కాకతీయ యుగ విశేషాలు

పాలనా విధానం: కాకతీయుల ప్రభుత్వం సంప్రదాయ రాచరికం. సాధారణంగా రాజ్యం తండ్రి నుంచి కుమారుడికి వారసత్వంగా సంక్రమిస్తుంది. కుమార్తెకు కూడా ఆ హక్కు కల్పించడం కాకతీయ వంశంలోనే జరిగింది. సిద్ధాంత రీత్యా అధికారం అంతా రాజుదే. కానీ ఆచరణలో రాజ్యాధికారానికి కొన్ని పరిమితులు ఉండేవి. పాలనలో రాజుకు సహకరించేందుకు మంత్రి పరిషత్తు ఉండేది. వర్ణధర్మం, కులధర్మం, ఆచారం, సంప్రదాయం, శాస్త్ర నియమాలు రాజుకైనా అనుల్లంఘనీయాలు. నాటి శాసనాల్లో చాతుర్వర్ణ సముద్ధరణ అనే బిరుదు తరచుగా కనిపిస్తుంది. నిర్ణీత సమయంలో రాజు ప్రజలకు దర్శనం ఇవ్వాలని రుద్రదేవుడి నీతిసారం తెలుపుతోంది. కాకతీయులు ఆరోగ్యశాలలు, ప్రసూతి ఆసుపత్రులు, కళాశాలలు, మఠాలు, సత్రాలు, చలివేంద్రాలను నెలకొల్పారు.
కాకతీయుల మంత్రులలో అన్ని కులాలవారు ఉండేవారు. కాకతీయులు కులాన్ని బట్టికాక వ్యక్తుల అర్హతలను బట్టి మంత్రి పదవులు ఇచ్చారు. గణపతిదేవ చక్రవర్తికి రేచర్ల రుద్రారెడ్డి, మల్యాల హేమాద్రిరెడ్డి ప్రధానులు. ప్రతాపరుద్రుడికి ముప్పిడి నాయకుడు మహా ప్రధాని. ప్రతాపరుద్రుడి కాలంలో నాయంకర విధానం అమలైంది. ఇది ఒక రకమైన జాగిర్దారీ విధానం. రాజ్యాన్ని అనేక మండలాలుగా విభజించి వాటికి పరిపాలనాధికారులుగా సైన్యాధ్యక్షులను నియమించేవారు. ఈ పాలకులనే నాయంకరులు అనేవారు. నాయంకరులు దుర్గాధ్యక్షులు. వారి మండలంలో వచ్చే ఆదాయంతో నిర్ణీత సైన్యాన్ని పోషించి, యుద్ధ సమయంలో చక్రవర్తికి తోడ్పడేవారు. ప్రతాపరుద్రుడు తన రాజ్యంలో నాలుగో వంతు భూమిని నాయంకరుల ఆధీనంలో ఉంచాడు. ప్రతాపరుద్రుడి కాలంలో 75 మంది నాయంకరులున్నారు. కాకతీయరాజ్య పతనం తర్వాత విజయనగర రాజులు నాయంకర విధానాన్ని అనుసరించారు. ఆంగ్లేయులు పాలన చేపట్టే వరకూ ఈ విధానం కొనసాగింది. కాకతీయులకు పూర్వీకులైన చోళులు, చాళుక్యులు కేంద్రీకృత పాలనా విధానాన్ని అనుసరించారు. అందుకు భిన్నంగా కాకతీయులు వికేంద్రీకృత పాలనా వ్యవస్థను అమలు పరిచారు. అందుకే మాండలికులు, నాయంకరులకు సైనిక విషయాలు మినహా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. వారిపై అధికారాన్ని రుద్దలేదు. అణచి ఉంచే పద్ధతిని విడిచిపెట్టారు. వీరు తమను మహామండలేశ్వరులుగానే భావించారు తప్ప, రాజాధిరాజుగా, చక్రవర్తిగా భావించలేదు. ఒక రకంగా ఇది ప్రజాస్వామిక భావన.
నాయంకరుల్లో తెలంగాణకు సంబంధించిన కొందరి వివరాలు: యాదవ విశ్వనాథుడు గణపతిదేవుడి కాలంలో యుద్ధాల్లో పాల్గొన్నాడు. నల్లగొండ జిల్లాలో ఒక ప్రాంతాన్ని పరిపాలించాడు. అక్షయ చంద్రదేవుడు కరీంనగర్ ప్రాంతాన్ని పాలించాడు. సారంగ పాణి దేవుడనే యాదవరాజు పానగల్లును పాలించాడు. సింద కుటుంబానికి చెందిన భైరవుడు రుద్రమ కాలంలో బీదర్ ప్రాంతాన్ని పాలించాడు.
పరిపాలనా సౌలభ్యం కోసం కాకతీయ సామ్రాజ్యాన్ని స్థలం, సీమ, వాడి, నాడు, పాడి, భూమి అనే ప్రాంతీయ విభాగాలుగా విభజించారు. 10 నుంచి 60 గ్రామాల సముదాయాన్ని స్థలంగా వ్యవహరించేవారు. కొన్ని స్థలాల సముదాయమే నాడు. ఉదాహరణ: అనుమకొండనాడు, కందూరునాడు, సబ్బినాడు, అయిజనాడు.

