Union Budget: కేంద్ర బడ్జెట్ 2025–26ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. పూర్తి వివరాలు ఇవే..

రూ.50,65,345 కోట్లతో కూడిన పద్దును పార్లమెంటుకు సమర్పించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.4 శాతం ఉండొచ్చని మంత్రి జోస్యం చెప్పారు. జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతానికే పరిమితం కావచ్చన్న అంచనాల నేపథ్యంలో సంక్షేమాన్ని, సంస్కరణలను పరుగులు పెట్టించేలా పలు చర్యలను ప్రతిపాదించారు. 74 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఏమేం చెప్పారంటే..
పరిశ్రమలకు మహర్దశ
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ల్లో పెట్టుబడులను రెట్టింపునకు పైగా పెంచనున్నట్టు మంత్రి వివరించారు. ‘‘ప్రస్తుతం కోటికి పైగా ఎంఎస్‌ఎంఈల ద్వారా 7.5 కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వాటికి ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లకు పైగా రుణ సదుపాయం అందనుంది. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రుణ పరిమితి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు, స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెరగనుంది. తయారీ రంగంలో మేకిన్ ఇండియాకు మరింత ప్రాధాన్యం దక్కనుంది’’ అని చెప్పారు.
బడ్జెట్ స్వరూపం (అంకెలు రూ.కోట్లలో)
- మొత్తం బడ్జెట్ 50,65,345
- రెవెన్యూ వసూళ్లు 34,20,409
- రెవెన్యూ వ్యయం 39,44,255
- మూలధన వసూళ్లు 16,44,936
- మూలధన వ్యయం 11,21,090
చదువుకు జేజే
ఈ ఏడాది మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 10 వేల అదనపు సీట్లు, ఐఐటీల్లో కనీసం 6,500 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నట్టు విత్త మంత్రి ప్రకటించారు. ‘‘రూ.500 కోట్లతో సాగు, ఆరోగ్యం తదితర రంగాల్లో కృత్రిమ మేధలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటవుతాయి. భారత్‌నెట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం అందుబాటులోకి తేనున్నాం. బాలల్లో శాస్త్రీయ జిజ్ఞాసను పెంపొందించేందుకు సర్కారీ స్కూళ్లలో వచ్చే ఐదేళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబులు ఏర్పాటవుతాయి. ‘భారతీయ భాషా పుస్తక్’ పథకంతో స్థానిక భాషల్లోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాలన్నీ డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తాయి’’ అని తెలిపారు.
పట్టణాలకు ప్రాధాన్యం
పట్టణాలను గ్రోత్ హబ్‌లుగా తీర్చిదిద్దడానికి రూ.లక్ష కోట్లతో అర్బన్ చాలెంజ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా అమలు చేసే ప్రతి పథకంలోనూ నాలుగో వంతు నిధులను కేంద్రం అందజేస్తుంది. 2047 కల్లా కనీసం 100 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తే లక్ష్యంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
మెడికల్ టూరిజానికి ఊపు
మెడికల్ టూరిజంలో భాగంగా రూ.20 వేల కోట్లతో ‘హీల్ ఇన్ ఇండియా’ పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా మరో 50 పర్యాటక ప్రాంతాలను స్థానిక ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. మరో 120 పట్టణాలను ఉడాన్ పథకం పరిధిలోకి తేవడం ద్వారా వచ్చే పదేళ్లలో మరో 4 కోట్ల మందికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి సింగిల్ విండో సదుపాయంగా ‘భారత్ ట్రేడ్‌నెట్’ను అందుబాటులోకి తెస్తామన్నారు.
సాగుకు పట్టం...
వ్యవసాయ రంగానికి పట్టం కట్టేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మల ప్రకటించారు. ‘‘7.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నాం. అసోంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంలో భారీ యూరియా ప్లాంటు ఏర్పాటవనుంది. వ్యవసాయోత్పత్తి, నిల్వ సామర్థ్యం పెంపు తదితర లక్ష్యాలతో రాష్ట్రాల భాగస్వామ్యంతో 100 జిల్లాల్లో ప్రధానమంత్రి ధనధాన్య కృషీ యోజన అమలవనుంది.
రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెజీలియన్స్ పథకంతో ఈ పథకంతో గ్రామీణ మహిళలు, యువ రైతులు, చిన్న, సన్నకారు రైతులకు బాగా లబ్ధి చేకూరుతుంది. వంట నూనెల ఉత్పత్తి తృణధాన్యాల సాగులో ఆత్మనిర్భరత సాధనకు ప్రాధాన్యమిస్తున్నాం. కూరగాయ లు, పళ్ల సాగుకు సమగ్ర పథకం తేనున్నాం. జన్యు బ్యాంకుల ద్వారా విత్తన నిల్వ సా మర్థ్యం పెంపొందిస్తాం’’ అని వివరించారు.
గమ్యస్థానం: వికసిత భారత్
దారిదీపం: సమష్టి కృషి
ఇంధనం: కొత్త తరం సంస్కరణలు
స్థూలంగా చెప్పాలంటే 2025–25 కేంద్ర బడ్జెట్లో నిర్మలమ్మ ఆవిష్కరించిన పంచ రంగుల చిత్రం సారాంశమిదే! మధ్య తరగతి కొనుగోలు శక్తిని, తద్వారా అంతిమంగా ఆర్థిక వృద్ధి రేటును ఇతోధికంగా పెంచడం, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను విస్తృతపరచడమనే మోదీ ప్రభుత్వ లక్ష్యాలను బడ్జెట్లో ఘనంగానే ఆవిష్కరించారు విత్త మంత్రి. ‘‘ఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కల సాకారం దిశగా ఇదో పెద్ద ముందడుగు’’ అని చెప్పుకున్నారు.
పౌరులందరి ప్రగతే (సబ్ కా వికాస్) లక్ష్యంగా పలు పథకాలను, చర్యలను ప్రతిపాదించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న తెలుగువారి అడుగుజాడ గురజాడ పంక్తులతో ప్రసంగం మొదలు పెట్టారు. ‘పేదరికం లేని సమాజం, అందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన, పాఠశాల విద్య, వైద్య సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తి–వారికి మెరుగైన ఉపాధి, మహిళల్లో కనీసం 70 శాతం మందికి ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం, భారత్‌ను ప్రపంచ ఆహార పాత్రగా తీర్చిదిద్దేలా రైతన్నకు వెన్నుదన్నుగా నిలవడం’ తమ ప్రభుత్వ లక్ష్యాలని పేర్కొన్నారు.
వాటి సాధనకు ‘ఆర్థిక వృద్ధి–ఉత్పాదకత, గ్రామీణ స్వావలంబన, వృద్ధి పథంలో సమష్టి అడుగులు, మేకిన్ ఇండియా ద్వారా నిర్మాణ రంగానికి పెద్దపీట, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత తోడ్పాటు, ఉద్యోగిత ఆధారిత వృద్ధి, మానవ వనరులపై భారీ పెట్టుబడులు, రక్షిత ఇంధన సరఫరాలు, ఎగుమతులు, ఇన్నోవేషన్లకు ఇతోధిక ప్రోత్సాహం’... ఇలా పది రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రస్థానంలో వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పెట్టుబడులు, ఎగుమతులను నాలుగు ప్రధాన చోదక శక్తులుగా పేర్కొన్నారు.
పన్నులు, ఇంధన, పట్టణాభివృద్ధి, గనులు, ఆర్థికం, నియంత్రణ... ఈ ఆరు కీలక రంగాల్లో వచ్చే ఐదేళ్ల పరిధిలో భారీ సంస్కరణలను ప్రతిపాదించారు. కాకపోతే లక్ష్యాలను ఘనంగా విధించుకున్న మంత్రి, వాటి సాధనకు ఏం చేయనున్నారనేది మాత్రం ఇదమిత్థంగా చెప్పకుండా పైపై ప్రస్తావనలతోనే సరిపెట్టారు. వేతనజీవికి వ్యక్తిగత వార్షిక ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచేశారు. తద్వారా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్య తరగతిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కొత్త ఆదాయ పన్ను బిల్లును వారంలో ప్రవేశపెడతామని తెలిపారు. పన్నుల రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మోదీ సర్కారు మానస పుత్రికలైన స్టార్టప్‌లు, డిజిటల్ ఇండియా తదితరాలకు నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెట్టారు.

రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు
మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కీలక ప్రకటన చేశారు. వడ్డీ లేకుండా రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేకుండా ఈ రుణాలు కేంద్రం ఇస్తుంది. ఈ నిధులను వివిధ రంగాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2021లో మొదటి అసెట్ మానిటైజేషన్ వ్యూహాన్ని ప్రకటించింది.
తాజా బడ్జెట్‌లో 2025–30 కాలానికి సంబంధించి రెండో అసెట్ మానిటైజేషన్ ప్లాన్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్లాన్‌లో భాగంగా మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.10 లక్షల కోట్ల మూలధన సహకారం అందిస్తారు. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ మద్దతుతో రాష్ట్రాలను కూడా ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు.

బడ్జెట్ హైలైట్స్
➤ కొత్త పన్నువిధానంలో రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉండదు. వేతన జీవులకు రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.12.75 లక్షల వరకు పరిమితి ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల రెవెన్యూ తగ్గిపోతుంది.
➤ ఏడు టారిఫ్ రేట్ల తొలగింపు
➤ 82 టారిఫ్ లైన్లపై ఉన్న సామాజిక సంక్షేమ సర్‌చార్జి రద్దు.
➤ అప్పుల ద్వారా ఆదాయం రూ.34.96 లక్షల కోట్లు, మొత్తం వ్యయం రూ.50.65 లక్షల కోట్లు
➤ జీడీపీ రెవెన్యూ లోటు 4.4 శాతం
➤ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రధాన్‌మంత్రి ధన్ ధాన్య యోజనకృషి యోజన ఏర్పాటు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
➤ కంది, మినుములు, పెసర రైతుల ప్రోత్సాహకం కోసం పప్పుధాన్యాల ఆత్మనిర్భర మిషన్ ఏర్పాటు. దీనిద్వారా నాఫెడ్, ఎన్‌సీపీఎఫ్‌లు రైతులనుంచి వచ్చే నాలుగేళ్లలో పప్పుధాన్యాలను సేకరిస్తాయి.
➤ కూరగాయలు, పండ్లు పండించే రైతుల కోసం సమగ్ర పథకం
➤ మఖానా విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు బిహార్‌లో మఖానా బోర్డు స్థాపన. అస్సాంలో ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తిచేసే యూరియా ప్లాంట్.
వరుసగా 8వసారి – బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

- దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ హితోక్తే మా సర్కారుకు స్ఫూర్తి
- జీవకోటి వానల కోసం ఎదురు చూసినట్టే పౌరులు సుపరిపాలనను అభిలషిస్తారన్న తిరుక్కురళ్ హితవును పన్ను విధానాల రూపకల్పనలో దృష్టిలో ఉంచుకున్నాం
- ఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కలను సాకారం చేసుకునే దిశగా ఇదో పెద్ద ముందడుగు
ధరలు తగ్గేవి
- విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే 36 రకాల ప్రాణాధార ఔషధాలు
- రూ.35 లక్షలకు పైగా విలువైన విదేశీ మోటార్ సైకిళ్లు
- విదేశీ ప్రీమియం కార్లు
- ఆహారం, పానీయాల పరిశ్రమల్లో ఉపయోగించే సింథటిక్ పరిమళ ద్రవ్యాలు
- కొన్ని రకాల నగలు, స్వర్ణకారుల ఉత్పత్తులు
- ఈథర్నెట్ స్విచ్చెస్ (క్యారియర్ గ్రేడ్)
- దిగుమతి చేసుకొనే ఎలక్ట్రానిక్ ఆట వస్తువులు, బొమ్మల విడిభాగాలు
ధరలు పెరిగేవి
- విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే ఫ్లాట్ ప్యానెల్ (టచ్ స్క్రీన్) డిస్‌ప్లేలు
- కొన్ని రకాల వస్త్రాలు
- యంత్రాల్లో ఉపయోగించే టేపర్లు
- దిగుమతి చేసుకొనే పాదరక్షలు
- స్మార్ట్ మీటర్లు
- సోలార్ సెల్స్
- పీవీసీ ఫ్లెక్స్ ఫిలింలు, పీవీసీ ప్లెక్స్ షీట్లు, పీవీసీ ప్లెక్స్ బ్యానర్లు
- దిగుమతి చేసుకొనే పడవలు, కొవ్వొత్తులు
రైల్వేలకు రూ.2.52 లక్షల కోట్ల నిధుల కేటాయింపు
ఈ బడ్జెట్‌లో రైల్వేశాఖ పద్దుల్లో పెద్దగా మార్పులేమీ రాలేదు. 2025–26 బడ్జెట్‌లో ఈ శాఖకు మొత్తం రూ.2.52 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు మొత్తం రూ.3,02,100 కోట్ల ఆదాయం ఆర్జిస్తాయని అంచనా వేశారు. మరో 200 వందేభారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమోభారత్ రైళ్లు ప్రవేశపె ట్టేందుకు అనుమతి ఇచ్చారు.

