సీబీఎస్‌ఈ సిలబస్ కుదింపు.. విద్యార్థులపై భవిష్యత్తుకు అనుకూలమా.. ప్రతికూలమా..?!
వచ్చే ఏడాది జరిగే వార్షిక పరీక్షల పరంగా విద్యార్థులపై ఒత్తిడిని నివారించేందుకు సిలబస్‌ను కుదించినట్లు సీబీఎస్‌ఈ వర్గాలు పేర్కొంటున్నాయి.
తగ్గించిన సిలబస్‌తో విద్యార్థులపై ప్రస్తుతానికి ఒత్తిడి తగ్గినా.. భవిష్యత్తులో జేఈఈ, నీట్ వంటి పరీక్షల పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో... సీబీఎస్‌ఈ సిలబస్ కుదింపు నిర్ణయం.. దానివల్ల రానున్న కాలంలో విద్యార్థులపై ప్రభావం తదితర అంశాలపై విశ్లేషణ..
సీబీఎస్‌ఈ 9 నుంచి 12వ తరగతుల వరకు సిలబస్‌ను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. తరగతులు, సబ్జెక్ట్‌ల వారీగా తగ్గించాల్సిన అంశాలను కూడా స్పష్టంగా పేర్కొంది. సీబీఎస్‌ఈ సిలబస్ కుదింపు.. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌లలో ఆయా అంశాలను తగ్గించడం పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై కొంత ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారముందనే వాదన వినిపిస్తోంది.
11, 12 తరగతులపై ప్రభావం..
సిలబస్ కుదింపు కారణంగా ఎక్కువగా ప్రభావితమయ్యేది 11, 12వ తరగతుల విద్యార్థులే. ఈ విద్యా సంవత్సరంలో(2020–21).. 12వ తరగతిలో అడుగుపెట్టి.. వచ్చే ఏడాది అంటే 2021లో జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై సిలబస్ కుదింపు ప్రభావం చూపనుంది. అలాగే ఈ ఏడాది 11వ తరగతిలో చేరే విద్యార్థులు.. 2022లో ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వీరిపైనా మారిన సిలబస్ ప్రభావం ఉంటుంది. దీనికి పరిష్కారంగా కుదించిన సిలబస్ మేరకు పోటీ పరీక్షల సిలబస్‌ను కూడా మార్చాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రవేశ పరీక్షల సన్నద్ధతకు ప్రతికూలం..
- సిలబస్ కుదిస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందనే మాట వాస్తవమైనప్పటికీ.. మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌ల(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) సిలబస్ కుదింపు..ప్రవేశ పరీక్షల పరంగా సన్నద్ధతకు ప్రతికూలంగా మారుతుందంటున్నారు. జేఈఈ– మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్ ఎంట్రన్స్ టెస్టుల్లో 11, 12 తరగతుల సిలబస్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిలబస్ కుదింపుతో విద్యార్థులు ఆయా అంశాల్లో అకడమిక్‌గా అవగాహన పొందడం కష్టమవుతుంది. ఇది పోటీ పరీక్షల్లో వారి ప్రతిభపై ప్రభావం చూపుతుంది.
- ఇప్పుడు 11వ తరగతిలో అడుగుపెట్టే విద్యార్థులు.. 12వ తరగతిలో ఆయా టాపిక్స్‌కు కొనసాగింపుగా ఉండే అంశాల విషయంలో సన్నద్ధత పొందలేరు. ప్రవేశ పరీక్షల్లో 12వ తరగతి టాపిక్స్‌కు వెయిటేజీ కొంత ఎక్కువనే చెప్పొచ్చు. 12వ తరగతిలో తగ్గించిన సిలబస్ నుంచి ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నలు అడిగితే.. వాటికి సమాధానాలు రాబట్టడం విద్యార్థులకు కష్టంగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
అనుసంధాన సమస్య..
- సిలబస్ కుదింపుతో ఇంటర్ రిలేటెడ్ (అనుసంధాన) టాపిక్స్ ఉండే సబ్జెక్ట్‌ల విషయంలో మరింత సమస్య ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఉదాహరణకు ఫిజిక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రతి టాపిక్‌కు తదుపరి యూనిట్‌లోని టాపిక్‌కు మధ్య అనుసంధానం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాథమికంగా.. కుదించిన సిలబస్‌లో సదరు టాపిక్‌పై పూర్తిస్థాయి అవగాహన లభించదు. పర్యవసానంగా దానికి అనుసంధానంగా ఉండే తదుపరి టాపిక్‌లోని అంశాలను అవగాహన చేసుకోవడం కష్టంగా మారుతుంది.
- ఉదాహరణకు బయాలజీని పరిగణనలోకి తీసుకుంటే.. ప్లాంట్ అనాటమీ, మార్ఫాలజీ వంటి టాపిక్స్‌ను కూడా కుదించారు. కానీ వీటికి ఎంట్రన్స్‌లలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.
- మ్యాథమెటిక్స్ పరంగా చూస్తే.. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్‌లో సిలబస్‌ను కుదించారు. ఏ టాపిక్ అయినా వాటి ధర్మాల(ప్రాపర్టీస్)కు సంబంధించి పూర్తిస్థాయి అవగాహన ఉంటేనే.. ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా సమాధానం రాయగలిగే సన్నద్ధత లభిస్తుంది.
