భారతదేశం- ఖనిజాధార పరిశ్రమలు
ఏ దేశ ఆర్థికాభివృద్ధికైనా ఇనుము-ఉక్కు పరిశ్రమల అభివృద్ధి అతి ముఖ్యమైంది. అందువల్లే ఈ పరిశ్రమను ‘మూల పరిశ్రమ’ అంటారు. ఖనిజాధార పరిశ్రమల్లో ఇనుము-ఉక్కు పరిశ్రమ అత్యంత ప్రధాన, అతి పెద్ద పరిశ్రమ
- భారతదేశంలో మొదటి ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని 1830లో తమిళనాడులోని పోర్టోనోవో వద్ద స్థాపించారు. 1866లో దీన్ని మూసేశారు.
- 1870లో పశ్చిమ బెంగాల్‌లోని కుల్టీ వద్ద ‘బెంగాల్ ఐరన్ వర్క్స్’ ఇనుము-ఉక్కు పరిశ్రమను నెలకొల్పారు. ఇది దేశంలో మొట్టమొదటి ఇనుము-ఉక్కు పరిశ్రమ. దీన్ని బర్నాపూర్లోని ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ(ఐఐఎస్‌సీవో)లో విలీనం చేశారు.
ఇది దేశంలోని మొదటి భారీ ఆధునిక ఇనుము-ఉక్కు కర్మాగారం. దీన్ని జార్ఖండ్‌లోని సక్చీ వద్ద 1907లో జంషెడ్జీ టాటా స్థాపించారు. ప్రైవేట్ రంగంలో ఏర్పాటైన మొదటి కర్మాగారం ఇది. ప్రస్తుతం పనిచేస్తున్న అతి పురాతన ఇనుము-ఉక్కు కర్మాగారం. జంషెడ్జీ టాటా గౌరవార్థం సక్చీని ‘జంషెడ్పూర్’గా వ్యవహరిస్తున్నారు.
- 1919లో పశ్చిమ బెంగాల్‌లోని ‘బర్నాపూర్’ వద్ద ‘ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ’(ఐఐఎస్‌సీవో)ని స్థాపించారు. దీన్ని 1972లో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
- 1923లో కర్ణాటకలో షిమోగా జిల్లాలోని భద్రావతి వద్ద ‘మైసూర్ స్టీల్ వర్క్స్’ (మిస్కో) అనే ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని నిర్మించారు. అనంతరం విశ్వేశ్వరయ్య గౌరవార్థం ఈ పరిశ్రమకు ‘విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్’(వీఐఎస్ఎల్) గా పేరు మార్చారు.
దీన్ని రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలోని ‘భిలాయ్’ వద్ద రష్యా సహకారంతో నిర్మించారు. కోర్బా ప్రాంతంలోని బొగ్గు నిక్షేపాలను ఇది వినియోగించుకుంటోంది. దీని ఉత్పత్తి 1959లో ప్రారంభమైంది.
రూర్కెలా ఇనుము - ఉక్కు కర్మాగారం:
దీన్ని ఒడిశాలో సుందర్‌గఢ్ జిల్లాలోని ‘రూర్కెలా’ వద్ద బ్రాహ్మణీ నది ఒడ్డున నిర్మించారు. దీనికి ‘పశ్చిమ జర్మనీ’ సహకారం చేసింది. ఇది 1959 నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది.
దుర్గాపూర్ ఇనుము - ఉక్కు కర్మాగారం: దీన్ని పశ్చిమ బెంగాల్‌లోని బురద్వాన్ జిల్లాలో దామోదర్ నదీ ప్రాంతంలో దుర్గాపూర్ వద్ద నిర్మించారు. దీనికి బ్రిటన్ సహకారం చేసింది. ఇది 1962 నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది.
భిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్ ఇనుము -ఉక్కు కర్మాగారాలు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేశారు.
