Skip to main content

బిట్‌శాట్-2019 విజయానికి వ్యూహాలు..!

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్.. సంక్షిప్తంగా బిట్స్! డీమ్డ్ యూనివర్సిటీ హోదా.. దేశంలో మూడు క్యాంపస్‌లు, అంతర్జాతీయంగా ఒక క్యాంపస్! ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌గా పేరున్న బిట్స్‌లో బీటెక్ కోర్సులో ప్రవేశానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడుతుంటారు! ఇందుకోసం ఏటా నిర్వహించే బిట్‌శాట్‌కు సన్నద్ధమవుతుంటారు. తాజాగా 2019-20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు బిట్‌శాట్-2019 నోటిఫికేషన్ వెలువడింది! ఈ నేపథ్యంలో బిట్‌శాట్ తీరుతెన్నులు, విజయానికి వ్యూహాలపై విశ్లేషణ...
దేశంలో మూడు క్యాంపస్‌లు.. పిలానీ, గోవా, హైదరాబాద్; దుబాయ్‌లో ఒక క్యాంపస్ ద్వారా అకడమిక్ కోర్సులు అందిస్తున్న బిట్స్.. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌గా నిలిచింది. తాజాగా ఎంహెచ్‌ఆర్‌డీ నుంచి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా సైతం సొంతం చేసుకుంది. అందుకే బిట్స్‌లో సీటు కోసం ప్రతిభావంతులు పోటీపడుతుంటారు. జేఈఈ, ఎంసెట్ వంటి పరీక్షలకు పోటీపడే విద్యార్థుల్లో అధికశాతం మంది బిట్‌శాట్‌కు కూడా సన్నద్ధమవుతుంటారు.

ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ :
బిట్స్ నిర్వహించే అడ్మిషన్ టెస్ట్ (బిట్‌శాట్)ను ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం పేరుతో నిర్వహిస్తున్నారు. ఇందులో విజయం సాధించి.. మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు ఉమ్మడి కౌన్సెలింగ్ విధానంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం లభిస్తుంది.

బిట్స్ క్యాంపస్‌లు.. బ్రాంచ్‌లు
పిలానీ క్యాంపస్: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్ బ్రాంచ్‌లు.
గోవా క్యాంపస్: కెమికల్, సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ బ్రాంచ్‌లు.
హైదరాబాద్ క్యాంపస్: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ బ్రాంచ్‌లు.
- వీటితోపాటు బీ-ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షే.. బిట్‌శాట్.

బిట్‌శాట్ తీరుతెన్నులు...
బిట్‌శాట్‌ను మొత్తం నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారు. అవి..

పార్ట్

ప్రశ్నల సంఖ్య

పార్ట్-1: ఫిజిక్స్

40

పార్ట్-2: కెమిస్ట్రీ

40

పార్ట్-3:

ఎ) ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ

15

బి) లాజికల్ రీజనింగ్

10

పార్ట్-4:

మ్యాథమెటిక్స్/బయాలజీ

45

మొత్తం ప్రశ్నలు

150

పార్ట్-4లో పేర్కొన్న మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ సబ్జెక్టుల్లో బీఫార్మసీ ఔత్సాహిక విద్యార్థులు ఏదో ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. బీఈ కోర్సుల అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున మొత్తం 150 ప్రశ్నలతో 450 మార్కులకు పరీక్ష జరుగుతుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కును తగ్గిస్తారు.

అదనంగా 12 ప్రశ్నలు..
బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్‌లో మరో ప్రత్యేకత.. పరీక్షకు కేటాయించిన మూడు గంటల వ్యవధిలోపే 150 ప్రశ్నలను పూర్తిచేసిన అభ్యర్థులకు.. అదనంగా మరో 12 ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం కల్పిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ నుంచి నాలుగు ప్రశ్నలు చొప్పున ఇస్తారు.

ఆన్‌లైన్ టెస్ట్.. స్లాట్
ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా బిట్‌శాట్-2019ను మొత్తం 11 రోజుల వ్యవధిలో రోజుకు రెండు స్లాట్లతో నిర్వహించనున్నారు. నిర్దిష్ట వ్యవధిలో అభ్యర్థులు తమకు నచ్చిన తేదీ, స్లాట్‌లో పరీక్షకు హాజరయ్యే వెసులుబాటు ఉంటుంది. ఇందుకోసం.. తాము ఎంపిక చేసుకున్న టెస్ట్ సెంటర్‌లో తమకు అనుకూలమైన స్లాట్‌ను రిజర్వ్ చేసుకునేందుకు వీలైనంత త్వరగా ఉపక్రమించాలి.

