Telangana Inter board: ఇంటర్‌బోర్డు ఈసారి సరికొత్త విధానం అందుబాటులోకి

ఇంటర్‌బోర్డు ఈసారి సరికొత్త విధానం అందుబాటులోకి
Telangana Inter board: ఇంటర్‌బోర్డు ఈసారి సరికొత్త విధానం అందుబాటులోకి

హైదరాబాద్‌ : పైవేట్‌ కాలేజీల ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు ఇంటర్‌బోర్డు ఈసారి సరికొత్త విధానం అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థి ఏ కాలేజీలో చేరినా, వెంటనే అతని వ్యక్తిగత మొబైల్‌కు మెసేజ్‌ వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు చర్చించారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే కాలేజీలో చేరిన వెంటనే వివరాలు హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మెసేజ్‌ పంపే వీలుంది. దీనికి ప్రైవేట్‌ కాలేజీలు ఇష్టపడే అవకాశం లేదు. కొన్ని నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్‌ కాలేజీలు దీనివల్ల నష్టం జరుగతుందని భావిస్తున్నాయి.  

ప్రయోజనం ఏమిటి? 
ఇప్పటి వరకూ ప్రైవేట్‌ కాలేజీలు విద్యార్థులను ఒక బ్రాంచ్‌లో చేర్చుకొని, వేరొక చోట కూర్చోబెట్టి బోధన చేస్తున్నాయి. ఉదాహరణకు మాదాపూర్‌ బ్రాంచ్‌లో ఓ విద్యార్థి అడ్మిషన్‌ తీసుకుంటాడు. కానీ అతని క్లాసులు వనస్థలిపురం బ్రాంచ్‌లో జరగుతాయి. పరీక్ష కేంద్రం సమీపంలో వేయాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షకు దరఖాస్తు చేసే ప్రాంతాన్నే కొలమానంగా తీసుకుంటారు. దీనివల్ల దూరంగా ఉండే ప్రాంతంలో పరీక్ష కేంద్రం ఉంటుంది.

Also Read: Students Future with CBSE Syllabus

అదీగాక అంతర్గత పరీక్ష నిర్వహించి, బాగా మార్కులొచ్చే వారిని వేరు చేసి చదివిస్తున్నారు. మార్కులు తక్కువగా ఉండే వారి పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు. ఈ బ్రాంచ్‌ల్లో నైపుణ్యం లేని అధ్యాపకులను తక్కువ వేతనాలకు నియమిస్తున్నారు. ఈ విధానాన్ని అడ్డుకోవడానికి మెసేజ్‌ విధానం దోహదపడుతుందని ఓ అధికారి తెలిపారు. తనకు వచ్చే మెసేజ్‌లో అన్ని వివరాలు ఉంటాయి..కాబట్టి వెంటనే అదే కాలేజీలో చదివేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారని, అన్ని కేటగిరీల విద్యార్థులు ఒకే క్యాంపస్‌లో చదువుకునే వీలుందని అధికారులు భావిస్తున్నారు.  

సహకారం అందేనా? 
మెసేజ్‌ విధానంపై కాలేజీ యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి. అడ్మిషన్ల వివరాలు గడువులోగా ఇంటర్‌ బోర్డుకు పంపే వీలుందని, కానీ మెసేజ్‌ సిస్టం తీసుకొస్తే ప్రతీ రోజు వివరాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనివల్ల క్లరికల్‌ పని ఎక్కువగా ఉంటుందని, తనిఖీల పేరుతో అధికారులు వేధించే వీలుందని చెబుతున్నారు. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

#Tags