వచ్చే నాలుగేళ్లలో మొత్తం రైల్వే మౌలిక వసతుల కల్పన కోసం రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు బడ్జెట్ ప్రకటన అనంతరం శనివారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఆదాయ అంచనా రూ.3 లక్షల కోట్లు
2025–26 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ అన్ని మార్గాల ద్వారా రూ.3,02,100 కోట్ల ఆదాయం ఆర్జిస్తుందని అంచనా వేశారు. 2024–25 బడ్జెట్‌లో సవరించిన అంచనా ప్రకారం ఇది రూ.2,79,000 కోట్లుగా ఉంది. గత బడ్జెట్‌లో ప్రయాణికుల చార్జీల ఆదాయం 2024–25లో రూ.80,000 కోట్లు ఉండగా, 2023–24లో రూ.70,693 కోట్లు వచ్చింది. 2024–25 బడ్జెట్‌లో సరుకు రవాణా ద్వారా రూ.1,80,000 కోట్ల ఆదాయం వస్తుందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు.
2023–24లో ఇది 1,68,199 కోట్లుగా ఉంది. రైల్వేల్లో భద్రతాపరమైన చర్యల కోసం 2024–25 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రూ.1,14,062 కోట్లు ఉండగా, 2025–26 బడ్జెట్‌లో దీనిని రూ.1,16,514 కోట్లుగా అంచనా వేశారు.
మరో 200 వందేభారత్ రైళ్లు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
దేశవ్యాప్తంగా మరో 200 వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తక్కువ దూరంగల పట్టణాల మధ్య ప్రయాణించే అమృత్ భారత్ రైళ్లను మరో 100 ప్రారంభిస్తామని చెప్పారు. 17,500 కొత్త కోచ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వివరించారు.
రూ.12.75 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు
ఏడాదికి వచ్చే ఆదాయం రూ.12 లక్షల లోపు ఉన్నవారెవరూ ఇక ఆదాయపు పన్ను చెల్లించాల్సిన పని లేదు. ఇప్పటిదాకా రూ.7 లక్షలుగా ఉన్న ట్యాక్స్ రిబేట్ పరిమితిని ఒక్కసారిగా 12 లక్షలకు పెంచటం ద్వారా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊహించని కానుకనిచ్చారు. ఏడాదికి రూ.12 లక్షలు ఆదాయం ఉన్న వాళ్లు ప్రస్తుతం చెల్లిస్తున్న సుమారు రూ.80,000 పన్ను ఇకపై వారికి మిగులుతుంది.
దీనికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000ను కూడా కలిపితే రూ.12.75 లక్షల ఆదాయం వరకు ఉన్నవారు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మొత్తం ఆదా యం రూ.12.75 లక్షలకన్నా ఒక్క రూపాయి పెరిగినా.. వారు వివిధ పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పైపెచ్చు ఇది వ్యక్తులు జీతం రూపంలో ఆర్జించే మొత్తానికే వర్తిస్తుందని, మూలధన లాభాలు (క్యాపిటల్ గెయిన్స్) వంటి ఇతర ఆదాయాలకు మాత్రం ఈ రిబేటు వర్తించదని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అంటే మీరు ఒక ఏడాదిలో ఆర్జించిన మూలధన లాభాలు, జీతం కలిపి రూ.12 లక్షల లోపు ఉన్నా... మూలధన లాభాలపై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్న మాట!!.
ఫిబ్రవరి 1వ తేదీ లోకసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి... త్వరలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అత్యంత గజిబిజీగా ఉన్న ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం స్థానంలో అత్యంత సరళంగా ఉండే కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా పన్నుల శ్లాబులను మరింత సరళతరం చేస్తూ.. అత్యధిక పన్ను రేటు 30 శాతాన్ని ఇప్పటి దాకా రూ.15 లక్షలు దాటితే వర్తింపజేస్తుండగా.. ఇకపై దాన్ని రూ.24 లక్షలు దాటితేనే వర్తింపజేస్తామని ప్రకటించారు.
అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్‌కు ఉపయోగపడేలా టీడీఎస్, కంపెనీలకు ప్రయోజనం కల్పించేలా టీసీఎస్ నిబంధనల్లో పలు మార్పులను ప్రతిపాదించారు.ఈ ప్రతిపాదనల వల్ల ప్రస్తుతం రిటర్నులు దాఖలు చేస్తున్న వారిలో 85 శాతానికి పైగా ప్రయోజనం పొందుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఇక కొత్త పన్ను చట్టం
ఇంటి అద్దె, అలవెన్సులు, పొదుపు పథకాలు, గృహరుణాలు, ఇతర వ్యయాల వంటి వాటిని చూపించి పన్ను భారం తగ్గించుకునే పాత పన్నుల విధానం స్థానంలో ఎటువంటి పొదుపు అవసరం లేని కొత్త పన్నుల విధానాన్ని 2020 బడ్జెట్ ద్వారా కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది.
కొత్త, పాత విధానాల్లో ఏది ఎంచుకుంటారన్నది పన్ను చెల్లింపు దారుల ఇష్టమని మొదట్లో చెప్పినా.. ప్రతి బడ్జెట్లో కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకునే వారిని ప్రోత్సహించేలా.. పాత పన్నుల విధానాన్ని అనుసరిస్తున్న వారిని నిరుత్సాహ పరిచలేలా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇక పాత విధానానికి స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందని భావించారో ఏమో.. ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానం కింద మినహాయింపు పరిమితిని భారీగా పెంచుతూ.. దాదాపుగా ప్రతి ఒక్కరూ కొత్త విధానాన్నే ఎంచుకునే పరిస్థితిని కల్పించారు మంత్రి నిర్మల.
వచ్చే వారం పార్లమెంటులో కొత్త పన్ను చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పటం ద్వారా ఇక పాత పన్ను చట్టానికి స్వస్తి చెబుతామని చెప్పకనే చెప్పారు. వాస్తవానికి ఇప్పటిదాకా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటున్న వారిలో ఒకటో అరో తప్ప అంతా రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారే. ఇప్పుడు వారందరికీ పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వటంతో... ఇక వారికి రకరకాల సేవింగ్స్ చేయటం, బిల్లులు చూపించటం వంటివి తప్పిపోతాయి.
నేరుగా పన్ను మినహాయింపు లభిస్తుంది. కాబట్టి వారంతా సహజంగానే కొత్త విధానంలోకి మారిపోతారు. అంటే... దాదాపు ఎలాంటి ప్రతిఘటనా లేకుండానే పాత విధానాన్ని ప్రతి ఒక్కరూ వదిలిపెట్టి కొత్త విధానంలోకి మారిపోతారు. కొత్త చట్టం వచ్చినా వ్యతిరేకత ఉండదు.
రూ.80 వేల నుంచి రూ.1.10 లక్షల దాకా లాభం
కొత్త పన్ను (2025–26 నుంచి అమలు) విధానం ప్రకారం... మినహాయింపు పరిమితిని రూ.7 నుంచి 12 లక్షలకు పెంచటమే కాదు. ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉన్న బేసిక్ లిమిట్‌ను రూ.4 లక్షలకు పెంచారు. దాంతో పాటు ప్రతి 4 లక్షలకు ఒక శ్లాబు రేటు చొప్పున మొత్తం 7 శ్లాబులను ప్రవేశపెట్టారు. దీంతో రూ.24 లక్షల లోపు ఆదాయానికి 30% పన్ను వర్తించదు.
గతంలో 15 లక్షలు దాటితే 30% పన్ను రేటు చెల్లించాల్సి వచ్చేది. అలాగే రూ.20–24 లక్షల ఆదాయం ఉన్న వారికి 25% పేరుతో కొత్త శ్లాబు రేటును ప్రవేశపెట్టారు. ఈ మార్పుల వల్ల రూ.12 లక్షల ఆదాయం ఉన్న వారికి 80,000, రూ.18 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.70,000, రూ.25 లక్షలపైన ఆదాయం ఉన్న వారికి రూ.1.10 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుంది.
సీనియర్ సిటిజన్లకు ఊరట
వడ్డీ ఆదాయంగా జీవించే సీనియర్ సిటిజన్స్ టీడీఎస్ పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీడీఎస్ అంటే మూలం దగ్గర చెల్లించే పన్ను. అంటే వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం గనక పరిమితిని దాటితే అందులో 10 శాతాన్ని టీడీఎస్ రూపంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలే కట్ చేస్తాయి.
- ప్రస్తుతం ఈ వడ్డీ ఆదాయం టీడీఎస్ పరిమితి రూ.50,000. ఇకపై దీన్ని రూ.లక్ష చేస్తున్నట్లు నిర్మల ప్రకటించారు.
- ఇంటద్దె రూపంలో వచ్చే వార్షికాదాయం గనక రూ.2.4 లక్షలు దాటితే ఇప్పటిదాకా టీడీఎస్‌చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.6 లక్షలకు పెంచారు.
బీమా కమీషన్లపై టీడీఎస్ రేటును 5 నుంచి 2 శాతానికి తగ్గించారు
రెమిటెన్స్‌లపై విధించే టాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ (టీసీఎస్) పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు... విదేశీ విద్యకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చేసే రెమిటెన్స్‌లై టీసీఎస్‌ను ఎత్తివేస్తు్తన్నట్లు ప్రకటించారు.
ఇక నుంచి అధిక టీడీఎస్‌ను కేవలం పాన్ నెంబర్ లేని కేసులకు మాత్రమే పరిమితం చేస్తామని ప్రకటించారు. తప్పుగా ఆదాయం చూపించిన రిటర్నులు సవరించుకునే కాలపరిమితిని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచారు. నాలుగేళ్లలోపు స్వచ్ఛందంగా అధిక పన్ను చెల్లించడం ద్వారా సవరించిన రిటర్నులు తిరిగి దాఖలు చేసుకోవచ్చు.
రూ.12.75 లక్షలకుఒక్క రూపాయి మించినా..
నిజానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలవరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించటంతో.. చాలామంది తమకు రూ.15 లక్షల వేతనం ఉన్నట్లయితే కేవలం రూ.3 లక్షలపై పన్ను చెల్లిస్తే చాలుననే అపోహల్లో ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితిని కాదు. పన్ను రిబేట్ పరిమితిని.
అంటే.. 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి పన్ను ఉండదు. దీనికి ఎలాగూ స్టాండర్డ్ డిడక్షన్‌గా పేర్కొనే రూ.75వేలను కలుపుతారు. అంటే రూ.12.75 లక్షల వరకూ వార్షిక వేతనం ఉన్నవారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. దీనిప్రకారం చూసుకుంటే నెలకు రూ.1,06,250 వేతనం అన్నమాట. అయితే దీనికన్నా ఒక్క రూపాయి దాటినా వారు రిబేట్ పరిధిని దాటిపోతారు. కాబట్టి సహజంగా పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సిఉంటుంది.
ఉదాహరణకు...
మీ వార్షిక వేతనం రూ.12.80 లక్షలనుకోండి. మీరు రిబేట్ పరిధిలోకి రారు. కాబట్టి మీ వేతనం నుంచి రూ.75వేలు స్టాండర్డ్ డిడక్షన్ తీసేయగా... మిగిలిన రూ.12.05 లక్షలకు శ్లాబుల ప్రకారం పన్ను పడుతుంది. అంటే.. దీనిలో రూ.4 లక్షల వరకూ జీరో.. రూ.4 –8 లక్షల ఆదాయానికి 5 శాతం.. అంటే 20వేలు, రూ.8–12 లక్షల ఆదాయానికి 10 శాతం అంటే 40 వేలు, మిగిలిన 5వేలపై 15 శాతం.. అంటే రూ.750. మొత్తంగా రూ.60,750 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అంటే.. రూ.12.75 లక్షలకన్నా 5వేలు ఎక్కువ ఉన్నందుకు రూ.60,750 పన్ను చెల్లించాల్సి వస్తోంది. అదే 12.75 లక్షల లోపుంటే... రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇదీ లెక్క.
ఇది మరిచిపోకండి..
జీతం ఒక్కటే మీ ఆదాయంగా పరిగణించకూడదు. మీ బ్యాంకులోని సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ముపై వచ్చే వడ్డీ కూడా మీ జీతం లెక్కలోకే వస్తుంది. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు, ఇంటద్దె రూపంలో వచ్చే ఆదాయం అన్నీ కూడా జీతం లెక్కలోకే వస్తాయి. ఇక షేర్లు, క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులపై వచ్చే రాబడులను జీతం కింద పరిగణించబోమని ఈ సారి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ స్పష్టంగా చెప్పారు.
వీటిపై వచ్చే ఆదాయంపై క్యాపిటల్ గెయిన్స్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వచ్చే ఆదాయం రూ.12.75 లక్షల లోపున్నా సరే... మీ మొత్తం ఆదాయానికి కలిపినా కూడా రూ.12.75 లక్షల లోపున్నా సరే... వీటిపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఈసారి జన గణన లేనట్లే
జనాభా లెక్కల కార్యక్రమం ఈ సంవత్సరం కూడా ఉండదని తేలిపోయింది. వాస్త వానికి జనగణన చేపడితే వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. కానీ జనగణన, సర్వేలు, స్టాటిస్టిక్స్/రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఈసారి కేవలం రూ.574.80 కోట్లే కేటాయించడం చూస్తుంటే ఈ ఏడాది కూడా జనగణన చేయట్లేదని స్పష్టమవుతోంది. 2021-22 బడ్జెట్లో జనగణన కోసం రూ.3,768 కోట్లు కేటాయించారు. కానీ జనగణన చేయలేదు. తాజా బడ్జెట్‌లో కేవలం రూ.574 కోట్లు కేటాయించడం చూస్తుంటే ఈ ఏడాది కూడా జనగణన వాయిదా. పడ్డట్లేనని తెలుస్తోంది. 2021లో జనగణన చేపడితే రూ.8,754.23 కోట్లు అవసరం అవుతాయని ఊహించి అందుకు తగ్గప్రతిపాదనలకు 2019 డిసెంబర్ 24ననాటి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడం తెల్సిందే.
మంత్రుల జీతభత్యాలు తదితరాలకు వేయి కోట్లు
కేంద్ర మంత్రుల జీతభత్యాలు, కేబి నెట్ సచివాలయం, ప్రధాన మంత్రి కార్యాలయం, ప్రభుత్వ ఆతిథ్యం పొందే విదేశాల అగ్రనేతల బస, ఇతరత్రా ఖర్చుల కోసం ఈసారి బడ్జెట్లో రూ.1,024.80 కోట్లు కేటాయించారు. ఇందులో కేవలం కేంద్ర మంత్రుల జీతభత్యాలకే కేటాయింపులు రూ.619.04 కోట్లు కావడం గమనార్హం. గత బడ్జెట్‌లో మంత్రుల జీతభత్యాలకు కేవలం రూ.540 కోట్లే కేటాయించారు. కేంద్ర కేబినెట్ మంత్రులు, సహాయక మంత్రుల జీతభత్యాలు, ఇతర అలవెన్సులు, ట్రావెల్ ఖర్చులు, మాజీ ప్రధాన మంత్రుల కోసం ఈ బడ్జెట్ కేటాయింపులు జరిపారు. వీవీఐపీల విమానప్రయాణ ఖర్చులనూ ఇందులో కలిపారు. జాతీయ భద్రతా మండలి సచివాలయం కోసం రూ.182.75 కోట్లు కేటాయించారు. ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం కోసం రూ.70 కోట్లు. కేబినెట్ సెక్రటేరియట్ కోసం రూ.75 కోట్లు ప్రధాని కార్యాలయం కోసం రూ.10.91 కోట్లు కేటాయించారు.
పన్నుల ఆదాయం 42.70 లక్షల కోట్లు
స్థూల పన్ను వసూళ్లు వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26) 42.70 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.38.40 లక్షల కోట్లు పన్నుల ఆదాయం రావొచ్చని తొలుత అంచనా వేయగా, తాజాగా దీన్ని రూ.38.44 లక్షల కోట్లకు సవరించారు. ఒకవైపు వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించినప్పటికీ, వచ్చే ఆర్థిక సంవత్సరానికి మెరుగైన పన్నుల ఆదాయాన్ని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు బడ్జెట్ ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి. వ్యక్తిగత ఆదాయపన్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) రూ.12.57 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేసుకోగా, 2025-26లో 14.4 శాతం అధికంగా రూ.14.38 లక్షల కోట్లు వసూలు అవుతుందని ప్రతి పొదించారు. అలాగే, 2024-25లో కార్పొరేట్ పన్నుల ద్వారా రూ.9.80 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేయగా 2025-26లో ఇది 10.82 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేంద్రం పెద్దపీట
వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్దపీట వేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, గ్రామీణ ప్రగతి లక్ష్యంగా పథకాలు, కేటాయింపులు ప్రకటించింది. రైతాంగానికి లబ్ధి చేకూర్చేలా కొత్తగా ఆరు పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు సబ్సిడీతో కూడిన కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఆర్థికాభివృద్ధికి కీలకమైన రంగాల్లో వ్యవసాయం మొదటిదని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2025–26 బడ్జెట్‌లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఆహార శుద్ధి కార్యక్రమాలకు కలిపి రూ.1.45 లక్షల కోట్లు కేటాయించారు.