ఆయగార్లు
గ్రామపాలనను ఆయగార్లు నిర్వహించేవారు. గ్రామసేవ, రాజ్యసేవ చేసినందుకు పన్ను లేకుండా వీరు భూమిని పొందేవారు. ఆయం అంటే పొలం వైశాల్యం. సాధారణంగా ఆయగార్ల సంఖ్య పన్నెండు. వారు
1. కరణం, 2. రెడ్డి, 3. తలారి, 4. పురోహితుడు, 5. కమ్మరి, 6. కంసాలి, 7. వడ్రంగి, 8. కుమ్మరి, 9. చాకలి, 10. మంగలి, 11. వెట్టి, 12. చర్మకారుడు. వీరిలో మొదటి ముగ్గురు ప్రభుత్వ సేవకులు. మిగతా వారు గ్రామ సేవకులు. గ్రామ విస్తీర్ణం, ఆయకట్టు, పోరంబోకు భూమి, తోటభూమి, గడ్డిభూముల విస్తీర్ణం, వ్యక్తుల ఆస్తుల లెక్కలు, దేవాలయ ఆస్తుల లెక్కలు మొదలైన దస్తరం నిర్వహణ కరణం బాధ్యత. కరణం ఇచ్చే లెక్కల ఆధారంగా రాజ్యభాగం(పన్ను)ను వసూలు చేసి ప్రభుత్వానికి అందజేసే బాధ్యత రెడ్డి లేదా పెద కాపుది. గ్రామ రక్షణ బాధ్యత తలారిది. దొంగతనాలు జరిగినప్పుడు నేరస్థులను పట్టుకోవడం, అపహరించిన సొత్తుని తెచ్చి ఇవ్వడం అతడి విధి. అష్టాదశవర్ణాల వారికి సంఘాలుండేవి. వీటిని సమయాలనేవారు.

పన్నులు
కాకతీయుల కాలంలో స్థూలంగా అయిదు రకాల పన్నులుండేవి.
అవి: 1. భూమి పన్ను, 2. పారిశ్రామిక, ఆస్తి పన్నులు, 3. వృత్తి పన్నులు, 4. వ్యాపార పన్నులు, 5. ఇతర పన్నులు.

ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు. వర్తకం, పరిశ్రమలు, వృత్తులపై విధించే పన్నులు రెండో ఆదాయ మార్గం. పశుగ్రాసానికి పనికి వచ్చే పచ్చికబయళ్లపై వసూలు చేసే పన్ను, అడవుల కలపపై వేసే పన్ను మూడో ఆదాయ మార్గంగా ఉండేది. వర్తక సరకులు, ఎగుమతి దిగుమతులు, తయారైన వస్తువుల మీద వేసే పన్నును ‘సుంకం’గా పేర్కొనేవారు. సాధారణంగా సుంకాలు వసూలు చేసే అధికారం వర్తక శ్రేణులకు ఇచ్చేవారు.

న్యాయ పాలన
సామాన్యమైన వివాదాలన్నింటినీ గ్రామ సభల్లో గ్రామ ప్రభువులు పరిష్కరించేవారు. గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా ‘తలారి’ అనే గ్రామోద్యోగి చూసేవాడు. రాజే అంతిమ న్యాయ నిర్ణేత. యాజ్ఞవల్క్య స్మృతి లాంటి ప్రాచీన స్మృతి గ్రంథాల్లో పేర్కొన్న సూత్రాలను అనుసరించి ధర్మాసనాలు ఏర్పరిచేవారు. ఒకరిద్దరు రాజాధికారులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సభల్లో న్యాయ సమస్యలు పరిష్కారమయ్యేవి. వీరిని ‘మహాజనులు’గా పేర్కొనేవారు. సమస్య పరిష్కారమైన వెంటనే సభ రద్దయ్యేది. ప్రస్తుతం గ్రామ పెద్దల మాదిరిగా ఈ మహాజనులు పనిచేసేవారు. తెగల్లో వివాదాలను ‘సమయాలే’ పరిష్కరించేవి.

సైనిక వ్యవస్థ
కాకతీయ సైన్యంలో చక్రవర్తి సైన్యం, నాయంకర సైన్యం అని రెండు విభాగాలు ఉండేవి. కాకతీయ చక్రవర్తులు సైన్యానికి స్వయంగా నాయకత్వం వహించేవారు. వీరి రాజ్యంలో స్థల, జల, వన, గిరి అనే నాలుగు రకాల కోటలు ఉన్నట్లు తెలుస్తోంది. కాకతీయుల కాలంలో ఓరుగల్లు, రాయచూరు, గోల్కొండ, భువనగిరి, రాచకొండ, దేవరకొండ, నల్లగొండ, పానుగల్లు కోటలు శత్రు దుర్భేద్యమైనవిగా పేరు పొందాయి.

ఆర్థిక పరిస్థితులు
కాకతీయుల కాలంలో ఆంధ్రదేశం సిరి సంపదలతో విలసిల్లినట్లు అమీర్ ఖుస్రూ, అబ్దుల్లా వాసఫ్, మార్కోపోలో లాంటి విదేశీ యాత్రికుల రచనల ద్వారా తెలుస్తోంది.

