Skip to main content

జేఈఈ మెయిన్ కి ప్రిపేర్ అవుతున్నారా.. స‌త్తా చాటే మార్గం ఇదిగో..

ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశం పొందేందుకు.., ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించేందుకు.. జేఈఈ మెయిన్‌లో సత్తా చాటడం తప్పనిసరి.

సెప్టెంబరు 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో.. పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులకు ఉపయోగపడే ఎగ్జామ్‌ డే టిప్స్‌...

చర్చలు వద్దు..

చాలామంది విద్యార్థులు పరీక్ష చివరి నిమిషం వరకు స్నేహితులతో చర్చిస్తుంటారు. ఇది సరి కాదు. పరీక్షకు ముందు రోజు, పరీక్ష రోజున సాధ్యమైనంత తక్కువ మందితో మాట్లాడాలి. స్నేహితులతో ప్రిపరేషన్‌ గురించి అస్సలు చర్చించరాదు. ఇతరులతో పరీక్షపై చర్చించడం వల్ల ఏకాగ్రతకు భంగం వాటిల్లొచ్చు. అదేవిధంగా కొత్త సందేహాలు సైతం తలెత్తవచ్చు. అదే జరిగితే ఒత్తిడి పెరిగి విజయావకాశాలు సన్నగిల్లుతాయి. పరీక్షలో విజయానికి ఏకాగ్రత చాలా అవసరమని గుర్తించాలి.

అతిగా చదవొద్దు..

విద్యార్థులు పరీక్షకు ముందు రోజు అతిగా చదవకూడదు. కేవలం అప్పటివరకు చదివిన అంశాలను మాత్రమే మననం చేసుకోవాలి. యోగా, మెడిటేషన్‌ వంటివి చేయాలి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి దూరం అవుతుంది. దీంతోపాటు సులభంగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి. లైట్‌ ఆపి నిద్రకు ఉపక్రమించే ముందు ముఖ్యమైన టాపిక్స్, ఈక్వేషన్స్‌ గురించి ఒకసారి మనసులోనే గుర్తుకు తెచ్చుకోవాలి.

గంట ముందుగానే..

పరీక్ష రోజు అలారం పెట్టుకొని త్వరగా నిద్ర లేవాలి. తేలికైన బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి. నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. రిపోర్టింగ్‌ సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. అడ్మిట్‌ కార్డు, ఐడీ ప్రూఫ్, రివిజన్‌ నోట్స్‌ను వెంట తీసుకెళ్లాలి. పరీక్ష కేంద్రానికి చేరుకునే సమయంలో, పరీక్ష హాల్లోకి ప్రవేశించిన తర్వాత ఫోకస్డ్‌గా వ్యవహరించాలి. ఒత్తిడికి గురవ్వరాదు.

టెక్నికాలిటీస్‌:

పరీక్ష హాల్లోకి ప్రవేశించిన అభ్యర్థులు సౌకర్యవంతంగా కూర్చోవాలి. అనంతరం కంప్యూటర్‌ టెక్నికాలిటీస్‌ను సరిచూసుకోవాలి. కంప్యూటర్‌ స్క్రీన్‌తోపాటు ఇతరత్రా సాధనాలు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా?! అని పరిశీలించాలి. కంప్యూటర్, మౌస్‌ చేతికందగానే స్క్రోల్‌ చేసి.. ప్రశ్నలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తున్నాయో లేదో చెక్‌ చేసుకోవాలి. ఆ తర్వాతే సమాధానాలు గుర్తించేందుకు ఉపక్రమించాలి.

ప్రారంభించండిలా..

అభ్యర్థులు ఇష్టమైన టాపిక్‌ లేదా సబ్జెక్టుతో సమాధానాలు ఇవ్వడం ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనంతరం మధ్యస్థ, ట్రికీ ప్రశ్నలు సాధిస్తే మెరుగైన ఫలితాలుంటాయి. పరీక్షలో ప్రతి మార్కు ర్యాంకును ప్రభావితం చేస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కంగారు పడకుండా సమాధానాలు గుర్తించాలి.

పోటీ అందరికీ సమానమే..

