Skip to main content

భారతదేశం - నదీ వ్యవస్థ

 భారతదేశాన్ని ‘నదులదేశంగా’ పిలుస్తారు. వందల సంఖ్యలో చిన్న నదులు ప్రవహిస్తున్నా, దేశంలోని  ప్రధాన నదీహరివాణాలు 38. భారతదేశ నదులను హిమాలయ నదీవ్యవస్థ,  ద్వీపకల్ప నదీవ్యవస్థలుగా విభజించవచ్చు.

 హిమాలయ నదీ వ్యవస్థ
 హిమాలయ పర్వతశ్రేణుల్లోని  హిమనీ నదాలు, హిమనీనద సరస్సులు ఈ నదీ వ్యవస్థకు మాతృకలు. హిమాలయ నదులు జీవనదులు. వీటిలో ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తుంది. గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలు దీనికి ఉదాహరణ. ద్వీపకల్ప నదీ వ్యవస్థలకు ద్వీపకల్ప పీఠభూములు, ద్వీపకల్ప పర్వతాల శిఖరాలు  మాతృకలు. ద్వీపకల్ప నదుల్లో శీతాకాలంలో నీటి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. గోదావరి, కృష్ణా, కావేరి, నర్మద నదులు ద్వీపకల్ప నదులు. హిమాలయ నదుల నీటి పరిమాణం, ప్రవాహ వేగం ఎక్కువ. వీటి ప్రవాహ దిశలు తిన్నగా ఉండటం వల్ల ఈ నదులపై ఆనకట్టలు నిర్మించడం కొంచెం కష్టం. ద్వీపకల్ప నదుల ప్రవాహ వేగం తక్కువ. వీటి గమన మార్గాల్లో నదీ వక్రతలు ఎక్కువగా ఉంటాయి. హిమాలయ నదులు పురాతన లోయల ద్వారా ప్రవహిస్తున్నాయి. హిమాలయాల ఆవిర్భావానికి ముందే ఈ లోయలు ఏర్పడ్డాయి. ద్వీపకల్ప నదులు ప్రవహించే లోయలు పీఠభూములు, పర్వతాలు ఆవిర్భావించాక ఏర్పడ్డాయి.

 ఈ రెండు నదీ వ్యవస్థలు చివరకు సముద్రంలో కలుస్తాయి. కానీ కొన్ని నదులు సముద్రంలో కలువకుండానే భూభాగం మీదే అంతరిస్తాయి. వీటిని అంతర్గత లేదా ఖండాంతర నదీ వ్యవస్థలుగా పిలుస్తారు. పశ్చిమ రాజస్థాన్‌లోని లూనీ నది లాంటి ఎడారి నదులు ఈ కోవకు చెందినవి. ఈ నదులు థార్ ఎడారిలో అంతర్ధానమవుతాయి లేదా ఎడారిలోని సాంబార్, దీద్వానా లాంటి ఉప్పునీటి సరసుల్లో కలుస్తాయి. కొన్ని ఎడారి నదులు రాన్ ఆఫ్ కచ్‌లోని చిత్తడి నేలల్లోకి ప్రవహిస్తాయి. దక్కన్ పీఠభూమి తూర్పు-ఆగ్నేయ దిశగా వాలి ఉండటంతో గోదావరి, కృష్ణా, పెన్న, కావేరి నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. మాల్వా, బాగేల్‌ఖండ్, బుందేల్‌ఖండ్ పీఠభూములు ఉత్తరం వైపు వాలి ఉండటంతో  చంబల్, బేత్వా, కేన్, సోన్‌లాంటి నదులు ఉత్తరం దిశగా ప్రవహించి గంగా-యమున నదీ వ్యవస్థలో కలుస్తాయి. నర్మద, తపతి నదులు రిఫ్ట్‌వ్యాలీల ద్వారా తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తూ అరేబియూ సముద్రంలో కలుస్తాయి. పశ్చిమ కనుమల వాలుల ద్వారా జాలువారుతూ పశ్చిమ తీరమైదానం ద్వారా ప్రవహించే నదుల వేగం ఎక్కువ. ఉదాహరణకు పంబన్, ఇడుక్కి, మండొలి, జువారి మొదలైనవి. ఈ నదులు అపారమైన జల విద్యుచ్ఛక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.