వ్యవసాయం: తెలంగాణా ప్రాంతంలో సాగుభూమిని, నీటి వనరులను పెంచడానికి కాకతీయులు ఎనలేని కృషి చేశారు. వీరు చెరువులు నిర్మించి నీటి పారుదలపై శ్రద్ధ వహించారు. రెండో బేతరాజు సెట్టి సముద్రం, కెరె సముద్రం, కేసరి సముద్రం చెరువులను నిర్మించాడు. గణపతిదేవుడు రాజ్యం నలుమూలలా అనేక చెరువులు నిర్మించాడు. గణపతిదేవుడి సేనాని రేచర్లరుద్రుడు 17,258 ఎకరాలకు సాగు నీరు అందించేవిధంగా పాకాల చెరువును నిర్మించాడు. దీని విస్తీర్ణం 12 చ.కి.మీ. రామప్ప చెరువును నిర్మించింది కూడా ఇతడే. రేచర్ల రెడ్లు 35 నీటి వనరులను ఏర్పాటు చేశారు. కాటచమూపతి కాట సముద్రం; చౌడ చమూపతి చౌడ సముద్రం; నామిరెడ్డి సబ్బి సముద్రం, గౌర సముద్రం, కోమటి చెరువు; ఎరకసాని ఎరక సముద్రం నిర్మించారు. వీటితో పాటు చింతల సముద్రం, నామా సముద్రం కూడా ఉండేవి. చెరువుల నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులకు దినసరి వేతనాలు చెల్లించేవారు. చెరువులతో పాటు ఊట కాలువలను కూడా నిర్మించారు. మూసీ నది నుంచి సాగే మూసెటి కాలువ; ఆలేరు నది నుంచి ఆలేటి కాలువ; కూచినేని కాలువ, రావిపాటు కాలువ, బొమ్మకంటి కాలువ, ఉటుంకాలువ, చింతల కాలువల గురించి పిల్లలమర్రి శాసనాల్లో పేర్కొన్నారు. ఏతం, మోటలతో కూడా వ్యవసాయం చేసేవారు. కొత్తగా పొలాలను సాగు చేయడానికి కాకతీయ రాజులు కృషి చేశారు. ప్రతాపరుద్రుడి కాలంలో అడవులను నరికేసి విశాల భూభాగాలను సాగులోకి తీసుకువచ్చారు. నేటి రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లోని అనేక గ్రామాలు ప్రతాపరుద్రుడి కాలంలో రూపొందినవేనని ఆ గ్రామ కైఫీయతుల ద్వారా తెలుస్తోంది. తెలంగాణలోని మంథెన, కాళేశ్వరం, చెన్నూరు, నర్సంపేట, అచ్చంపేట, ఖమ్మం మెట్టు, కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎక్కువ భాగం కాకతీయుల కాలంలోనే ఏర్పడినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. గ్రామం, చెరువును నిర్మించడం నాడు పుణ్యకార్యంగా భావించేవారు. గ్రామాలను ఏర్పరచడానికి అన్ని వృత్తుల వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. చాలా మంది కాకతీయ రాజులు, రాణులు అటవీ, బీడు భూములను వ్యవసాయ యోగ్యంగా చేశారు. వీరి పేరు మీద అనేక గ్రామాలు ఏర్పడ్డాయి. గణపవరం, ఘన్‌పూర్, మహాదేవపురం, రుద్రవరం, బయ్యారం, ముప్పవరం, కుందవరం మెదలైనవన్నీ వీటికి ఉదాహరణ. భూమిపై ప్రాథమిక స్వామ్యం రాజుది, ద్వితీయ స్వామ్యం వ్యక్తిది.
రైతులు వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, మొక్కజొన్నలు, నీలిమందు, ఆముదాలు, నువ్వులు, పెసలు, కందులు, చెరకు, నూనెగింజలు, ఆవాలు, సజ్జలు, మినుములు, ఉలవలు, పత్తి, అల్లం, పసుపు, ఉల్లి తదితర పంటలు పండించేవారు. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం తయారైనట్లు సాహిత్యం ద్వారా తెలుస్తోంది. ఆ కాలంలో కొబ్బరి, చెరకు, మామిడి, జామ, అరటి తోటలు విస్తారంగా ఉండేవి. సాధారణంగా ప్రతి గ్రామంలో బెల్లం, నూనె గానుగలు ఉండేవి. పశు సంపద పుష్కలంగా ఉండేది.

పరిశ్రమలు: నాడు వ్యవసాయంతో పాటు అనేక పరిశ్రమలు కూడా ఉండేవి. పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్ర’లో ఇరవైకి పైగా వస్త్రాల గురించి పేర్కొన్నాడు. ఓరుగల్లులో రత్నకంబళ్లు, ముఖమల్ వస్త్రాలు నేసేవారు. ఏకామ్రనాథుడు ఓరుగల్లులో చిత్తరువులు రాసే ఇళ్ల్లు 1500 వరకు ఉండేవని పేర్కొన్నాడు. నాడు చిత్రకళకు మంచి ఆదరణ ఉండేది. పాల్కురికి ‘బసవపురాణం’లో యాభై రకాల దుస్తుల పేర్లను ప్రస్తావించాడు. కాకతీయుల రాజ్యంలో శ్రేష్టమైన సన్నని వస్త్రాలు నేసేవారని, అవి సాలెపురుగు జాలె మాదిరిగా ఉండేవని మార్కోపోలో ప్రశంసించాడు. వీటి ఆధారంగా ఆ కాలంలో పద్మశాలీలకు మంచి నైపుణ్యం ఉండేదని తెలుస్తోంది. పల్లకీల మీద చెక్కిన నగిషీల వర్ణనను పరిశీలిస్తే నాటి వడ్రంగుల పని నైపుణ్యం అర్థమవుతుంది. పంచలోహాలతో వివిధ రకాల వస్తువులను తయారు చేసేవారు. నిర్మల్‌లో తయారైన కత్తులకు డమాస్కస్‌లోనూ మంచి ఆదరణ ఉండేది. గోల్కొండ ప్రాంతంలో వజ్రాల గనులున్నట్లు మార్కోపోలో రాశారు. వ్యవసాయానికి అవసరమైన పరికరాలను గ్రామాల్లోనే తయారు చేసేవారు. పానగల్లు, చండూరులో దేవాలయాల్లో ఉపయోగించే కంచు గంటలు, పళ్లాలు, పాత్రలను రూపొందించేవారు.

