Skip to main content

దేశంలో దుర్భిక్షానికి కారణాలు

 దేశంలో ప్రధానంగా ముడు రకాల కారణాల వల్ల దుర్భిక్షం ఏర్పడే అవకాశాలున్నాయి. అవి:
 1. శీతోష్ణస్థితి సంబంధ కారణాలు
 2. హైడ్రోలాజికల్ కారణాలు
 3. మానవ జోక్యం
 
 శీతోష్ణస్థితి సంబంధ కారణాలు
 శీతోష్ణస్థితి పరంగా దుర్భిక్షానికి కారణాలు..
 ఎ) నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించడం
 బి) నైరుతి రుతుపవనాలు నిర్దేశిత సమయం కంటే ముందే తిరోగమించడం
 సి) నైరుతి రుతుపవనాల్లో అంతరాయం
 సాధారణంగా జూన్ ఒకటో తేదీకల్లా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకి జూలై 15కల్లా దేశమంతటా విస్తరిస్తాయి. కానీ కొన్నిసార్లు రుతుపవనాలు ఆలస్యంగా రావడం, నెమ్మదిగా విస్తరించడం వల్ల వర్షపాత పరిమాణం తగ్గి దుర్భిక్షం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో నైరుతి రుతుపవనాలు నిర్దేశిత సమయానికే చేరినప్పటికీ, మధ్యలో అంతరాయం ఏర్పడుతుంది. రుతుపవనాలు క్రియాశీలకంగా ఉండని  దశ 15-20 రోజుల కంటే ఎక్కువగా ఉంటే దుర్భిక్షానికి దారితీస్తుంది. ముఖ్యంగా జూలైలో రుతుపవనాలు క్రియాశీలకంగా లేకపోవడం లేదా అంతరాయం సంభవిస్తే ఖరీఫ్‌లో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఇది ‘వ్యవసాయ దుర్భిక్షానికి’ దారి తీస్తుంది.
 సాధారణంగా అక్టోబర్ రెండో వారంకల్లా నైరుతి రుతుపవనాలు దేశం నుంచి తిరోగమిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి సెప్టెంబర్ మొదటి వారానికే తిరోగమిస్తాయి. దీంతో వర్షపాత పరిమాణం తగ్గి దుర్భిక్షం సంభవిస్తుంది. అనేక సంక్లిష్ట అంశాల వల్ల రుతుపవనాల్లో అనిశ్చితి ఏర్పడుతుంది. ఎల్‌నినో, ఈక్వినూ లాంటి దృగ్విషయాలతో పాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో స్థానికంగా ఏర్పడే అధిక పీడన మండలాలు, హిమాలయాల్లోని మంచు, గ్లోబల్ వార్మింగ్ లాంటి అంశాలు నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుండటంతో దుర్భిక్షం తలెత్తుతోంది.
 
హైడ్రోలాజికల్ కారణాలు
కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం సరిపడా ఉన్నప్పటికీ హైడ్రోలాజికల్ కారణాల వల్ల  అనావృష్టి ఏర్పడవచ్చు. ఉదాహరణకు చోటానాగపూర్ పీఠభూమికి చెందిన జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో 100 సెం.మీ.కు పైగా వర్షం కురుస్తుంది. కానీ పురూలియా, పలమావు, బొలంగీర్, కాళహంది ప్రాంతాల్లో తరచుగా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కురిసిన వర్షపు నీటిని ఉపరితలంపై నిల్వ ఉంచే భూస్వరూపాలు లేకపోవడంతో వర్షపు నీరు వృథాగా సముద్రంలోకి చేరుతోంది. నైసర్గిక స్వరూపం కఠిన శిలలతో కూడి ఉండటం వల్ల వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకిపోవడం చాలా తక్కువ. దీంతో భూగర్భ జలాలు కూడా ఎక్కువ లోతులో ఉండి అనావృష్టి ప్రభావం తీవ్రమవుతోంది.
 
మానవ జోక్యం
ఇటీవల దుర్భిక్ష ప్రాంతాల సంఖ్య మరింతగా పెరుగుతోంది. దుర్భిక్షం తరచుగా సంభవిస్తోంది. కరవు తీవ్రత కూడా అధికమవుతోంది. పర్యావరణంలో మానవ జోక్యమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అధునాతన పద్ధతిలో భారీ యంత్రాలను విరివిగా ఉపయోగించి వ్యవసాయ, నిర్మాణ కార్యకలాపాలను చేపడుతుండటం వల్ల ఉపరితల ప్రవాహ వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతోంది. దీంతో ఉపరితల జలవనరులు కుచించుకుపోయి అనావృష్టి సమస్య అధికమవుతోంది. అడవులను విచక్షణారహితంగా నరికివేయడంతో జలాలు ఇంకిపోయే రేటు తగ్గి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. కరవు పీడిత ప్రాంతాల్లో అధిక నీటి వసతి అవసరమయ్యే పంటల సాగు వల్ల కూడా అనావృష్టి సంభవిస్తోంది. గత రెండు దశాబ్దాల నుంచి సంభవిస్తోన్న దుర్భిక్షం ప్రధానంగా మానవ ప్రేరేపితమైందని శాస్త్రవేత్తల అభిప్రాయం.
 దేశంలో సుమారు 40 శాతం భౌగోళిక ప్రాంతాన్ని దుర్భిక్ష పీడిత ప్రాంతంగా వర్గీకరించారు. ఇరిగేషన్ కమిషన్ మొదటిసారిగా దుర్భిక్షాన్ని నిర్వచించి, దుర్భిక్ష పీడిత ప్రాంతాలను గుర్తించింది. 50 సెం.మీ. కంటే తక్కువ  సగటు వార్షిక వర్షపాతాన్ని పొందుతూ వర్షపాత పరిమాణంలో 50 శాతం కంటే ఎక్కువ విచలనం ఉన్న ప్రాంతాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తించారు. అయితే ఇటీవల దుర్భిక్ష పీడిత ప్రాంతాలను గుర్తించడానికి పంటల దిగుబడుల్లో క్షీణత, సాగు భూమి విస్తీర్ణంలో క్షీణతలనూ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.
 పశ్చిమ రాజస్థాన్, ఉత్తర గుజరాత్‌లోని కచ్ ప్రాంతాలను నిరంతర అనావృష్టి పీడిత ప్రాంతాలుగా పరిగణిస్తారు. ఈ ప్రాంతాల్లో  సగటు వార్షిక వర్షపాతం 30 సెం.మీ. కంటే తక్కువగా ఉంటుంది. విచలనం 70 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. సహ్యాద్రి పర్వత  వర్షచ్ఛాయా ప్రాంతం తీవ్ర దుర్భిక్ష పీడిత మండలం కిందకు వస్తుంది. మరాట్వాడా, విదర్భ(మహారాష్ట్ర), ఉత్తర కర్ణాటక, పశ్చిమ తెలంగాణ, రాయలసీమలు ఈ మండలం కిందకు వస్తాయి. జార్ఖండ్‌లోని పలమావు, పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా, ఒడిశాలోని బొలంగీర్, కాళహంది, మధ్యప్రదేశ్‌లోని జబువా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బుందేల్‌ఖండ్ ప్రాంతాలను ఓ మోస్తరు అనావృష్టి పీడిత ప్రాంతాలుగా గుర్తించారు.
Published date : 17 Nov 2015 04:43PM

Photo Stories