Skip to main content

ఇంటర్ పరీక్షల్లో టాప్ స్కోర్ సాధించేందుకు...సబ్జెక్ట్ నిపుణుల సలహాలు-సూచనలు

ఇంటర్మీడియెట్.. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ! ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఇంటర్‌లో సాధించే మార్కులు.. వారి భవిష్యత్ గమనాన్ని నిర్దేశిస్తాయి. రానున్న రోజుల్లో ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో అడుగుపెట్టేందుకు ఇంటర్ మార్కులు దోహదం చేస్తాయి.
బైపీసీ విద్యార్థులు జాతీయ స్థాయిలో నీట్‌లో నెగ్గి.. వైద్యవిద్యలో అడుగుపెట్టాలన్నా.. రాష్ట్ర స్థాయిలో అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో మంచి కోర్సులో చేరాలన్నా.. ఇంటర్మీడియెట్ మార్కులు ఎంతో కీలకం! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు పరీక్షల్లో టాప్ స్కోర్ సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు...

ఇంటర్మీడియెట్ విద్యార్థులు ప్రస్తుత సమయంలో పునశ్చరణ, ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. జేఈఈ మెయిన్, నీట్ వంటి ఇతర పరీక్షలకు పోటీ పడుతున్నప్పటికీ.. ప్రస్తుతం వాటి ప్రిపరేషన్‌కు విరామం ఇవ్వాలి. ఇప్పుడు పూర్తిగా ఇంటర్మీడియెట్ పరీక్షలపైనే దృష్టిపెట్టాలన్నది సబ్జెక్ట్ నిపుణుల సూచన. ఇందుకోసం విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి ముఖ్యమైన చాప్టర్లు, గత ప్రశ్న పత్రాల ఆధారంగా వెయిటేజీ పరంగా ప్రధానమైన టాపిక్స్‌పై ఫోకస్ పెట్టాలి. ప్రస్తుత సమయంలో కొత్త అంశాల జోలికి వెళ్లకుండా.. తమకు బాగా వచ్చిన వాటిపైనే మరింత పట్టు సాధించేలా కృషి చేయాలి. తద్వారా పరీక్షలో అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే సామర్థ్యం లభిస్తుంది.

ఎంపీసీ.. మ్యాథ్స్‌లో గరిష్ట స్కోర్
మ్యాథమెటిక్స్ :
  • ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు స్కోరింగ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ పరంగా కీలకమైన సబ్జెక్ట్.. మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్‌లో-ద్విపద సిద్ధాంతం; సంకీర్ణ సంఖ్యలు, డిమోవర్‌సిద్ధాంతం; సాంఖ్యకశాస్త్రం; సంభావ్యత చాప్టర్లను బాగా ప్రాక్టీస్ చేయాలి. ద్విపద సిద్ధాంతం పూర్తిగా ప్రాక్టీస్ ఆధారిత చాప్టర్. చాలామంది విద్యార్థులు దీన్ని క్లిష్టమైనదిగా భావిస్తారు. కానీ.. వెయిటేజీ పరంగా చూస్తే ఇది ఎంతో ముఖ్యమైనది. కాబట్టి ఈ పాఠ్యాంశాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సంభావ్యతకు సంబంధించిన రెండు చాప్టర్లు(సంభావ్యత సిద్ధాంతం, గుణకార సిద్ధాంతం; ప్రస్తారాలు, సంయోగాలు) స్కోరింగ్ పరంగా కీలకమైనవి. సంభావ్యత సంకలన సిద్ధాంతం, గుణకార సిద్ధాంతం, ఇచ్చిన పట్టిక నుంచి ‘కె’విలువ కనుగొనటం, మధ్యమం, విస్తృతిలను కనుగొనటం వంటివి ముఖ్యం. ఇవి సులభంగా ఉంటాయి. మంచి మార్కుల సాధనకు దోహదం చేస్తాయి. ‘ప్రస్తారాలు, సంయోగాలు’ను క్లిష్టమైన చాప్టర్‌గా చెప్చొచ్చు. కాబట్టి పరీక్షలకు ఉపయోగపడేలా కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానాలు నేర్చుకుంటే సరిపోతుంది. ఇచ్చిన పదానికి కోటి(ర్యాంక్) కనుగొనటం, సంఖ్యల మొత్తం తదితరాలకు సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
  • వాస్తవానికి మ్యాథమెటిక్స్‌ను ముఖ్యంగా మ్యాథ్స్ 2బిని విద్యార్థులు క్లిష్టంగా భావిస్తారు. కానీ.. గత రెండు, మూడేళ్ల ఇంటర్ ప్రశ్నపత్రాలను పరిశీలించి.. ప్రశ్నల సరళిపై అవగాహన పెంచుకుంటే.. ఈ పేపర్‌లోనూ ఎక్కువ మార్కులు సాధించొచ్చు. ఇందులో వృత్తాలు; నిశ్చితి; అనిశ్చితి; సమాకలనాలు; అవకలన సమీకరణాలు ముఖ్యమైనవి. అవకలన సమీకరణాల్లో లీనియర్, మోనోజీనిక్ ఫామ్, వానిల్లా సెపరాడో మెథడ్‌లను కీలకమైనవిగా గుర్తించాలి. నిరూపక రేఖా జ్యామితులు, వృత్తాలు, శంఖవాలు సిద్ధాంతపరమైనవి. నిశ్చిత సమాకలనం, అవకలన సమీకరణాల్లో ఫార్ములాను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్ 2బి పరంగా విద్యార్థులకు కలిసొచ్చే అంశం.. ఇందులో ప్రశ్నలు నేరుగా ఉంటాయి. ప్రిపరేషన్ సమయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇస్తూ చదవాలి. ఒకే విధంగా ఉండే ఫార్ములాలు, ప్రాసెస్‌ల విషయంలో ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేయాలి. కఠినమైన, అధిక ప్రాధాన్యత ఉన్న సమస్యలను నిరంతరం ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్షలో ఎలాంటి ప్రశ్న, ఏవిధంగా అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. మొదటి సంవత్సరం విద్యార్థులు వెక్టార్ ఆల్జీబ్రా; మాత్రికలు, సరళరేఖలు, సరళరేఖ యుగ్మాలు, అవకలనాలు, అప్లికేషన్స్ అండ్ డెరివేషన్స్‌పై ఎక్కువ సమయం కేటాయించాలి.
- ఎం.ఎన్.రావు, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నిపుణులు

