Skip to main content

టీఎస్‌ పాలిసెట్ 2021 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పాలిటెక్నిక్‌తో ప్రయోజనాలు ఇవే..

తెలంగాణ స్టేట్‌ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (టీఎస్‌ పాలిసెట్‌–2021)కు నోటిఫికేషన్ విడుదలైంది.

పాలిసెట్‌ 2021 ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలు; రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో నడుస్తున్న సెకండ్‌ షిఫ్ట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలు అందిస్తున్న ఇంజనీరింగ్‌/నాన్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులు; ప్రొఫెసర్‌ జయశంకర్ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌యూ), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వీటి అనుబంధ
కళాశాలలు అందించే అగ్రికల్చర్, అనుబంధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ నేపథ్యంలో.. పాలిసెట్‌కు అర్హతలు, ప్రవేశం కల్పించే కోర్సులు, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక కథనం..

పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో.. టెక్నికల్,నాన్‌ టెక్నికల్‌ ఉంటాయి. పదోతరగతి ఉత్తీర్ణతతోనే వీటిలో చేరొచ్చు. తద్వారా చిన్న వయసులోనే సత్వర ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే.. ఆ దిశగా కూడా పయనించొచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఎస్‌బీటీఈటీ)లు.. ఏటా పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు(పాలిసెట్‌)ను నిర్వహించి.. ఆయా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

అర్హతలు..
తెలంగాణ పాలిసెట్‌–2021కు.. రాష్ట్రంలో పదోతరగతి లేదా తత్సమాన విద్యను మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా కనీసం 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్షా విధానం..
పాలిసెట్‌ పరీక్షను పెన్‌ అండ్‌ పేపర్‌(ఆఫ్‌ ౖలñ న్‌) విధానంలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ తరహా మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో మొత్తం 150 ప్రశ్నలకు ప్రశ్న పత్రం ఉంటుంది. మ్యాథ్స్‌ 60 ప్రశ్నలు–60మార్కులు, ఫిజిక్స్‌ 30ప్రశ్నలు–30మా ర్కులు,కెమిస్ట్రీ–30ప్రశ్నలు–30మార్కులు, బ యాలజీ 30ప్రశ్నలు–30 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు.

పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానంలో అమలులో లేదు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ(పీజేటీఎస్‌యూ), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వీటి అనుబంధ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు మాత్రమే బయాలజీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

రెండు వేర్వేరు ర్యాంకులు..
పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను ప్రకటిస్తారు. పాలిటెక్నిక్, అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకులను విడుదల చేసి.. కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

పాలిటెక్నిక్‌(ఇంజనీరింగ్‌/నాన్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులకు మ్యాథ్స్‌– 60 మార్కులు, ఫిజిక్స్‌–30 మార్కులు, కెమిస్ట్రీ–30 మార్కులు.. ఇలా మొత్తం 120 మార్కులకు సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకు ప్రకటిస్తారు.

అలాగే అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు మ్యాథ్స్‌(60/2)–30 మార్కులకు, ఫిజిక్స్‌–30 మార్కులకు, కెమిస్ట్రీ–30 మార్కులకు, ,బయాలజీ 30 మార్కులకు.. ఇలా మొత్తంగా 120 మార్కులకు సదరు అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు.

పాలీసెట్‌లో అర్హత పొందాలంటే.. రెండు విభాగాలకు సంబంధించి కనీసం 30 శాతం మార్కులు అంటే.. 120 మార్కులకు కనీసం 36 మార్కులు సాధించాలి.

డిప్లామా కోర్సులు..
సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్, గార్మెంట్‌ టెక్నాలజీ, హోమ్‌సైన్స్, మెటలర్జికల్, కెమికల్, సిరామిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్, పెట్రోలియం టెక్నాలజీ, ఫుట్‌వేర్, ప్యాకేజింగ్, ప్రింటింగ్, లెదర్‌ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. అలాగే.. అగ్రికల్చర్, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌ వంటి డిప్లొమా కోర్సులను కూడా పాలిసెట్‌ ద్వారా చేయచ్చు. టెక్నికల్‌ కోర్సులు మూడేళ్లు లేదా మూడున్నరేళ్ల కాలవ్యవధితో అందిస్తారు. నాన్‌టెక్నికల్‌ కోర్సులు మూడేళ్లు లేదా రెండేళ్ల కాలవ్యవధితో ఉంటాయి.

ఉన్నత విద్య..
మూడు, మూడున్నరేళ్ల పాలిటెక్నిక్‌(ఇంజనీరింగ్‌) డిప్లొమా పూర్తిచేసిన అనంతరం ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే ఈసెట్‌ పరీక్ష రాసి.. లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా బీటెక్‌/బీఈ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందొచ్చు. డిప్లొమా విద్యార్హతతో ఉద్యోగంలో చేరిన వాళ్లు బీఈ/బీటెక్‌తో సమానమైన అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌(ఏఎంఐఈ) వంటి కోర్సులనూ పూర్తిచేసుకోవచ్చు.

ఉద్యోగావకాశాలు..
పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులకు చక్కటి కెరీర్‌ అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ, ప్రవేట్‌ సంస్థలో సూపర్‌వైజర్‌ స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. గెయిల్, ఓఎన్‌జీసీ, డీఆర్‌డీఓ, బీహెచ్‌ఈఎల్‌ వంటి మహారత్న, నవరత్న కంపెనీలు, ఆర్మీ, రైల్వే, సింగరేణి వంటి సంస్థల్లో కొలువులు దక్కించుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు, భవనాలు,పంచాయతీరాజ్,ఇరిగేషన్, వ్యవసాయం తదితర శాఖల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

పాలిటెక్నిక్‌ కోర్సులు పూర్తిచేసిన వారికి.. ప్రైవేట్‌ రంగంలో అవకాశాలు పుష్కలం. నిర్మాణం, ఆటోమొబైల్, వపర్‌ప్లాంట్స్, కమ్యూనికేషన్స్, మ్యానుఫాక్చరింగ్‌ తదితర రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ముఖ్యమైన సమాచారం..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు రూ.400, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: 11 జూన్‌ 2021
రూ.100 లేట్‌ ఫీజుతో: 13 జూన్‌ 2021
రూ.300 లేట్‌ ఫీజుతో: 15 జూన్‌ 2021
పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు.

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://polycetts.nic.in/Default.aspx
Published date : 07 Jun 2021 03:49PM

Photo Stories