వర్తక - వాణిజ్యం: శాతవాహనుల తర్వాత క్రమంగా క్షీణించిన దేశీయ, విదేశీ వాణిజ్యాన్ని కాకతీయులు పునరుద్ధరించారు. కాకతీయుల కాలంలో దేశీయ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం ఓరుగల్లు. ఆ తర్వాత తెలంగాణలో మంథెన, అలంపురం, జడ్చర్ల, మగతల, పేరూరు ప్రధాన వాణిజ్యకేంద్రాలుగా ఉండేవి. పలనాటి సీమ నుంచి వాడపల్లి, నకిరెకల్, పిల్లలమర్రి మీదుగా వ్యాపారులు వరంగల్ వచ్చేవారు. బళ్లారి-చిత్తూరు, రాయచూరు-కొలనుపాక, బీదరు-కొలనుపాక, కల్యాణి-కొలనుపాక-అనుమకొండ, బీదరు-పటాన్‌చెరువు-వరంగల్ మొదలైనవి ముఖ్యమైన వాణిజ్య మార్గాలుగా ఉండేవి.
కాకతీయుల పాలనలో తెలంగాణలో వర్తక శ్రేణుల నిర్మాణంలో గుర్తించదగిన మార్పు వచ్చింది. ఆ కాలంలో వ్యాపారం బలిజలకు, వైశ్యులకే పరిమితం కాలేదు. రెడ్లు, నాయుళ్లు, బోయలు, దాసర్లు, తెలికలు, పద్మశాలీలు, వ్యవసాయదారుల లాంటి ఉత్పత్తిదారులు, కమ్మరి, కంసాలి, మేదరి లాంటి వృత్తి కులాల వారు వ్యాపారంలోకి వచ్చారు. వివిధ వృత్తికారులు, ఉత్పత్తిదారులు సొంత సమయాలను ఏర్పరచుకొని తమ కులవృత్తులతో పాటు వ్యాపారాలను నిర్వహించుకునేవారు. వీరిలో కొంత మంది కేవలం తమ ఉత్పత్తులనే అమ్ముకునేవారు. అందువల్ల ఇంతమంది వ్యాపారంలోకి వచ్చినప్పటికీ ప్రధానంగా వ్యాపారం వైశ్యుల చేతిలోనే ఉండేది. గోధుమ, పెసలు, వడ్లు, జొన్నలు, ఉప్పు, నూనె, నెయ్యి, మిరియాలు, ఆవాలు, తేనె, తగరం, రాగి, కర్పూరం, కస్తూరి, పట్టు, రత్నాలు, ముత్యాలు, పూసలు, పసుపు, ఉల్లిగడ్డలు, అల్లం, నూలు, దుంపలు మొదలైన ఉత్పత్తుల వ్యాపారం జరిగేది.

విదేశీ వాణిజ్యం: కాకతీయుల కాలంలో ‘మోటుపల్లి’ విదేశీ వాణిజ్యానికి ప్రసిద్ధమైన రేవు పట్టణంగా గుర్తింపు పొందింది. చాళుక్య, చోళ రాజుల కారణంగా దెబ్బతిన్న విదేశీ వ్యాపారాన్ని గణపతిదేవుడు ఈ రేవు పట్టణం ద్వారా పునరుద్ధరించాడు. దీని ద్వారా ఇండోనేషియా, జావా, సుమత్రా, జపాన్, మలయా, బర్మాతో వ్యాపారం చేసేవారు. మార్కోపోలో ఈ రేవు పట్టణాన్ని సందర్శించాడు. ఇక్కడి నుంచి ఎగుమతయ్యే వస్తువుల్లో వజ్రాలు, పట్టుతో తయారయ్యే సన్నని వస్త్రాలు ముఖ్యమైనవని అతడు పేర్కొన్నాడు. కాకతీయుల నాణేలు ఎక్కువగా లభించలేదు. కానీ శాసనాలు, సాహిత్యంలో నాణేల ప్రస్తావన ఉండేది.

సాంఘిక పరిస్థితులు
కాకతీయుల కాలంనాటి సంఘంలో ప్రధానంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలు ఉండేవి. ప్రతి కులంలో అనేక ఉపకులాలు ఏర్పడ్డాయి. ఏకామ్రనాథుడు ‘ప్రతాపచరిత్ర’లో, వినుకొండ వల్లభరాయుడు ‘క్రీడాభిరామం’లో కాకతీయుల కాలంనాటి వివిధ వృత్తుల గురించి ప్రస్తావించారు. కోమట్లు, ఈదురవారు, గొల్లవారు, అక్కలవారు (ఆగసాల), సాలెవారు, మంగలులు, కుమ్మరివారు, బోయవారు, రుంజులు, పిచ్చుకుంట్లు, పంబల, బవని, మేదర, గాండ్ల మొదలైన కులాల పేర్లను శాసనాల్లోనూ పేర్కొన్నారు.

హిందూ మతాన్ని సంస్కరించే ఉద్దేశంతో శైవ, వైష్ణవ మతాలు ఆవిర్భవించాయి. కుల నిర్మూలన కోసం పుట్టిన వీటి ద్వారా సంఘంలో కొత్త కులాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా శైవుల్లో లింగాయతులు, బలిజలు, జంగాలు, తంబళ్లు మొదలైన కులాలు ఏర్పడ్డాయి. వైష్ణవుల్లో నంబులు, సాతానులు, దాసర్లు మొదలైన కులాలు ఆవిర్భవించాయి. ‘అష్టాదశ కులాలు’ అప్పటికే ప్రాచుర్యంలో ఉన్నాయి.

కాకతీయుల కాలంలో బాల్యవివాహాలు జరిగాయి. అనులోమ, ప్రతిలోమ వివాహ పద్ధతులు ఉండేవి. రుద్రమదేవి కుమార్తె రుయ్యమను బ్రాహ్మణ మంత్రి ఇందులూరి అన్నయ్య దేవుడు పెళ్లి చేసుకోవడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అయినప్పటికీ కుల నిర్మూలన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాకతీయుల కాలంలో వెలమలు సంఘ సంస్కర్తలుగా, రెడ్లు పూర్వాచార పరాయణులుగా ఉన్నట్లు తెలుస్తోంది. నాడు రాజకీయంగా ప్రాబల్యం వహించిన రెడ్లు, వెలమల మధ్య అధికారం కోసం పోటీ ప్రారంభమైంది. ఈ కాలంలో అష్టాదశ వర్ణాల్లో అగ్రవర్ణమైన బ్రాహ్మణ వర్గానికి చెందినవారు రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోయారు. రాజకీయాధికారం చతుర్థ వర్ణ పరమైంది. క్షత్రియ వంశాలు నామామాత్రంగా అధికారంలో ఉండేవి.