బోర్డ్ టాపర్స్.. డెరైక్ట్ అడ్మిషన్స్ :
బిట్స్ ప్రవేశాల పరంగా మరో విశిష్టత.. ఆయా రాష్ట్రాల బోర్డ్‌ల పరిధిలో స్టేట్ టాపర్స్‌గా నిలిచిన అభ్యర్థులకు బిట్‌శాట్‌కు హాజరు నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ బోర్డ్ టాపర్స్ నేరుగా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందే వీలుంది. ఈ విధానానికి కూడా విద్యార్థుల నుంచి ఎంతో ఆదరణ లభిస్తోంది. గత ఆరేళ్లలో ఆయా బోర్డ్‌లలో టాపర్స్‌గా నిలిచిన దాదాపు 50 మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడమే ఇందుకు నిదర్శనం.

సీటు లభిస్తే..
బిట్‌శాట్ తుది మెరిట్ జాబితాలో నిలిచి బిట్స్ క్యాంపస్‌లలో సీటు సొంతం చేసుకున్న అభ్యర్థులకు కోర్సు వ్యవధిలో విస్తృత నైపుణ్యాలు సొంతమవడం ఖాయం. కారణం.. ఆయా కోర్సులకు సంబంధించి బిట్స్ ప్రత్యేక కరిక్యులంను రూపొందించడమే. విద్యార్థుల్లో ప్రాక్టికల్ అప్రోచ్ పెరిగే విధంగా దీన్ని రూపొందించారు. బీఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులు.. కోర్సు వ్యవధిలో రెండుసార్లు ప్రాక్టీస్ స్కూల్-1, ప్రాక్టీస్ స్కూల్-2 పేరుతో.. పరిశ్రమల్లో రీసెర్చ్ కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

మైనర్ ప్రోగ్రామ్స్ :
విద్యార్థులకు.. కోర్ సబ్జెక్ట్‌లే కాకుండా ఇతర అంశాల్లోనూ అవగాహన కల్పించే విధంగా మైనర్ ప్రోగ్రామ్స్ విధానాన్ని బిట్స్ అమలు చేస్తోంది. ఫైనాన్స్, అకౌంటింగ్, లిటరేచర్, హ్యుమానిటీస్ వంటి పలు సబ్జెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం మరో విశేషం.

పెరుగుతున్న పోటీ..
బిట్‌శాట్ ద్వారా దేశంలోని మూడు క్యాంపస్‌లలో మూడు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశం పొందడానికి ఏటా పోటీ పెరుగుతోంది. మొత్తం 450 మార్కులకు నిర్వహించే పరీక్షలో 400కుపైగా స్కోర్ సాధిస్తేనే సీటు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. గత మూడేళ్లలో క్యాంపస్‌ల వారీగా నమోదైన ఫైనల్ కటాఫ్‌లే ఇందుకు నిదర్శనం.

మరికొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు..
బిట్‌శాట్ స్కోర్ ఆధారంగా ఇప్పుడు పలు ప్రైవేటు యూనివర్సిటీలు బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ, బిట్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కాకుండా దాదాపు వంద వరకు ప్రముఖ ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లు తమ ప్రవేశ ప్రక్రియకు బిట్‌శాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.