ఫిజిక్స్ :
ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్‌లో ఉండే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నటిజం; కరెంట్ ఎలక్ట్రిసిటీ; ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్; పరమాణువు, వేవ్స్; సెమీ కండక్టర్ ఎలిమెంట్స్ వంటి అంశాల్లో పట్టు సాధించేందుకు కృషి చేయాలి. మొదటి సంవత్సరం విద్యార్థులు రొటేటరీ మోషన్; యూనివర్సల్ గ్రావిటేషన్ లా; ఎస్కేప్ వెలాసిటీ; సింపుల్ హార్మోనిక్ మోషన్; సర్ఫేస్ టెన్షన్, థర్మోడైనమిక్స్ వంటి అంశాలకు అధిక సమయం కేటాయించాలి. ఈ సబ్జెక్ట్‌లోని చాప్టర్లకు లభిస్తున్న వెయిటేజీ కోణంలో వేవ్స్; ఆప్టిక్స్; స్టాటిక్ ఎలక్ట్రిసిటీ; కరెంట్ ఎలక్ట్రిసిటీ; మూవింగ్ ఛార్జెస్ ఇన్ మ్యాగ్నటిజం; ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్; డ్యూయల్ నేచర్ ఆఫ్ మేటర్; సెమీ కండక్టర్ డివెజైస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫిజిక్స్‌లో న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలను సాధన చేయాలి. ఇందుకోసం బేసిక్స్, ఫార్ములాలు, కాన్సెప్ట్‌లపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. సెమీకండక్టర్ డివెజైస్,న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్స్ నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఫిజిక్స్‌కు సంబంధించి విద్యార్థులు ఎలక్ట్రోస్టాటిక్ వేవ్ మోషన్, ఆప్టిక్స్‌ను కఠినమైనవిగా భావిస్తారు. విద్యార్థులు డాప్లర్ ప్రభావం, ఫ్లేమ్స్ ఎడమ, కుడి నియమాలు, అర్ధవాహక పరికరాలు, వేవ్ మోషన్; సెమీ కండక్టర్ ఎలిమెంట్స్; మూవింగ్ ఛార్జెస్-మ్యాగ్నటిజం; విద్యుదయస్కాంత ప్రేరణల గురించి క్షుణ్నంగా చదవడం తప్పనిసరి.
- సి.హెచ్.రామకృష్ణ, ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు


కెమిస్ట్రీ :
కెమిస్ట్రీలోని టాపిక్స్ అధిక శాతం కాన్సెప్ట్‌ల ఆధారంగా ఉంటాయి. దీంతో విద్యార్థులు ఈ సబ్జెక్ట్‌ను కొంత క్లిష్టంగా భావిస్తారు. ప్రాక్టీస్‌తో ఈ సమస్యను అధిగమించొచ్చు. ముఖ్యంగా సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్ చాప్టర్లను బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటిలో నుంచి ఎక్కువగా రీజనింగ్ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత సమయంలో అకాడమీ పుస్తకాలను చదువుతూ... ముఖ్యమైన పాయింట్లను అండర్‌లైన్ చేసుకోవాలి. ముఖ్యాంశాలను నోట్స్ రూపంలో రాసుకొని రివిజన్ చేయాలి. పి-బ్లాక్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ; విద్యుత్ రసాయన శాస్త్రం, కెమికల్ కై నటిక్స్‌లోని దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నల ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్గానిక్,ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీల్లో ప్రతిదాన్నుంచి ఒక దీర్ఘ సమాధాన ప్రశ్న చొప్పున అడుగుతారు. అదే విధంగా పి-బ్లాక్ మూలకాలు, డి,ఎఫ్-బ్లాక్ మూలకాలు, లోహ శాస్త్రం వంటి అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని ముఖ్యాంశాలను చదవాలి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. కర్బన రసాయన శాస్త్రం; ఆవర్తన పట్టిక; పరమాణు నిర్మాణం; రసాయన బంధం అంశాలపై అధికంగా దృష్టిపెట్టాలి. బైపీసీ విద్యార్థులు కెమిస్ట్ట్రీలో.. ఆవర్తన పట్టిక; కర్బన రసాయన శాస్త్రం; రసాయన బంధం; పరమాణు నిర్మాణం అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలోని సమస్యలను సాధన చేస్తూనే సినాప్సిస్ రూపొందించుకుంటే.. రివిజన్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలో పి-బ్లాక్ ఎలిమెంట్స్; ఆర్గానిక్ కెమిస్ట్రీ; విద్యుత్ రసాయన శాస్త్రం; కెమికల్ కైనటిక్స్‌లోని దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నల ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
- విజయ్ కిశోర్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ నిపుణులు


బైపీసీ.. బోటనీ, జువాలజీ కీలకం :
బైపీసీ విద్యార్థులు బోటనీ, జువాలజీ సబ్జెక్ట్‌లను విశ్లేషణాత్మక దృక్పథంతో ప్రిపేరవ్వాలి. ముఖ్యంగా అనువర్తిత ఆధారిత ప్రిపరేషన్ సాగించాలి.
బోటనీ :
బోటనీలో ఫ్లో చార్ట్‌లు, డయాగ్రమ్స్ వేయడం ప్రాక్టీస్ చేయాలి. మొదటి సంవత్సరం విద్యార్థులు.. మొక్కల నిర్మాణాత్మక సంవిధానం-స్వరూప శాస్త్రం; జీవ ప్రపంచంలో వైవిధ్యం; కణ నిర్మాణం, విధులు; మొక్కల అంతర్ నిర్మాణ సంవిధానం, మొక్కల్లో ప్రత్యుత్పత్తి యూనిట్లపై ఎక్కువ దృష్టిపెట్టాలి. దీనికి సంబంధించి డయాగ్రమ్స్ వేయడం బాగా ప్రాక్టీస్ చేయాలి. డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్ ఇన్ ప్లాంట్స్(మార్ఫాలజీ), రీ ప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ సిస్టమాటిక్స్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఎకాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ(బ్యాక్టీరియా,వైరస్), జెనిటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ టాపిక్స్‌పైనా అవగాహన పెంచుకోవాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొక్కల శరీర ధర్మశాస్త్రం; బయోటెక్నాలజీ; మైక్రోబ్స్, అణు జీవశాస్త్రం యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్ నిపుణులు

జువాలజీ :
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జువాలజీలో మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి సంబంధిత ఆరోగ్యం; అంతస్రావక వ్యవస్థ, నాడీ నియంత్రణ -సమన్వయం; శరీర ద్రవాలు, ప్రసరణ, విసర్జక పదార్థాలు; జన్యు శాస్త్రాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. జంతుదేహ నిర్మాణం; గమనం, ప్రత్యుత్పత్తి; జీవావరణం; పర్యావరణం; బొద్దింక జీవ వ్యవస్థ వంటి అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలి. ఈ సబ్జెక్ట్‌లో కూడా గ్రాఫికల్ ప్రజంటేషన్ మార్కుల సాధనలో కీలకంగా మారుతుంది. కాబట్టి డయాగ్రమ్స్ ప్రాక్టీస్ చేయాలి. జువాలజీ రెండు సంవత్సరాలకు సంబంధించి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, యానిమల్ డైవర్సిటీ, లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రొటొజోవా, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, స్టడీ ఆఫ్ పెరిప్లెనేటా అమెరికానా, ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, హ్యూమన్ రీప్రొడక్షన్, జెనిటిక్స్, ఆర్గానిక్ ఎవల్యూషన్, అప్లయిడ్ బయాలజీలపై ప్రత్యేక దృష్టితో చదవాలి.
-శ్రీనివాసులు, జువాలజీ సబ్జెక్ట్ నిపుణులు

