విద్యార్హతలకు ఇక లెవెల్స్
జాతీయ విద్యావిధానంలో భాగంగా ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని కేంద్రం పేర్కొంది. ఎన్ హెచ్‌ఈక్యూఎఫ్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సంయుక్తంగా రూపొందించిన ఈ ముసాయిదాపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతోంది. ప్రపంచస్థాయిలో అనుసరిస్తున్న క్రెడిట్స్, విద్యాస్థాయి విధానాలను అమలు చేయాలన్నదే ఈ ముసాయిదా ముఖ్య ఉద్దేశంగా కన్పిస్తోంది. విద్య, పరిశోధన, వృత్తివిద్య, స్కిల్ డెవలప్‌మెంట్ విద్యకు విడివిడిగా లెవెల్స్ కేటాయిస్తారు. 1–4 వరకూ ఉండే లెవెల్‌లోకి స్కూల్ ఎడ్యుకేషన్ వస్తుంది. 5వ లెవెల్‌లో సాంకేతిక నైపుణ్యాన్ని, విశ్లేషణాత్మక ఆలోచనలతో కూడిన విద్యను చేర్చారు. 6వ లెవెల్‌లో పరిశోధనకు అవసరమైన సాంకేతిక విద్యను, 7వ లెవెల్‌లో అడ్వాన్స్ డ్ టెక్నిక్స్ విద్య, 8వ లెవెల్‌లో టెక్నికల్ స్కిల్స్, డిజైన్, ఆలోచన విధానాన్ని స్వతహాగా కనబరచే విద్యా సంబంధమైన స్థాయిని చేర్చారు. ఏ దేశానికైనా వెళితే ఫలానా కోర్సు చేశాననే పరిస్థితి కాకుండా, ఏ లెవెల్ అనే విషయాన్ని చెబితే సరిపోయేలా ఉన్నత విద్యావిధానాన్ని రూపొందించాలని ప్రతిపాదించారు. అయితే, దీని అమలు క్రమంలో అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేసి, ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ అభిప్రాయపడ్డారు.