Tomorrow All Schools Holiday Due to Rain :నేడు అన్ని స్కూళ్లకు సెలవు... ఇలాగే సెప్టెంబర్ 5వ తేదీ వరకు..!
పలువురు నీట మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జూలై 3వ తేదీన (మంగళవారం) అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు, వరద ముప్పుతో ముందు జాగ్రత్తగా కలెక్టర్ నాగలక్ష్మి సెలవు ప్రకటించారు. వర్షాలు కురిసే మరికొన్ని జిల్లాల్లోనూ రాత్రిలోగా కలెక్టర్లు సెలవు ఇచ్చే అవకాశం ఉంది. ఇలాగే పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, ప.గో, కృష్ణా, గుంటూరు జిల్లాలు, నెల్లూరులోని కొన్ని మండలాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. అలాగే వివిధ జిల్లాల కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నారు.
తెలంగాణలో కూడా పాఠశాలలకు సెలవులు..
తెలంగాణలోని 4 జిల్లాల్లో రేపు స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే.. అధికారులు ఆయా జిల్లాల్లోని పరిస్థితులను బట్టి.. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే.. పాఠశాలలకు సెలవులపై నిజామాబాద్, నిర్మల్ కలెక్టర్లు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు రేపు అనగా.. సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో.. విద్యార్థులు భద్రత దృష్ట్యా.. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు సెలవు పాటించాలని ఆయన సూచించారు. మహబూబాబాద్‌లో కురస్తున్న భారీ వర్షాలకు ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఫలితంగా రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కేంద్ర హోంశాఖ ఆదేశాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది రాష్ట్రంలో ఈ సీజన్‌లో అత్యధిక వర్షపాతం. వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆదివారం రాష్ట్రంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసి దారి మళ్లించింది. హైదరాబాద్‌లోనూ శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. 2020 వరదల మాదిరిగానే 30 సెం.మీ కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్న అనుకూల వాతావరణంతో నగరానికి ఉపశమనం కలిగినట్లు తెలిపింది.
సెప్టెంబర్ 5వ తేదీ వరకు..
వాతవారణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 5వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ ప్రజలకు మరో హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. ఈనెల ఐదో తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో, కోస్తా జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తుపాన్‌గా బలపడిన అనంతరం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో, కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
తాజాగా వరదల కారణంగా...
తాజాగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వెళ్తోంది. దీంతో, విజయవాడ జల దిగ్భందమైంది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. మరోవైపు.. తాజాగా వరదల కారణంగా 15 మంది మరణించినట్టు తెలుస్తోంది.