 అతిపెద్ద నదీ వ్యవస్థ
 గంగానదీ వ్యవస్థ భారతదేశంలోకెల్లా అతి పెద్ద నదీ వ్యవస్థ. గంగోత్రి హిమానీనదంలోని గౌముఖ్ వద్ద ఆవిర్భవించే భగీరథీ నది గంగానదికి మాతృక. భగీరథీ, అలక్‌నంద నదులు దేవ ప్రయూగ్ వద్ద కలుస్తాయి. తర్వాత ఏర్పడిన ఉమ్మడి ప్రవాహాన్నే గంగానదిగా పిలుస్తారు. గంగానది హరిద్వార్ వద్ద హిమాలయ పర్వతాలను వీడి మైదానాన్ని చేరుతుంది. యమునా, రామ్‌గంగా, గండక్, అరుణ్, గాగ్రా, కోసిలు గంగానది ఉపనదులు వీటన్నింటిలో యమునా నది ప్రధానమైనది. హిమాలయాల్లోని యమునోత్రి హిమానీనదం యమునా నది  ఆవిర్భావ ప్రాంతం.

 ద్వీపకల్ప నదీ వ్యవస్థ
 ద్వీపకల్ప పీఠభూముల్లో ఆవిర్భవించే కొన్ని ద్వీపకల్ప నదులు కూడా ఉత్తరంగా ప్రవహించి గంగానదీ హరివాణాన్ని చేరతాయి. ఉదాహరణకు బేతూల్ పీఠభూమిలో ఆవిర్భవించిన చంబల్‌నది యమునానదిలో కలుస్తుంది. చంబల్-యమునా నదీలోయల మధ్య ప్రాంతం ‘బాడ్‌లాండ్స్’గా ప్రసిద్ధి. టాన్స్, బేత్వా, కేన్‌లు యమునా నదికి ఇతర ఉపనదులు. పేండ్రా పీఠభూమిలో ఆవిర్భవించిన సోన్ నది కుడా ఉత్తరంగా ప్రవహించి పాట్నా వద్ద గంగా నదిలో కలుస్తుంది. గంగా-సోన్‌ల సంగమ ప్రాంతానికి ఎగువన సోన్‌నదిపై రిహాండ్ వద్ద పెద్ద ఆనకట్ట కట్టారు. ఈ రిజర్వాయర్‌ను ‘గోవింద్‌వల్లభ్ పంత్‌సాగర్’ గా పిలుస్తారు. గంగానది పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా వద్ద రెండు పాయలుగా చీలుతుంది. ఇక్కడ ఫరక్కా ఆనకట్ట నిర్మించారు. ప్రధాన పాయ బంగ్లాదేశ్‌లో ప్రవహిస్తుంది. గంగా నదిని బంగ్లాదేశ్‌లో ‘పద్మ’ నదిగా పిలుస్తారు. కలకత్తా వైపుగా ప్రవహించే చిన్న పాయను హుగ్లీగా పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది టిబెట్ హిమాలయూల్లోని కైలాస పర్వతాల్లో ఉన్న మానససరోవరం నుంచి ఆవిర్భవిస్తుంది. టిబెట్‌లో బ్రహ్మపుత్రను ‘సాంగ్‌పో’గా పిలుస్తారు. ఇది  సయూడియూ పర్వత శ్రేణుల ద్వారా అరుణాచల్‌ప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ దీన్ని దిహాంగ్ అని పిలుస్తారు. అరుణాచల్ హిమాలయూలను వీడి అసోంలో కోవాఘాట్ వద్ద మైదానాన్ని చేరుతుంది. అసోంలో ఈ నదిని బ్రహ్మపుత్రగా పిలుస్తారు.

 ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నదీ దీవి ‘మాజులి’ అసోంలో బ్రహ్మపుత్ర నదిలో ఉంది. అసోంలోని ధుబ్రి పర్వతశ్రేణులు బ్రహ్మపుత్రానదిని దక్షిణంగా మళ్లించి బంగ్లాదేశ్‌లోకి ప్రవహించేలా చేస్తాయి. బంగ్లాదేశ్‌లో ఈ నదిని ‘జమున’గా పిలుస్తారు.

నదుల జన్మస్థానాలు, ప్రవాహ గతి..
సింధూ లేదా ఇండస్
దీని జన్మస్థానం టిబెట్‌లోని కైలాస పర్వతాల్లో ఉన్న ‘చాండుయాంగ్’ హిమానీనదం. ఈ నది డామ్‌ఛోక్ వద్ద దేశంలోకి ప్రవేశించి షిగార్, గిల్గిత్, డ్రాస్ తదితర ఉపనదులను కలుపుకొని పాకిస్తాన్‌లోకి ప్రవహిస్తుంది. సట్లెజ్, రావి, బియాస్, జీలం, చీనాబ్ నదులు సింధూ ముఖ్య ఉపనదులు. సట్లెజ్ నది కూడా కైలాస పర్వతాల్లోని ‘రాకాస్ తావ్’గా పిలిచే హిమానీనద సరస్సు నుంచి ఉద్భవిస్తుంది. ఈ నదిని ప్రాచీన కాలంలో ‘సుతుద్రి’ అని పిలిచేవారు. సట్లెజ్ నది హిమాచల్ ప్రదేశ్‌లోని ‘షిప్కిలా’ కనుమ ద్వారా భారత్‌లోకి ప్రవేశిస్తుంది.