ప్రవేశ పరీక్షల సిలబస్‌పై కసరత్తు!
సీబీఎస్‌ఈ సిలబస్‌ను కుదించడం, అవి ప్రవేశ పరీక్షల్లో విద్యార్థుల ప్రదర్శనపై ప్రభావం చూపుతాయనే అభిప్రాయాల నేపథ్యంలో.. భవిష్యత్‌లో జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్ నీట్ ఎంట్రన్స్ టెస్ట్‌ల ప్రశ్న పత్రాలను మారిన సిలబస్‌కు అనుగుణంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)..సబ్జెక్ట్ నిపుణుల కమిటీకి సీబీఎస్‌ఈ కొత్త సిలబస్‌ను అందించింది. ఎన్‌టీఏ వర్గాల సమాచారం ప్రకారం–సదరు సబ్జెక్ట్ నిపుణులు రివైజ్డ్ సిలబస్‌ను పరిశీలించి..దానికి అనుగుణంగా ఎంట్రన్స్ టెస్టుల సిలబస్ రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. జేఈఈ– అడ్వాన్స్‌డ్ విషయంలోనూ ఐఐటీలకు సంబంధించి జాయింట్ అడ్మిషన్ బోర్డ్ కూడా ఇదే తరహా కసరత్తు ప్రారంభించింది.
స్వయం సన్నద్ధత..
విద్యార్థులు మారిన సిలబస్‌కు అనుగుణంగా అకడమిక్‌గా ముందుకు సాగుతూనే.. పోటీ పరీక్షలో సిలబస్ పరంగా స్వయం సన్నద్ధత పొందేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా రివైజ్డ్ సిలబస్‌ను పరిశీలించి.. అందులో కుదించిన అంశాలకు సంబంధించి నేర్చుకోవాల్సిన టాపిక్స్‌పై అధ్యాపకుల సలహాలతో అవగాహన పెంచుకోవాలంటున్నారు. ఇందుకోసం ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అభ్యసించాలని పేర్కొంటున్నారు.
బేసిక్స్‌పై ప్రభావం..
సీబీఎస్‌ఈ 9,10 తరగతుల్లోనూ అన్ని సబ్జెక్ట్‌లలో సిలబస్‌ను కుదించింది. దీనివల్ల ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన పెంచుకునే విషయంలో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా భవిష్యత్తులో సదరు సబ్జెక్ట్స్‌ల అడ్వాన్స్‌డ్ టాపిక్స్‌లో రాణించడం కష్టంగా మారుతుందని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ ఏడాది సమస్య లేదు..
సీబీఎస్‌ఈ సిలబస్ కుదింపు నేపథ్యంలో ఈ ఏడాది ఎంట్రన్స్‌లలో ఏమైనా మార్పులు ఉంటాయా? అనే సందేహాలను విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. అయితే 12వ తరగతి ఉత్తీర్ణత ఆధారంగా ఈ సంవత్సరం ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. 2019–20 సంవత్సరానికి 12వ తరగతి తత్సమాన కోర్సులు పూర్తయ్యాయి. కాబట్టి ఈ ఏడాది ప్రవేశ పరీక్షలు గతేడాది మాదిరిగానే ఉంటాయని గుర్తించాలి.
తప్పనిసరి అనుకుంటే బోధించొచ్చు..
సీబీఎస్‌ఈ సిలబస్‌ను రివైజ్ చేయడం, కుదించడం అనేది ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం. అయితే టీచర్లు ఏదైనా ఒక టాపిక్‌కు సంబంధించి రివైజ్‌డ్ సిలబస్ కంటే మరింత బోధన అవసరం అని భావిస్తే దానికి అనుగుణంగా బోధన సాగించొచ్చు. ఇందులో ఎలాంటి నిబంధనలు లేవు.
– వికాస్ అరోరా, రీజనల్ ఆఫీసర్, సీబీఎస్‌ఈ బెంగళూరు రీజియన్
స్వీయ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం..
సీబీఎస్‌ఈ సిలబస్‌ను కుదించినా.. విద్యార్థులు దానికే పరిమితం కాకుండా.. ఆయా చాప్టర్స్‌లో అన్ని అంశాల్లో పట్టు సాధించేందుకు స్వీయ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. ఆన్‌లైన్ పోర్టల్స్, ఇతర మార్గాల ద్వారా అన్ని అంశాల్లోనూ అవగాహన పొందేందుకు కృషి చేయాలి. సిలబస్ తగ్గించడం వల్ల ప్రస్తుతం ఒత్తిడి తగ్గినా.. ఆ తర్వాత ఎంట్రన్స్ టెస్ట్‌ల విషయంలో ఒత్తిడికి గురయ్యే ఆస్కారముంది. – ఆర్.కేదారేశ్వర్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నిపుణులు
కెమిస్ట్రీలో మార్పులు.. సన్నద్ధత ఇలా..
కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో చాలా ముఖ్యమైన అంశాలను తగ్గించారు. ఎంతో కీలకంగా భావించే పి–బ్లాక్ మూలకాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొనొచ్చు. ఇలాంటి టాపిక్స్ విషయంలో విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతోపాటు ఇతర ప్రామాణిక పుస్తకాలను చదివి.. అవగాహన పెంచుకోవాలి.
– డి.కె.ఝా, కెమిస్ట్రీ సబ్జెక్ట్ నిపుణులు