Sri Chaitanya Chairman BS Rao Passes Away : శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత‌ డా. బి.ఎస్‌. రావు కన్నుమూత

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత‌ డా.బి.ఎస్‌.రావు జూలై 13వ తేదీ మధ్యాహ్నం కన్నుమూశారు. డా.బి.ఎస్‌.రావు వయస్సు 75 ఏళ్లు. జూలై 13వ తేదీన ఉదయం ఇంట్లో అస్వస్థతకు గురయినట్టు శ్రీచైతన్య వర్గాలు తెలిపాయి.
Dr. Boppana Satyanarayana Rao

దీంతో బి.ఎస్‌. రావును హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు.  డాక్టర్లు చికిత్స అందించినా.. బీఎస్ రావు తిరిగి కోలుకోలేకపోయారు. ఆయన భౌతిక కాయాన్ని అంతిమ సంస్కారాల కోసం విజయవాడకు తరలించనున్నారు. రేపు విజయవాడలో అంత్యక్రియలు జరపనున్నారు.

డాక్ట‌ర్ నుంచి..

డాక్టర్ బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. మెడిసిన్ చదివిన BS రావు.. కొంత కాలం పాటు విదేశాల్లో (ఇంగ్లండ్, ఇరాన్) వైద్య సేవలు అందించారు. ఆయన భార్య ఝాన్సీ లక్ష్మీబాయి కూడా వైద్యురాలే. భార్య భర్తలిద్దరు విదేశాల్లో మెడిసిన్ ప్రాక్టీస్ అనంతరం 1986లో దేశానికి తిరిగి వచ్చారు.

ఎంచుకున్న రంగంలోనే ఉన్నత స్థానానికి..

1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి, వాటిని అగ్రపథంలో నడిపించారు. విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన విద్యా సంస్థల ప్రస్థానం ప్రారంభమైంది. 56 మంది విద్యార్థులతో తొలి బ్యాచ్ ప్రారంభించిన ఆ తర్వాత తొమ్మిదేళ్ళ వరకు విస్తరణలో ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొన్నారు. ఈ ప్ర‌యాణంలో అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా శ్రీచైతన్యను మార్చారు. ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థానానికి శ్రీచైతన్య విద్యాసంస్థలను చేర్చారు.  ప్రస్తుతం శ్రీచైతన్యకు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 CBSE స్కూళ్లు ఉన్నాయి. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో దాదాపు 8.5లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

#Tags