అయితే కొత్త పథకాలకు కేటా యింపులపై స్పష్టత వచ్చిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలు రూ.1.47 లక్షల కోట్లను తాజా బడ్జెట్ అధిగమించ వచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖకు 2.75 శాతం తక్కువ బడ్జెట్‌ను ప్రకటించినప్పటికీ, కేంద్రం కీలక పథకాలకు శ్రీకారం చుట్టింది.
అయితే అనుబంధ రంగాలకు, మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమకు 37 శాతం అధికంగా రూ.7,544 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్‌కు 56 శాతం అధికంగా రూ.4,364 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) మొత్తంగా రూ.1.57 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేంద్రం ప్రతిపాదించింది.
ఆహార భద్రతపై దృష్టి..
తాజా బడ్జెట్‌లో ఆహార భద్రతపై ప్రధానంగా దృష్టి పెట్టిన కేంద్రం.. తక్కువ సాగు, ఉత్పాదకతతో వ్యవసాయంలో వెనుకబడిన దేశంలోని 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేసే ఈ పథకంతో.. ధాన్యం ఉత్పాదకత పెంపు, పంటల్లో వైవిధ్యం, పంటల కోత అనంతర సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా దేశవ్యాప్తంగా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.
పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధి..
పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధి (ఆత్మ నిర్భర్) లక్ష్యంగా ఆరేళ్ల పప్పు ధాన్యాల కార్యక్రమాన్ని (పల్సెస్ మిషన్) కేంద్రం ప్రకటించింది. కంది, మినప, ఎర్రపప్పు (మసూర్) ఉత్పత్తిని ప్రోత్సహించే ఈ కార్యక్రమానికి రూ.1,000 కోట్లు కేటాయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లు రైతులతో లాంఛనంగా ఒప్పందాలు కుదుర్చుకుని నాలుగేళ్ల పాటు ఈ పప్పు ధాన్యాలను సేకరిస్తాయి.
పండ్లు, కూరగాయలు.. పత్తికి ప్రత్యేక కార్యక్రమాలు
కూరగాయలు, పండ్ల ఉత్పాదకతను పెంచే సమగ్ర ఉద్యాన కార్యక్రమానికి, అలాగే మంచి (పొడవైన పింజ) పత్తి రకాలను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన కాటన్ (పత్తి) మిషన్‌కు రూ.500 కోట్ల చొప్పున కేటాయించా రు. ఇటీవల తెలంగాణలోని నిజామాబాద్‌లో పసుపు బోర్డును ప్రకటించిన కేంద్రం.. తాజా బడ్జెట్‌లో బిహార్‌కు రూ.100 కోట్లతో మఖానా (తామర గింజ (ఫాక్స్ నట్) బోర్డును మంజూరు చేసింది.
అదేవిధంగా మరో రూ.100 కోట్లతో వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే విత్తనాల అభివృద్ధి లక్ష్యంగా ఓ పరిశోధనా వ్యవస్థను ప్రకటించింది. అసోంలోని నామ్‌రూప్‌లో 12.7లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో ఓ యూరియా కర్మాగారాన్ని కూడా ప్రతిపాదించారు.
గ్రామీణ ప్రగతి కార్యక్రమం..
గ్రామీణ నిరుద్యోగితకు పరిష్కారంగా సమగ్ర ‘గ్రామీణ ప్రగతి.. స్థితి స్థాపకత’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పా రు. వలసలు అనేవి తప్పనిసరి కాకుండా ఓ ప్రత్యా మ్నాయంగానే ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యమని ఆర్థికమంత్రి వివరించారు. గ్రామీణ మహిళలు, యువత, యువ రైతులు, సన్న చిన్నకారు రైతులు, భూముల్లేని కుటుంబాలపై ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని చెప్పారు.
సుస్థిర ఫిషింగ్ ఫ్రేమ్‌వర్క్..
రూ.60 వేల కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేస్తూ. చేపలు, ఆక్వాకల్చర్ ఉత్తత్తిలో ప్రపంచంలోనే భారత్ రెండోస్థానంలో ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఓ సుస్థిర ఫిషింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. ప్రపంచ సీఫుడ్ మార్కెట్‌లో భారత్ పోటీ తత్వాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా..ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్ (సురిమి)పై కనీస దిగు మతి సుంకాన్ని (బీసీడీ) 30% నుంచి 5 శాతానికి తగ్గించింది.
కృషి వికాస్ యోజనకు రూ.8,500 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి 41.66 శాతం పెంపుతో రూ.8,500 కోట్లు కేటాయించారు. కృషియోన్నతి (రూ.8వేల కోట్లు), నమో డ్రోన్ దీదీ, నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫారి్మంగ్, ప్రధానమంత్రి, మత్స్య సంపద యోజన తదితర పథకాలకు నిధులు గణనీయంగా పెంచారు.
కిసాన్ క్రెడిట్ కార్డులతో మరింత రుణం
రైతులకు రుణ భద్రతను మరింత పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందులో భాగంగానే కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని కేంద్రం ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్ కలిసి ప్రారంభించాయి.
ఈ కార్డుపై ఇప్పటిదాకా రూ.3 లక్షల రుణ పరిమితి ఉండగా.. దీన్ని తాజాగా రూ.5 లక్షలకు పెంచడంతో దేశవ్యాప్తంగా 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులు లబ్ధి పొందనున్నారు. పెంచిన పరిమితి మేరకు వీరు స్వల్పకాలిక రుణాలు పొందేందుకు అవకాశం ఉంది.
పరిశ్రమ వర్గాల హర్షం
బడ్జెట్‌లో వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతపై పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్ అసోసి యేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) అధ్యక్షుడు సంజీవ్ అస్థానా, ఫెడ రేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ)చైర్మన్ అజయ్ రాణా, అదాని విల్మార్ సీఈఓ అంగ్షు మాలిక్, బేయర్ క్రాప్ సైన్సెస్ ఎండీ సైమన్ వీ బుష్‌లు హర్షం వ్యక్తం చేశారు.
దూరదృష్టి బడ్జెట్..
‘ఇది దూరదృష్టితో కూడిన బడ్జెట్. విశ్వాసం అనే పరిమ ళం ఇందులో ఉంది. అభివృద్ధి కోసం, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం కోసం తపన ఇందులో ఉంది. స్వయం సమృద్ధి భారత్ దిశగా ప్రభుత్వ దార్శనికతలో వ్యవసాయం, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత లభించింది..’ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
రైతు సంఘాల అసంతృప్తి.. 5న ధర్నా
అన్ని పంటలకు చట్టబద్ధమైన గ్యారంటీతో కూడిన కనీస మద్దతు ధర కల్పించాలనే తమ దీర్ఘకాల డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోక పోవడంపై రైతు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. పంట రుణాలు మాఫీ చేయకపోవడం, రైతు, కార్మిక, పేదల వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్‌కు నిరసనగా ఈ నెల 5న ధర్నా నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) తదితర సంఘాలు ప్రకటించాయి.
మహిళా, శిశు అభివృద్ధికి రూ.26,889 కోట్లు

మహిళా, శిశు అభివృద్ధి శాఖకు నిధుల కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2025–26 బడ్జెట్‌లో కేంద్రం రూ.26,889.69 కోట్లు కేటా యించింది. 2024–25లో సవరించిన అంచనా రూ.23,182.98 కోట్లు కాగా, తాజాగా బడ్జెట్‌లో మరో రూ.3,706.71 కోట్లు పెంచారు. మొత్తం కేటాయింపుల్లో రూ.21,960 కోట్లను ‘సాక్షం అంగన్‌వాడీ’, పోషణ్ 2.0 కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నారు. చిన్నారులు, కౌమార దశలోని బాలికల్లో పోషకాహార లేమిని అరికట్టాలని, శిశు సంరక్షణను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయబోతోంది. సాక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 కార్యక్రమాలతో ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది బాలలు, కోటి మంది గర్భిణులు, బాలింతలు, 20 లక్షల మంది కౌమార బాలికలు ప్రయోజనం పొందుతారని ఆర్థిక మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం–జన్‌మన్)కు అదనంగా రూ.120 కోట్లు కేటాయించారు.
ఈ నిధులను 75 గిరిజన జాతుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వ్యయం చేస్తారు. గిరిజనాభివృద్ధి కోసం ధార్తి అబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్‌కు రూ.75 కోట్లు కేటాయించారు. బాలల రక్షణ సేవలకు గాను ‘మిషన్ వాత్సల్య’ కోసం గతేడాది రూ.1,391 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1,500 కోట్లు కేటాయించారు.
మహిళా వ్యాపారవేత్తలకు రూ.2 కోట్ల రుణం తొలిసారి వ్యాపారవేత్తలుగా మారిన మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం రూ.2 కోట్ల టర్మ్ లోన్ మంజూరు చేయనుంది. 5 లక్షల మందికి ఈ రుణాలు ఇవ్వనున్నారు. సూక్ష్మ, మధ్య తరహా, భారీ పరిశ్రమల కోసం ‘మాన్యుఫాక్చరింగ్ మిషన్’ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు.
‘మిషన్ శక్తి’కి రూ.3,150 కోట్లు
మహిళా సాధికారతే ధ్యేయంగా ‘మిషన్ శక్తి’ అమలుకు రూ.3,150 కోట్లు కేటాయించారు. బేటీ బచావో.. బేటీ పడావో, వన్‌స్టాప్ సెంటర్లు, నారీ ఆదాలత్‌లు, ఉమెన్ హెల్ప్‌లైన్, మహిళా పోలీసు వాలంటీర్లకు రూ.629 కోట్లు ఖర్చు చేస్తారు. స్వధార్ గృహాలు, ప్రధాని మాతృ వందన యోజన, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, నేషనల్ క్రెష్ స్కీమ్‌కు రూ.2,521 కోట్లు వెచ్చిస్తారు.
నిర్భయ నిధికి రూ.30 కోట్లు, జాతీయ మహిళా కమిషన్‌కు రూ.28 కోట్లు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు రూ.25 కోట్లు కేటాయించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో–ఆపరేషన్, చైల్డ్ డెవలప్‌మెంట్‌కు రూ.90 కోట్లు, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (సీఏఆర్‌ఏ)కు రూ.14.49 కోట్లు కేటాయించారు.
'టాయ్' హబ్‌గా భారత్..
ప్రపంచ ఆట వస్తువులు, బొమ్మల తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దడానికి కేంద్రం బడ్జెట్లో ఓ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో క్లస్టర్లను అభివృద్ధి చేస్తారు. ఇందులో నైపుణ్యాల పెంపు, బొమ్మల తయారీ వంటి అంశాలపై దృష్టిసారిస్తారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో వినూత్నంగా, సృజనాత్మకత ఉట్టి పడేలా మన్ని కతో కూడిన ఆట బొమ్మలను 'మేడిన్ ఇండియా' బ్రాండ్‌తో ఈ క్లస్టర్లలో తయారు చేస్తారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆట బొమ్మలకు డిమాండ్ తగ్గడంతో 2021-22లో 177 మిలియన్ డాలర్లు ఉన్న భారత ఎగుమతులు, 2023-24లో 152 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. కాగా, కేంద్రం నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చేయడం, బొమ్మల దిగుమతిపై కస్టమ్స్ సుంకాలను పెంచడం వంటి చర్యలు చేపట్టడంతో దేశీయ బొమ్మల తయారీ పరిశ్రమకు ఊతం లభించింది. గతంలో ఆట బొమ్మల దిగుమతిలో మన దేశం చైనాపై ఎక్కువగా ఆధారపడేది. అయితే ఈ రంగంలో కేంద్రం చేపట్టిన చర్యల కారణంగా చైనాపై ఆధారపడే పరిస్థితి క్రమంగా తగ్గుతోంది.
కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖకు రూ.334 కోట్లు
బడ్జెట్‌లో కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖకు రూ.334 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ప్రభుత్వ ఉద్యోగులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే శిక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. ఈ నిధుల్లో కార్యా లయాల ఆధునీకరణ, పైలట్ ప్రాజెక్టులకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెకట్రేరియట్ ట్రైనింగ్, మేనేజ్ మెంట్(ఐఎస్టీఎం), లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ శిక్షణ పథకాల కోసం రూ.118.46 కోట్లు వెచ్చిం చనున్నారు. 'మిషన్ కర్మయోగి'కి రూ.110 కోట్లు వ్యయం చేస్తారు. అధికార యంత్రాంగంలో సంస్కరణల కోసం మిషన్ కర్మయోగిని కేంద్రం ప్రారంభించింది. బడ్జెట్‌లో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్)కు రూ.164.62 కోట్లు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ)కి రూ.515.15 కోట్లు కేటాయించారు.
ఇండియా పోస్ట్.. పెద్ద లాజిస్టిక్ వ్యవస్థగా..
దేశంలో 1.5 లక్షలున్న గ్రామీణ పోస్టాఫీసుల వ్యవస్థను పెద్ద లాజిస్టిక్ వ్యవస్థగా రూపాంతరం చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇండియా పోస్ట్ కీలకం అవుతుందని చెప్పారు. అస్సాంలో 12.7 లక్షల టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంట్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
గ్రామీణాభివృద్ధికి రూ.2,66,817 కోట్లు
బడ్జెట్లో రక్షణ రంగం తరువాత గ్రామీణాభివృద్ధికి అత్యధికంగా రూ.2,06,817 కోట్లు కేటాయించారు. ఉపాధి హామీ పథకానికి రూ.86,000 కోట్లు కేటాయిం చారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల పురోభివృద్ధి కార్యక్రమాన్ని చేపడ తామని ఆర్థిక మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత, పెట్టుబడులు, నైపు ణ్యాల పెంపు ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విసృత అవకాశాలను కల్పించడం ద్వారా వల సలను అరికడతామన్నారు.
ప్రధానంగా.. గ్రామీణ మహిళలు, యువ రైతులు, యువత, సన్నకారు రైతులు, భూమి లేని కుటుంబా లపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను ప్రతిబింబించిన ఈ బడ్జెట్ దేశం స్వయం సమృద్ధి సాధించేలా దోహదం చేస్తుం దని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సిం గ్ చౌహాన్ ప్రశంసించారు. దీన్ఐయాళ్ అం త్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనో పాధి పథకం అమలుకు రూ.19.005 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఈ పథకానికి రూ.15,047 కోట్లు కేటాయించారు.
ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఏర్పాటు..
ఎగుమతులకు ఊతమి చ్చేందుకు కేంద్రం కొత్తగా ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం రూ.2,250 కోట్లు కేటాయించింది. ఈ మిషన్‌ను వాణిజ్య, ఆర్థిక, సూక్ష్మ, చిన్న మాధ్యమిక సంస్థల శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. దీని వల్ల ఎగుమతుల నిర్వహణ సులభతరం కావడంతోపాటు సరిహద్దుల్లో సహకారం, ఓవర్సీస్ మార్కెట్‌లో టారిఫ్ యేతర అంశాలను నియంత్రిస్తూ ఎంఎస్ ఎంఈలకు ప్రోత్సాహకం కల్పించేందుకు దోహదపడుతుంది.
మైనార్టీ శాఖకు రూ.3,500 కోట్లు
మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బడ్జెట్లో రూ.3,350 కోట్లు కేటాయించారు. ఇది 2024-25 బడ్జెట్ కన్నా రూ.166 కోట్లు ఎక్కువ కాగా, సవరించిన అంచనాల కన్నా రూ.1.481 కోట్లు ఎక్కువ. ఈసారి మైనారిటీ విద్యార్థుల సాధికారత కోసం రూ.678.03 కోట్లు కేటాయించారు. ఈ శాఖలోని ముఖ్య పథకాలకు రూ.1,237.32 కోట్లు ఇవ్వగా, మైనారిటీల అభివృద్ధికి రూ.1,913.98 కోట్లు ఇచ్చారు.
ఆహారం, ఎరువుల రాయితీకి రూ.3.71 లక్షల కోట్లు
ఆహారం, ఎరువులపై రాయితీకి బడ్జెట్‌లో కేంద్రం రూ.3.71 లక్షల కోట్లు కేటాయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆహార సబ్సిడీకి రూ.2.03 లక్షల కోట్లు, ఎరువుల సబ్సిడీకి రూ.1.67 లక్షల కోట్ల కేటాయించారు. సర్కారు ఖజానాపై రాయితీ భారం పెరిగిపోతోందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
ఎన్నికల ఖర్చులకు రూ.1400 కోట్లు
కేంద్ర బడ్జెట్లో న్యాయశాఖకు దాదాపు రూ.1,400 కోట్ల బడ్జెట్ను ప్రతిపా దించారు. అయితే, ఈ నిధులు లోక్సభ ఎన్ని కల వ్యయం, కొత్త ఎలక్ట్రానిక్ యంత్రాల కొనుగోల, ఓటర్లకు ఐడీ కార్డుల జారీ తది తర అవసరాల కోసం క్యారీ ఫార్వర్డ్ కాను న్నాయి. బడ్జెట్లో లోక్ సభ ఎన్నికల వ్యయం కింద ఈ శాఖకు రూ.500 కోట్లు కేటాయించారు. ఓటర్ ఐడీ కార్డుల కోసం రూ.300 కోట్లు, ఇతర ఎన్నికల ఖర్చుల కోసం రూ.597.80 కోట్లు ప్రతిపాదించారు. ఈవీఎంల కొనుగోలు కోసం రూ.18.72 కోట్లు కేటాయించారు.
మోదీ 3.0.. గ్రామాలకు మహర్దశ
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా మోదీ 3.0 సర్కారు తాజా బడ్జెట్‌లో పూర్తి అండదండలు అందించింది. కేంద్ర ప్రభుత్వం పల్లెల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు ఫ్లాగ్‌షిప్ పథకాలకు కేటాయింపులు జోరందుకున్నాయి. ముఖ్యంగా సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు పుష్కలంగా నిధులు కేటాయించారు. అలాగే, ఉపాధికి ఢోకా లేకుండా.. గ్రామీణ రోడ్లు పరుగులు తీసేలా.. బడ్జెట్‌లో ఫోకస్ చేశారు.

