Skip to main content

సివిల్ సర్వీస్...లేటరల్ ఎంట్రీకి శ్రీకారం !

దేశ పరిపాలనకు వెన్నెముక లాంటి సివిల్ సర్వీసులోకి లేటరల్ ఎంట్రీ విధానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వంలోని కీలకమైన 10 జాయింట్ సెక్రటరీ పోస్టుల్లో నియామకానికి ఇతర రంగాల వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరుతూ... డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) జూన్ 10న నోటిఫికేన్ విడుదల చేసింది.
వాస్తవానికి యూపీఎస్సీ ఏటానిర్వహించే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్ష ద్వారా ఎంపికై... ప్రభుత్వ సర్వీసులో అనుభవం గడించిన అధికారులను జాయింట్ సెక్రటరీలుగా నియమిస్తారు. జాయింట్ సెక్రటరీ అనేది కేంద్ర ప్రభుత్వ విధానాల రూపకల్పనతోపాటు పథకాల అమలులోనూ కీలకపాత్ర పోషించే హోదా. ఇలాంటి ముఖ్యమైన జాయింట్ సెక్రటరీ పోస్టుల్లోకి ఇతర రంగాలకు చెందిన వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరుతూ.. డీవోపీటీ నోటిఫికేషన్ జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జాయింట్ సెక్రటరీ పోస్టుల భర్తీకి డీవోపీటీ తాజా నోటిఫికేషన్.. సివిల్ సర్వీసెస్‌లోకి లేటరల్ ఎంట్రీ విధానంపై నిపుణుల విశ్లేషణ...

నిపుణుల కొరతే కారణమా?
డీవోపీటీ ఈ ఏడాది విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో కలిపి 5104 మంది ఐఏఎస్‌లు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ సంఖ్య 6,400 మంది వరకూ ఉండాలి. మొత్తంగా చూస్తే దేశంలో 20 నుంచి 30 శాతం మేరకు ఐఏఎస్‌ల కొరత నెలకొంది. రాష్ట్రాల్లోనూ ఐఏఎస్‌ల కొరత ఉందని.. కేంద్రానికి డిప్యుటేషన్‌పై వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటోందని.. అందుకే సివిల్ సర్వీసెస్‌లో లేటరల్ ఎంట్రీ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనే వాదన ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తోంది. దాంతోపాటు ‘కొన్ని ప్రత్యేక విభాగాల్లో సంబంధిత రంగంలోని నిపుణులు అందుబాటులో ఉంటే సత్వరం, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని, అందుకోసమే ఆయా రంగాల్లో నిపుణులైన వ్యక్తుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోందని పేర్కొంటున్నారు.

ఎంపిక ప్రక్రియ!
డీవోపీటీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వచ్చిన దరఖాస్తుల్లోంచి షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను సెలక్షన్ కమిటీ ఆహ్వానిస్తుందని పేర్కొన్నారు. కానీ.. ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూలు నిర్వహిస్తారా.. అనేది స్పష్టం చేయలేదు. వ్యక్తిగత సంభాషణకు ఆహ్వానిస్తారు అని మాత్రమే పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొనే వ్యక్తులు లేదా నిపుణుల వివరాలు పేర్కొనలేదు. సంబంధిత విభాగానికి జాయింట్ సెక్రటరీగా ఎంపికైన అభ్యర్థి నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి పేర్కొన్నారు. కానీ సదరు అభ్యర్థికి ఉండాల్సిన నైపుణ్యాల గురించి స్పష్టత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాయింట్ సెక్రటరీ హోదాలో కీలక నిర్ణయాధికారం ఉండే ఈ పోస్టుల్లో తటస్థ విధానాన్ని అనుసరించే కెరీర్ బ్యూరోక్రాట్స్ ఉంటేనే మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆయా రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారిని ప్రభుత్వ సేవల్లోకి ఆహ్వానించడంలో తప్పులేదని... అయితే అధికారంలో ఉన్నవారు తమకు అనుకూల వ్యక్తులను నియమించుకునే ప్రయత్నం సరికాదంటున్నారు. దీనివల్ల సమాజంలో అన్ని వర్గాలకు అందాల్సిన కీలక పథకాల విషయంలో ప్రతికూల ప్రభావం పడే ఆస్కారముందని ఓ మాజీ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

సత్సంబంధాల మాట :
యూపీఎస్సీ పరీక్ష ద్వారా ఎంపికై ఐఏఎస్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న కెరీర్ బ్యూరోక్రాట్స్‌కు.. లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా జాయింట్ సెక్రటరీగా చేరిన వారికి మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఐఏఎస్‌గా ఎంపికైనప్పటి నుంచి ప్రత్యేక గుర్తింపు పొందిన అధికారులు.. ఒక్కసారిగా ప్రయివేటు వ్యక్తులకు జవాబుదారీగా పనిచేయడం ఇబ్బందిగానే భావిస్తారని.. కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లిన ఏపీ కేడర్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. లేటరల్ ఎంట్రీ విధానంలో ఎంపికైన జాయింట్ సెక్రటరీలకు, కెరీర్ బ్యూరోక్రాట్స్‌కు మధ్య సత్సంబంధాలు లేకుంటే.. సంబంధిత శాఖలో పరిపాలన సజావుగా సాగడం కష్టమేనంటున్నారు.

