Skip to main content

ప్రపంచ లింగ సంబంధిత సమానత్వ సూచీ-2019లో భారత్ స్థానం?

మహిళా సాధికారత:
ఆర్థిక, సాంఘిక, రాజకీయ అంశాలలో మహిళల స్థితిగతులను మెరుగుపరచడం... మహిళా సాధికారత ప్రక్రియలో ప్రధానమైంది. లింగ సంబంధిత సమానత్వం, సాధికారత లేనిదే దేశంలో అభివృద్ధి, సామాజిక మార్పు సాధ్యం కాదు. ఆర్థికాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం లేనిదే ఆర్థికాభివృద్ధి ప్రక్రియ వల్ల కలిగే ప్రయోజనాలను వారు పొందలేరు. మహిళా సాధికారత కోసం అమలుపరచే కార్యక్రమాలు, విధానాల ద్వారా దేశాలు, వ్యాపారాలు, సమాజంలోని వివిధ గ్రూపులు లబ్ధి పొందుతాయి. పశ్చిమ దేశాలలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని అంశాలలో సమానమైన హక్కులను కల్గి ఉన్నప్పటికీ భారత్‌లో ఇప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది.
విద్యా ప్రమాణాల అందుబాటు తక్కువగా ఉండటం, బాలికా శిశుహత్యలు, కుటుంబ బాధ్యతలు అధికం, నష్ట భయాన్ని భరించగలిగే సామర్థ్యం తక్కువగా ఉండటం, బాల్య వివాహాలు, ఆర్థిక పరిమితులు, తక్కువ చైతన్యం, మహిళలపై అధిక దురాగతాలు లాంటి అంశాలు భారత్‌లో మహిళా సాధికారతకు అవరోధంగా నిలుస్తున్నాయి. మహిళల సామాజిక చైతన్యంలో మార్పు, శ్రామిక ప్రక్రియలో మార్పు, విధాన నిర్ణయాలలో భాగస్వామ్యం, విద్య, స్వయం ఉపాధి, స్వయం సహాయక బృందాల ఏర్పాటు, పౌష్టికాహారం, ఆరోగ్యం, పారిశుధ్యం, గృహవసతి లాంటి కనీస అవసరాల కల్పనకు ప్రభుత్వం అమలుపరచే కార్యక్రమాలు, విధానాలు దోహదపడినప్పుడే మహిళా సాధికారతకు మార్గం సుగమం అవుతుంది.

1. ప్రపంచ బ్యాంక్ గ్రూపు నివేదిక-2019:
భారత జనాభాలో 48.20 శాతంగా ఉన్న మహిళలు వేగవంతమైన ఆర్థిక వృద్ధి వలన పురుషులతో సమానంగా ప్రయోజనాన్ని పొందలేకపోయారు. మహిళా శిశుమరణాలు ఆందోళన కలిగించే పరిణామంగా ప్రపంచ బ్యాంక్ గ్రూపు నివేదిక పేర్కొంది. ప్రతి సంవత్సరం భారత్‌లో 5 సంవత్సరాల వయో వర్గంలోపు బాలికలు 2,39,000 మంది మరణిస్తున్నారు. ప్రపంచంలో ‘మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు’ భారత్‌లో తక్కువ. పురుషులలో అక్షరాస్యత 80 శాతం కాగా మహిళలలో సుమారు 65 శాతంగా ఉందని ప్రపంచ బ్యాంక్ గ్రూపు నివేదిక పేర్కొంది. లింగ సంబంధిత అసమానతలను తొలగించడంలో అక్షరాస్యత ప్రధానమైంది. 15 సంవత్సరాలు, అంతకు పైబడిన మహిళలలో 1/3వంతు శ్రమశక్తిలో భాగస్వాములుగా లేదా ఉపాధి కోసం వేచి ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది.
గ్రామీన‌ పేదలలో పేదరికం తగ్గింపు, సుస్థిర జీవన ప్రమాణం కల్పన ధ్యేయంగా 2011లో ప్రారంభించిన ‘నేషనల్ రూరల్ లైవ్‌లీ హుడ్ మిషన్’కు ప్రపంచ బ్యాంక్ ఒక బిలియన్ డాలర్ల పరపతిని అందించింది. ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాతి కాలంలో 50 మిలియన్ల గ్రామీణ పేద మహిళలు స్వయం సహాయక గ్రూపులు, అత్యున్నత స్థాయి ఫెడరేషన్‌లలో సభ్యత్వం పొందినట్లు ప్రపంచ బ్యాంక్ గ్రూపు నివేదిక పేర్కొంది. తద్వారా గ్రామీణ పేద మహిళలకు ఫైనాన్‌‌స, మార్కెట్ల అందుబాటు సాధ్యమైంది.
2013లో వరదలు, కొండచరియలు విరిగిపడి అధిక నష్టం సంభవించడం వల్ల గృహవసతి, గ్రామీణ కనక్టివిటీ పెంపు కోసం ‘ఉత్తరాఖండ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు’ ద్వారా ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయం అందించింది. మహిళలు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించడం, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందిన 2500 మంది మహిళలలో 10 శాతం వితంతువులు కాగా మరో పది శాతం మహిళలపై ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి.