కాకతీయుల కాలంనాటి సాంఘిక జీవితానికి సంబంధించిన ఒక ప్రధాన లక్షణం కుల సంఘాలు. వీటిని ‘సమయములు’ అనేవారు. నగరాలు, గ్రామాలు పేటలుగా విభజించి ఉండేవి. అక్కలవాడ, భోగంవీధి, వెలిపాళె, మేదరవాడ, మోహరినాడు మొదలైనవి ఇలాంటివే. పూటకూళ్ల ఇళ్లు ఉండేవి. బసవ పురాణం ఆధారంగా ఆనాటికే వెట్టి వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలు పాత్ర, గొండ్లి, పేరణి, కోలాటం, గొబ్బిళ్లు, గుర్రం, భంజళి మొదలైన క్రీడలతో వినోదం పొందేవారు.

వాస్తు, శిల్ప కళ
కాకతీయ రాజులు, వారి సామంతులు అనేక జైన, శైవ, వైష్ణవాలయాలను నిర్మించారు. దేవాలయ నిర్మాణంలో కాకతీయులు పశ్చిమ చాళుక్యుల వాస్తు విధానాన్ని అనుసరించారు. వీరు త్రికూటాలయాలను ఇదే పద్ధతిలో నిర్మించారు. బేతిరెడ్డి భార్య ఎరకేశ్వరాలయం నిర్మించారు. నామిరెడ్డి పిల్లలమర్రిలో కాటేశ్వర, కాచేశ్వర, నామేశ్వర ఆలయాలను నిర్మించాడు. పాలంపేట, పిల్లలమర్రి, పానగల్లు, హన్మకొండలో ఉన్న ఆలయాలను త్రికూట పద్ధతిలోనే నిర్మించారు.

నంది విగ్రహాలు కాకతీయ శిల్ప ప్రాభవానికి నిదర్శనాలు. కాకతీయ శిల్పం చాళుక్యుల శిల్పం కంటే నిగ్గు తేలి ఉంది. ఇది కొంత ప్రాంతీయ లక్షణాలను సంతరించుకొని ఉంటుంది. దేశీయ నృత్య రీతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాట్యగత్తెల కోలాట దృశ్యాలు కూడా కాకతీయుల కళా నైపుణ్యానికి తార్కాణంగా ఉన్నాయి.

భాషాసాహిత్యాలు
కాకతీయులు తెలుగుభాషను ఆదరించడం మొదటి ప్రోలరాజు తర్వాతే మొదలైంది. అప్పటి వరకు ఉన్న శాసనాలు కన్నడం, సంస్కృత భాషల్లో ఉన్నాయి. రెండో బేతరాజు తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించాడు. కానీ నన్నయకు ముందే వృత్త పద్యాలు వాడిన తొలి తెలుగు శాసనం ఇటీవలే బయల్పడింది. అది విరియాల కామసాని వేయించిన గూడూరి శాసనం(క్రీ.శ 1000). ఈ యుగంలో కనిపించే ప్రసిద్ధ శాసన కవులు అచింతేంద్రయతి, వెల్లంకి గంగాధర మంత్రి, నాగదేవకవి, బ్రహ్మశివకవి, మల్లపురాజు, కవిచక్రవర్తి, అభినవ మయూర సూరి, రెండో ఈశ్వర భట్టోపాధ్యాయుడు. కాకతీయుల కాలం తెలంగాణ సాహిత్యంలో స్వర్ణయుగం. కాకతీయులతో సంబంధం లేకపోయినా ఈ యుగంలో కనిపించే తొలి ప్రముఖ కవి వేములవాడ భీమకవి.

ఆదికవి పాల్కురికి
తెలుగులో తొలిసారి స్వతంత్ర రచన చేసిన పాల్కురికి సోమనాథుడు(1160-1240) తెలుగు సాహిత్యంలోనే ఆదికవి. పాల్కురికి కంటే ముందే రుద్రదేవుడు నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ కాలంలోనే భువనగిరి ప్రాంతానికి చెందిన నరహరి (సరస్వతీ తీర్థముని) మమ్మటుని కావ్యప్రకాశానికి బాల చిత్తానురంజనమనే వ్యాఖ్యానాన్ని, స్మృతి దర్పణం, తర్క రత్నాకరం అనే గ్రంథాలను రచించాడు.
జాయపసేనాని పాల్కురికి తర్వాతి కాలానికి చెందిన కవి. ఇతడు గణపతిదేవుడి బావమరిది. ఇతడు నృత్త రత్నావళి గ్రంథంలో భరతుడి మార్గ నృత్తంతో పాటు ఆనాటి దేశీ నృత్తం గురించి వివరించాడు. చిందు, పేరణి, ప్రేంఖణ, వికటం, కందుక, బహురూప కోల్లాట, ఖాండిక మొదలైన దేశీ నృత్తరీతుల వివరణలు నాటి తెలంగాణ నృత్య, నాట్యరీతుల్ని తెలుపుతున్నాయి. చక్రపాణి రంగనాథుడు పాల్కురికి శిష్యుడు. ఇతడు శివభక్తి దీపిక, గిరిజాధినాయక శతకం లాంటి రచనల్లో పాల్కురికి మార్గాన్ని అనుసరించాడు. విశ్వేశ్వర దేశికుడు (శివదేవుడు) గణపతిదేవుడి దీక్షాగురువు. రుద్రమదేవి పాలనను, ప్రతాపరుద్రుడి యువరాజత్వాన్ని ప్రశంసించిన ఈ విద్వత్కవి శివతత్త్వ రసాయనం అనే గ్రంథాన్ని రచించాడు.

