Telangana: కేజీబీవీలో వసతులు కరువు

నిజాంసాగర్‌: అనాథ, చదువు మధ్యలో మానేసిన బాలికలను అక్కున చేర్చుకొని ఉన్నత విద్యను అందిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సమస్యలకు నిలయంగా మారింది.

నిజాంసాగర్‌లోని కేజీబీవీలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రహరి లేక పందులు, కోతులు బడి ఆవరణలో స్వైర విహారం చేస్తున్నాయి. మురికి నీటి పైపులైన్లు, కాల్వలు లేక దుర్గంధం వెదజల్లుతోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేక చదువు, నిద్ర ఒకే గదిలో సాగిస్తున్నారు.

చదవండి: DEO: విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి

పందులు, కోతుల స్వైరవిహారం

గుట్టకు ఆనుకొని ఉన్న నిజాంసాగర్‌ కేజీబీవీ వెనుక బాగాన ప్రహరీ లేకపోవడంతో అడవి, ఊర పందులు, కోతుల బెడద అధికంగా ఉంది. పందులు వంటశాల గదుల్లోకి వచ్చి తిరుగుతున్నాయి. తరగతి గదులతో పాటు డార్మెట్‌ రూముల్లోకి కోతులు గుంపులుగా వస్తుండటంతో విద్యార్థులు భయపడుతున్నారు. భోజన సమయంలో దాడి చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. నెలకు ఐదారుగురు విద్యార్థులు కోతుల దాడిలో గాయపడుతున్నారు.

నిధులు చాలడం లేదని..

కేజీబీవీని కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం గతంలో రూ.1.5 కోట్లు మంజూరు చేసింది. విద్యాలయం ఆవరణలో తరగతి గదుల నిర్మాణ పనులు చేపట్టారు. అయితే గదుల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అదనపు గదులకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని కాంట్రక్టర్‌ నిర్మాణంతో సరిపెట్టారు. ఆ గదుల్లో వసతలు కల్పన, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం, మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టలేదు. అంతేగాకుండా తరగతుల నిర్వహణకు కావాల్సిన ఫర్నీచర్‌ లేదు. దీంతో ఆ గదులు నిరుపయోగంగా మారాయి.

వేధిస్తోన్న గదుల కొరత

నిజాంసాగర్‌ సమీపంలో ఉన్న కేజీబీవీలో ఆరు నుంచి పదో తరగతి వరకు 227 మంది, ఇంటర్‌లో 106 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా గదులు లేక తరగతి గదులనే డార్మెట్‌ రూమ్‌లుగా ఉపయోగిస్తున్నారు. చదువుకున్న తరగతి గదిలో నే రాత్రి వేళ విద్యార్థినులు నిద్రస్తున్నారు. వి ద్యాలయంలో ఎనిమిది తరగతి గదులు, ఆ రు డార్మెట్‌ రూమ్‌లు ఉన్నాయి. దీంతో 6, 7, 8 తగతుల బాలికలు తరగతి గదులను డా ర్మెట్‌ రూములుగా ఉపయోగిస్తున్నారు. తరగ తి గదిలోనే పుస్తకాల బస్తాలు, బ్యాగులు, పడక బట్టలను పెట్టుకుంటున్నారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లా

పాఠశాల ఆవరణలో తరగతి గదుల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. గదులు నిర్మించినా సరైన సదుపాయల్లేవు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాను. అలాగే పాఠశాల వెనుక ప్రహరీ లేకపోవడంతో పందులు, కోతుల వస్తున్నాయి. మురికి కాలువలు లేకపోవడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంది.
– సరోజన, కేజీబీవీ ప్రిన్సిపాల్‌, నిజాంసాగర్‌

#Tags