Skip to main content

పారిశ్రామిక మండలాలు

పారిశ్రామిక కార్యకలాపాలు భారీగా కేంద్రీకృతమైన భౌగోళిక ప్రాంతాన్నే పారిశ్రామిక మండలంగా వ్యవహరిస్తారు. పారిశ్రామిక ముడి సరకులు, మార్కెట్లు, అవస్థాపనా సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో పారిశ్రామిక కార్యకలాపాలు కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమై పారిశ్రామిక మండలాలు ఏర్పడతాయి. ఐరోపా, ఉత్తర అమెరికా, జపాన్‌లలో పారిశ్రామిక మండలాలు విశేషంగా అభివృద్ధి చెందాయి. ఉదాహరణకు యూఎస్‌ఏలోని ఈశాన్య ప్రాంతం, మహా సరస్సుల ప్రాంతాల్లో విస్తారమైన పారిశ్రామిక మండలాలు రూపొందాయి. అదేవిధంగా అభివృద్ధి చెందుతోన్న చైనా, ఇండియూ, బ్రెజిల్ దేశాల్లోనూ ఇటీవల పారిశ్రామిక మండలాల అభివృద్ధిని గమనించవచ్చు.
ఒక భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న పారిశ్రామిక వస్తువుల విలువ, వసూలవుతున్న కార్పొరేట్ సుంకాల విలువ, వినియోగమవుతున్న విద్యుచ్ఛక్తి, పారిశ్రామిక ఉపాధి పరిమాణం మొదలైన సూచికల ఆధారంగా పారిశ్రామిక మండలాలను గుర్తించవచ్చు. భారతదేశంలో ఆరు ప్రధాన పారిశ్రామిక మండలాలు ఉన్నాయి. అవి:
  • ముంబై-పుణె మండలం
  • హుగ్లీ బేసిన్ మండలం
  • చోటా నాగపూర్ మండలం
  • ఢిల్లీ-ఆగ్రా-మధుర మండలం
  • అహ్మదాబాద్-వడోదర మండలం
  • చెన్నై-మధురై-కోయంబత్తూరు మండలం
ముంబై-పుణె మండలం
 ముంబై-పుణె, హుగ్లీ బేసిన్ మండలాలు స్వాతంత్య్రానికి ముందే అభివృద్ధి చెందాయి. మిగతా నాలుగు మండలాలు ప్రధానంగా స్వాతంత్య్రానంతరం అభివృద్ధి చెందాయి. మహారాష్ట్రలో విస్తరించిన ముంబై-పుణె మండలం దేశంలోకెల్లా అతిపెద్ద, అత్యాధునిక పారిశ్రామిక మండలం. స్వాతంత్య్రానికి పూర్వమే నూలు వస్త్ర పరిశ్రమ స్థాపనతో ఈ పారిశ్రామిక మండల అభివృద్ధికి అంకురార్పణ జరిగింది. ఇప్పటికీ నూలు వస్త్ర పరిశ్రమను ఈ మండలానికి వెన్నుముకగా పేర్కొనవచ్చు.
స్వాతంత్య్రం తర్వాత ఈ మండలంలో పారిశ్రామిక వైవిధ్యం సంభవించింది. ఆటోమొబైల్, చమురు శుద్ధి, కాగితం, ఇంజనీరింగ్, రసాయనాలు తదితర పరిశ్రమలు ఇక్కడ అభివృద్ధి చెందాయి. ముంబై మెట్రోపాలిటన్ నగరం ఈ పారిశ్రామిక మండల కేంద్రం. కళ్యాణ్, పుణె, కొల్హాపూర్, ఉలాస్‌పూర్, థానే, నాగాథానే, ట్రాంబే మొదలైన పారిశ్రామిక పట్టణాలు ఈ మండలం కిందకు వస్తాయి.
ముంబై రేవుపట్టణం, సహ్యాద్రి కొండల్లోని జలవిద్యుచ్ఛక్తి సామర్థ్యం, పటిష్టమైన రవాణా వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం, స్థానిక పెట్టుబడి సామర్థ్యత, రాష్ట్ర ప్రభుత్వ ఉదారవాద విధానాలు ఈ పారిశ్రామిక మండల అభివృద్ధికి దోహదం చేస్తున్న అనుకూలాంశాలు. విపరీతంగా పెరుగుతున్న భూమి ధరలు, కాలుష్యం ఈ పారిశ్రామిక మండల అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.
 