కామన్ టిప్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ :
  • పస్తుతం ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు ఇంక కొద్ది రోజులు మాత్రమే సమయం అందుబాటులో ఉంది. కాబట్టి విద్యార్థులు ఇప్పుడు పూర్తిగా ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కుల సాధనే లక్ష్యంగా నిర్దేశించుకోవాలి.
  • ఈ సమయంలో పూర్తిగా ఇంటర్ ప్రిపరేషన్‌కే కేటాయించాలి.
  • కచ్చితత్వం, సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి. గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
  • ప్రతి చాప్టర్ అధ్యయనంతోపాటు వాటిలో ప్రాబ్లమ్స్ ఆధారిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
  • ఇప్పటికే తాము చదివిన మెటీరియల్‌తోపాటు తెలుగు అకాడమీ పుస్తకాల్లోని కాన్సెప్టులను మరోసారి రివిజన్ చేయడం లాభిస్తుంది.
  • రివిజన్ సమయంలో వ్యాసరూప ప్రశ్నలు, ఉదాహరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ముందుగా సులభంగా ఉండే చాప్టర్లను పూర్తిచేసి.. ఆ తర్వాత క్లిష్టమైన చాప్ట్టర్లకు ఎక్కువ సమయం కేటాయించాలి.
  • ప్రతి రోజు అన్ని సబ్జెక్ట్‌లను చదివే విధంగా టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి.
  • కొత్త టాపిక్‌ను చదివే ముందు.. అంతకుముందు రోజు చదివిన చాప్టర్లను అవలోకనం చేసుకోవడానికి పది నిమిషాలు కేటాయించాలి.
  • రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గంటలు చదివే విధంగా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి.
  • వీక్లీ టెస్ట్‌లు, ప్రీ-ఫైనల్ టెస్ట్‌లకు హాజరు కావాలి. దీనిద్వారా తమ సామర్థ్య స్థాయి తెలుసుకోవచ్చు.
  • ఇలా.. ప్రతి సబ్జెక్ట్‌లోని ముఖ్యమైన చాప్టర్లను గుర్తించడం మొదలు.. టైమ్ ప్లానింగ్ వరకు పకడ్బందీగా ప్రిపరేషన్ సాగిస్తే టాప్ స్కోర్ సొంతం చేసుకోవచ్చు.

ఇంటర్మీడియెట్ - 2020 పరీక్షల టైమ్ టేబుల్ :
ప్రథమ సంవత్సరం :
తేదీ పరీక్ష పేపర్
04-03-2020 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
06-03-2020 ఇంగ్లిష్ పేపర్-1
09-03-2020 మ్యాథమెటిక్స్ పేపర్ 1-ఎ; బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1
12-03-2020 మ్యాథమెటిక్స్ పేపర్ 1-బి;జువాలజీ పేపర్-1; హిస్టరీ పేపర్-1
14-03-2020 ఫిజిక్స్ పేపర్-1; ఎకనామిక్స్ పేపర్-1
17-03-2020 కెమిస్ట్రీ పేపర్-1;కామర్స్ పేపర్-1; సోషియాలజీ పేపర్-1; ఫైన్ ఆర్ట్స్, మూజిక్ పేపర్-1
19-03-2020 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1;లాజిక్ పేపర్-1; బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు)
21-03-2020 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1; జాగ్రఫీ పేపర్-1

గమనిక: తెలంగాణలో మ్యాథమెటిక్స్ పేపర్-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1, సైకాలజీ పేపర్-1లను మార్చి పదో తేదీన నిర్వహించనున్నారు.

ద్వితీయ సంవత్సరం టైమ్ టేబుల్ :
తేదీ పరీక్ష పేపర్
05-03-2020 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
07-03-2020 ఇంగ్లిష్ పేపర్-2
11-03-2020 మ్యాథమెటిక్స్ పేపర్ 2-ఎ; బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2
13-03-2020 మ్యాథమెటిక్స్ పేపర్ 2-బి; జువాలజీ పేపర్-2; హిస్టరీ పేపర్-2
16-03-2020 ఫిజిక్స్ పేపర్-2; ఎకనామిక్స్ పేపర్-2
18-03-2020 కెమిస్ట్రీ పేపర్-2; కామర్స్ పేపర్-2; సోషియాలజీ పేపర్-2; ఫైన్ ఆర్ట్స్, మూజిక్ పేపర్-2
20-03-2020 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2; లాజిక్ పేపర్-2; బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు)
23-03-2020 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2; జాగ్రఫీ పేపర్-2
Published date : 18 Feb 2020 04:11PM

Photo Stories