ఇక తాగునీటి పథకం.. జల్ జీవన్ మిషన్‌ను 100% పూర్తి చేసేందుకు మరో మూడేళ్లు పొడిగించి, నిధుల వరద పారించారు. భారత్‌నెట్ గొడుగు కింద ఇకపై గ్రామాల్లో ప్రభుత్వ సెకండరీ స్కూళ్లు, పీహెచ్‌సీలకు సైతం హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం దక్కనుంది.
సొంతింటికి ఫుల్ సపోర్ట్ (పీఎంఏవై)
2025–26 కేటాయింపులు: రూ.74,626 కోట్లు
2024–25 కేటాయింపులు: రూ.46,096 కోట్లు (సవరించిన అంచనా)
పేదలు, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేలా బడ్జెట్‌లో ఈ పథకానికి ఫుల్ సపోర్ట్ లభించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని పీఎంఏవై 2.0 స్కీమ్ కింద చేపట్టనున్నట్లు గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించడం తెలిసిందే. పట్టణ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు అదనంగా కోటి ఇళ్లు అందించే పీఎంఏవై (అర్బన్)కు ఈ బడ్జెట్‌లో రూ.19,794 కోట్లు కేటాయించారు.
2025–26లో గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేసిన లబ్దిదారులకు వడ్డీ సబ్సిడీ స్కీమ్ కింద 10 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చనున్నారు. ఇందుకు మొత్తం రూ.3,500 కోట్లను కేటాయించారు. పీఎంఏవై (గ్రామీణ్)కు రూ.54,832 కోట్లు దక్కాయి. 2029 మార్చికల్లా రూ.3.06 లక్షల నిధులతో 2 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం లక్ష్యం. 2024–25లో 40 లక్షల ఇళ్ల లక్ష్యానికి గాను డిసెంబర్ నాటికి 18 రాష్ట్రాల్లో 27.78 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి.
గ్రామీణ రోడ్లు.. టాప్ గేర్
2025–26 కేటాయింపులు: రూ.19,000 కోట్లు
2024–25 కేటాయింపులు: రూ.14,500 కోట్లు (సవరించిన అంచనా)
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అమలు చేస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్ స్కీమ్ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)కు ఈసారి బడ్జెట్లో మరింత ప్రాధాన్యం లభించింది. ఈ స్కీమ్ నాలుగో దశను గత బడ్జెట్లో సీతారామన్ ప్రకటించగా.. ఇప్పుడు జోరందుకుంటోంది.
25,000 ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు దృష్టిపెట్టుకుని పక్కా రోడ్లతో అనుసంధానించనున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి 17,570 ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం సర్వే పూర్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 35,000 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘గ్రీన్’టెక్నాలజీతో 18,000 కిలోమీటర్ల రోడ్లు వేయనున్నారు.
‘ఉపాధి’కి ఢోకా లేదు
2025–26 కేటాయింపులు: రూ.86,000కోట్లు
2024–25 కేటాయింపులు: రూ.86,000కోట్లు (సవరించిన అంచనా)
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి దన్నుగా నిలుస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈసారీ నిధుల ‘హామీ’దక్కింది. అయితే, 2024– 25 సవరించిన అంచనాల (రూ.86,000 కోట్లు)తో పోలిస్తే దాదాపు అదే స్థాయిలో కేటాయించారు. రాష్ట్రాల్లో లక్ష్యాలు, అవసరాలను బట్టి అవసరమైతే మరి న్ని నిధులను కేటాయించే అవకాశం ఉంది. 2023– 24లో రూ.60,000 కోట్లు కేటాయించగా, వాస్తవ వ్యయం రూ.89,153 కోట్లు కావడం గమనార్హం.
జల్‌జీవన్ మిషన్.. మరో మూడేళ్లు పొడిగింపు
2025–26 కేటాయింపులు: రూ.67,000 కోట్లు
2024–25 కేటాయింపులు: రూ.22,694 కోట్లు (సవరించిన అంచనా)
దేశంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుందుకు జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నారు. 2024 నాటికి ఇది సాకారం కావాల్సి ఉండగా.. 100 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు దీన్ని 2028 వరకు పొడిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్‌లో ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ఏకంగా మూడు రెట్లు నిధులు పెంచారు.
కాగా, ఇప్పటివరకు 15 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా. 2025–26లో 1.36 కోట్ల కనెక్షన్లు అందించాలనేది బడ్జెట్ లక్ష్యం. కాగా, ‘జన్ భాగీధారీ’ద్వారా నీటి సరఫరా మౌలిక సదుపాయాల నాణ్యత, నిర్వహణపై దృష్టి పెట్టున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
కనెక్ట్ టుభారత్ నెట్..
2025–26కేటాయింపులు: రూ.22,000 కోట్లు
2024–25 కేటాయింపులు: రూ. 6,500 కోట్లు (సవరించిన అంచనా)
దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను (దాదాపు 2.5 లక్షలు) హైస్పీడ్ బ్రాండ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయాలనేది ఈ స్కీమ్ ఉద్దేశం. ఇప్పటిదాకా 2,14323 పంచాయితీలను కనెక్ట్ చేశారు. 6,92,676 లక్షల కి.మీ. పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేశారు. అదనంగా 1,04,574 వైఫై హాట్ స్పాట్స్, 12,21,014 ఫైబర్–టు–హోమ్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 18,000 పంచాయతీలకు కొత్తగా బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించనుండగా... 64,000 పంచాయతీల్లో కనెక్టివిటీని మరింత మెరుగుపరచనున్నారు.
స్వచ్ఛ భారత్.. విస్తరణ
2025–26 కేటాయింపులు: రూ. 12,192 కోట్లు
2024–25 కేటాయింపులు: రూ. 9,351 కోట్లు (సవరించిన అంచనా)
దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా తుడిచిపెట్టడానికి (ఓడీఎఫ్) 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద, గ్రామీణ ప్రాంతాల్లో ఓడీఎఫ్ స్టేటస్‌ను పూర్తిగా సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. దీన్ని స్థిరంగా కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లోనూ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

స్వచ్ఛ భారత్ (అర్బన్) కింద పట్టణ ప్రాంతాల్లో 2025–26లో 2 లక్షల వ్యక్తిగత టాయిలెట్లు, 20,000 కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మించనున్నారు. 98 శాతం వార్డుల్లో ఇంటింటికీ ఘన వ్యర్థాల సేకరణను అమలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 89,000 గ్రామాలను ఘన వ్యర్ధాల నిర్వహణలోకి తీసుకురానున్నారు. 60,000 గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ వ్యవస్థను అమలు చేయనున్నారు.
అలాగే 800 బ్లాక్‌లలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు నెలకొల్పనున్నారు. కాగా, స్వచ్ఛభారత్ 2.0 కింద తాగునీరు, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుల కోసం 100 నగరాలను గుర్తించే ప్రక్రియ జోరుగా సాగుతోంది.
జగ్జీవన్ మిషన్... మరో మూడేళ్లు పొడిగింపు
2025-26 కేటాయింపులు: రూ.67,000 కోట్లు
2024-25 కేటాయింపులు: రూ.22,694 కోట్లు (సవరించిన అంచనా)
దేశంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుందుకు జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాము అమలు చేస్తున్నారు. 2024 నాటికి ఇది సాకారం కావాల్సి ఉండగా.. 100 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు దీన్ని 2028 వరకు పాడిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్‌లో ప్రకటించారు. దీనికి అను గుణంగానే ఏకంగా మూడు రెట్లు నిధులు పెంచారు. కాగా, ఇప్పటివరకు 15 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా. 2025-26లో 1.36 కోట్ల కనెక్షన్లు అందించాలనేది బడ్జెట్ లక్ష్యం. కాగా, 'జన్ భాగీధారీ' ద్వారా నీటి సరఫరా మౌలిక సదుపాయాల నాణ్యత, నిర్వహణపై దృష్టి పెట్టున్నట్లు ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.
కనెక్ట్ టు భారత్ నెట్..
2025-26 కేటాయింపులు: రూ.22,000 కోట్లు
2024-25 కేటాయింపులు: రూ.6,500 కోట్లు (సవరించిన అంచనా)
దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను (దాదాపు 2.5 లక్షలు) హైస్పీడ్ బ్రాండ్బ్యాండ్ నెట్వర్క్ కనెక్ట్ చేయాలనేది ఈ స్కీమ్ ఉద్దేశం. ఇప్పటిదాకా 2,14323 పంచాయితీలను కనెక్ట్ చేశారు. 6,92,676 లక్షల కి.మీ. పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేశారు. అదనంగా 1,04,574 వైఫై హాట్ స్పాట్స్, 12,21,014 ఫైబర్-టు-హోమ్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 18,000 పంచాయతీలకు కొత్తగా బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించనుండగా.. 64,000 పంచాయతీల్లో కనెక్టివిటీని మరింత మెరుగుపరచనున్నారు.
హౌసింగ్‌కు స్వామీ-2 బూస్ట్
నిలిచిపోయిన హౌసింగ్ ప్రాజెక్టులకు బూస్ట్ నిచ్చేందుకు తాజా బడ్జెట్‌లో స్వామీ (ఎస్ డబ్ల్యూఏఎంఐహెచ్) ఫండ్-2ను ప్రతిపాదించారు. ఇందుకు రూ.15,000 కోట్లు కేటాయించనున్నారు. దీంతో నిలిచిపోయిన లక్ష యూనిట్లను పూర్తి చేసేందుకు దారి చూపనున్నారు. తద్వారా చిక్కుకుపోయిన గృహ వినియోగదారుల పెట్టుబడులకు ఉపశమనాన్ని కల్పించనున్నారు. 2019 నవంబర్లో కేంద్రం 'అందుబాటు ధరల, మధ్యాదాయ హౌసింగ్‌కు స్పెషల్ విండో (స్వామీ)' పేరుతో కొత్త పథకానికి తెరతీసిన విషయం విదితమే.
స్వామీ-1 విజయం తదుపరి ఆర్థిక శాఖ తాజాగా ఫండ్-2కు ప్రతిపాదించింది. స్వామీ-1లో భాగంగా 50,000 యూనిట్లను పూర్తిచేసి కొనుగోలుదారులకు అందించారు. 2025లో మరో 40,000 యూనిట్లను పూర్తి చేయనున్నారు. తద్వారా ఈఎంఐలు, అద్దెలు చెల్లిస్తున్న మధ్యతరగతికి చేయూతనివ్వనున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకులు, ప్రభుత్వం, ప్రయివేట్ ఇన్వెస్టర్ల కలయికతో స్వామీ-2 ద్వారా ఫైనాన్స్ సౌకర్యాలు అందనున్నాయి.
పట్టణ సదుపాయాలకు రూ.లక్ష కోట్ల నిధి
పట్టణాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు వీలుగా రూ.లక్ష కోట్లతో 'అర్బన్ చాలెంజ్ ఫండ్'ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం బడ్జెట్‌లో భాగంగా ప్రకటించింది. పట్టణాల పునరాభివృద్ధి, పట్టణాలను వృద్ధి కేంద్రాలుగా మార్చడం, తాగు నీరు, మురుగునీటి పారుదల సదుపాయాలకు ఈ నిధులు కేటాయించనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం నిధులను బ్యాంక్ రుణాలు లేదా బాండ్ల రూపంలో సమకూర్చుకునేవి.. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీఈ)తో నడిచే ప్రాజెక్టులకు 25 శాతం మేర సాయాన్ని ఈ ఫండ్ కింద పాం దొచ్చని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. రూ.లక్ష కోట్ల నిధిలో రూ.10,000 కోట్లను 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం కేటాయించారు.
రహదారుల శాఖకు రూ.2.87 లక్షల కోట్లు
ఈసారి బడ్జెట్‌లో రోడ్డు రవాణా. రహదారుల మంత్రిత్వ శాఖకు రూ.2,87,333.16 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.2,80,518.80 కోట్లు కేటాయించగా, 2025-26 బడ్జెట్‌లో రూ.2.41 శాతం నిధులను పెంచారు. జాతీయ రహదారుల అధీకృత సంస్థ (ఎన్‌హెచ్ఎఐ)కు రూ.1,87.803 కోట్లు కేటాయించారు. కాగా, ఎన్‌హెచ్ఎఐ రుణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు రూ.3.35 లక్షల కోట్లు ఉండగా, 2025 మూడో త్రైమాసికం వరకు రూ.2.76 లక్షల కోట్లకు తగ్గనున్నాయి.. ఎన్‌హెచ్ఎఐ రుణ భారం తగ్గించేందుకు వచ్చే ఆర్ధిక సంవత్సరంలో కొత్త రుణాలను ప్రతిపాదించకపోవడం గమనార్హం.
హౌసింగ్, పట్టణ వ్యవహారాలకు రూ.96,777 కోట్లు
హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖకు ఈ విడత బడ్జెట్‌లో 18 శాతం అధిక కేటాయింపులు దక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.82,576 కోట్లు కేటాయించగా, 2025-26 సంవత్సరానికి 18 శాతం అధికంగా రూ.96,777 కోట్లను ప్రతిపాదించారు. పీఎం స్వనిధి... పీఎం వీధి వర్తకుల స్వావలంబన నిధి (పీఎం స్వనిధి) పథకం కింద బ్యాంక్‌లు, యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డుల ద్వారా ఒక్కో వర్తకుడికి రూ.30,000 రుణ సదుపాయం అందించనున్నట్టు బడ్జెట్ సందర్భంగా మంత్రి సీతారామన్ ప్రకటించారు.
ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.373 కోట్లకు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.326 కోట్లను కేటాయిం చడం గమనార్హం. అసంఘటిత రంగంలో అధిక వడ్డీ రుణాల స్థానంలో ఈ పథకం కింద 68 లక్షల వీధి వర్తకులకు ప్రయోజనం లభించినట్టు చెప్పారు.
- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన రెండో దశకు రూ.3,500 కోట్లను కేటాయించారు.
- పట్టణ పునరుజ్జీవ మిషన్ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.10,000 కోట్ల నిధులు దక్కాయి. దేశవ్యాప్తంగా 500 పట్టణాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు రూ.8,000 కోట్లతో పోల్చితే 25 శాతం పెంచారు.
- పీఎం ఈ-బస్ సేవా పథకానికి బడ్జెట్లో రూ.1,310 కోట్ల కేటాయింపులు లభించాయి. స్వచ్చ భారత్ మిషన్ కోసం రూ.5,000 కోట్లు కేటాయించారు. మెట్రో, నాన్ మెట్రో ప్రాజెక్టుల ప్రణాళికల కోసం రూ.133 కోట్లు లభించాయి. ఈ ఏడాది జూన్తో ముగుస్తున్న స్మార్ట్ సిటీస్ మిషన్ కార్యక్రమానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు.
ఐదేళ్లలో 50 శాతానికి రుణ-జీడీపీ నిష్పత్తి తగ్గింపు
కేంద్రం రుణ-జీడీపీ (స్థూల దేశీయోత్పిత్తి) నిష్పత్తిని తగ్గించడంపై దృష్టి సారించింది. 2031 మార్చి నాటికి ఈ నిష్పత్తిని 50 శాతానికి తగ్గించడానికి కొత్త రోడ్‌మ్యప్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఈ నిష్పత్తి 57.1 శాతంగా ఉంది. ద్రవ్య బాధ్యత-బడ్జెట్ నిర్వహణ (ఎస్ఆర్బీఎం) చట్టం 2003 ప్రకారం, 2025-26 నాటికి ద్రవ్య లోటును 4.5 శాతం కంటే తక్కువకు తగ్గించాలి. ఈ లక్ష్యాన్ని సాధిం చగలమన్న భరోసా నేపథ్యంలో (2025-26లో 4.4 శాతానికి తగ్గుతుందని తాజా బడ్జెట్ భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే) తాజాగా కేంద్రం రుణ-జీడీపీ నిష్పత్తిపై దృష్టి పెట్టింది. తాజా ప్రణాళిక ప్రకారం, 2025-26లో ఈ నిష్పత్తిని 56 శాతానికి తగ్గించాలి. ఐదేళ్లలో ఈ నిష్పత్తిని 500 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) తగ్గించడానికి కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోనుంది.
'భారత్‌లో తయారీ'కి కొత్త ఊపిరి
భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర సర్కారు 'నేషనల్ మాన్యు ఫాక్చరింగ్ మిషన్' పేరుతో ప్రతిష్టాత్మక కార్య క్రమాన్ని ప్రకటించింది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడం ఇందులోని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు విభాగాలపై దృష్టి సారించనుంది. పులబతర వ్యాపార నిర్వ హణతోపాటు, వ్యాపార నిర్వహణ వ్యయాలు తగ్గించడం ఒకటి. డిమాండ్ ఉన్న విభాగాల్లో భవిష్యత్ అవసరాలకు అనుకూలమైన మానవవనరులను అభివృద్ధి చేయడం రెండోది. ఎంఎస్ఎంఈ రంగాన్ని చురుగ్గా, బలంగా మార్చడం.
టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకురావడం, నాణ్యమైన ఉత్పత్తులపై ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాధాన్యం ఇవ్వను న్నారు. ఈ పథకం కింద చిన్న, మధ్య, భారీ పరిశ్రమలకు చేయూతనివ్వనున్నట్టు ఆర్ధిక మం త్రి సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ప్రకటిం చారు. విధానపరమైన మద్దతుకుతోడు, అన్ని కేంద్ర శాఖలు, రాష్ట్రాల తరఫున పర్యవేక్షణ ఉం టుందన్నారు. అం తర్జాతీయ సరఫరా వ్యవస్థతో దేశ ఆర్థిక వ్యవస్థ ధానానికి అనుసం దేశీ తయారీ సామర్థ్యా లను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టు రూ.2,900 కోట్లు
దేశంలోనే తొలి ప్రాంతీయ ర్యాపిడ్ రైల్ ప్రాజెక్ట్ అయినది నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ)కి 2025-26 బడ్జెట్లో రూ.2,900 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన 13 కిలోమీటర్ల కారిడార్ గత నెల ఐదున ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ 13 కి.మీ.ల కారిడార్ ఢిల్లీలోని న్యూ అశోక్‌నగర్‌ను ఘజియాబాద్‌లోని సహిబాబాద్‌ను కలుపుతుంది. మిగతా కారిడార్లు నిర్మించాల్సి ఉంది. గత బడేజెట్ సవరించిన ఆంచనాల్లో ఈ ప్రాజెక్టు రూ.3,855 కోట్లు కేటాయించిన సంగతి తెల్సిందే. ఎన్సీఆర్టీసీ ఢిల్లీ సెక్షన్ ప్రారంభం తర్వాత ఢిల్లీ వాసులు దక్షిణ మీరట్‌కు కేవలం 40 నిమిషాల్లో చేరుకోవచ్చు.
విద్యా రంగానికి రూ.1.28 లక్షల కోట్లు
కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ.1.28 లక్షల కోట్లను కేటాయించారు. ఇందులో ఉన్నత విద్యకు రూ.50,067 కోట్లు, పాఠశాల విద్యకు రూ.78,572 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఐఐటీలు, వైద్య విద్య, పాఠశాల విద్య, స్కిల్లింగ్‌కు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పనున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

