Vocational Skill Centres in Schools: స్కూల్ కాంప్లెక్స్‌లు.. వృత్తి నైపుణ్య కేంద్రాలు
● నేడు, రేపు సమావేశాలు
● సమగ్ర శిక్షా ఉత్తర్వులు
అలాగే ఉపాధ్యాయులు కూడా ఉత్తమంగా ఎదగాలంటే నిరంతరం వారి అనుభవాలను ఇతరులతో పంచుకోవాలి. సందేహాలను ఇతరుల ద్వారా నివృత్తి చేసుకోవాలి. దీనికి స్కూల్ కాంప్లెక్స్‌లు (పాఠశాల సముదాయాలు) ఎంతో దోహదపడతాయని కొఠారి కమిషన్ గతంలోనే పేర్కొంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలను వివరించడం మాత్రమే కాకుండా విద్యార్థులు అభ్యసన ఫలితాలను సాధించే విధంగా బోధన సాగించాలని విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ–2009) కూడా సూచించింది. ఈ నేపథ్యంలోనే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు సమగ్ర శిక్షా రాష్ట్ర పదాధికారులు చర్యలు చేపట్టారు.
ఇదీ ఆవశ్యకత
పాఠశాల నిర్వహణలో ఎదురయ్యే విద్యా విషయక, ఇతర సమస్యలకు పరిష్కార వేదికగా స్కూల్ కాంప్లెక్స్‌లు ఉండాలి. ఉపాధ్యాయులు వారి బోధనా అనుభవాలు, వినూత్న బోధన పద్ధతులను పరస్పరం పంచుకునే వేదికగా ఉండాలి. వారి బోధనా పటిమను పెంచేవిగా ఉండాలి. నిరంతరం విద్యా విషయక సహకారం అందించాలి. ప్రాథమిక స్థాయిలో గుణాత్మక విద్యను పెంపొందించాలి. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడం, డ్రాపౌట్లు తగ్గించాలి. పాఠశాల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యం పెంపొందించాలి. స్కూల్ కాంప్లెక్స్‌ల నిర్వహణకు అనువైన, డిజిటల్ ఎక్విప్‌మెంట్, ఇంటర్నెట్ సదుపాయం ఉండే భవనం చూసుకోవాలి. రిఫరెన్స్ పుస్తకాలతో కూడిన లైబ్రరీ ఉండాలి. సమావేశాల్లో ఒక ఉపాధ్యాయుడు మాదిరి పాఠాన్ని బోధించాలి. అనంతరం దానిపై అర్థవంతమైన చర్చ జరగాలి. శాశ్వత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్‌ఎం) తయారు చేసుకోవాలి. తప్పనిసరైతే కొనుగోలు చేయాలి. స్కూల్ కాంప్లెక్స్‌లలో టీఎల్‌ఎం మేళాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాలి. అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలు కాంప్లెక్స్‌లో అందుబాటులో ఉంచుకోవాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలి. వీటిని సీఆర్‌పీలు తప్పనిసరిగా డాక్యుమెంటేషన్ చేయాలి.
చర్చలు అర్థవంతంగా జరగాలి
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు మొక్కుబడిగా కాకుండా, ఉపాధ్యాయులు బోధనాభ్యసన పద్ధతులను మెరుగుపరచుకునే విధంగా నిర్వహించాలి. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు వేదికగా నిలవాలి. ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూల్ ప్రకారం వీటిని నిర్వహించాలి. – జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ
జిల్లాల వారీగా స్కూల్ కాంప్లెక్స్‌ల వివరాలు
జిల్లా మండలాలు స్కూల్ కాంప్లెక్స్‌లు
కోనసీమ 22 127
కాకినాడ 21 64
తూర్పు గోదావరి 19 81
272 స్కూల్ కాంప్లెక్స్‌లలో..
స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్‌ను సమగ్ర శిక్షా అధికారులు విడుదల చేశారు. ప్రతి నెలా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు విధిగా నిర్వహించాలి. దీనిలో భాగంగా మంగళ, బుధవారాల్లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు, అలాగే 6, 7, 8 తరగతుల సబ్జెక్టు ఉపాధ్యాయులకు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ రెండు రోజులు సగం మంది చొప్పున ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాలకు హాజరయ్యేలా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 272 స్కూల్ కాంప్లెక్స్‌ల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో బోధానాభ్యసన పద్ధతులపై విషయ నిపుణత కలిగిన ఉపాధ్యాయులు సాధ్యమైనంత ఎక్కువ సమయం అర్థవంతమైన చర్చ సాగించాలని సమగ్ర శిక్షా అధికారులు సూచించారు. అందుకు తగిన వాతావరణాన్ని స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్లు, సెక్రటరీలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో గుర్తించిన మంచి అంశాలను ఇతర పాఠశాలలు కూడా అమలు చేసేలా చర్యలు చేపట్టాలి. స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్, ఎంఈఓలు, సెక్టోరియల్ అధికారులు, డీవైఈఓలు, డీఈఓలు కాంప్లెక్స్ సమావేశాలను సందర్శించి, పాఠశాలల్లో విద్యాభివృద్ధికి, బోధనాభ్యసన పద్ధతుల పెంపునకు సూచనలు, సలహాలు ఇవ్వాలి.