సట్లెజ్‌పై భాక్రా, నంగల్
సట్లెజ్ నదిపై హిమాచల్‌ప్రదేశ్‌లోని భాక్రా, పంజాబ్‌లోని నంగల్ వద్ద భారీ ఆనకట్టలు నిర్మించారు. భాక్రా నంగల్ భారత్‌లో అతి పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టుల్లో ఒకటి. భాక్రా నంగల్ రిజర్వాయర్‌ను ‘గోవింద సాగర్’గా పిలుస్తారు. జీలం నది కశ్మీర్‌లోని వెరినాగ్ కొండల్లో ఆవిర్భవిస్తుంది. చంద్ర-భాగా నదుల కలయికతో చీనాబ్ నది ఏర్పడింది. ఇవి హిమాచల్ ప్రదేశ్‌లోని రోహతాంగ్ కనుమ వద్ద ఆవిర్భవిస్తాయి.

కాలాబాగ్
రావి నది కులూ కొండల్లో, బియాస్ నది బియాస్‌కుండ్ వద్ద ఆవిర్భవించాయి. సింధూ నదీ వ్యవస్థలో రావి-బియాస్‌ల సంగమం మాత్రమే భారతదేశంలో ఉంది. మిగిలిన నదులన్నీ పాకిస్తాన్ భూభాగంలో ఒక దానితో మరోటి కలుస్తాయి. ఈ నదులన్నీ పాకిస్తాన్‌లోని ‘కాలాబాగ్’ వద్ద కలిసి, ఒకే ప్రవాహంగా సింధ్ రాష్ట్రం ద్వారా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. రావి-బియాస్ నదులు పంజాబ్ (భారత్)లోని హరికే వద్ద కలుస్తాయి. ఇందిరాగాంధీ కాలువ హరికే వద్ద నిర్మించిన ఆనకట్ట నుంచి ప్రారంభమవుతుంది.

గోదావరి -త్య్రయంబకం
ద్వీపకల్ప నదీ వ్యవస్థలన్నింటి కంటే గోదావరి పెద్దది. ఇది సహ్యాద్రి పర్వతాల్లో నాసిక్ సమీపంలోని ‘త్య్రయంబకం’ వద్ద ఆవిర్భవించింది. ఈ నది మహారాష్ట్రకు చెందిన వార్ధా, పేన్‌గంగ, ప్రాణహిత, ఇంద్రావతి, కోయనా, మధ్యప్రదేశ్‌కు చెందిన వైన్‌గంగను కలుపుకొని తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. మానేరు, శబరి, మంజీరా నదులు గోదావరి ముఖ్య ఉపనదులు.

మంజీరాపై నిజాంసాగర్
మంజీరా నది మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ పర్యశ్రేణుల్లో ఆవిర్భవించింది. ఈ నది తెలంగాణలోని నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. మంజీరాపై నిజాంసాగర్, సింగూరు ఆనకట్టలు నిర్మించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఉద్భవించిన శబరి నది, ఖమ్మం జిల్లాలోని కూనవరం వద్ద గోదావరిలో కలుస్తుంది. గోదావరిపై నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శ్రీరాంసాగర్ ఆనకట్ట నిర్మించారు. గోదావరి రాజమండ్రికి దిగువన గౌతమీ గోదావరి, వశిష్ట గోదావరి, కైనతేయి గోదావరి అనే మూడు పాయలుగా చీలిపోతుంది. అనంతరం అంతర్వేది,యానాం, కొమరగిరి పట్నాల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

కృష్ణానది
సహ్యాద్రి కొండల్లోని మహాబలేశ్వర్ వద్ద కృష్ణానది ఆవిర్భవించింది. ఇది కర్ణాటక ద్వారా ప్రవహిస్తూ మహబూబ్‌నగర్ జిల్లాలో మక్తల్ వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఘటప్రభ, మల్లప్రభ, భీమా, తుంగభద్ర, దిండి, మూసీ నదులు కృష్ణా నదికి ముఖ్య ఉపనదులు. తుంగభద్ర కర్ణాటకలోని వరాహ పర్వతాల్లో ఆవిర్భవించి.. కర్నూలులోని  సంగమేశ్వర్ వద్ద కృష్ణలో కలుస్తోంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు దిగువన కృష్ణానది పాయలుగా చీలి హంసలదీవి వద్ద బంగాళాఖాతాన్ని చేరుతుంది.
Published date : 22 Sep 2015 03:58PM

Photo Stories