బొకారో ఇనుము - ఉక్కు కర్మాగారం:
ఇది మూడో పంచవర్ష ప్రణాళిక కాలం (1964)లో ఏర్పాటైంది. దీన్ని జార్ఖండ్‌లో హజారీబాగ్ జిల్లాలోని బొకారో, దామోదర్ నదుల సంగమ ప్రాంత సమీపంలో నిర్మించారు. అత్యధికంగా స్వదేశీ పరిజ్ఞానంతో, కొంత రష్యా సహకారంతో స్థాపించిన నాలుగో ప్రభుత్వరంగ ఇనుము-ఉక్కు కర్మాగారం.
- ప్రస్తుతం ఇది భారతదేశంలో అతిపెద్ద ఇనుము-ఉక్కు కర్మాగారం. 1972 నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్: ఇది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉంది. దీన్ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్.. రష్యా సహాయంతో నిర్మించింది. 1992 ఆగస్టు 1న నాటి ప్రధాని పీవీ నరసింహారావు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. ఈ కర్మాగారం భారతదేశంలో అత్యాధునిక, తీరప్రాంతంలో ఉన్న ఏకైక ఇనుము-ఉక్కు కర్మాగారం.
- 1982లో తమిళనాడులోని ‘సేలం’ వద్ద ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు. ఈ కర్మాగారం నాణేల తయారీకి, స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తికి ప్రసిద్ధి. మరో కర్మాగారాన్ని కర్ణాటకలోని హోస్పేట్ సమీపంలోని విజయనగర్ వద్ద నిర్మించారు.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)
దీన్ని 1973లో న్యూఢిల్లీలో స్థాపించారు. ఇది పూర్తిగా ప్రభుత్వాధీన సంస్థ. దీనికి మహారత్న హోదా ఉంది. భిలాయ్, దుర్గాపూర్, రూర్కెలా, బొకారో, బర్నాపూర్, సమీకృత ఉక్కు కర్మాగారాలు మొదలైన వాటి నిర్వహణ బాధ్యత దీనిదే.
- భారతదేశంలో ఏర్పాటైన తొలి స్పాంజ్ ఐరన్ కర్మాగారం తెలంగాణ రాష్ర్టంలో ఖమ్మం జిల్లాలోని పాల్వంచ (కొత్తగూడెం)లో ఉంది.
అల్యూమినియం పరిశ్రమ
భారతదేశంలో ఇనుము తర్వాత ఇది రెండో పెద్ద ఖనిజరంగ పరిశ్రమ. దీన్ని మన దేశంలో వార్బోర్న్ పరిశ్రమ అంటారు. ‘అల్యూమినియం’ను విశ్వలోహం అంటారు. భారతదేశంలో 1937లో పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలో అసన్సోల్ సమీపంలో ‘జాయక్నగర్’ ప్రాంతంలో ‘అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ను స్థాపించారు.
- భారతదేశంలో 8 అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. అవి..
- ఇందాల్కో (ఇండియన్ అల్యూమినియం కంపెనీ): దీనికి అలువాపురం(కేరళ), హీరాకుడ్ (ఒడిశా), బెల్గాం (కర్ణాటక)లో యూనిట్లు ఉన్నాయి.
- హిందాల్కో(హిందుస్తాన్ అల్యూమినియం కంపెనీ): ఇది రేణుకూట్ (ఉత్తరప్రదేశ్)లో ఉంది.
- బాల్కో (భారత్ అల్యూమినియం కంపెనీ): దీనికి కోర్బా (ఛత్తీస్‌గఢ్), రత్నగిరి (మహారాష్ర్ట)లో యూనిట్లు ఉన్నాయి. బాల్కో మొదటిసారి లక్ష టన్నుల కెపాసిటీ సాధించింది.
- నాల్కో(నేషనల్ అల్యూమినియం కంపెనీ): ఇది దామన్జోడి(ఒడిశా)లో ఉంది.
- మాల్కో(మద్రాస్ అల్యూమినియం కంపెనీ): ఇది మెట్టూరు (తమిళనాడు)లో ఉంది.
భారతదేశంలో మొదటి సిమెంటు పరిశ్రమ 1904లో చెన్నైలో ప్రారంభమైంది. ప్రస్తుతం దీన్ని మూసివేశారు. పూర్తి స్థాయిలో 1912లో గుజరాత్‌లోని పోర్బందర్లో సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేశారు.