2024–25 బడ్జెట్‌లో విద్యా రంగం సవరించిన అంచనాలు రూ.1.14 లక్షల కోట్లుగా ఉన్నాయి. మానవ వనరుల అభివృద్ధి దిశగా కేటాయింపులు చేశారని, ఉద్యోగాల ఆధారిత అభివృద్ధి బ్రాండ్ ఇండియా సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బడ్జెట్‌ను స్వాగతించారు.
భారతీయ భాషా పుస్తక్ స్కీమ్..
ఈ ఏడాది కొత్తగా భారతీయ భాషా పుస్తక్ స్కీమ్‌ను ప్రకటించారు. దీని ద్వారా పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషల్లోని పుస్తకాలను డిజిటలైజ్ చేయనున్నారు. దీనివల్ల విద్యార్థులు సులభంగా అన్ని అంశాలను అవగతం చేసుకునే వీలుంటుంది.
ఐఐటీల విస్తరణ..
2014 తర్వాత ఏర్పాటు చేసి న ఐదు ఐఐటీల్లో మౌలిక వసతులు విస్తరించి మరో 6,500 మంది విద్యార్థులకు సరిపడా సదుపాయాలు కల్పించనున్నారు. ఐఐటీ పాట్నాను పూర్తి స్థాయిలో విస్తరిస్తారు. గత పదేళ్లలో దేశంలోని 23 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య 65 వేల నుంచి 1.30 లక్షలకు చేరిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తంగా ఐఐటీలకు రూ.11,349 కోట్లు కేటాయించారు. ఐఐటీలు, ఐఐఎస్‌సీ–బెంగళూరులో టెక్నాలజీ రీసెర్చ్ అభ్యర్థుల కోసం ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌ను వచ్చే ఐదేళ్లలో పది వేల మందికి అందిస్తారు.
నైపుణ్యాల పెంపు..
విద్యార్థులకు ఆయా వృత్తులు, విభాగాల్లో క్షేత్ర నైపుణ్యాలు అందించేలా గ్లోబల్ నైపుణ్యాలు, పార్ట్‌నర్‌షిప్స్ కోసం కొత్తగా ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాల స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను నెలకొల్పనున్నారు. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేలా గ్రామీణ ప్రాంతాల్లోని సెకండరీ పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కల్పిస్తారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.99,858.56 కోట్లు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో రూ.99,858.56 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.89,974.12 కోట్లు కేటాయించగా, ఈసారి 11 శాతం మేర పెంచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే దేశంలో వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో అదనంగా పదివేల సీట్లను పెంచనున్నట్లు తెలిపారు. ఈ పెంచిన సీట్ల ద్వారా వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారి కల సాకారమైనట్లేనన్నారు.

కాలేజీల్లో మెడికల్ సీట్ల కొరతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు మెడికల్ సీటు రాక.. మరో ఏడాదిపాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఏడాదికి 10 వేల సీట్ల చొప్పున ఐదేళ్లలో 75 వేల సీట్లు పెంచుతున్నట్లు శనివారం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025–26 వార్షిక బడ్జెట్‌లో ప్రకటించారు. తమ ప్రభుత్వం గత పదేళ్లలో 1.1 లక్షల అండర్ గ్రాడ్యుయేట్, పీజీ మెడికల్ సీట్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు.
జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లు
ఇటీవల కాలంలో కేన్సర్ బారిన పడుతూ ఎంతోమంది రోగులు ఆసుపత్రుల్లో బారులుతీరుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్రం.. ఆ రోగులకు ఉపశమనం కలిగించేందుకు మరో అడుగు ముందుకేసింది. ఇందులోభాగంగా దేశవ్యాప్తంగా డే కేర్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. 2025–26లో సుమారు 200 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కేటాయింపులు ఇలా..
- వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మొత్తం రూ.99,858.56 కోట్లను కేటాయించగా, ఇందులో వైద్య, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ.95,957 కోట్లు, ఆరోగ్య పరిశోధనల విభాగానికి రూ.3,900.69 కోట్లు కేటాయించారు.
- ఆయుష్ మంత్రిత్వ శాఖకు రూ.3,992.90 కోట్ల కేటాయింపు. గత బడ్జెట్‌లో రూ.3,497 కోట్లను కేటాయించారు.. ఇప్పుడు 14.15 శాతం పెంపు.
- జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ.37,226.92 కోట్ల కేటాయింపు. గత బడ్జెట్‌లో రూ.36,000 కోట్లు.
- ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనకు (ఏబీపీఎం–జేఏవై) రూ.9,406 కోట్లు.
- స్వయంప్రతిపత్తి గల సంస్థలకు రూ.20,046.07 కోట్లు కేటాయించారు. 2024–25లో రూ.18,978.72 కోట్లు కేటాయించారు.
36 మందులకు సుంకం మినహాయింపు
కేన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి ఉపశమనం అందించేందుకు వారు వాడే మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)ని పూర్తిగా మినహాయించను న్నారు. వారు చికిత్సకు వినియోగించే 36 రకాల జీవ ఔషధాలపై ఈ మినహాయింపు వర్తిస్తుందని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
అలాగే, ఫార్మాకంపెనీలు పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ కింద రోగులకు అందించే మరో 37 రకాల మందులతోపాటు 13 కొత్త ఔషధాలకు బీసీడీని మినహాయించనున్నారు. దీంతో ఆయా మందులను రోగులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
➣ ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో దేశంలో మెడికల్ టూరిజం, ‘హీల్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించడంతోపాటు, సులభతర వీసా విధానాన్ని తెస్తామని చెప్పారు.
➣ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ప్రభుత్వ మాధ్యమిక స్కూళ్లకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందుబాటులోకి తెస్తామని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
లోక్‌పాల్ కోసం రూ.44.32 కోట్లు
లోక్‌పాల్ నిర్వహణ, నిర్మాణం తదితరాల కోసం 2025-26 బడ్జెట్లో రూ.44.32 కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్‌లో రూ.67.65 కోట్లు కేటాయించగా ఈసారి దాదాపు 34 శాతం తక్కువ నిధులిచ్చారు. ప్రధాని మొదలు కేంద్ర ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, సంస్థల్లో అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే విచారణ చేపట్టడం లోక్పాల్ విధి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కి 2025-26 బడ్జెట్లో రూ.52.07 కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్‌లో రూ.51.31 కోట్లు కేటాయించారు. సుప్రీంకోర్టు భవన విస్తరణకు రూ.123 కోట్లు సర్వోన్నత న్యాయస్థానం భవన విస్తరణ 2025-26 బడ్జెట్‌లో రూ.123.75 కోట్లు కేటాయించారు.
ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి రూ.5,915 కోట్లు
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో రూ.5,915 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో కేటాయింపులతో పోలిస్తే ఈసారి 47 శాతం అధికంగా కేటాయింపులు చేయడం విశేషం. ఉడాన్ ప్రాజెకుట్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో కొత్తగా 120 ప్రాంతాలకు విమానసర్వీసులను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే పదేళ్లలో నాలుగు కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలే లక్ష్యంగా చిన్న విమానాశ్రయాలు, హెలిప్యాడ్లపై ప్రభుత్వం దృష్టిసారించనుంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో యూరియా లభ్యతను పెంచేందుకు అస్సాంలోని నామ్‌రూమ్‌లో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో యూరియా తయారీ కర్మాగారాన్ని నెలకొల్పనున్నారు. ల్యాండ్ రికార్డుల నవీకరణ, జియోస్ఫాటికల్ సాంకేతికతతో మౌలికసదుపాయాల కల్పన వ్యూహాలను రచించనున్నారు.
సాంస్కృతిక శాఖకు పెరిగిన కేటాయింపులు
కేంద్ర సాంస్కృతిక శాఖకు బడ్జెట్లో రూ.3.360.96 కోట్లు కేటాయించారు. 2024-25లో సవరించిన అంచనా కంటే ఈసారి రూ.100 కోట్లు అధికంగా కేటాయించడం విశేషం. ఈ మొత్తం నిధుల్లో రూ.1,278.49 కోట్లు ఏఎస్ఐ కోసం ఖర్చు చేస్తారు. వార్షికోత్సవాలకు, సంస్మరణ కార్యక్రమాలకు 2024-25లో రూ.110 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.35 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంతర్జాతీయ సాం స్కృతిక ఒప్పందాలు, భాగస్వామ్యాలకు నిధుల కేటాయింపులు రూ.10.50 కోట్ల నుంచి రూ.4.65 కోట్లకు తగ్గిపోయాయి.
అలాగే జాతీయ లైబ్రరీలు, ఆర్కైవ్స్‌కు రూ.156.55 కోట్లు ఖర్చు చేయనున్నారు. నేషనల్ మ్యూజియం, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్‌కు రూ.126.63 కోట్లు, కళా సంస్కృతి వికాస్ యోజనకు రూ.198.50 కోట్లు కేటాయించారు. సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఇం దిరాగాంధీ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు బడ్జెట్లో రూ.411.42 కోట్లు కేటాయించారు. ప్రదర్శనశాలలకు రూ.379.58 కోట్లు కేటాయించారు.
విదేశాంగ శాఖకు రూ.20,516 కోట్లు
పొరుగుదేశానికి ప్రాధాన్యం విధానంలో భాగంగా భారత్ విదేశాలకు సాయాన్ని మరింత పెంచనుంది. ఈసారి బడ్జెట్‌లో విదేశాంగ శాఖకు రూ.20,516 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో అత్యధికంగా భూటాన్కు రూ.2.150 కోట్లను అభివృద్ధిసాయంగా ఇవ్వనుంది. నేపాల్‌కు రూ.700 కోట్లు, మాల్దీవులకు రూ.600 కోట్లు ఇవ్వనుంది. భారత్, ఇరాన్ సంయుక్తంగా నిర్మించిన ఛాబహార్ పోర్ట్ కోసం రూ.100 కోట్లు కేటాయించారు. విదేశాల్లో అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్టుల కోసం రూ.6,750 కోట్లు కేటాయించారు.
గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి విదేశాల్లో అభివృద్ధి సాయం కోసం నిధులను 20 శాతం (రూ.5,667 కోట్లు) పెంచారు. జలవిద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, విద్యుత్ సరఫరా లైన్‌లు, గృహ, రోడ్డు, వంతెన ప్రాజెక్టులు, సమీకృత చెక్‌పోస్ట్‌ల ఏర్పాటుసహా పలు రకాల కార్యక్రమాల కోసం నిధులను ఖర్చుచేయనున్నారు. బంగ్లాదేశకు రూ.120 కోట్లు, శ్రీలంకకు రూ.300 కోట్లు, మయన్మార్‌కు రూ.350 కోట్లు, మారిషసు రూ.500 కోట్లు కేటాయించారు.
రాష్ట్రపతి కార్యాలయానికి రూ.141 కోట్లు
రాష్ట్రపతి కార్యాలయంలో రాష్ట్రపతికి ఇచ్చే అలవెన్సులతోపాటు అక్కడ పనిచేసే సిబ్బంది, పనివాళ్లకు జీతభత్యాల కోసం మొత్తంగా 2025-26 బడ్జెట్‌లో రూ.141.83 కోట్ల కేటాయింపులు చేశారు. రాష్ట్రపతికి జీత భత్యాలు, అలవెన్సుల కోసం రూ.60 లక్షలు కేటాయించారు. ఈ మొత్తం గత బడ్జెట్లోనూ ఇంతే ఉంది. రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ నిర్వహణ వ్యయాలనూ మొత్తం కేటాయింపుల్లో కలిపేశారు.
రక్షణ రంగానికి 6,81,210 కోట్లు కేటాయింపు
గణతంత్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న మన దేశాన్ని ఆధునిక రణతంత్రం దిశగా నడిపించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.6.22 లక్షల కోట్లతో పోలిస్తే... సుమారు 9.53 శాతం అదనంగా ఈసారి రూ.6.81 లక్షల కోట్లు ప్రతిపాదించారు. ఇది మొత్తం బడ్జెట్‌లో 13.45 శాతం, మన దేశ జీడీపీలో ఇది 1.91 శాతం కావడం గమనార్హం.

రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా మూలధన వ్యయం కింద రూ.1,92,387 కోట్లను చూపారు. ఇందులో అత్యాధునిక యుద్ధ విమానాలు, నౌకలు, ఆయుధాలు, పరికరాల కొనుగోళ్లకు రూ.1,48,722 కోట్లను.. దేశీయంగా ఆయుధాలు, రక్షణ సాంకేతికతల అభివృద్ధి కోసం రూ.31,277 కోట్లను.. డిఫెన్స్ సర్వీసెస్ కోసం రూ.12,387 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం.. మూలధన వ్యయం రూ.1.59 లక్షల కోట్లు. దానితో పోలిస్తే ఈసారి రూ.21 వేల కోట్లు అదనంగా ఇవ్వనున్నారు.
ఆధునీకరణ కోసం..
మూలధన వ్యయం కింద చేసిన కేటాయింపులను రక్షణ రంగం ఆధునీకరణ కోసం వినియోగించనున్నారు. ఇందులో రూ.48,614 కోట్లను యుద్ధ విమానాలు, వాటి ఇంజన్ల కొనుగోలు, అభివృద్ధి కోసం కేటాయించారు. నౌకా దళంలో కొనుగోళ్లు, అభివృద్ధి కోసం రూ.24,390 కోట్లు, నావికాదళ డాక్‌యార్డుల ప్రాజెక్టుల కోసం అదనంగా రూ.4,500 కోట్లు ఇచ్చారు. ఇతర ఆయుధాలు, క్షిపణుల కొనుగోలు, అభివృద్ధి కోసం రూ.63,099 కోట్లు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. దేశ సరిహద్దుల రక్షణతోపాటు యుద్ధాలు, దాడులకు సంబంధించి వ్యూహాత్మక సన్నద్ధత దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జీతాలు, పెన్షన్లకు అధిక వ్యయం..
రక్షణ రంగానికి చేసిన కేటాయింపులలో ఈసారి కూడా పెద్ద మొత్తంలో రక్షణ బలగాల వేతనాలు, పెన్షన్లు, రోజువారీ నిర్వహణ వ్యయమే అధికంగా ఉన్నాయి. మొత్తం కేటాయింపుల్లో రూ.4,88,822 కోట్లు అంటే 71శాతానికిపైగా వీటికే ఖర్చుకానున్నాయి. ఇందులో రూ.1,60,795 కోట్లు పెన్షన్ల కోసమే వ్యయం కానున్నాయి.
సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణానికి రూ.7,146.5 కోట్లు
దేశ సరిహద్దుల్లో వ్యూహాత్మక రోడ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.7,146.5 కోట్లు కేటాయించారు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంట భద్రతా దళాల కదలికలు సులువుగా సాగేందుకు వీలుగా రోడ్లు, సొరంగాలు, వంతెనల నిర్మాణానికి ఈ నిధులను వినియోగిస్తారు.
- మొత్తం బడ్జెట్‌లో 13.45%
- మన దేశ జీడీపీలో 1.91%
- ఆయుధాలకొనుగోళ్లు, అభివృద్ధికి 1,92,387 కోట్లు
- వేతనాలు, రోజువారీ వ్యయానికి రూ.4,88,822 కోట్లు (ఇందులో పెన్షన్లకు 1,60,795 కోట్లు)
దేశీయంగానే రక్షణ కొనుగోళ్లకు పెద్దపీట
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో భాగంగా మూలధన వ్యయంలో 75 శాతాన్ని దేశీయంగానే ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్‌లో పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచే రక్షణ పరికరాలు, ఆయుధాలను కొనుగోలు చేస్తారు. ఈ మేరకు రూ.1,11,544 కోట్లను దేశీయంగా ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్‌లో వెల్లడించారు. ఈ వ్యయంలో రూ.27,886 కోట్ల (25 శాతం)ను మన దేశంలోని ప్రవేటు రక్షణ, పరిశోధన సంస్థల నుంచి కొనుగోళ్ల కోసం వినియోగించనున్నట్టు తెలిపారు.
డీఆర్‌డీవోకు రూ.26,817 కోట్లు..
కీలకమైన ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)’కు ఈ బడ్జెట్‌లో రూ.26,817 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులు రూ.23,856 కోట్లతోపోలిస్తే సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా ఇచ్చారు. దేశీయంగా రక్షణ పరికరాలు, ఆయుధాలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.
మరో 120 ప్రాంతాలకు విమానాలు
దేశీయ పౌర విమానయాన రంగాన్ని ప్రోత్సహించేం దుకు ప్రారంభిం చిన 'ఉడే దేశ్ 'కా ఆన్ నాగరిక్' (ఉడాన్) పథకంలో భాగంగా దేశంలోని మరో 120 ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని విస్తరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025-26 వార్షిక బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ మేరకు ప్రతిపాదించారు. వచ్చే పదేళ్లలో దేశీయ విమాన ప్రయాణికులను 4 కోట్లకు పెంచటమే లక్ష్యమని ప్రకటించారు. ఈ పథకం కింద ప్రస్తుతం 88 విమానాశ్రయాలు అను సంధానమై ఉన్నాయి. 610 మార్గాల్లో విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
సివిల్ ఏవియేషన్‌కు రూ.2,400 కోట్లు
పౌర విమానయాన రంగానికి 2025-26 బడ్జెట్‌లో రూ.2,400.31 కోట్ల నిధులు ప్రతిపాదించారు. 2024 -25 బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.2,658.68 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో దాదాపు 10 శాతం నిధుల కోత పెట్టారు. గత బడ్జెట్లో ఉడాన్ పథకానికి రూ.800 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో 32 శాతం కోతపెట్టి.. రూ.540 కోట్లతో సరిపెట్టారు. డీజీసీఏతో పాటు బీసీఏఎస్‌కు రూ.330 కోట్లు కేటాయించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ ఆల్టైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ (ఏఏఐసీల్ఏఎస్)కు రూ.142.75 కోట్లు, ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్‌కు రూ.1,025.51 కోట్లు ప్రతిపాదించారు.
సముద్రయాన పరిశ్రమ కోసం రూ.25,000 కోట్లతో మూలనిధి
రూ.25,000 కోట్లతో సముద్రయాన అభివృద్ధి మూలనిధిని ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి నిర్మల చెప్పారు. సముద్రమార్గంలో రవాణాకు సంబంధించి వస్తూత్పత్తుల సంస్థలకు మద్దతు పలకడం, వాటి మధ్య పోటీని ప్రోత్సహించడం కోసం ఈ మూలనిధిని వినియోగిస్తామని మంత్రి పేర్కొన్నారు. "సముద్రయాన పరిశ్రమ అభివృద్ధి కోసం అయ్యే వ్యయంలో కేంద్రప్రభుత్వం తన వాటాగా 49 శాతం నిధులిస్తుంది. మిగతా నిధులను నౌకాశ్రయాలు, ప్రైవేట్ రంగం నుంచి సమీ కరిస్తాం, నౌకారంగం నుంచి 2030 ఏడాదికల్లా రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించే లక్ష్యంతో మేరిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ (ఎండీఎఫ్) పనిచేయనుంది. మరో పదేళ్లపాటు నౌకల తయారీలో వాడేందుకు విదేశాల నుంచి దిగుమతి చేసు కునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని ఎత్తేస్తున్నాం. రాష్ట్రాల మధ్య నదీజలాల్లో తిరిగే చిన్ననౌకలకు టోనేజ్ పన్ను ప్రయోజనాలను అందిస్తాం. దీంతో అంతర్గత నదీ జలాల్లో రవాణా పెరుగుతుంది" అని మంత్రి అన్నారు.
భారతీయ షిఫ్ట్ యార్డ్‌కు నేరుగా ఆర్థిక సబ్సిడీ దక్కేలా షిస్టెబిల్డింగ్ ఫైనాన్స్ అసిస్టెంట్ పాలసీ 2.0ను తీసుకొ చ్చామని మంత్రి నిర్మల చెప్పారు. నిర్వహణ ఖర్చు లను బడ్జెట్ ద్వారా ప్రభుత్వమే ఇవ్వడం ద్వారా విదేశీ రవాణా ఆర్డర్లను పెంచుకునేందుకు ప్రభుత్వం సాయపడుతోంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.18,090 కోట్లు కేటాయించారు.
కొత్త టెక్నాలజీలకు రాచబాట
దేశంలో సరికొత్త టెక్నాలజీలకు రాచబాట వేసేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు. ప్రైవేటు రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు చర్యలను ప్రకటించారు. ఇందుకోసం రూ.20 వేల కోట్లను కేటాయించారు. మొత్తంగా శాస్త్ర, సాంకేతిక రంగానికి సంబంధించి వివిధ విభాగాలకు మొత్తంగా రూ.55,679 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.

పెద్ద ఎత్తున పరిశోధనలకు ప్రోత్సాహం
దేశంలో ప్రైవేటు రంగంలో భారీ ఎత్తున పరిశోధనలను ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్ సమయంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డీప్ టెక్, సోలార్, ఇతర శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఆ కార్పస్ ఫండ్ ఏర్పాటు కోసం తొలి విడతగా తాజా బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భవిష్యత్తు తరం స్టార్టప్‌లకు ప్రోత్సాహమిచ్చేలా రూ.10 వేల కోట్లతో ‘డీప్ టెక్’ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీలు
దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో ఫ్రేమ్ వర్క్‌ను ఏర్పా టు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో సరఫరా వ్యవస్థలతో ఆర్థిక వ్యవస్థ అనుసంధానాన్ని బలోపేతం చేస్తామన్నారు. దేశంలో ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసేలా ‘భారత్ ట్రేడ్ నెట్’ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.
ప్రధాన విభాగాలకు గణనీయంగా కేటాయింపులు..
- కార్పస్ ఫండ్‌కు ఉద్దేశించిన నిధులు సహా తాజా బడ్జెట్‌లో శాస్త్ర, సాంకేతిక విభాగానికి రూ.28,508 కోట్లు
- కేటాయించారు.
- బయోటెక్నాలజీ విభాగానికి ఈసారి రూ.3,446 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయింపులు రూ.2,275 కోట్లతో పోలిస్తే.. రూ.1,171 కోట్లు అదనం. ఇక పారిశ్రామిక పరిశోధనల విభాగానికి రూ.6,657 కోట్లు ఇచ్చారు.
- అణుశక్తి విభాగానికి గతంలో (రూ.24,968 కోట్లు) కన్నాస్వల్పంగా తగ్గించి రూ.24,049 కోట్లు కేటాయించారు.
- అంతరిక్ష పరిశోధనల విభాగానికి రూ.13,416 కోట్లు కేటాయించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పేస్ సెంటర్లలో కొనసాగుతున్న స్పేస్ ఫ్లైట్, లాంచ్ వెహికల్, శాటిలైట్ ప్రాజెక్టుల కోసం రూ.10,230 కోట్లను కేటాయించారు.
జమ్మూ కశ్మీర్‌కు రూ.41,000 కోట్లు
జమ్మూ కశ్మీర్‌కు కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రూ.41,000.07 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో సవరించిన ఆంచనాలకు దాదాపు సమానంగా తాజా కేటాయింపులు ఉన్నాయి. కాగా, ఈ కేటాయింపులకు అదనంగా రాష్ట్ర పోలీసు విభాగానికి కేంద్రం మరో రూ.9,325.73 కోట్లను ప్రకటించింది. కాశ్మీర్‌ను విభజించడం, 370 అధికరణం రద్దు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ, జమ్ము, కశ్మీర్ పోలీసు విభాగాన్ని నేరుగా నియంత్రిస్తోంది. గత బడ్జెట్‌తో పోలిస్తే సుమారు 650 కోట్లు పెరగడం గమనార్హం. ఇక లడక్‌కు రూ.4,692 కోట్లు, అండమాన్ నికోబార్ దీవులకు రూ.6,212 కోట్లు, చండీగడ్‌కు రూ.6,187 కోట్లు, లక్షదీవులకు రూ.3,432 కోట్లు దాద్రా నగర్ హవేలీ-డయ్యూ డామన్లకు కలిపి 2,780 5, లక్షదీవులకు రూ.1,586 కోట్లు ఇచ్చారు.
ఈ-కోర్టుల ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు
దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో డిజిటల్, ఆన్‌లైన్, పేపర్స్ విధానాలు పూర్తి స్థాయిలో తీసుకురావాలని కేంద్రం సంకల్పించిం ది. ఇందులో భాగంగా మూడో దశ ఈ-కోర్టుల ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించింది. నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్లాన్‌లో భాగంగా ఈ-కోర్టుల ప్రాజెక్టు 2007లో ప్రారంభమైంది. ఇందులో రెండో దశ 2023లో పూర్తయి మూడో దశ ప్రారంభమైంది. మొత్తం కోర్టు రికార్డులను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. మూడో దశలో ఏకీకృత సాంకేతిక వేదికను తీసుకురాబోతున్నారు. వివిధ కోర్టుల మధ్య డిజిటల్ అనుసంధానం పెరగబోతోంది. కోర్టులో కాగిత రహిత కార్యకలాపాలు జరగబోతున్నాయి. టెక్నాలజీ అందుబాటులో లేనివారికోసం ఈ-సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. డిజిటల్, ఆన్‌లైన్ విధానాలతో న్యాయ వ్యవస్థపై ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కక్షిదారులు కోర్టు ఫీజులు, నిందితులు జరిమానాలు ఇకపై ఎక్కడి నుంచైనా చెల్లించవచ్చు.
మావోయిస్టు ప్రాంతాల్లో భద్రతకు రూ.3,481 కోట్లు
దేశంలో 2026 మార్చినాటికి మావోయిస్టులను అంతం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తాజా బడ్జెట్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కోసం రూ.3,481 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్‌లో దీనికి కేటాయింపులు రూ.2,463 కోట్లు మాత్రమే. మావోయిస్టు ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక మౌలిక సదు పాయాల కల్పన పేరిట ఈ నిధులను కేటాయించారు.
సీబీఐకి రూ.1,071 కోట్లు
కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో సీబీఐకి 1,071.05 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.84.12 కోట్లను పెంచింది. సీబీఐ శిక్షణ కేంద్రాల ఆధునీకరణ, సాంకేతిక, ఫోరెన్సిక్ యూనిట్ల ఏర్పాటుకు ఈ నిధులను ఖర్చు చేస్తారు.
ఏఐ ఆధారిత లెర్నింగ్ కోసం ఎక్సలెన్స్ సెంటర్లు
విద్యా రంగానికి సంబంధించి కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లు నిర్మలా తెలిపారు. ఏఐలో భారత్ అగ్రగామి కావాలనే ఆలోచనతో ఈ రంగానికి పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా... అధునాతన పరిశోధన, ఏఐ ఎనేబుల్డ్ లెర్నింగ్ టూల్స్‌తో విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేస్తామన్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ సెక్టార్లలో ఏఐ ఆధారిత ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తున్నట్టు వివరించారు. ఏఐ నమూనాలను అభివృద్ధి చేయడానికి ప్రముఖ విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, ప్రైవేటు సంస్థలతో ఎక్సెలెన్స్ సెంటర్లు భాగస్వామ్యం అవుతాయని తెలిపారు.
న్యూక్లియర్ ఎనర్జీ మిషన్‌కు రూ.20,000 కోట్లు
వాతావరణ మార్పులను కట్టడిచేయడంతోపాటు పర్యావరణహిత సౌరవిద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లేందుకు కొత్త పథకాలను ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల చెప్పారు. "2047 కల్లా 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా పనిచేస్తున్నాం. దేశీయంగా సోలార్ ప్యానెళ్లు, సోలార్ పీవీ సెల్స్, ఈవీ బ్యాటరీలు, పవన విద్యుత్ టర్బైన్లు, హై ఓల్టేజ్ ట్రాన్స్మోషన్ పరికరాలు, ఎలక్ట్రోలైజర్ల తయారీ కర్మాగారాలను ప్రోత్సహిస్తాం. చిన్న రియాక్టర్ల పరిశోధన, అభివృద్ధి కోసం కొత్త న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ను తెస్తాం. ఇందుకోసం రూ.20,000 కోట్లు కేటాయిస్తాం. 2083 ఏడాదికల్లా ఐదు చిన్న మాడ్యులార్ రియాక్టర్లను ఏర్పాటుచేస్తాం"అని మంత్రి అన్నారు. "కోబాల్ట్ పాడి, లిథియం అయాన్ బ్యాటరీల వ్యర్ధాలు, లెడ్, జింక్ లతోపాటు అదనంగా 12 అరుదైన ఖనిజా లపై కస్టమ్స్ డ్యూటీని ఎత్తేస్తున్నాం" అని ప్రకటించారు.
హోంశాఖకు రూ.2.33 లక్షల కోట్లు
హోం శాఖకు రూ.2,33,210 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రూ.2,19,643 కోట్లతో పోలిస్తే ఇది సుమారు రూ.13.4 వేల కోట్లు అదనం. ఇందులో దేశ అంతర్గత రక్షణ, ఉగ్రవాదులు, మావోయిస్టులతో పోరాటంలో కీలకమైన సీఆర్పీఎఫ్ తోపాటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ తదితర పారామిలటరీ బలగాలకు రూ.1,60,391 కోట్లను కేటాయించారు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు రూ.3,893 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండే ఢిల్లీ పోలీసు వ్యవస్థకు రూ.11,981 కోట్లు.. రాష్ట్రపతి, ప్రధాని వంటి వీఐపీల రక్షణకు ఉద్దేశించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)కి రూ.489 కోట్లు, ఎన్టీఆర్ఎఫ్‌కు రూ.1,822 కోట్లు కేటాయించారు. దేశంలో పోలీసు బలగాల ఆధునీకరణ కోసం రూ.4,069 కోట్లు ఇచ్చారు. పోలీసు మౌలిక సదుపాయాల అభి వృద్ధికి రూ.4,379 కోట్లు, మహిళల భద్రతకు సంబంధించిన పథకాలకు రూ.960 కోట్లు కేటాయించారు. దేశంలో జైళ్ల ఆధునీ కరణ కోసం కేంద్ర హోంశాఖ బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించారు.
50 పర్యాటక స్థలాల అభివృద్ధి
దేశీయ పర్యాటకానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. దేశంలోని 50 ప్రముఖ పర్యాటక ప్రాంతాలను రాష్ట్రాల సహకారంతో అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. గత బడ్జెట్లో ఈ శాఖకు రూ.850.36 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.2,541.06 కోట్లు కేటాయించారు. ఇందులో మౌలిక వసతుల అభివృద్ధి పథకం 'స్వదేశ్ దర్శన్'కు రూ.1,900 కోట్లు ఇచ్చారు.
పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన. దేశంలో అంతర్జాతీయంగా భారీగా ప్రచారంతో పర్యాటకులను ఆకర్షించటం, రవాణా సదుపాయాలు పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు మం త్రి వెల్లడించారు. ఎంపిక చేసే పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు భూమిని రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చాల్సి ఉం టుందన్నారు. దేశీయ పర్యాటక రంగాన్ని ఉపాధి, ఉద్యోగ కల్పనకు ప్రధాన చోదకంగా మారుస్తామని ప్రకటించారు. నైపుణ్యా భివృద్ధి కార్యక్రమాల ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి పర్యాటక రంగంలో ఉపాధి కల్పిస్తామని నిర్మల తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ-వీసా, ఫీజు రహిత వీసా కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దేశంలో హెల్త్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ప్రారంభించిన 'హీల్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు.
విద్యుత్ పీఎసయూల పెట్టుబడులు రూ.86,138 కోట్లు
ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థలు 2025-26లో 21 శాతం అధికంగా రూ.86,138 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు బడ్జెట్ 2025లో ప్రతిపాదించారు. 9 విద్యుత్ పీఎసూలు 2024-25లో రూ.67,286 కోట్లు ఇన్వెస్ట్ చేయను న్నట్టు గత బడ్జెట్‌లో పేర్కొనగా, తాజాగా దీన్ని రూ.71,278 కోట్లకు సవరించారు. విద్యుత్ శాఖకు 2025-26 కోసం రూ.21,847 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌కు సంబంధించి సవరించిన కేటాయింపులు రూ.19,845 కోట్లుగా చూపారు.