పదోన్నతులపై ప్రభావం ?
సివిల్ సర్వీసులోకి లేటర్ ఎంట్రీ విధానం వల్ల భవిష్యత్తులో పదోన్నతుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయనే వాదన వినిపిస్తోంది. ప్రధానంగా రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిర్దేశిత సమయంలో వచ్చే పదోన్నతులకు ఆటంకం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే సివిల్స్ లేటరల్ ఎంట్రీ విధానం వల్ల తాజాగా సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఎంపికవుతున్న ఐఏఎస్‌లకు ఎలాంటి సమస్య ఉండదని మరో సీనియర్ అధికారి పేర్కొన్నారు. గత మూడేళ్లుగా సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా నియామకాల్లో ఐఏఎస్ ఖాళీల సంఖ్య తగ్గుతూ వస్తోందని.. కాబట్టి భవిష్యత్తులో ఉన్నత స్థాయిల్లో సీనియర్ ఐఏఎస్‌ల కొరత ఏర్పడుతుందని.. కాబట్టి పదోన్నతులకు ఎలాంటి ఇబ్బందని ఉండదని పలువురు విశ్లేషిస్తున్నారు.

నిపుణుల నియామకం.. ఎప్పటి నుంచో
వివిధ రంగాలకు చెందిన నిపుణులను ప్రభుత్వ రంగంలో కన్సల్టెంట్స్‌గా నియమించే విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉందని.. దాన్నే ఇప్పుడు వ్యవస్థీకృతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మరికొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. నేషనల్ నాలెడ్‌‌జ కమిషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన శామ్ పిట్రోడా, ఆధార్ ప్రాజెక్ట్‌కు హెడ్‌గా వ్యవహరించిన నందన్ నీలేకని వంటి వారిని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆర్‌బీఐ గవర్నర్లుగా పనిచేసిన రంగరాజన్, బిమల్ జలాన్ వంటి వారు కూడా తమ రంగంలో నైపుణ్యం ద్వారా ప్రభుత్వ రంగానికి వచ్చినవారే!

10 జాయింట్ సెక్రటరీ పోస్టులకు నోటిఫికేషన్ :
దేశ నిర్మాణంలో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన నైపుణ్యమున్న ఉత్సాహవంతుల నుంచి 10 జాయింట్ సెక్రటరీ స్థాయి పోస్టుల్లో నియామకానికి భారత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) జూన్ 10న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

డీవోపీటీ నోటిఫికేషన్ ప్రత్యేకత :
  • భారత ప్రభుత్వంలో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలోని కీలకమైన హోదా.. జాయింట్ సెక్రటరీ. సంబంధిత డిపార్ట్‌మెంట్‌లో విధానాల రూపకల్పన, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో వీరిది ముఖ్యపాత్ర. జాయింట్ సెక్రటరీలు సంబంధిత మంత్రిత్వశాఖలోని సెక్రటరీ/అడిషనల్ సెక్రటరీల పర్యవేక్షణలో పనిచేస్తారు.
  • ప్రస్తుతమున్న విధానం ప్రకారం జాయింట్ సెక్రటరీ పోస్టులను యూపీఎస్సీ నిర్వహించే మూడంచెల ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఎంపికై న సీనియర్ కెరీర్ బ్యూరోక్రాట్స్ నుంచి భర్తీ చేస్తారు.
  • డీవోపీటీ తాజా నోటిఫికేషన్ ద్వారా రెవెన్యూ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎకనామిక్ అఫైర్స్, అగ్రికల్చర్, కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్, షిప్పింగ్, ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్స్, క్లైమేంట్‌చేంజ్, న్యూఅండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, సివిల్ ఏవియేషన్, కామర్స్... ఇలా మొత్తం పది విభాగాల్లో జాయింట్ సెక్రటరీ స్థాయి పోస్టుల్లో ప్రయివేటు వ్యక్తులను భారత ప్రభుత్వం నియమించనుంది.
  • జాయింట్ సెక్రటరీ పోస్టుల్లోకి ప్రయివేటు రంగానికి చెందిన వ్యక్తులను ఆహ్వానించడం ద్వారా ప్రభుత్వ సర్వీసులోకి లేటరల్ ఎంట్రీ విధానానికి శ్రీకారం చుట్టినట్లయింది.
  • గతంలోనూ శ్యాంపిట్రోడా, మన్మోహన్ సింగ్, రంగరాజన్, నందన్ నిలేకని వంటి వారిని నైపుణ్యం ఆధారంగా ప్రత్యేకమైన బాధ్యతల నిర్వహరణ కోసం ప్రభుత్వ సర్వీసులోకి తీసుకున్నప్పటికీ.. దరఖాస్తులు ఆహ్వానించి ఎంపిక ప్రక్రియ చేపట్టనుండటం ఇదే మొదటిసారి! ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది!!

