Inter Exams 2024: విద్యార్థులకు ఉచిత ప్రయాణం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఇప్పటికే ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. అదే విధంగా జనరల్, వొకేషనల్ గ్రూపులకు సంబంధించి థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు 99 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు. 40,082 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 35,494 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 75,576 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వివరించారు.
Also Read: Videos Lessons
సిబ్బంది నియామకం..
పరీక్షల నిర్వహణకు సంబంధించి 99 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 29 మంది కస్టోడియన్ అధికారులను నియమించామని కలెక్టర్ చెప్పారు. 18 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్ష పత్రాలను స్టోరేజ్ పాయింట్ల నుంచి పరీక్ష కేంద్రాలకు తరలింపు మొదలు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. బందోబస్తు ఏర్పాటు, భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిఘా విషయంలో పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు సంబంధించి అయిదేసి చొప్పున బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ఉచిత ప్రయాణం..
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని.. హాల్ టికెట్‌తో ఉచితంగా ప్రయాణించేలా చూడాలని కలెక్టర్ సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రాథమిక చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షల నిర్వహణ విషయంలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఢిల్లీరావు స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి (డీఐఈవో) సీఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి, డీఎస్‌ఈవో యూవీ సుబ్బారావు, డాక్టర్ ఆర్.బాలాజీ నాయక్, ఏపీఎస్‌ఆర్టీసీ ప్రతినిధి ఎంవై దానం, ఏఎస్‌పీవో ఎం.సత్యనారాయణ, ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ ఎం.మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.