Skip to main content

మృత్తికలు

మృత్తికలు లేదా నేలలు వ్యవసాయ పంటలకు, సహజ ఉద్భిజ సంపదకు మూలాధారం. మృత్తికల ఆవిర్భావ ప్రక్రియ చాలా సంక్లిష్టమైంది. ఈ సహజ సిద్ధ ప్రక్రియను ‘పిడోజెనెసిస్’ అంటారు. ఒక సెంటీమీటరు మందంఉన్న మృత్తిక ఏర్పడటానికి అయిదు నుంచి పది వేల సంవత్సరాల వరకు పడుతుంది!
 వ్యవసాయానికి కీలకమైన మృత్తికలు క్రమేణా క్రమక్షయం చెందుతున్నాయి. ఇది ఆవరణ వ్యవస్థల సుస్థిరతపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. పర్యావరణ సమతౌల్యం సాధించడానికి మృత్తికా సంరక్షణ అనివార్యం. మనదేశంలోని మృత్తికలు...
 1. ఒండ్రుమట్టి నేలలు
 2. నల్లరేగడి నేలలు
 3. ఎర్ర నేలలు
 4. నలుపు-ఎర్ర మిశ్రమ నేలలు
 5. లేటరైట్ నేలలు
 6. ఎడారి నేలలు
 7. అటవీ నేలలు  
 8. క్షార లేదా ఆమ్ల నేలలు
 ఒండ్రుమట్టి నేలలు
 ఈ నేలలు గంగా-సింధు-బ్రహ్మపుత్ర మైదానం, తీర మైదానాలు, డెల్టాలు, నదీ హరివాణా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు చాలా సారవంతమైనవి. వీటిలో పంట దిగుబడి అధికంగా ఉంటుంది. ఒండ్రుమట్టి నేలలు రవాణా నేలల తరగతికి చెందినవి. మాతృక శిలలు వేర్వేరు ప్రాంతాలకు చెందినవి. దాంతో ఒండ్రుమట్టి నేలల్లో వివిధ స్థూల, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అందువల్ల ఈ నేలలు అనేక రకాల పంటల సాగుకు అనువైనవి.
 ఈ నేలలు లోమి(Loamy) తరగతికి చెందినవి కావడం వల్ల తేమను బాగా పీల్చుకొని నిల్వ ఉంచుకుంటాయి. మృత్తికా కణాలు గోళాకారంలో ఉండటం వల్ల ఈ నేలలు దున్నడానికి చాలా అనువైనవి. ఒండ్రుమట్టి నేలలను తీర ప్రాంత, నదీ, డెల్టా అని మూడు రకాలు విభజించారు.  ప్రతి ఏటా శిలా పదార్థాలు నిక్షేపించడం వల్ల డెల్టా నేలలు సారవంతంగా తయారవుతాయి. సాపేక్షంగా పరిశీలిస్తే తీరప్రాంత ఒండ్రుమట్టి నేలల్లో వ్యవసాయ దిగుబడి తక్కువ.
 నల్లరేగడి నేలలు
 వింధ్యా-సాత్పురా పర్వత శ్రేణుల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు నల్లరేగడి మండలం విస్తరించి ఉంది. ఈ నేలలు ప్రధానంగా గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని మాళ్వా పీఠభూమి, పశ్చిమ మహారాష్ర్ట, ఉత్తర కర్ణాటక, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. దక్కన్ నాపల ప్రాంతంలో బసాల్ట్ తరగతికి చెందిన అగ్నిశిలలు తీవ్ర క్రమక్షయం వల్ల నల్లరేగడి నేలలుగా ఏర్పడ్డాయి. ఇవి తేమను పీల్చుకొని ఎక్కవ కాలం తమలో నిల్వ చేసుకుంటాయి. అందువల్ల ఈ నేలలు వర్షాధార వ్యవసాయానికి అనువైనవి. నీటి ముంపునకు గురైతే ముద్దగా మారి సాగుకు అనువుగా ఉండవు. అందువల్ల నల్లరేగడి నేలల్లో సాగునీటి వ్యవసాయం సాధ్యం కాదు. ఇవి పత్తిసాగుకు చాలా అనువైనవి.
 ఎర్రనేలలు
 భారత్‌లోని పీఠభూమి ప్రాంతంలో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. ఇవి పోషకాల పరంగా సారవంతమైనవి. అయితే ఎర్ర ఇసుక  నేలల్లో పంటల దిగుబడి తక్కువ. తెలంగాణ, రాయలసీమ, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని నేలలు ఈ తరగతికి చెందినవి. గులకరాళ్లు, బండరాళ్లు పరుచుకొని ఉంటాయి. అందువల్ల ఈ నేలలను సాగులోకి తేవడం చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఈ నేలలను ఆంధ్రప్రదేశ్‌లో స్థానికంగా చెలకలు అంటారు. వీటిలో పంటల దిగుబడి తక్కువ. వరుసగా పంటలను సాగు చేస్తే త్వరగా సారాన్ని కోల్పోతాయి.  సాగునీరు, ఎరువులను వాడటం వల్ల దిగుబడిని స్థిరీకరించవచ్చు. ఎర్రనేలలు, నల్లరేగడి మండలాల మధ్య ప్రాంత నేలల్లో ఈ రెండింటి మిశ్రమ లక్షణాలు కనిపిస్తాయి.