హుగ్లీ బేసిన్ మండలం
స్వాతంత్య్రానికి పూర్వమే కలకత్తా నగర పరిసర ప్రాంతాల్లో హుగ్లీ బేసిన్ పారిశ్రామిక మండలం అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. కలకత్తా నదీరేవు పట్టణం కావడం ఈ పారిశ్రామిక మండల అభివృద్ధి ప్రాథమిక దశలో కీలక పాత్ర పోషించింది.
 మొదట జనపనార పరిశ్రమ అభివృద్ధితో ప్రారంభమై క్రమంగా ఆటోమొబైల్, భారీ యంత్ర పరికరాలు, వినిమయ వస్తువులు, రసాయనాలు, కాగితం, పెట్రో రసాయన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. హౌరా, డమ్‌డమ్, సాల్ట్ లేక్ సిటీ, రిస్రా, ఆగర్‌పారా, సెరామ్‌పూర్, చందర్ నాగోర్, ఫోర్ట్‌గ్లాస్టర్, లీలూ, బడ్జ్ బడ్జ్ ఆసన్‌సోల్, హల్దియా మొదలైనవి ఈ బేసిన్‌లో ముఖ్య పారిశ్రామిక పట్టణాలు.
దేశంలో మొదటి జనపనార కర్మాగారాన్ని రిస్రాలో స్థాపించారు. సమీపంలోని ఝరియా, రాణిగంజ్ బొగ్గు క్షేత్రాలు, జల రవాణా వ్యవస్థలు, అధిక జనసాంద్రత, కలకత్తా రేవుపట్టణం ఈ పారిశ్రామిక మండల అభివృద్ధికి దోహదం చేశాయి. రేవులో పూడిక సమస్య, తీవ్రమైన పారిశ్రామిక వివాదాలు, అతివాద ట్రేడ్ యూనియన్ ధోరణులు ఈ పారిశ్రామిక మండల అభివృద్ధికి ఇటీవల ప్రధాన అడ్డంకులుగా మారాయి. దీంతో ఈ పారిశ్రామిక మండల అభివృద్ధి కుంటుపడింది.
 
చోటానాగపూర్ మండలం
ఇది దేశంలోని ఏకైక ఖనిజాధారిత పారిశ్రామిక మండలం. చోటానాగపూర్ పీఠభూమిలో  పరిశ్రమలకు అవసరమైన ఖనిజ నిల్వలు విస్తారంగా ఉన్నాయి. దామోదర్ నదీలోయలోని బొగ్గు క్షేత్రాలు (బొకారో, గిర్ధి, ఝరియూ), హజారీబాగ్-సింగ్‌భమ్ ప్రాంతాల్లోని ఇనుము, బాక్సైట్, రాగి మొదలైన లోహ ఖనిజాలు  పరిశ్రమలను ఆకర్షించాయి. గనుల తవ్వకం ఈ మండలంలో పెద్ద పరిశ్రమగా రూపొందింది. భారత ప్రభుత్వం స్థాపించిన వివిధ భారీ ప్రభుత్వ రంగ కర్మాగారాలు ఈ పారిశ్రామిక మండల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాయి. రాంచీలోని హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ (HEC), సింధ్రీలోని ఎరువుల కర్మాగారం (FCI), బరేనీలోని చమురు శుద్ధి కర్మాగారాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇవేకాకుండా సిమెంట్ కర్మాగారాలు, ఇనుము- ఉక్కు కర్మాగారాలు (బొకారో, జంషెడ్‌పూర్) ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాయి. పటిష్టమైన రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలు లేకపోవడం ఈ మండలం అభివృద్ధికి ప్రధాన ఆటంకం. ఈ పారిశ్రామిక మండలంలోని భారీ ప్రభుత్వ రంగ సంస్థలకు అనుసంధానాలు లేకపోవడం వల్ల స్థానిక పారిశ్రామిక పట్టణాలు సమగ్ర ప్రాంతీయాభివృద్ధికి ఉపకరించడంలో విఫలమయ్యాయి. పారిశ్రామికాభివృద్ధి స్థానికులకు ఉపాధి చూపలేకపోయింది.
 
