Union Budget 2023: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ మోడల్.. ఏపీ స్ఫూర్తితో విద్యారంగంలో నూతన కార్యక్రమాలు
నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, డిజిటల్ లైబ్రరీలు, పీఎం శ్రీ స్కూళ్ల ఏర్పాటు సహా మరికొన్ని కార్యక్రమాలకు రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్నాయి. ‘టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమాన్ని కేంద్రం ఈ బడ్జెట్‌లో పొందుపరిచింది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంజనీరింగ్ విద్యాసంస్థలు అకడమిక్ ఎక్సలెన్స్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంపై సమష్టిగా దృష్టి సారిస్తాయి. అయితే, రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డు ద్వారా ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తోంది. రాష్ట్ర వర్సిటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం వంటి సంస్థలన్నీ కలిపి పరస్పర సహకారం అందించుకుంటూ ముందుకు వెళ్లేలా దీన్ని అమలు చేస్తున్నారు.
డిజిటల్ లైబ్రరీలు, నైపుణ్యాభివృద్ధికి చర్యలు
ప్రతి పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసి యువతకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. రాష్ట్రంలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుపై ప్రభుత్వం ఇంతకుముందే దృష్టి సారించింది. దీంతోపాటు ఉన్నత విద్యామండలి ద్వారా లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్‌ఎంఎస్)ను ఏర్పాటు చేయించి విద్యార్థులకు పలు సబ్జెక్టు అంశాలను అందుబాటులోకి తెచ్చింది. కాగా, నైపుణ్యాభివృద్ధి కోసం ‘స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ల’ ఏర్పాటుకు కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి ఏర్పాట్లు చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు చదువులు పూర్తయ్యే నాటికే పూర్తి నైపుణ్యాలు కలిగి ఉండేలా తీర్చిదిద్దడంతో పాటు బయటకు వచ్చిన తరువాత కూడా అప్‌స్కిల్లింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 స్కిల్ హబ్‌లు, 26 స్కిల్ కాలేజీలు, రెండు స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయిస్తోంది.
నాడు–నేడు తరహాలో..
దేశంలో కొత్తగా భారతీయ భాషా యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. స్థానిక భాషల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తోంది. కాగా, పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రం జాతీయ స్థాయిలో 14,500 స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ బడ్జెట్‌లో రూ.4,000 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో నాడు–నేడు పథకం కింద అన్ని విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏకంగా రూ.16 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.