Skip to main content

Employees Working Hours : ఆర్థిక సర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం.. ఇక ప‌నిచేసే గంట‌లు ఎన్ని అంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆర్థిక సర్వే 2024-25ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
finance minister nirmala sitharaman announced working hours

ఈ నివేదికలో భారతదేశ ఆర్థిక స్థితిగతులు, వృద్ధి ప్రణాళికలు, పెట్టుబడులు, వాణిజ్య వ్యూహాలు, భవిష్యత్ సవాళ్లు గురించి వెల్ల‌డించారు. అలాగే ఈ రోజు ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని కూడా వెల్ల‌డించారు మంత్రి గారు. అది ఏమిటంటే...

వారానికి 60 గంటలకు మించి పని చేయడం వల్ల...

వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్సింగ్‌ గురించి ఈ మధ్యకాలంలో విస్తృతస్థాయి చర్చ నడుస్తోంది. చైర్మన్‌, సీఈవో స్థాయిలో ఉన్న వ్యక్తులు నేరుగా స్పందిస్తుండడం.. వాటిపై విమర్శలు-సమర్థనలతో ఈ చర్చ కొనసాగుతోంది. ఈ దరిమిలా ఇవాళ విడుదలైన ఆర్థిక సర్వే సైతం పనిగంటల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. పని గంటల చర్చలో ఇప్పుడు ఎకనామిక్‌ సర్వే సైతం భాగమైంది. వారానికి 60 గంటలకు మించి పని చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. వివిధ అధ్యయనాల నివేదికలను ఇందులో ప్రముఖంగా ప్రస్తావించింది. 

☛➤ Economic Survey 2024-25 Highlights: ఆర్థిక సర్వే కీలక అంశాలివే.. 2047 నాటికి దేశంలో...

ఆఫీసుల్లో ఎక్కువ సేపు గడపడం వల్ల....

ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం... ఆఫీసుల్లో ఎక్కువ సేపు గడపడం వల్ల మానసిక శ్రేయస్సుకు మంచిది కాదు. రోజుకు 12,  అంతకంటే ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులు గణనీయమైన స్థాయిలో బాధను అనుభవిస్తున్నారు. వారానికి ఎక్కువ గంటలు పని చేయడం ఆరోగ్యానికి హానికరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ(ILO) అధ్యయనాల నివేదికలూ ఈ విషయాన్నే స్పష్టం చేశాయి.

అనధికారికంగా.. ఎక్కువ పని గంటలతో ఉత్పాదకత(Productivity) పెరిగినా.. వారానికి 55-50 గంటల మధ్య పని చేయడం ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమేనని డబ్ల్యూహెచ్‌వో-ఐఎల్‌వో సంయుక్త అధ్యయన నివేదిక స్పష్టం చేసింది అని ఆర్థిక సర్వే వెల్లడించింది. అలాగే.. సుదీర్ఘంగా ఒకే దగ్గర ఎక్కువ గంటలు పని చేయడం మానసిక ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందని సపెయిన్‌ లాబ్స్‌ సెంటర్‌ ఫర్‌ హుమన్‌ బ్రెయిన్‌ అండ్‌ మైండ్‌ స్టడీ రిపోర్ట్‌ను ఎకనామిక్‌ సర్వే హైలెట్‌ చేసింది.

దెబ్బ తీసే అవకాశం లేకపోలేదని...

పని గంటలపై పరిమితులు విధించడం ఆర్థిక వృద్ధికి అవాంతరాన్ని కలిగించొచ్చని సర్వే అభిప్రాయపడింది. అలాగే కార్మికుల సంపాదన సామర్థ్యాన్ని దెబ్బ తీసే అవకాశం లేకపోలేదని తెలిపింది. కాబట్టి సౌకర్యవంతమైన పని గంటల విధానం భారతదేశాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుతుందని.. ఈ చర్యలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి తోడ్పడుతుంది అని ఆర్థిక సర్వే సూచించింది.

రాబోయే సంవత్సరంలో...

గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. బడ్జెట్‌కు ముందర దీనిని ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్‌ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనామిక్‌ డివిజన్‌ ఈ సర్వేను రూపొందిస్తుంది.

Published date : 31 Jan 2025 07:09PM

Photo Stories