2. నేషనల్ క్రైమ్ రికార్‌‌డ బ్యూరో-అక్టోబర్ 2019:
నేషనల్ క్రైమ్ రికార్‌‌డ బ్యూరో 2019 అక్టోబర్ 21న ‘క్రైమ్ ఇన్ ఇండియా 2017’ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో మహిళలపై నేరాలకు సంబంధించి 3,59,849 కేసులు నమోదయ్యాయి. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు అధికంగా ఉత్తరప్రదేశ్ (56,011), తర్వాత మహారాష్ర్ట, పశ్చిమ బెంగాల్‌లో నమోదయ్యాయి. అధిక కేసులు భర్త లేదా అతని బంధువుల క్రూరత్వం కింద నమోదయ్యాయి. 2016తో పోల్చినప్పుడు 2017లో మహిళలపై నేరాల కేసులలో పెరుగుదల 6 శాతం. ఈ నివేదిక ప్రకారం అల్లర్లకు సంబంధించి 58,880 కేసులు నమోదు కాగా వీటిలో బిహార్ (11,698) ప్రథమ స్థానంలో ఉంది. మహిళపై నేరాలు 2015లో 3.2 లక్షలు కాగా, 2016లో 3.38 లక్షలకు, 2017లో 3.59 లక్షలకు పెరిగాయి.
మహిళలపైనే నేరాలకు సంబంధించి రేప్ కేసులు 2009లో 21,397 నమోదు కాగా 2012లో 24,923కు, 2013లో 33,707కు పెరిగాయి. 2017లో రేప్‌కు సంబంధించి 32,559 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన కేసులు 2017లో అధికంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో నమోదయ్యాయి. గత రెండు సంవత్సరాలతో పోల్చినప్పుడు 2017లో ఢిల్లీలో రేప్ కేసులు కొంతమేర తగ్గాయి. రాష్ట్రాల వారీ గణాంకాలను పరిశీలించినప్పుడు సంబంధిత కేసులు అల్పంగా అరుణాచల్‌ప్రదేశ్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో నమోదయ్యాయి.
దక్షిణాది రాష్ట్రాలలో మహిళలపై నేరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలువగా తెలంగాణ రెండో స్థానం పొందింది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాలకు సంబంధించి 2015లో 15,967 కేసులు నమోదు కాగా ఈ మొత్తం 2016లో 16,362కు, 2017లో 17,909కి పెరిగాయి. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో 17,521 కేసులు, కర్ణాటకలో 14,078, కేరళలో 11,057, తమిళనాడులో 5,397 కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన నేరాలు దేశంలోనే అధికంగా తమిళనాడులో నమోదయ్యాయి.