ఢిల్లీ-ఆగ్రా-మధుర మండలం
ఢిల్లీ మెట్రోపాలిటన్ నగరం కేంద్రంగా 1970వ దశకం నుంచి పారిశ్రామికాభివృద్ధి ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రధాన రైలు మార్గాలు, జాతీయ రహదారులు ఢిల్లీ నగరంలో అభిసరణం చెందడం, విస్తార స్థానిక మార్కెట్, సమీపంలోని సారవంతమైన వ్యవసాయ ప్రాంతం ఈ మండల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. వ్యవసాయాధార పరిశ్రమలైన చక్కెర, నూలు వస్త్రాల తయారీతో ప్రారంభమై క్రమంగా పారిశ్రామిక వైవిధ్యం ఏర్పడింది. ఢిల్లీ మెట్రోపాలిటన్ నగరంలో కాల్కా, షాదారా, నోయిడా, గుర్గావ్ ప్రాంతాల్లో ఆటోమొబైల్, ఇంజనీరింగ్, వినిమయ వస్తువుల తయారీ కేంద్రీకృతమైంది. ఆగ్రా, మధుర, ఘజియాబాద్, యమునానగర్ మొదలైనవి ఇతర పారిశ్రామిక కేంద్రాలు.
 
అహ్మదాబాద్-వడోదర మండలం
గుజరాత్‌లోని అహ్మదాబాద్-వడోదర మండలంలో పారిశ్రామికాభివృద్ధి 1970వ దశకం నుంచి వేగం పుంజుకుంది. అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్, జామ్‌నగర్, వల్సాస్, ఆనంద్, భరోచ్ ఈ ప్రాంతంలోని పారిశ్రామిక పట్టణాలు. నూలు వస్త్రాలు, చమురు శుద్ధి, పెట్రో రసాయనాలు, ఇంజనీరింగ్, సిమెంట్ మొదలైన పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. ‘వడోదర’ను భారతదేశ పెట్రో రసాయనాల రాజధానిగా అభివర్ణిస్తారు. కంబత్ సింధు శాఖలో బయల్పడిన చమురు, సహజ వాయు నిక్షేపాలు, సారవంతమైన కథియావాడ్ వ్యవసాయ ప్రాంతం, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ మండల అభివృద్ధికి దోహదం చేశాయి.
 
చెన్నై - మధురై - కోయంబత్తూరు మండలం
తమిళనాడులో పారిశ్రామికాభివృద్ధి మొదట చెన్నై పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. దీనికి  చెన్నై రేవుపట్టణం ఉపయోగపడింది. మెట్టూరు, శివ సముద్రాల్లో జలవిద్యుచ్ఛక్తి, రవాణా సౌకర్యాల అభివృద్ధి, నైపుణ్యం ఉన్న శ్రామికుల లభ్యత ఈ మండలానికి అనుకూలించే అంశాలు. కోయంబత్తూరులో నూలు వస్త్ర పరిశ్రమలు కేంద్రీకృతమవడంతో ఈ నగరం ‘దక్షిణ భారత మాంచెస్టర్’గా అవతరించింది. ఇక్కడ ఇంజనీరింగ్, సిమెంటు పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి. మధురై, ఈరోడ్, తిరుప్పూర్, సేలం మొదలైనవి ఇతర పారిశ్రామిక పట్టణాలు.
Published date : 17 Nov 2015 04:55PM

Photo Stories