ప్రవేశ పరీక్షల్లో అడిగే ప్రశ్నల్లో 50 శాతం నాలెడ్జ్‌ ఆధారితంగా ఉంటాయి. మిగిలిన 50 శాతం శాతం ప్రశ్నలు అనలిటికల్, మెమొరీ బేస్డ్‌గా ఉంటాయి. పరీక్షలో పోటీ అందరికీ సమానంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎగ్జామ్‌ను క్రాక్‌ చేయగలనా? లేదా అనే సందేహాల్ని పక్కనపెట్టాలి. ప్రశ్నపత్రం సులభంగా ఉందా? కఠినంగా ఉందా? అనే దానితో సంబంధం లేకుండా.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే ధ్యేయంగా కదలాలి. ఈ దిశగా జేఈఈ సిలబస్‌పై అవగాహన, విశ్లేషణ సామర్థ్యాలు, పరీక్ష రోజు అవలంభించే వ్యూహం, ఆత్మవిశ్వాసాలు కీలకంగా నిలుస్తాయి.

స్మార్ట్‌ గెస్సింగ్‌..

  • జవాబులు తెలియని న్యూమరికల్‌ వ్యాల్యూస్‌ ఆప్షన్స్‌గా ఉన్న ప్రశ్నల్లో.. గరిష్ట, కనిష్ట వ్యాల్యూస్‌ను విడిచిపెట్టాలి. ఆరవై శాతం సందర్భాల్లో ఆ రెండు వాల్యూస్‌ సరైన సమాధానాలుగా ఉండవు. కాబట్టి న్యూమరికల్‌ వ్యాల్యూస్‌ ఆప్షన్స్‌గా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియనప్పుడు ఈ పద్ధతిని అనుసరించడం లాభిస్తుంది.
  • అలాగే యూనిట్స్, వ్యాల్యూస్‌ ఆప్షన్స్‌గా ఉన్న ప్రశ్నల్లో యూనిట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. యూనిట్, వ్యాల్యూస్‌ ఆప్షన్లలో కామన్‌గా ఉన్న నంబర్‌ సరైన సమాధానం అయ్యే అవకాశాలెక్కువగా ఉంటాయి.

పరీక్షకు ముందు రోజు..

  • మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లోని కీలక ఫార్ములాలను రివిజన్‌ చేయాలి.
  • కొత్త టాపిక్స్‌ను చదవరాదు.
  • ఎక్కువ సేపు మేల్కొని ఉండకూడదు.
  • రాత్రి 10–10.30 గంటల మధ్య నిద్రకు ఉపక్రమించాలి.
  • రాత్రి భోజనం మితంగా తీసుకోవాలి.

పరీక్ష రోజు ఇలా..

  • సింపుల్‌ అండ్‌ లైట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి.
  • స్నేహితులతో సబ్జెక్టు విషయాలను చర్చించరాదు.
  • గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
  • సులభమైన ప్రశ్నలతో పరీక్షను ప్రారంభించాలి.
  • ప్రశాంతంగా, ఏకాగ్రతతో పరీక్ష రాయాలి.

జేఈఈ మెయిన్‌ 2020 ముఖ్య సమాచారం:

  • జేఈఈ మెయిన్‌తో ప్రయోజనం: నిట్‌లు, ఐఐఐటీలు, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాలతోపాటు ఐఐటీల్లో అడ్మిషన్స్‌ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్ష.
  • జేఈఈ మెయిన్‌ 2020 పరీక్ష తేదీలు: సెప్టెంబర్‌ 1 నుంచి ఆరో తేదీ వరకు
  • బీఆర్క్‌/బీప్లానింగ్‌ కోసం పరీక్ష తేది: సెప్టెంబర్‌ 1న
  • బీఈ/బీటెక్‌ కోసం పరీక్ష తేదీలు: సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 6వ తేదీ వరకు
  • జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌
  • బీఈ/బీటెక్‌ జేఈఈ మెయిన్‌లో సబ్జెక్టులు: మ్యాథ్స్‌(25 ప్రశ్నలు), ఫిజిక్స్‌(25 ప్రశ్నలు), కెమిస్ట్రీ(25 ప్రశ్నలు).
  • పరీక్ష సమయం: మూడు గంటలు
  • పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://jeemain.nta.nic.in
Published date : 25 Aug 2020 03:57PM

Photo Stories