అర్హతలు..
వయసు: 2018, జూలై 1 నాటికి కనీసం 40 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
విద్యార్హత: ఏదైనా గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. ఉన్నత విద్యార్హతలు ఉంటే మంచిదే!
అనుభవం: కనీసం 15 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి.
  • పైవేటురంగ కంపెనీలు, కన్సల్టెన్సీ సంస్థలు, బహుళజాతి కంపెనీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు, అటానమస్ సంస్థలు, స్టాట్యుటరీ ఆర్గనైజేషన్స్‌, యూనివర్సిటీలు, గుర్తింపుపొందిన పరిశోధనా సంస్థల్లో పనిచేస్తున్న భారతీయ పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాల్లో పనిచేస్తున్న అధికారులు కూడా దరఖాస్తుకు అర్హులే.

ఎంపిక ప్రక్రియ: అందిన దరఖాస్తుల్లో నుంచి షార్ట్‌లిస్ట్ (సంక్షిప్త జాబితా) చేసిన వారిని సెలక్షన్ కమిటీ పర్సనల్ ఇంటరాక్షన్ (వ్యక్తిగత సంభాషణ)కు పిలుస్తుంది.

ఒప్పంద కాలపరిమితి: ఉద్యోగంలో చేరిన రోజు నుంచి మూడేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుంది. పనితీరు ఆధారంగా దీన్ని అయిదేళ్ల వరకూ పొడిగించే అవకాశముంది.

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో జాయింట్ సెక్రటరీ స్థాయి పేస్కేల్ రూ.144200-218200 అందిస్తారు. దీంతోపాటు సంబంధిత స్థాయి హోదా కలిగిన ప్రభుత్వ అధికారులకు లభించినట్లే ఇతర అలవెన్సులు, సౌకర్యాలు అన్నీ పొందొచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 30, 2018

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://Lateral.nic.in  

పారదర్శకంగా ఉంటే సమస్య లేదు :
సివిల్ సర్వీసులోకి లేటరల్ ఎంట్రీ విధానంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా రంగాలకు సంబంధించిన ప్రత్యేక పరిజ్ఞానంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అందుకే ప్రయివేటు రంగం నుంచి తీసుకునే వ్యక్తుల నియామకం పారదర్శకంగా ఉండాలని రెండో ఏఆర్‌సీ (అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్) పేర్కొంది. లేటర్ ఎంట్రీ విధానం వల్ల సీనియర్ ఐఏఎస్‌లకు, ప్రయివేటు రంగం నుంచి వచ్చిన వారికి మధ్య అనుసంధానం కొరవడుతుందనటానికి ఆధారంలేదు.
- వినితా రాయ్, మెంబర్ సెక్రటరీ, రెండో ఏఆర్‌సీ.

నిపుణులను ఆహ్వానించాలి :
వివిధ రంగాల్లో ఫలితాలు అందించి.. సమాజానికి, ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోగల సమర్థమంతులైన వ్యక్తులను నియమించడం సత్ఫలితాలు ఇస్తుంది. అయితే లేటరల్ ఎంట్రీ పేరుతో దరఖాస్తులు ఆహ్వానించి ఎంపిక చేపట్టే విధానానికి బదులుగా.. ఆయా రంగాల్లోని నిపుణులను గుర్తించి.. వారు ప్రభుత్వ సేవలవైపు వచ్చేలా ఆహ్వానించాలి. ఉదాహరణకు సింగపూర్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. సింగపూర్ యూనివర్సిటీ నుంచి అకడమిక్ నిపుణులను ప్రభుత్వం ఆయా శాఖల్లో విధులు నిర్వర్తించేందుకు ఆహ్వానిస్తుంది. ఇలాంటి విధానమే మన దేశంలోనూ రావాలి. ముఖ్యంగా వైద్యం, విద్య, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో నిపుణుల అవసరం ఎంతో ఉంది. ఏ రంగంలోనైనా.. మంచి ఫలితాలు రాబట్టే నిపుణులకు స్థానం కల్పించాలి. వాస్తవానికి మన దేశంలో ఎప్పటినుంచో ఈ విధానం ఉంది. శ్యాంపిట్రోడా, రఘురామ్ రాజన్, నందన్ నీలేకని వంటి వారే ఇందుకు ఉదాహరణ. మంచి ఫలితాలు సాధించడానికి ‘ఇస్రో’ వంటి వ్యవస్థ విధానాన్ని అవలంబించాలి. ఇస్రోకు సంబంధించి ఛైర్మన్ నియామకం.. ఫలితాల నిర్దేశనానికి మాత్రమే ప్రభుత్వం పరిమితం అవుతోంది. ఆ తర్వాత ప్రభుత్వ జోక్యం ఉండదు. అందుకే ఇస్రో ఎన్నో విజయాలు సాధిస్తోంది. ఇలాంటి విధానాన్నే మిగతా శాఖలు, విభాగాల్లో తీసుకు రావాలి. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో అమలవుతున్న న్యూ పబ్లిక్ మేనేజ్‌మెంట్ విధానాన్ని(ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ మోడల్) అనుసరించొచ్చు.
- డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, మాజీ ఐఏఎస్ అధికారి.
Published date : 03 Jul 2018 12:57PM

Photo Stories