KGBV Admissions: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..
రాప్తాడు: నిరుపేద, అనాథ బాలికల చదువుకు కేజీబీవీలు (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు) ఆలవాలంగా మారాయి. ఉచిత వసతి, భోజన సదుపాయంతో ప్రమాణాలతో కూడిన విద్యను బోధిస్తున్నాయి. బాలికల భవితకు గట్టి పునాది వేస్తున్నాయి. ఉజ్వల భవిష్యత్‌కు బాసటగా నిలుస్తున్నాయి. కేజీబీవీల్లో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి, ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు ఉంది. అర్హులైన బాలికలు ప్రవేశాలు పొందవచ్చు.
Teacher Jobs: టెట్ నిర్వహించి టీచర్ పోస్టులు పెంచాలి
62 కేజీబీవీల్లో 2,480 సీట్లు
ఉమ్మడి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని 63 మండలాలకు గాను 62 కేజీబీవీలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 31 మండలాలకు 32 కేజీబీవీలు, శ్రీ సత్యసాయి జిల్లాలోని 32 మండలాలకు 30 కేజీబీవీలు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగే ఈ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఒక్కో పాఠశాలలో 40 సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,480 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే 11వ తరగతి (ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం)లో వివిధ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మరో వైపు 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది.
అర్హతలు ఇలా.....
అనాథ, వీధి బాలికలు, పేద, పిల్లలతో పాటు బడి బయట ఉన్న పిల్లలు, బడి మానేసిన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీపీఎల్ బాలికలకు తొలి ప్రాధాన్యత కింద కేజీబీవీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వలస కూలీల చిన్నారులు, అసిస్టెంట్ లేబర్ సహాయ శాఖ అధికారులు సిఫారసు చేసిన వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యత ఉంటుంది. 6వ తరగతిలో ప్రవేశం కోసం ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదివిన బాలికలై ఉండాలి. ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. విద్యార్థినులు తమ దరఖాస్తును apkgbv.apcfss.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు. ఎంపికైన బాలికలకు ఫోన్ మెసెజ్ ద్వారా సమాచారం అందుతుంది. ఆయా పాఠశాల నోటిఫికేషన్ బోర్డులోనూ నేరుగా చూడవచ్చు.
Intermediate Students: ప్రశాంతంగా సాగుతున్న ఇంటర్ పరీక్షలు
అన్నీ ఉచితమే
కేజీబీవీలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే అవకాశం ఉంది. విద్యాలయాల్లో చేరిన బాలికలకు ఉచిత విద్యతో పాటు భోజనం, వసతి సౌకర్యాన్ని కల్పిస్తారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, కాస్మోటిక్ చార్జీలు అందజేస్తారు. రోజూ పోషక విలువలతో కూడిన రుచికరమైన భోజనం పెడతారు. ప్రత్యేక అధికారి నుంచి టీచర్లు, వాచ్‌మన్, స్వీపర్ వరకు అందరూ మహిళలే ఉంటారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బోధన సాగుతుంది.