బిట్‌శాట్‌లో విజయానికి మార్గాలు...
బేసిక్స్‌పై పట్టు :
బిట్‌శాట్‌లో అడుగుతున్న ప్రశ్నలు వాటి తీరును గమనిస్తే.. జేఈఈ తరహాలోనే క్లిష్టత స్థాయి ఉంటోంది. ప్రశ్నలన్నీ దాదాపుగా అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో సమాధానం ఇవ్వాల్సిన విధంగా ఉంటున్నాయి. దీంతో అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లలో బేసిక్స్‌పై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి. జేఈఈ ప్రిపరేషన్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవడం వల్ల ఒకే సమయంలో రెండు పరీక్షలకు ప్రిపరేషన్ సాగించొచ్చు.
పార్ట్-3.. ప్రత్యేకం :
ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లతో బేరీజు వేస్తే.. బిట్‌శాట్ ప్రత్యేకం పార్ట్-3 అని చెప్పొచ్చు. ఈ విభాగంలో ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్ అంశాల నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. కేవలం అభ్యర్థుల్లోని సబ్జెక్ట్ నైపుణ్యాలను పరీక్షించడమే కాకుండా.. లాంగ్వేజ్, తులనాత్మక పరిశీలన సామర్థ్యాన్ని పరీక్షించే లా ఈ విభాగాన్ని పొందుపర్చారు. పదో తరగతి స్థాయిలో ఇంగ్లిష్ గ్రామర్, వొకాబ్యులరీపై పట్టుంటే 25 ప్రశ్నలకు సులువుగా సమాధానం ఇవ్వొచ్చు.
మరికొన్ని చిట్కాలు..
  • బేసిక్స్‌పై పట్టు సాధించడంతోపాటు విద్యార్థులు నిర్దిష్టంగా కొన్ని వ్యూహాలు అనుసరిస్తే బిట్‌శాట్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచే అవకాశముంది.
  • ప్రతి సబ్జెక్ట్‌లోనూ ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లకు షార్ట్‌కట్ మెథడ్స్‌తో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ఇది రివిజన్ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది.
  • కెమిస్ట్రీలో ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్‌ను ఒక జాబితాగా రూపొందించుకోవాలి.
  • ఫిజిక్స్‌లో.. వర్క్ అండ్ ఎనర్జీ, న్యూటన్స్ లా, కరెంట్ ఎలక్ట్రిసిటీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మ్యాగ్నటిజం అండ్ మ్యాగ్నటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్లలో ముఖ్య అంశాలతో నోట్స్ రూపొందించుకోవాలి.
  • మ్యాథమెటిక్స్‌లో హైపర్‌బోలా, పారాబోలా, రెక్టాంగులర్ పారాబోలా, ట్రిగ్నోమెట్రీ, వెక్టార్స్, 3-డి, ఇంటెగ్రిల్ కాలిక్యులస్ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
బిట్‌శాట్ లక్ష్యంగా..
కేవలం బిట్‌శాట్‌నే లక్ష్యంగా ఎంచుకున్న అభ్యర్థులు.. ప్రత్యేక వ్యూహాలు అనుసరించాలి. ప్రతిరోజు, ప్రతి విభాగానికి కచ్చితంగా నిర్దిష్ట సమయం కేటాయించుకుని ప్రిపరేషన్ సాగించాలి. ప్రతి సబ్జెక్ట్‌కు రోజుకు కనీసం రెండు గంటలు చొప్పున కేటాయించేలా వ్యవహరించాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని సిలబస్‌ను అనుసరిస్తూ వాటిని బిట్‌శాట్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ చదివితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

బిట్‌శాట్-2019 సమాచారం..
అర్హత: 10+2/ఇంటర్మీడియెట్ ఎంపీసీ/బైపీసీ (బి.ఫార్‌‌మ).. గ్రూప్ సబ్జెక్టులలో ఒక్కో సబ్జెక్ట్‌లో 60 శాతం మార్కులతో.. మొత్తం గ్రూప్ సబ్జెక్ట్‌లలో కలిసి సగటున 75 శాతం మార్కులు సాధించాలి.
  • 10+2/ఇంటర్మీడియెట్ 2018లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు, 2019లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులే బిట్‌శాట్‌కు అర్హులు.
దరఖాస్తు విధానం: www.bitsadmission.com వెబ్‌సైట్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకుని ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. క్యాంపస్, బ్రాంచ్ ప్రాథమ్యం ఎంపిక విషయంలో స్పష్టత ఏర్పరచుకోవాలి. ఎందుకంటే.. తుదిదశకు చేరిన అభ్యర్థులకు వారు ఎంచుకున్న ప్రాథమ్యం ఆధారంగానే ప్రవేశం కల్పిస్తారు.
బిట్‌శాట్-2019 ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 20, 2019.
అప్లికేషన్‌లో లోపాల సవరణ అవకాశం: మార్చి 22-25, 2019.
టెస్ట్ సెంటర్ కేటాయింపు వివరాలు: మార్చి 27, 2019.
టెస్ట్ తేదీ, స్లాట్ బుకింగ్ సదుపాయం: మార్చి 28 - ఏప్రిల్ 8, 2019.
ఆన్‌లైన్ టెస్ట్ తేదీలు: మే 16, 2019 నుంచి మే 26, 2019 వరకు.
అడ్మిషన్ జాబితా ప్రకటన: జూన్ 20, 2019.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: బిట్స్ పిలానీ-హైదరాబాద్ క్యాంపస్, హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.bitsadmission.com
Published date : 30 Jan 2019 02:49PM

Photo Stories