పాల్కురికి తర్వాత పేర్కొనదగిన గొప్పకవి కృష్ణమాచార్యులు(1268-1323). తెలుగులో తొలి వచనాలైన ‘సింహగిరి వచనాలు’ రచించాడు. కృష్ణమాచార్యులు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవాడు. ఇతణ్ని తెలంగాణలో తొలి వైష్ణవ కవిగా భావించవచ్చు. కొలని రుద్రదేవుడు(రుద్రుడు) ఓరుగల్లు నివాసి. ఇతడు ‘రాజరుద్రీయం’ను రచించాడు. ప్రతాపరుద్రుడి వద్ద మంత్రిగా పనిచేశాడు.

కవిపోషకుడు.. ప్రతాపరుద్రుడు
విద్యానాథుడు, విశ్వనాథుడు, శాకల్యమల్లన, శరభాంకుడు, శివదేవయ్య లాంటి పేరొందిన కవి పండితులు ప్రతాపరుద్రుడి ఆశ్రయం పొందారు. గుండయభట్టు అనే విద్వాంసుడు, సకల శాస్త్రవేత్త వీరభల్లట దేశికుడు, నరసింహుడు, మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన గంగాధరకవి, జినేంద్ర కల్యాణాభ్యుదయాన్ని రచించిన అప్పయార్య తదితరులు కూడా ప్రతాపరుద్రుడి ఆస్థానంలోని వారే. సంస్కృత, కన్నడ భాషల్లో అనేక గ్రంథాలు రచించిన రుద్రభట్టు, కేయూరబాహుచరిత్ర రచయిత మంచన కూడా ప్రతాపరుద్రుడి ఆదరణ పొందారు. ప్రతాపరుద్రుడు పండిత పోషకుడే కాకుండా స్వయంగా కవి. సంస్కృతంలో యయాతి చరిత్ర, ఉషారాగోదయం అనే నాటకాల్ని రచించాడు. విద్యానాథుడు ప్రతాపరుద్రుడి శాస్త్ర, సంగీత ప్రావీణ్యాన్ని ప్రశంసించాడు.
తొలి పురాణ అనువాదకర్త, మహాకవి మారన ఈ యుగం వాడే. ఆయన మార్కండేయ పురాణాన్ని అనువదించి ప్రతాపరుద్రుడి సేనాని గన్నయ నాయకుడికి అంకితమిచ్చాడు. స్వతంత్రంగా తెలుగులో రచించిన మొదటి మహాపురాణం మార్కండేయ పురాణం. మారన పురాణానికి కావ్యత్వాన్ని కల్పించి తర్వాతి కావ్య ప్రబంధ కవులకు మార్గదర్శకుడయ్యాడు. ఇతడి మరో రచన హరిశ్చంద్రోపాఖ్యానం.
సంస్కృతంలో అలంకార గ్రంథాలు రచించి ప్రసిద్ధి చెందిన మొదటి తెలుగు వ్యక్తి విద్యానాథుడు. ఇతడు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. ఇతడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని నాట్యశాస్త్రం, ధ్వన్యాలోకం లాంటి కావ్య శాస్త్రగ్రంథాల వరుసలో పేర్కొనవచ్చు. ప్రతాపరుద్ర యశోభూషణాన్నే రామరాజభూషణుడు నరస భూపాలీయంగా అనువదించాడు. విద్యానాథుడు ఈ గ్రంథంలో కావ్య, నాటక లక్షణాలను తెలపడంతో పాటు తాను చెప్పిన లక్షణాలకు ఉదాహరణగా ప్రతాపరుద్ర కల్యాణం అనే నాటకం రచించాడు. ఓరుగల్లుకు చెందిన మరో కవి అగస్త్యుడు (1289-1325). ఇతడు బాలభారతం, నలకీర్తి కౌముది, శ్రీకృష్ణచరిత, అగస్త్య నిఘంటువు మొదలైన సంస్కృత రచనలు చేశాడు. ప్రతాపరుద్రుడి మంత్రి శరభాంకుడు మంచి కవి. ఇతడు శరభాంక లింగ శతకాన్ని రచించాడు. ఓరుగల్లు కోట తోరణ ద్వారం మీద లిఖించిన శ్లోకాన్ని బట్టి బుక్చాయ కాకతీయ చరిత్ర, మలయవతి అనే గ్రంథాలను నరసింహుడు అనే కవి రచించాడని తెలుస్తోంది. ప్రఖ్యాత వ్యాఖ్యాత మల్లినాథ సూరి తండ్రి కపర్థి మెదక్ జిల్లా కొలిచెలిమ నివాసి. ఈయన గొప్ప భాష్యకారుడు. ‘ఆపస్తంబ శ్రోతసూత్ర భాష్యం’ లాంటి రచనలు చేశాడు. మరో కవి విశ్వనాథుడు సౌగంధికాపహరణమ్ అనే సంస్కృత వ్యాయోగం(నాటక ప్రక్రియ) రచించాడు.