 లేటరైట్ నేలలు
 భారతదేశంలోని కొండలు, పీఠభూమి శిఖర భాగాల్లో లేటరైట్ నేలలు ఏర్పడ్డాయి. అధిక వర్షపాతం, ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఇవి ఏర్పడతాయి. ఖనిజ పోషకాలు ఈ నేలల పైపొరల నుంచి కింది పొరల్లోకి ఇంకిపోతాయి. దీనివల్ల పైపొరల్లో కేవలం ఫై ఆక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ లాంటి ఖనిజాలు మాత్రమే మిగులుతాయి. అందువల్ల ఇవి వ్యవసాయానికి అంతగా అనువైనవి కావు. ఈ నేలలు ముదురు జేగురు వర్ణంలో ఉంటాయి. సహ్యాద్రి, అన్నామలై, వింధ్యా పర్వతాలు, తూర్పు కనుమల శిఖరాల్లోని నేలలు ఈ కోవకు చెందినవి.
 ఎడారి నేలలు
 ఈ నేలలు పశ్చిమ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ లలో  విస్తరించి ఉన్నాయి. వీటి పైపొరల్లో కఠిన లవణాలు ఉంటాయి. అందువల్ల ఇవి వ్యవసాయానికి పనికిరావు. సాగు నీటి ద్వారా ఉపరితల కఠిన పొరను తొలగిస్తే పంటలు పండించే అవకాశం ఉంటుంది. పశ్చిమ రాజస్థాన్ లోని ఇందిరాగాంధీ కాలువ ఆయకట్టు ప్రాంతంలో సాగునీటి ద్వారా కఠిన లవణ పొరను తొలగించి పంటలను సాగు చేస్తున్నారు.
 ఆమ్ల (క్షార) మృత్తికలు
 నిస్సారమైన ఈ మృత్తికలు ఒండ్రుమట్టి నేలల్లో చెదురుమదురుగా కనిపిస్తాయి. ఈ మృత్తికలను స్థానికంగా కల్లార్, రే, ఉసార్, నేలలు అంటారు. ఈ చౌడు నేలలను తటస్థీకరించడానికి సున్నం, జింక్‌లను నేలలకు కలుపుతారు. ఈ మృత్తికల్లో వ్యవసాయ పంటల దిగుబడి తక్కువ. కేరళ తీర ప్రాంతంలోని కొచ్చిన్, అల్లెప్పీల సమీపంలో ‘పీట్’ తరగతికి చెందిన నేలలు విస్తరించి ఉన్నాయి.
 మృత్తికా సంరక్షణ చర్యలు
 వేగంగా ప్రవహించే నదుల వల్ల మృత్తికా క్రమక్షయం జరుగుతుంది. కొండల వాలులో చెట్లు నాటడం వల్ల నేలల క్రమక్షయాన్ని తగ్గించవచ్చు. మృత్తికా సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. కాంటార్ బండింగ్, సోపాన వ్యవసాయం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, వాటర్‌షెడ్ పథకాల నిర్వహణపై దృష్టి కేంద్రీకరిస్తోంది. నేలల క్రమక్షయాన్ని తగ్గించడానికి రైతులు మల్చింగ్, స్ట్రిప్‌క్రాపింగ్ వంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. పంట చేతికొచ్చిన తర్వాత మిగిలిన రొట్టను పొలంలోనే ఉంచి దున్నడం ద్వారా నేలల సారాన్ని పెంచొచ్చు. మల్చింగ్ పద్ధతిలో రొట్టను పొలంలో పరిచి, పవనాల వల్ల నేలల క్రమక్షయూన్ని అరికట్టొచ్చు. స్ట్రిప్ క్రాపింగ్ పద్ధతిలో వివిధ కాల వ్యవధుల్లో కోతకు వచ్చే పంటలను వరుసల్లో పెంచుతారు. చంబల్-యమునా లోయ ప్రాంతంలో నేలల తీవ్ర క్రమక్షయం వల్ల గల్లీలు, రావైన్‌లు ఏర్పడి ఆ ప్రాంతమంతా ‘బ్యాడ్‌ల్యాండ్’ భూస్వరూపాన్ని సంతరించుకుంది. ఈ ప్రాంతంలో భూవనరులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. పంటల మార్పిడి పద్ధతి ద్వారా కూడా నేలల సారం పెంచొచ్చు. లెగ్యూమ్ జాతికి చెందిన పంటలను మార్పిడి పంటగా వాడుతున్నారు!!
Published date : 30 Sep 2015 05:36PM

Photo Stories