ఎన్‌పీఎస్ వాత్సల్యకూ పన్ను ఊరట
చిన్నారుల రిటైర్మెంట్‌కు గణనీయమైన నిధిని సమకూర్చుకునే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన పీఎం వాత్సల్య ఎన్‌పీఎస్ పథకానికి తాజా బడ్జెట్‌లో రూ.50,000 పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనం కల్పించారు. తొలిసారిగా 2024–25 బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతా ప్రారంభించి ఇన్వెస్ట్ చేయవచ్చు. చిన్నారులు 18 ఏళ్లు నిండిన తర్వాత రెగ్యులర్ ఖాతా కింద మార్చుకుని, అప్పుడు వారు స్వయంగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది.
దీని కింద ఇప్పటికే 89,475 ఖాతాలు ప్రారంభమయ్యాయి. వీటి పరిధిలో రూ.62 కోట్ల పెట్టుబడులు సైతం సమకూరాయి. ఈ పథకానికి మరింత ఆదరణ కల్పించే ఉద్దేశ్యంతో తాజాగా పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని ఆర్థిక మంత్రి కల్పించారు. సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాకు ఉన్నట్టుగానే ఎన్‌పీఎస్ వాత్సల్యకు ఒకే విధమైన పన్ను విధానాన్ని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు.
కాకపోతే చట్టం పరిధిలో ప్రస్తుతమున్న గరిష్ట ప్రయోజనాల పరిధిలోనే ఇది ఉంటుందన్నారు. సెక్షన్ 80 సీసీడీ(1బి) కింద సాధారణ ఎన్‌పీఎస్‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల జమలపై పన్ను మినహాయింపు ప్రయోజనం ప్రస్తుతం పాత పన్ను విధానం కింద అమల్లో ఉంది.
కీలక ఖనిజాలపై సుంకాల రద్దు.. 36 ప్రత్యేక ఔషధాలపై కూడా..
కీలకమైన 12 ఖనిజాలు, లిథియం అయాన్ బ్యాటరీల స్క్రాప్, సీసం, కొబాల్ట్ ఉత్పత్తులు, జింకు మొదలైన వాటితో పాటు క్యాన్సర్, ఇతరత్రా అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే 36 ఔషధాలపై దిగుమతి సుంకాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. కీలక ఖనిజాలపై సుంకాల తగ్గింపుతో వాటి ప్రాసెసింగ్, రిఫైనింగ్‌కి ఊతం లభిస్తుందని, వాటిపై ఆధారపడిన రంగాలకు సదరు ఖనిజాల లభ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. సెస్సు వర్తించే 82 ఉత్పత్తుల కేటగిరీలపై సామాజిక సంక్షేమ సర్‌చార్జిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఒకటికి మించి సెస్సు లేదా సర్‌చార్జీని విధించకుండా ప్రతిపాదన చేశారు. నౌకా నిర్మాణ సంబంధిత ప్రయోజనాలు అందడానికి సుదీర్ఘ సమయం పడుతుంది కాబట్టి ముడి వస్తువులు, విడిభాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) మినహాయింపును మరో పది సంవత్సరాలు పొడిగించారు. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న పేషంట్లకు ఊరటనిచ్చేలా బీసీడీ నుంచి పూర్తిగా మినహాయింపు ఉండే ఔషధాల జాబితాలోకి 36 ఔషధాలను చేరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేపై బీసీడీని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచగా, ఓపెన్ సెల్ మొదలైన వాటిపై అయిదు శాతానికి తగ్గించారు.
పెట్టుబడులు, టర్నోవరు పరిమితుల్లో మార్పులు
దేశానికి వెన్నెముకగా ఉంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) మరింత ఊతమిచ్చే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో పలు సంస్కరణలను ప్రతిపాదించారు. ఎంఎస్‌ఎంఈల వర్గీకరణకు సంబంధించి పెట్టుబడి, టర్నోవరు పరిమితులను పెంచడం, రుణ హామీ పథకం కవరేజీని పెంచడం, ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు కస్టమైజ్ చేసిన క్రెడిట్ కార్డులు అందించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. వర్గీకరణకు సంబంధించి పెట్టుబడి, టర్నోవరు పరిమితులను వరుసగా రెండున్నర రెట్లు, రెండు రెట్లు పెంచుతూ బడ్జెట్‌లో మంత్రి ప్రతిపాదనలు చేశారు.
వీటి ప్రకారం.. రూ.2.5 కోట్ల వరకు పెట్టుబడులు, రూ.10 కోట్ల వరకు టర్నోవరు ఉన్న సంస్థలను ‘సూక్ష్మ’ సంస్థలుగా వర్గీకరిస్తారు. రూ. 25 కోట్ల వరకు పెట్టుబడి, రూ.100 కోట్ల వరకు టర్నోవరు ఉన్నవి ‘చిన్న’ తరహా సంస్థలుగా, రూ.125 కోట్ల వరకు పెట్టుబడులతో రూ. 500 కోట్ల లోపు టర్నోవరు ఉన్న సంస్థలను ’మధ్య’ తరహా సంస్థలుగా వ్యవహరిస్తారు. ఎంఎస్‌ఎంఈల విషయంలో ప్రకటించిన చర్యలను పరిశ్రమ స్వాగతించింది. దేశ ఎకానమీలో తయారీ రంగ వాటాను పెంచే దిశగా ఇది కీలకమైన అడుగని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ తెలిపారు.