గోన బుద్ధారెడ్డి
కాకతీయుల కాలంలో పేరొందిన మరో కవి గోన బుద్ధారెడ్డి. వర్ధమానపురం పాలకుడైన గోన గన్నయ్యరెడ్డి సోదరుడైన విఠలుని కుమారుడే బుద్ధారెడ్డి. ఇతడు రచించిన రామాయణం రంగనాథ రామాయణంగా ప్రసిద్ధికెక్కింది. పాల్కురికి రచనలు శైవ మత ప్రచారానికి దోహదం చేస్తే రంగనాథ రామాయణం వైష్ణవ మతాన్ని జనంలోకి తీసుకెళ్లింది. గోన బుద్ధారెడ్డి కుమారులైన కాచభూపతి, విట్టల రాజులు తండ్రి కోరిక మేరకు ఉత్తర రామాయణాన్ని రచించారు. వీరు తెలుగులో తొలి జంట కవులు. ఉత్తర రామాయణంలో తిక్కన పూర్తి చేయలేకపోయిన భాగాలను ఇందులో చేర్చారు. తిక్కన సంక్షిప్తంగా రాసిన కొన్ని భాగాలను విపులీకరించారు. గోన బుద్ధారెడ్డి కుమార్తె కుప్పాంబిక తెలుగు సాహిత్యంలో తొలి కవయిత్రి. ఓరుగల్లుకు చెందిన గణపనారాధ్యుడు సర్వశాస్త్రాన్ని ద్విపదగా రాశాడు. గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడి వద్ద మంత్రిగా పని చేసిన శివదేవయ్య మంచి కవి. ఇతడు శివదేవధీమణిశతకం, పురుషార్థసారం రచించాడు.

ఓరుగల్లు వర్ణన
తెలుగులో చంపువుగా వచ్చిన మొదటి రామాయణం భాస్కర రామాయణం. ప్రతాపరుద్రుడి ఆస్థానానికి చెందిన హుళక్కి భాస్కరుడు, అతడి కుమారుడైన మల్లికార్జున భట్టు, శిష్యుడైన రుద్రదేవుడు భాస్కర రామయణాన్ని రచించారు. అయ్యాలార్యుడు దీన్ని పూర్తి చేశాడు. రావిపాటి త్రిపురాంతకుడు ప్రేమాభిరామంలో కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణించాడు. ఈయన సంస్కృతంలో రాసిన ప్రేమాభిరామాన్ని అనుసరించే క్రీడాభిరామం (వినుకొండ వల్లభరాయలు) వచ్చింది. త్రిపురాంతకోదాహరణం, మదనవిజయం, చంద్రతారావళి, అంబికా శతకం మొదలైనవి త్రిపురాంతకుడి ఇతర రచనలు. పాల్కురికి రచనల తర్వాత తెలంగాణ (ఓరుగల్లు పట్టణ) జీవితాన్ని విస్తృతంగా వర్ణించిన గ్రంథమిదే. అప్పయాచార్యుడు అనే జైనకవి 1310లో జినేంద్రకల్యాణాభ్యుదయం అనే సంస్కృత కావ్యాన్ని రచించాడు. ఇతడు ప్రతాపరుద్రుడి కాలంలో ఓరుగల్లులో నివసించాడు. దీన్ని బట్టి కాకతీయులు శైవులైనా పరమత సహనం పాటించారని, జైన సాహిత్యం కూడా మనుగడలో ఉందని అర్థమవుతోంది. విజయనగర సామ్రాజ్య స్థాపనకు ప్రేరకుడైన మహామంత్రి విద్యారణ్యస్వామి ధర్మపురిలో పుట్టి పెరిగి, కంచిలో విద్యాభ్యాసం చేశాడు. సంగీతసారమనే సంగీతశాస్త్ర గ్రంథాన్ని రచించాడు.

కాకతీయుల కాలం నాటి కవులు

రచనలు

రుద్రదేవుడు నీతిసారం
పాల్కురికి సోమనాథుడు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర
జాయపసేనాని నృత్త రత్నావళి
కృష్ణమాచార్యులు సింహగిరి వచనాలు
అప్పయార్య జినేంద్ర కల్యాణాభ్యుదయం
మంచన కేయూరబాహుచరిత్ర
ప్రతాపరుద్రుడు యయాతి చరిత్ర, ఉషారాగోదయం
గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం
రావిపాటి త్రిపురాంతకుడు ప్రేమాభిరామం
మారన మార్కండేయ పురాణం(అనువాదం)

మత పరిస్థితులు

కాకతీయుల కాలం నాటికి తెలంగాణలో బౌద్ధమత ప్రభావం నామమాత్రంగా ఉండేది. కానీ జైనమతం ప్రబలంగా ఉండేది. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో జైన మతాన్ని వీర శైవులు క్షీణింపజేశారు. వీరు జైన మతంలోని వర్ణ రాహిత్యాన్ని తమ ముఖ్య సిద్ధాంతంగా గ్రహించారు. రాజులకు శైవ దీక్షనిచ్చి వారి గురువులుగా, మంత్రులుగా, దండనాథులుగా జైనమత నిర్మూలనకు ప్రయత్నించారు. వీరశైవానికి పోటీగా వీర వైష్ణవం విజృంభించింది. క్రీ.శ.1200 నాటికి జైనం క్షీణించింది. దాని స్థానాన్ని శైవం ఆక్రమించింది. చివరకు శైవ, వైష్ణవ మతాలు రెండే మిగిలాయి.

బౌద్ధం
ఆంధ్రదేశంలో 10, 11 శతాబ్దాల్లోనే ప్రాభవాన్ని కోల్పోయిన బౌద్ధం కాకతీయుల కాలంలో మరింతగా కనుమరుగైంది. ఈ కాలానికి చెందిన శాసనాల్లో చాలా అరుదుగా బౌద్ధ మత ప్రసక్తి కనిపిస్తుంది. కాలక్రమంలో బౌద్ధం హిందూ మతంలో కలిసిపోయింది.

