పల్లెల్లో సరికొత్త బోధనకు ఎస్సీ గురుకుల సొసైటీ పిలుపు !

సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తితో దాదాపు నాలుగు నెలల నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు తెరుచుకోలేదు.
ఈ క్రమంలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తుండగా.. అవి కేవలం ఆయా పాఠశాల విద్యార్థులు, ఫీజులు చెల్లించే స్తోమత ఉన్నవారు మాత్రమే వీక్షిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సాధారణ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి పిల్లలకు ఈ ఆన్‌లైన్ పాఠాలు చేరడం లేదు. ఈ క్రమంలో బోధన, అభ్యసన పద్ధతుల్లో వారు గాడి తప్పకుండా ఉండేందుకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ గ్రామీణ విద్యా కేంద్రాల (వీఎల్‌సీ) పేరిట ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కోవిడ్-19 జాగ్రత్తలు పాటిస్తూ గ్రామాలు, పల్లెలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీల్లో గరిష్టంగా 10 మంది విద్యార్థులతో వీఎల్‌సీలను నిర్వహించాలని సూచించింది. ఔత్సాహికులెవరైనా వీటిని నిర్వహించవచ్చని, ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ పిల్లలనే తేడా లేకుండా ఆసక్తి ఉన్న వారందరికీ బోధన, అభ్యసన కార్యక్రమాలు నిర్వహించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ వీఎల్‌సీ నిర్వహణ సూచనలు జారీ చేసింది.