Skip to main content

ఆర్‌ఐఈల్లో రాష్ట్రాల వారీగా కోటా.. ఎంపిక విధానం ఇలా..

ఆర్‌ఐఈలలో సీట్లను కేటాయించే క్రమంలో రాష్ట్రాల వారీగా కోటా ఉంటుంది.

ఒక్కో ఆర్‌ఐఈ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాలకు కేటాయించిన సీట్లను నిర్దిష్టంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఆర్‌ఐఈ–మైసూరు పరిధిలో ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు బీఎస్‌సీ–బీఈడీలోని రెండు గ్రూప్‌లకు కలిపి 16 సీట్లు, బీఏ–బీఈడీ కోర్సులో 8 సీట్లు కేటాయించారు. అలాగే తెలంగాణ విద్యార్థులకు బీఎస్‌సీ–బీఈడీలోని రెండు గ్రూప్‌లకు కలిపి 10 సీట్లు, బీఏ–బీఈడీ కోర్సుకు 5సీట్లు అందుబాటులో ఉన్నాయి.

సీఈఈ స్కోర్‌–అకడెమిక్‌ మార్కులు..
ఊ ఆర్‌ఐఈల్లోని ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఎన్‌సీఈఆర్‌టీ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తుంది. ఇందులో సాధించిన స్కోర్‌ ఆధారంగా మలిదశ ప్రవేశ ప్రక్రియ ఉంటుంది. సీట్ల కేటాయింపులో సీఈఈ స్కోర్, అకడమిక్‌ అర్హతలకు వేర్వేరుగా వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తున్నారు. సీఈఈ స్కోర్‌కు 60 శాతం, ఇంటర్మీడియెట్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ విధానం అమలవుతోంది.

సీఈఈ పరీక్ష ఇలా..
సీఈఈ పరీక్షను మూడు సబ్జెక్ట్‌లలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ, టీచింగ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ విభాగంలో 20 ప్రశ్నలు, మిగతా రెండు విభాగాల నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 80 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున మొత్తం 160 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష సమయం రెండు గంటలు.

ఇంటర్‌తోనే ఎమ్మెస్సీ– బీఈడీ..
ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే ఆరేళ్ల వ్యవధిగల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ–బీఈడీ కోర్సు పూర్తిచేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కోర్సు ఆర్‌ఐఈ–మైసూరు క్యాంపస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మొత్తం మూడు విభాగాల్లో(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ మెటిక్స్‌)లలో ఎమ్మెస్సీ–బీఈడీ కోర్సు చదవొచ్చు. ఒక్కో విభాగంలో 18 సీట్లు ఉన్నాయి. వీటి కోసం జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడొచ్చు.

బీఈడీ, ఎంఈడీ కూడా..

  • ఇంటిగ్రేటెడ్‌ బీఏ–బీఈడీ, బీఎస్‌సీ–బీఈడీ, ఎమ్మెసీ–బీఈడీలతోపాటు రెండేళ్ల వ్యవధిలోని బీఈడీ, ఎంఈడీ కోర్సులు కూడా ఆర్‌ఐఈ క్యాంపస్‌లలో అందుబాటులో ఉన్నాయి. బీఈడీలో సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్‌సైన్స్‌ అండ్‌ లాంగ్వేజ్‌ గ్రూప్‌లలో కోర్సులు ఉన్నాయి. ఎంఈడీలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ లేదా సెకండరీ అండ్‌ సీనియర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
  • బీఈడీ కోర్సులకు 50శాతం మార్కులతో సంబంధిత గ్రూప్‌లతో డిగ్రీ ఉత్తీర్ణత, ఎంఈడీ కోర్సులకు 50శాతం మార్కులతో బీఈడీ, బీఏ బీఈడీ/బీఏ ఎడ్‌/బీఎస్‌సీ బీఈడీ/బీఎస్‌సీ ఈడీ/బీఈఎల్‌ఈడీ ఉత్తీర్ణత అవసరం. అదే విధంగా 50శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసుకున్న డీఈఎల్‌ఈడీ ఉత్తీర్ణులు కూడా ఎంఈడీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రారంభ్‌.. అన్ని రాష్ట్రాల విద్యార్థులకు..

ఎన్‌సీఈఆర్‌టీ పరిధిలోని ఆర్‌ఐఈలతోపాటు ఉన్న మరో ఉపాధ్యాయ విద్యా సంస్థ హర్యానాలోని అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌. దీనినే ప్రారంభ్‌ అని పిలుస్తున్నారు. ఇందులో కూడా ఇంటర్మీడియెట్‌ అర్హతతో ఇంటిగ్రేటెడ్‌ బీఏ–బీఈడీ, బీఎస్‌సీ–బీఈడీ కోర్సులు ఉన్నాయి. బీఏ–బీఈడీలో 30 సీట్లు, బీఎస్‌సీ–బీఈడీలో 70 సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడే అవకాశం ఉంది.
కోర్సుకు అనుగుణంగా ప్రశ్నలు..
సీఈఈ పరీక్షలో.. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న కోర్సుకు అనుగుణంగా సిలబస్, ప్రశ్నల సరళి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సుల విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ స్థాయిలోని అకడమిక్స్‌పై పట్టు సాధించాల్సి ఉంటుంది. బీఈడీ, ఎంఈడీ కోర్సుల విద్యార్థులు.. బ్యాచిలర్‌ స్థాయిలో తాము చదివిన గ్రూప్‌లకు సంబంధించిన సబ్జెక్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ సంబంధించి బోధన పద్ధతులు, పెడగాగీ వంటి అంశాలపై పట్టు అవసరం.
Published date : 05 Jun 2021 05:46PM

Photo Stories