- సిమెంటు ఉత్పత్తిలో భారత్‌ది రెండో స్థానం కాగా మొదటి స్థానంలో చైనా ఉంది.
- భారతదేశంలో తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సిమెంటు ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. సిమెంటు పరిశ్రమకు ప్రధాన ముడి సరుకు సున్నపురాయి.
- ప్రస్తుతం మనదేశంలో 128 భారీ, 322 చిన్న సిమెంటు కర్మాగారాలున్నాయి.
- ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేటు రంగంలోనూ సిమెంటు కర్మాగారాలు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలు దాదాపు 65 శాతం సిమెంటును ఉత్పత్తి చేస్తున్నాయి. అసోసియేట్ సిమెంటు కంపెనీ(ఏసీసీ) లిమిటెడ్ అతి పెద్ద సిమెంట్ తయారీ సంస్థ కాగా దాల్మియా గ్రూపు రెండోది.
ఎరువుల పరిశ్రమ
దేశంలో మొదటి ఎరువుల పరిశ్రమను 1906లో తమిళనాడులోని రాణిపేటలో ప్రారంభించారు. స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ రంగంలో మొదట 1951లో బిహార్‌లోని సింద్రీ (ప్రస్తుతం ఈ ప్రాంతం జార్ఖండ్‌లో ఉంది) వద్ద ఆధునిక ఎరువుల కర్మాగారాన్ని నిర్మించారు. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో ఎరువుల ఉత్పత్తిలో భారతదేశం మూడో స్థానంలో ఉంది.
- 1961లో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 1974లో నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్‌ను స్థాపించడం ద్వారా ఎరువుల పరిశ్రమ అభివృద్ధి చెందింది.
గాజు పరిశ్రమ
భారతదేశంలో మొదటి గాజు పరిశ్రమను 1941లో ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో స్థాపించారు. ఈ పరిశ్రమకు కావాల్సిన ముడి పదార్థాలు.. ఇసుక, సున్నపురాయి, సిలికా, సోడా యాష్. ఫిరోజాబాద్ పరిశ్రమ గాజులు, పూసలకు ప్రసిద్ధి.
ఇంజనీరింగ్ పరిశ్రమలు
మనదేశంలో 1958లో హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్‌ను రాంచీ (జార్ఖండ్)లో స్థాపించారు. దీని స్థాపనతో ఇంజనీరింగ్ పరిశ్రమ అభివృద్ధి ప్రారంభమైంది. ప్రస్తుతం దేశ అవసరాలకు కావాల్సిన అన్ని రకాల సామగ్రిని మన దేశం తయారు చేస్తోంది.
దేశంలోని ప్రధాన ఇంజనీరింగ్ పరిశ్రమలు
హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్: జార్ఖండ్‌లోని రాంచీలో ఉంది. ఇది ఉక్కు పరిశ్రమ. యంత్ర సామగ్రి, హెవీ క్రషింగ్, గ్రైండింగ్ యంత్రాలు, క్రేన్లు, రోలింగ్ యంత్రాలు, నూనె బావుల డ్రిల్లింగ్ రిగ్స్ ను ఉత్పత్తి చేస్తోంది.
మైనింగ్ అండ్ అలైడ్ మిషనరీ కార్పొరేషన్ లిమిటెడ్: ఇది దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్) ఉంది. రకరకాల ఖనిజ యంత్రాలను తయారు చేస్తోంది.
భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్: ఇది విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్)లో ఉంది. పెట్రో రసాయనాలు, ఎరువుల యంత్రాలను తయారు చేస్తోంది. దీన్ని 2009లో బీహెచ్ఈఎల్లో విలీనం చేశారు.
తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్: ఇది కర్ణాటకలో ఉంది. గేట్స్, ట్రాన్సమిషన్ టవర్స్, పెన్‌స్టాక్ పైప్స్ తయారు చేస్తుంది.