3. వివిధ లింగ సంబంధిత సూచీలు:
పేదరికం, ఆరోగ్యం, విద్య, అక్షరాస్యత, రాజకీయ ప్రాతినిధ్యం పనిచేసే స్థలంలో సమానత్వం కొలమానాలుగా రూపొందించిన ‘ప్రపంచ లింగ సంబంధిత సమానత్వ సూచీ’ 2019లో మొత్తం 129 దేశాలకుగాను భారత్ 95వ స్థానం పొందింది. ఈ సూచీలో డెన్మార్‌‌క ప్రథమ స్థానం పొందగా, చైనా 74, పాకిస్తాన్ 113, నేపాల్ 102, బంగ్లాదేశ్ 110 స్థానాలను పొందగా చాద్ చిట్టచివరి 129వ స్థానం పొందింది. ఆరోగ్యం, ఆకలి, పౌష్టికాహారం, శక్తిలాంటి సూచికల విషయంలో భారత్ మెరుగైన స్కోరు సాధింపగా, జాతీయ పార్లమెంట్‌లో మొత్తం సభ్యులలో మహిళా సభ్యుల సంఖ్య, జాతీయ బడ్జెట్‌ను లింగ సంబంధిత, వయస్సు, ఆదాయం, ప్రాంతం పరంగా విభజించే అంశం, సుప్రీంకోర్టులో మహిళల శాతం లాంటి సూచికలలో భారత్ స్కోరు అల్పంగా నమోదైంది.
మానవాభివృద్ది నివేదిక 2019 ప్రకారం 2018లో లింగ సంబంధిత అభివృద్ధి సూచీ విలువ 0.829తో భారత్ గ్రూప్-5 దేశాల జాబితాలో ఉన్న స్థితిని బట్టి పురుషులు, మహిళల మధ్య వివిధ అంశాలలో అసమానతలు స్పష్టమవుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం 2018లో మానవాభివృద్ధి సూచీ విలువ పురుషులకు సంబంధించి 0.692 కాగా మహిళలకు సంబంధించి 0.574. ఆయుఃప్రమాణం మహిళలలో (70.7 సంవత్సరాలు), పురుషులలో (68.2 సంవత్సరాలు), Expected years of schooling బాలికలలో (12.9 సంవత్సరాలు), బాలురలలో (11.9 సంవత్సరాలు), Mean years of schooling బాలికలలో (4.7 సంవత్సరాలు), బాలురలో (8.2 సంవత్సరాలు). అంచనావేసిన తలసరి స్థూల జాతీయాదాయం మహిళలలో (2625 డాలర్లు), పురుషులలో (10,712 డాలర్లు).
మానవాభివృద్ధి నివేదిక 2019 ప్రకారం 2018లో ‘లింగ సంబంధిత అసమానతల సూచి’ విలువ భారత్‌కు సంబంధించి 0.501 కాగా మొత్తం 189 దేశాలలో ఈ సూచీ పరంగా భారత్ 122వ స్థానం పొందింది. ప్రసూతి మరణాలు ప్రతి లక్ష జననాలకు భారత్‌లో 174గా నమోదయ్యాయి. పార్లమెంట్‌లో మహిళా సభ్యుల సంఖ్య 11.7 శాతం కాగా 2010-2018 మధ్య కాలంలో కొంత వరకు సెకండరీ విద్యను అవలంభించిన మహిళలు 39 శాతం కాగా పురుషులు 63.5 శాతం, శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు మహిళలలో 23.6 శాతం కాగా పురుషులలో 78.6 శాతంగా నమోదైంది.

4. లింగ సంబంధిత తేడా తొలగించడానికి చర్యలు:
విద్య, ఉపాధి, రాజకీయ ప్రక్రియలలో మహిళల భాగస్వామ్యం పెంపుకు చర్యలు అవసరం. భారత్‌లో కేరళ, సిక్కిం మినహా మిగిలిన రాష్ట్రాలు లింగ సంబంధిత సమానత సాధనలో వెనుకబడ్డాయి. సెకండరీ, ఉన్నత విద్యా స్థాయిలో బాలికల డ్రాప్-అవుట్ రేటు తగ్గించడానికి రాష్ర్ట ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి.
పురుష శ్రామికుల వేతనాలలో పెరుగుదల అధికంగా ఉండటం, Flexible ఉపాధి అవకాశాలు తక్కువ, అవస్థాపనా సౌకర్యాల లభ్యత తక్కువగా ఉండటం లాంటి అంశాల కారణంగా ఉత్పాదకత ఆర్థిక కార్యకలాపాలలో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు మహిళల భాగస్వామ్యం పెంపుకు చర్యలు చేపట్టాలి.
భేటీ బచావో భేటీ పడావో, ప్రధానమంత్రి మంత్రిత్వ వందన యోజన, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ లాంటి ప్రోత్సాహకాలను అందించడంతోపాటు ఉపాధికి సంబంధించి పారదర్శకత, పదోన్నతి విధానాలను సక్రమంగా అమలుపరచడం ద్వారా లింగ సంబంధిత వివక్షను తొలగించాలి.
బాలికలలో విద్యను ప్రోత్సహించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కన్యశ్రీప్రకల్ప’ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘అమ్మఒడి’ లాంటి పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలుపరచాలి. వివిధ రంగాలలోని మహిళల నైపుణ్యత పెంపుకు శిక్షణా కార్యక్రమాలు అమలుపరచాలి.

మాదిరి ప్రశ్నలు:
Published date : 13 Dec 2019 04:32PM

Photo Stories