జైనం
కాకతీయ సామ్రాజ్యంలో బౌద్ధం మందే క్షీణించినా జైనమతం మనుగడ సాగించింది. మొదటి బేతరాజు జైనమతావలంబి. హనుమకొండలోని పద్మాక్షి అనే జైన దేవాలయం ముందున్న శాసనాన్ని బట్టి మొదటి ప్రోలరాజు జైనమతాభిమానిగా తెలుస్తోంది. ఇతడి భార్య మైలమదేవి, మంత్రి బేతకు ప్రగ్గడ కూడా జైన మతాన్ని అవలంబించారు. మెదక్ జిల్లాలోని జోగిపేట జైనమత కేంద్రంగా ఉండేది. హనుమకొండలో సిద్దేశ్వరాలయం అనే జైన దేవాలయం కూడా ఉంది. వీటిని బట్టి తొలి కాకతీయులు జైన మతస్థులని తెలుస్తోంది. ప్రతాపరుద్రుడి కాలంలో ఓరుగల్లుకు చెందిన జైన అప్పయార్య ‘జినేంద్ర కల్యాణాభ్యుదయం’ను రచించాడు. దీన్నిబట్టి కాకతీయుల పాలన అంతమయ్యే వరకు తెలంగాణలో జైనం కొనసాగిందని తెలుస్తోంది. రాజుల పోషణ, ప్రజల ఆదరణ లభించకపోవడంతో జైనం క్రమంగా క్షీణించింది.

శైవం
శైవంలో పాశుపతం, కాలాముఖం, కాపాలికం, ఆరాధ్యశైవం, వీరశైవం అనే శాఖలుండేవి. వీటిలో పాశుపత శాఖ మాత్రమే రాజులు, ప్రజల ఆదరణ పొందింది. రెండో బేతరాజు మెదట జైనాన్ని ఆచరించినప్పటికీ, కాలాముఖ శైవానికి చెందిన రామేశ్వర పండితుడికి ఒక గ్రామాన్ని దానమివ్వడాన్ని బట్టి శైవుడిగా మారాడని చెప్పవచ్చు. రామేశ్వర పండితుడు రెండో బేతరాజు కుమారులైన దుర్గరాజు, రెండో ప్రోలరాజులకు కాలాముఖ శైవదీక్షనిచ్చాడు. దీన్ని బట్టి రెండో బేతరాజు కాలం నుంచి కాకతీయులు శైవమతాన్ని అవలంబించారని తెలుస్తోంది. అలంపురం ముఖ్య కాలాముఖ శైవ కేంద్రం. పన్నెండో శతాబ్దాంతం వరకు కాలాముఖ శైవం విస్తరించింది. గణపతిదేవుడి కాలం నుంచి పాశుపత శైవం ఆదరణ పొందింది. వీరశైవం కర్ణాటకలో ఉన్నంత ఉచ్ఛస్థితిలో ఆంధ్ర దేశంలో లేదు. కానీ పాల్కురికి బసవపురాణాన్ని బట్టి తెలంగాణలోనూ ఆదరణ పొందిందని చెప్పవచ్చు. గద్వాల సమీపంలోని పూడూరు గ్రామంలో ఆలయం వెలుపల నగ్న జైన విగ్రహాలు ఉండటాన్ని బట్టి, వేములవాడలో జైనాలయాన్ని శివాలయంగా మార్చి జైన విగ్రహాలను ఆలయం బయట ఉంచడాన్ని బట్టి జైనాన్ని క్షీణింపజేసి వీరశైవం మనుగడలోకి వచ్చిందని తెలుస్తోంది. గోళకి మఠాల స్థాపన కూడా ఈ విషయాన్ని సూచిస్తోంది. కాకతీయ రాజులు, రేచర్లరెడ్లు తదితరులు నిర్మించిన అనేక శివాలయాలను బట్టి శైవం విస్తృత ఆదరణ పొందినట్లు స్పష్టమవుతోంది.

వైష్ణవం
కాకతీయుల కాలంలో ప్రజాదరణ పొందిన మరో మతం వైష్ణవం. కాకతీయులు శైవులైనప్పటికీ వారి సామంతులు చాలామంది వైష్ణవులు. కాకతీయులు కూడా కొంతవరకు వైష్ణవాన్ని ఆదరించారు. రుద్రదేవుడు రుద్రేశ్వరాలయం(వేయిస్తంభాలగుడి)లో వాసుదేవుణ్ని ప్రతిష్టించాడు. అతడి మంత్రి గంగాధరుడు కేశవస్వామి ఆలయాన్ని నిర్మించాడు. గణపతిదేవుడి సోదరి మైలాంబ కృష్ణుడికి ఆలయాన్నినిర్మించింది. ప్రతాపరుద్రుడి భార్య లక్ష్మీదేవి రామనాథ దేవుడికి కానుకలు సమర్పించింది. ఇవన్నీ కాకతీయులు వైష్ణవాన్ని కూడా ఆదరించారనేందుకు నిదర్శనాలు. ఈ కాలంలో ధర్మపురి ప్రసిద్ధ వైష్ణవ కేంద్రం. ఇన్ని మతాలున్నా కాకతీయుల కాలంలో మత సామరస్యం ఉండేదనడానికి మల్లిరెడ్డి బెక్కల్లు శాసనం నిదర్శనం. కర్ణాటకలో జరిగిన తరహాలో ఇక్కడ వీరశైవ, వైష్ణవ మతాల మధ్య, వాటికీ ఇతర మతాల మధ్య మత యుద్ధాలు జరగకపోవడానికి కాకతీయుల మతసామరస్యమే కారణం.

దేవతారాధన
వైష్ణవ, శైవ దేవతలతోపాటు చరిత్ర పూర్వయుగం నుంచి సంప్రదాయంగా వస్తున్న గ్రామదేవతలు, గ్రామ శక్తులను కూడా ప్రజలు ఆరాధించేవారు. ఏకవీర (రేణుక/ఎల్లమ్మ) మైలారు దేవుడు, భైరవుడు, వీరభద్రుడు, మూసానమ్మ, కాకతమ్మ, పోలేరమ్మ, గంగమ్మ, పోతురాజు మొదలైన గ్రామదేవతలు పూజలు అందుకునేవారు. బవనీలు (బైండ్లవాళ్లు), మాదిగ స్త్రీలు రెండు రోజులపాటు ఎల్లమ్మ కథ చెప్పేవారు.





























#Tags