ఇతర పరిశ్రమలు
- హిందుస్తాన్ మెషీన్ టూల్స్(హెచ్ఎంటీ): దీన్ని 1953లో కర్ణాటకలోని బెంగళూరులో స్థాపించారు. దీనికి అయిదు యూనిట్లు ఉన్నాయి. శ్రీనగర్ (జమ్మూకశ్మీర్), బెంగళూరు (కర్ణాటక), హైదరాబాద్, కాలమస్సేరి (కేరళ) యూనిట్లలో హెచ్ఎంటీవాచ్లు, పింజోర్ (హర్యానా) యూనిట్లో ట్రాక్టర్లను తయారు చేస్తారు.
- భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్): దీన్ని 1956లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో స్థాపించారు. దీనికి జగదీశ్‌పూర్, హరిద్వారా (ఉత్తరప్రదేశ్) తిరుచిరాపల్లి (తమిళనాడు), హైదరాబాద్‌లో యూనిట్లు ఉన్నాయి.
- ప్రాగా టూల్స్: ఇది సికింద్రాబాద్ లో ఉంది. ఇక్కడ రక్షణ సామగ్రిని తయారు చేస్తారు.
- హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్): దీనికి హైదరాబాద్, రూప్ నారాయణపూర్ (పశ్చిమబెంగాల్)లో యూనిట్లు ఉన్నాయి.
- హిందుస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ: ఇది బెంగళూరు (కర్ణాటక)లో ఉంది.
- హెవీ వెహికల్ ఫ్యాక్టరీ: ఇది ఆవడి (చెన్నై) లో ఉంది.
- హిందుస్తాన్ హౌజింగ్ ఫ్యాక్టరీ లిమిటెడ్: ఇది న్యూఢిల్లీ ఉంది.
- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్): ఇది బెంగళూరు (కర్ణాటక)లో ఉంది.
- హిందుస్తాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్: ఇది పింప్రీ (మహారాష్ర్ట)లో ఉంది.
- హిందుస్తాన్ ఫొటోఫిల్మ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్: దీన్ని 1960లో భారత ప్రభుత్వం తమిళనాడులోని ఊటీ వద్ద ఏర్పాటు చేసింది.
- ఇండియన్ డ్రగ్స అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్): దీని కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
గతంలో వచ్చిన ప్రశ్నలు
1. మనదేశంలో మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?(కానిస్టేబుల్ -2012)
1) కొత్తగూడెం
2) విశాఖపట్నం
3) భోపాల్
4) కోల్‌కతా
- View Answer
- సమాధానం: 1
2. దేశంలోని అతిపెద్ద ఉక్కు కర్మాగారం ఎక్కడ ఉంది? (కానిస్టేబుల్ - 2009)
1) భిలాయ్
2) బొకారో
3) రూర్కెలా
4) దుర్గాపూర్
- View Answer
- సమాధానం: 2
3. భారత్ హెవీ ఎలక్ట్రికల్ కర్మాగారం ఎక్కడ ఉంది? (కానిస్టేబుల్ - 2009)
1) విశాఖపట్నం
2) భువనేశ్వర్
3) హైదరాబాద్
4) ముంబై
- View Answer
- సమాధానం: 3
4. దేశంలోని మొదటి ఉక్కు కర్మాగారమైన టాటా ఇనుము-ఉక్కు కంపెనీ ఎక్కడ ఉంది? (కానిస్టేబుల్ - 2009)
1) దుర్గాపూర్
2) నాగపూర్
3) బీజాపూర్
4) జంషెడ్పూర్
- View Answer
- సమాధానం: 4
5.బొకారో ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహాయంతో నిర్మించారు? (జైల్ వార్డెన్ - 2012)
1) అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2) ఇంగ్లండ్
3) జర్మనీ
4) సోవియెట్ యూనియన్
- View Answer
- సమాధానం: 4
6. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి. (జైల్ వార్డెన్ - 2012)
1) విశాఖపట్నం - నౌకా నిర్మాణం
2) టిట్లాఘర్ - రైల్వే సామగ్రి
3) భద్రావతి - ఇనుము, ఉక్కు
4) పింజోర్ - యంత్ర పరికరాలు
- View Answer
- సమాధానం: 2