కీలకమైన రెండో ఇంజిన్..
దేశాభివృద్ధికి కీలకమైన రెండో ఇంజిన్‌గా ఎంఎస్‌ఎంఈలను నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఉత్ప త్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు, టెక్నాలజీని మె రుగుపర్చుకునేందుకు, మరింతగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు తాజా ప్రతిపాదనలు ఉపయోగపడతాయని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కార్యకలాపాలను విస్తరించేందుకు, యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు లఘు సంస్థలకు ధీమా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కోటి పైగా ఉన్న రిజిస్టర్డ్ ఎంఎస్‌ఎంఈలు, సుమారు 7.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. తయారీ రంగంలో వీటి వాటా 36 శాతంగాను, ఎగుమతుల్లో దాదాపు 45%గా ఉంది.
మరిన్ని విశేషాలు..
- 5 లక్షల మంది మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ఎంట్రప్రెన్యూర్లకు ప్రయోజనం చేకూర్చేలా మంత్రి కొత్త ప్రతిపాదన ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో రూ.2 కోట్ల వరకు టర్మ్ లోన్‌లు అందించేందుకు తోడ్పడుతుంది.
- లఘు, చిన్న సంస్థలకు రుణ హామీ కవరేజీని రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచారు. దీనితో వచ్చే అయిదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల అదనపు రుణాలు లభిస్తాయి.
- స్టార్టప్‌లకు క్రెడిట్ గ్యారంటీ కవరేజీని రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచారు.
- ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ.5 లక్షల పరిమితితో కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులు అందించనున్నారు. తొలి ఏడాదిలో 10 లక్షల కార్డులు జారీ చేస్తారు.
- మేడిన్ ఇండియా ఆటబొమ్మలకు గ్లోబల్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా ఇంటర్నేషనల్ మాన్యుఫాక్చరింగ్ మిషన్ ఏర్పాటు.
అద్దె చెల్లింపులపై ఊరట
వ్యక్తిగత ఆదాయపన్ను పరంగా భారీ ఊరటనిచ్చిన కేంద్ర సర్కారు, మరోవైపు అద్దె చెల్లింపులపై టీడీఎస్, విదేశీ రెమిటెన్స్‌ల్లోనూ ఊరట కల్పించింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 194–ఐ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థల మధ్య అద్దె చెల్లింపులు రూ.2.40 లక్షలు మించితే కిరాయిదారు మూలం వద్దే పన్ను (టీడీఎస్) మినహాయించాల్సి ఉంటుంది. తాజాగా ఈ పరిమితిని రూ.6 లక్షలకు (నెలవారీ అయితే రూ.50,000) పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు.
ఎవరికి ప్రయోజనం..?
తాజా ప్రతిపాదన ప్రధానంగా వ్యాపార సంస్థలకు ఊరటగా చెప్పుకోవాలి. ప్రస్తుతం వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లకు కిరాయి చెల్లింపులు నెలవారీ రూ.50,000 (వార్షికంగా రూ.6లక్షలు) మించినప్పుడు 5 శాతం టీడీఎస్ అమలవుతోంది. అదే వ్యాపార సంస్థలు/ట్రస్ట్‌లు/ఎన్‌జీవోలు తదితర వర్గాలకు వార్షిక అద్దె రూ.2.4 లక్షలు మించినప్పుడే టీడీఎస్ అమలవుతోంది.
ఇప్పుడు వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌ల మాదిరే సంస్థలకూ టీడీఎస్ అమలు పరిమితిని నెలవారీ రూ.50,000కు పెంచారు. మరింత స్పష్టత, ఏకరూపత కోసం ఈ చర్య తీసుకున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ‘భూమి లేదా మెషినరీని కొన్ని నెలల కోసం అద్దెకు ఇచ్చినప్పుడు, నెలవారీ అద్దె రూ.50,000 మించితే టీడీఎస్‌లు అమలు చేయాల్సి వస్తుంది’ అని డెలాయిట్ ఇండియా ఆర్తి రాటే తెలిపారు. తక్కువ పన్ను చెల్లించే వారు, భూ/భవన యజమానులకు ఈ పెంపు ప్రయోజనం కల్పిస్తుందని క్రెడాయ్–ఎంసీహెచ్‌ఐ ప్రెసిడెంట్ డొమినిక్ రామెల్ అభిప్రాయపడ్డారు.
కోటి మంది పన్ను కట్టక్కర్లేదు: సీతారామన్
ఐటీ శ్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా ప్రజల చేతుల్లో పెద్ద ఎత్తున ఆదాయాన్ని మిగిల్చినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘‘రూ.12 లక్షలకు ఆదాయపన్ను మినహాయింపును పెంచడం వల్ల మరో కోటి మంది ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం స్పందన ఇది. మధ్య తరగతికి ప్రయోజనం కల్పించేందుకు పన్ను రేట్లను తగ్గించాం’’అని మంత్రి ప్రకటించారు.
కొత్తగా సులభతర ఆదాయపన్ను చట్టం
కొత్త ఆదాయపన్ను బిల్లును వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ప్రస్తుతమున్న ఆరు దశాబ్దాల క్రితం నాటి ‘ఆదాయపన్ను చట్టం 1961’ స్థానంలో దీన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. ‘ముందు విశ్వసించండి. తర్వాత పరిశీలించండి’ అన్న భావనతో ‘న్యాయ’ స్ఫూర్తితో ఈ బిల్లు ఉంటుందన్న సంకేతం ఇచ్చారు. ‘‘కొత్త బిల్లు చాలా స్పష్టతతో, చాప్టర్లు, పదాల పరంగా ప్రస్తుత చట్టంతో పోల్చి చూసినప్పుడు సగం పరిమాణంలోనే ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులు అర్థం చేసుకునేంత సరళంగా ఉంటుంది. ఫలితంగా పన్నుల స్పష్టత ఏర్పడి, వివాదాలు తగ్గిపోతాయి’ అని మంత్రి వివరించారు. కొత్త ఆదాయపన్ను బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపిస్తామని చెప్పారు.
రూ.10 లక్షలు మించితేనే రెమిటెన్స్‌లపై టీసీఎస్
ఆర్‌బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశాలకు పంపుకునే నిధుల(రెమిటెన్స్/చెల్లింపులు)పై టీసీఎస్‌లో మార్పు చోటుచేసుకుంది. ఏడాదిలో రూ.7 లక్షలు మించితే మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) ప్రస్తుతం అమల్లో ఉండగా, దీన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నిర్దేశిత ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ నుంచి రుణం తీసుకుని విదేశీ విద్య కోసం పంపుకునే రెమిటెన్స్‌లపై టీసీఎస్‌ను తొలగిస్తున్నట్టు చెప్పడం విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత ఊరటనిచ్చేదే. విదేశాల్లో చదువు కోసం, ఇతర అవసరాల కోసం వెళ్లిన వారికి నిధుల అవసరం ఏర్పడొచ్చు. అలాంటప్పుడు స్వదేశం నుంచి వారికి సులభంగా నిధులు పంపుకునేందుకు ఆర్‌బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ వీలు కల్పిస్తుంది.
డివిడెండ్ @ రూ.2.56 లక్షల కోట్లు
కేంద్ర బ్యాంకు ఆర్బీఐ సహా ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆర్ధిక సంవత్సరం (2025-28)లో రూ.2.56 లక్షల కోట్లు డివిడెండ్‌గా అందనున్నట్లు తాజా బడ్జెట్ అంచనా వేసింది. ప్రస్తుత ఏడాది(2024-25)లో డివిడెండ్ మిగులు ద్వారా రూ.2.34 లక్షల కోట్లమేర లభించనున్నట్లు అభిప్రాయపడింది. గత అంచనాల కంటే ఇది రూ.1,410 కోట్లు ఎక్కువకాగా.. వచ్చే ఏడాది ఇవి మరింత బలపడనున్నట్లు ఆర్థిక శాఖ భావిస్తోంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర పెట్టుబడుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందనున్న మొత్తం వసూళ్లు రూ.3.25 లక్షల కోట్లను తాకనున్నట్లు అంచనా. గతంలో నమోదైన రూ.2,89 లక్షల కోట్లను దాటనున్నాయి.
ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టులకు కేటాయింపులు.. రూ.18,000 కోట్లు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో కీలకమైన టెక్నాలజీ ప్రాజెక్టులకు కేటాయింపులను 84 శాతం అధికంగా రూ.18,000 కోట్లకు పెంచినట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొబైల్ ఫోన్‌లు, ఐటీ హార్డ్వేర్, సెమీకండక్టర్‌లు మొదలైన వాటి తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎస్ఐ) పథకం, ఇండియాఏఐ మిషన్ మొద లైనవి వీటిలో ఉన్నాయి. మొత్తం మీద ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖకు కేటాయింపులు 48 శాతం పెరిగి రూ.17,586 కోట్ల నుంచి రూ. 26,026 కోట్లకు చేరాయి.
అత్యధికంగా మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించిన లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పీఎల్ఎడి రూ.8,885 కోట్లు కేటాయించారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థలు పాక్స్కన్, టాటా ఎలక్ట్రానిక్స్ మొదలైనవి ఈ పథకం లబ్ధిదార్లుగా ఉన్నాయి.
మరోవైపు.. సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు కేటాయింపులు, సవరించిన అంచనాలకు దాదాపు రెట్టింపై, దాదాపు రూ.2,500 కోట్లకు చేరాయి. ఇండియాఏఐ మిషన్కి కేటాయింపులు 11 రెట్లు పెరిగి రూ.2,000 కోట్లకు చేరాయి. డిజైన్ ఆధారిత ప్రోత్సాహక పథకానికి రెట్టింపు స్థాయిలో రూ.200 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎలక్ట్రానిక్ రంగ ప్రాజెక్టు లకు కేటాయింపులను రూ.9,766 కోట్లకు సవరించారు.
డిజిన్వెస్ట్మెంట్ @.47,000 కోట్లు
కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో వచ్చే ఆర్ధిక సంవత్సరా నికి డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.47,000 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రతిపాదించింది. అయితే డిజిన్వెస్ట్మెంట్, అస్తుల మానిటైజేషన్ తదితర మూలధన వసూళ్లకింద ఈ మొత్తాన్ని అం చనా వేసింది. వెరసి రూ.47,000 కోట్ల మిస్లోనియస్ క్యాపిటల్ రిసీప్ట్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. చెరసి పీఎస్యూలలో వాటాల విక్రయం ద్వారా నిధుల సమీకరణ (డిజిన్వెస్ట్మెంట్)ను ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ఏడాది మూలధన సమీకరణగా పేర్కొంది. 2024-25లో ప్రభుత్వం వార్షిక డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాల నుంచి దూరం జరిగింది.
పీఎసీయూలలో వాటాల విక్రయం, ఆస్తుల మానిటైజేషన్ తదితర మిల్దేనియస్ క్యాపిటల్ రిసీల్డ్స్ ద్వారా రూ.50,000 కోట్ల లక్ష్యాన్ని ప్రకటించింది.. దీనిలో భాగంగా ఎంఎస్ సీసహా పలు ప్రభుత్వ రంగ సంస్థల ఐపీవోలకు దీపమ్ ప్రణాళికలు వేసింది. పీఎస్ఈయూ దిగ్గజాలు హెచ్ఎఎల్, కోల్ ఇండియా. ఆర్వీఎన్ఎల్. ఎస్ జేవీఎన్, హడ్కోలలో మైనారిటీ వాటాల విక్రయం (ఓఎఫ్ఎస్)ను సైతం చేపట్టింది. తద్వారా రూ.13,728 కోట్లు సమకూర్చుకుంది. అయితే ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్సహా వ్యూహాత్మక వాటాల విక్రయం పట్టాలెక్కలేదు. 2021 అక్టోబర్‌లో టాటా గ్రూప్నకు విమానయాన దిగ్గజం ఎయిరిండియా విక్రయం తదుపరి ప్రధాన డీల్స్‌కు చెకపడింది.
2025-26లో ద్రవ్యలోటు 4.4 శాతానికి కట్టడి @ రూ.15,68,936 కోట్లు
ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం-ద్రవ్యలోటును 2024-256 అనుకున్న ప్రకారం 4.8% వద్ద (జీడీపీ విలువలో) కేంద్రం కట్టడి చేయగలిగింది. విలువల్లో ఇది రూ.15,68,936 కోట్లు, 2025-26లో 4.4%కి తీసుకురావాలని నిర్దేశించుకుంది. గణాంకాల్లో చూస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.15.70 లక్షల కోట్ల ద్రవ్యలోటు అం చనా వేయగా, అంతకన్నా తక్కువగా రూ.15.69 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. తాజా ద్రవ్యలోటును పూడ్చుకోడానికి రూ.11.54 లక్షల కోట్ల మార్కెట్ రుణాన్ని సమీకరించాలని కొత్త బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన మొత్తాలను చిన్న తరహా పొదుపు మార్గాల ద్వారా సమీకరించాలని బడ్జెట్ నిర్దేశించింది. స్థూలంగా రూ.14.82 లక్షల కోట్ల మార్కెట్ రుణాలను స్వీకరించాలన్నది లక్ష్యం.
రూ.10 వేల కోట్ల కార్పస్‌తో ఎఫ్ఎఫ్ఎస్ పథకం
దేశంలో స్టార్టప్లను ప్రోత్సహించే దిశగా బడ్జెట్లో కేం ద్రం పలు కార్యక్రమాలు ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.10 వేల కోట్ల కార్పస్లో నిధుల నిది (ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ఎఫ్ఎస్) పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అర్హత కలిగిన స్టార్టప్లకు పన్ను రాయితీలు కల్పించేందుకు సం బంధించిన విలీన కాలపరిమితిని (ఇన్కార్పొరేషన్ పీరియడ్) ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్త లను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2016లో కూడా కేంద్రం రూ.10 వేల కోట్ల కార్పస్‌తో ఎఫ్ఎఫ్ ఎస్ తరహా పథకాన్ని ప్రారంభించింది. వెంచర్ మూలధన పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దీనిని నెలకొల్పారు.
సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో రిజిస్టర్ అయిన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకు (ఏఐఎఫ్లకు) పెట్టుబడి సమకూర్చే చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) దీనిని నిర్వహిస్తుంది. కాగా ఈ ఏఐఎస్లు తిరిగి స్టార్లప్‌లో పెట్టుబడి పెడతాయి. స్టార్టప్ కోసం ఉద్దేశించిన ఈ ఏఐఎఫ్లు రూ.91 వేల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలను కలిగి ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రూ.10 వేల కోట్ల ప్రభుత్వ కార్పస్ కూడిన నిధుల నిధి పథకం వీటికి దన్నుగా నిలుస్తుందని తెలిపారు. తాజాగా మరో రూ.10 వేల కోట్ల సహాయంతో ఓ కొత్త నిధుల నిధి పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించారు.
పరిశ్రమలను, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐ టీ)తో భేటీలో ఏఐఎఫ్లు ఈ పథకం కింద మరిన్ని నిధుల కోసం డిమాండ్ చేశాయి. ఎఫ్ఎఫ్ఎస్ సహకారం పొందుతున్న ప్రముఖ స్టార్టప్ పెట్టుబడి సంస్థల్లో చిరాటే వెంచర్స్, ఇండియా కోషియెంట్, బ్లూమ్ వెంచర్స్, ఐవై క్యాప్ తదితరాలున్నాయి. ఎఫ్ఎఫ్ఎస్ కింద ప్రయోజనం పొందే ఏఐఎఫ్ లు.. తాము ఆం గీకరించిన మొత్తానికి కనీసం రెండింతలు స్టార్టప్లలో పెట్టు బడి పెట్టాల్సి ఉంటుంది. 2024 అక్టోబర్ నాటికి ఏఐఎఫ్‌లు రూ.20,572 కోట్ల మేర స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టాయి.
కంపెనీల హర్షం
ఎఫ్ఎఫ్ఎస్ పథకంపై పలు కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. బడ్జెట్ భారత్ను ప్రపంచ ఆవిష్కరణల పవర్ హౌస్‌గా నిలబెడుతుందని పేర్కొన్నాయి. రూ.10 వేల కోట్ల తాజా కార్ప స్లో స్టార్టప్లకు అవసరమైన పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయని భారత్ పే వ్యవస్థాపకుడు శాశ్వత్ నకరాని చెప్పారు. కొత్త స్టార్లప్లకు తాజా ఎఫ్ఎఫ్ఎస్ పథకం కీలకమైన ఆర్థిక మద్ద తును అందజేస్తునందని స్టార్టప్ పాలనీ ఫోరం (ఎస్పీఎఫ్) అధ్యక్షుడు, సీఈఓ రాజ్పాల్ కోహ్లి పేర్కొన్నారు.
సాగుకు ఊతమేది?
భారత్‌ను అభివృద్ధి పథంలో పయనింపజేసే కీలకమైన నాలుగు ఇంజిన్లలో వ్యవసాయం ఒకటని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వ్యవసాయ అభివృద్ధి–ఉత్పాదకతల్లో సాధించే ప్రగతి... గ్రామీణ భారతం తిరిగి పుంజుకోవ డానికీ, సౌభాగ్యవంతం కావడానికీ దారితీస్తుందని ఆమె 2025–26 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ అందుకు తగిన కేటాయింపులు చేయడం మాత్రం మరిచారు. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతికూల ప్రభావాలు, అతివృష్టి, అనావృష్టి, సారం లేని నేలలు, నాణ్యత లేని విత్తనాలు వల్ల సగటు రైతులు పంట దిగుబడిలో తీవ్ర మార్పులు ఎదుర్కొంటున్నారు. బడ్జెట్‌లో ఈ పరిస్థితి నుంచి వారిని బయటపడవేయడానికి ఎట్లాంటి నిధులూ లేవు.

ఈ ఏడాది వ్యవసాయ బడ్జెట్ రూ.1,27,290.16 కోట్లుగా ప్రకటించారు. ఇది 2024–25లో రూ.1,22,528 కోట్లు, 2023–24లో రూ.1,16,788 కోట్లుగా ఉంది. 2025–26 మొత్తం బడ్జెట్ అంచనా (బీఈ) రూ.50,65,345 కోట్లు. అంటే వ్యవసాయానికి మొత్తం బడ్జెట్‌లో ఇచ్చింది కేవలం 2.51 శాతం మాత్రమే అన్నమాట. వ్యవసాయం, వ్యవసాయ పరిశోధన, చేపలు, పాడి పశువుల శాఖలకు కలిపి మొత్తం రూ.1,45,300.62 కోట్లు. గత ఏడాది ఇది రూ.1,39,607.54 కోట్లుగా ఉంది. వ్యవసాయ పరి శోధనకు గతేడాది రూ.9,941.09 కోట్లు ఇస్తే ఈసారి రూ.10,466.39 కోట్లు కేటాయించారు (పెరుగుదల 5.2 శాతం).
ఆశ్చర్యంగా, పంటల దిగుబడి ప్రభుత్వ లెక్కలలో పెరుగుతోంది. అననుకూల పరిస్థితుల వల్ల కేరళ రాష్ట్రంలో 3 పంటలు పండించే ప్రాంతంలో ఒకే పంట వేస్తున్నారు. గత 10 ఏండ్లలో వేల ఎకరాల వ్యవసాయ భూమి రోడ్లకు, ఇంకా ఇతర అభివృద్ధి పనులకు మళ్ళింది. దాదాపు 100 నదులు ఎండిపోయాయి. ఇవేవీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంటల దిగుబడి మీద వ్యతిరేక ప్రభావం చూపకపోగా... దిగుబడి పెర గడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పంటల విలువ పెరిగింది అని ఆర్థిక సర్వే చెబుతున్నది. అంటే ధరలు పెరిగినాయి. దీని వలన రైతుల ఆదాయం పెరగలేదు. కాగా ఆహార వస్తువుల ధరలు పెరిగాయి. అందువల్ల సాధారణ పౌరులకు అనేక పంట ఉత్పత్తులు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి.
ఆర్థిక మంత్రి తన 2024–25 బడ్జెట్ ప్రసంగంలో 9 ప్రాధాన్యాలను ప్రస్తావించారు. వ్యవసాయంలో దిగుబడి పెంచడం, వ్యవసాయాన్ని దృఢంగా సవాళ్ళను ఎదుర్కునే విధంగా తయారు చేయటం వంటివి ఇందులో ఉన్నాయి. అయితే ఏడాది గడిచేటప్పటికి ఈ ప్రాధాన్యాలు మరిచి పోయారు. పశుగణ అభివృద్ధికి, మత్స్య రంగానికి కలిపి రూ. 7,544 కోట్ల కేటాయింపు జరిగింది. వ్యవసాయ రంగ పెరుగు దలలో ఆర్థిక సర్వే కీలకంగా గుర్తించిన ఈ రెండు రంగాల మీద ప్రభుత్వం బడ్జెట్ పెరుగుదల 5 శాతం లోపే. మొత్తం బడ్జెట్ దిశ మారలేదు. ఈ రంగాల అభివృద్ధిని నిలువరిస్తున్న మౌలిక అంశాల మీద మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రధానంగా నీటి వనరుల కాలుష్యం, పశువులకు దొరకని దాణా వంటి అంశాల మీద దృష్టి లేనే లేదు. వ్యవసాయ పరిశోధనలకు రూ. 9,504 కోట్లు కేటాయించారు.
వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ‘ప్రధాన మంత్రి పంటల బీమా పథకా’నికి 13 శాతం కోత విధించింది. ఈ సారి ఇచ్చింది కేవలం రూ.13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారిన పడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకం తగ్గించడం శోచనీయం.
రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీల కొరత, వ్యవ సాయ కూలీ భారం వంటి అంశాల మీద ఆర్థిక సర్వేతో పాటు బడ్జెట్ కూడా ప్రస్తావించలేదు. గ్రామీణ భారతంలో ఉన్న భూమి లేని వారి ఉపాధికి, దాని రక్షణకు కేటాయింపులు లేవు. గ్రామీణ శ్రామిక శక్తికి అవసరమైన వసతుల కల్పనకు, సంక్షేమానికి, ఉపాధి రక్షణకు నిధులు మృగ్యం. వ్యవసాయంతో గ్రామీణ శ్రామిక శక్తి అనుసంధానం గురించిన కేటాయింపులు లేవు. పెరుగు తున్న ఉష్ణోగ్రతల వల్ల శ్రామికుల ఉత్పాదకత శక్తి పడి పోతున్నది. ఆహార ద్రవ్యోల్భణం వల్ల సరైన పరిమాణంలో పౌష్టిక ఆహారం శ్రామిక కుటుంబాలకు అందడం లేదు. ఈ సమస్యలను ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరం.
భారత ప్రభుత్వం పెరుగుతున్న ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాల మీద ఖర్చు చేయడం లేదు. కరోనా లాంటి కష్టకాలంలో ఉపాధి ఇచ్చి ఆదుకున్న వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. వ్యవసాయంలో ఉపాధిని తగ్గించే డిజిటలీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోక పోగా హాని కలిగించే పనుల మీద దృష్టి సారించడం మంచిది కాదు. కేంద్ర బడ్జెట్‌లో తీవ్ర మార్పులు అవసరం ఉన్నాయి. దార్శనిక నిధుల కేటాయింపుల అవసరం ఎంతైనా ఉంది.
Tags
- Union Budget 2025 Highlights
- Union budget 2025-26
- Union Budget 2025
- Budget 2025 Highlights in Telugu
- Nirmala Sitharaman
- Union Budge
- Budget Full Details
- Indian Union Budget 2025-26
- Indian Union Budget
- Narendra Modi Govt
- Union Budget News
- Budget Live Updates
- Budget Highlights 2025
- railway budget 2025
- Defense budget 2025
- Sakshi Education News
- UnionBudget2025
- Union Budget 2025 Full Details
- Budget 2025 Full Details
- Budget 2025 Full Details in Telugu