NEET UG 2024: మళ్లీ ‘NEET’కు ఆదేశించలేం.. ఎన్‌టీఏ తీరు దారుణం

న్యూఢిల్లీ: నీట్‌–యూజీ 2024 పరీక్ష సమగ్రతకే తూట్లు పొడిచేంతటి భారీ స్థాయిలో వ్యవస్థీకృత లీకేజీ జరిగినట్టు ఇప్పటికైతే ఎలాంటి రుజువులూ లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో పరీక్షను తిరిగి నిర్వహించాలని ఆదేశించలేమని స్పష్టం చేసింది. సీజేఐ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్డీవాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగ‌స్టు 2న‌ ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది.ధర్మాసనం తరఫున సీజేఐ 63 పేజీల తీర్పు రాశారు.
‘‘సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ వంటివాది ద్వారా ప్రశ్నపత్రాన్ని విస్తృతంగా లీక్‌ చేశారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. లీకేజీ ప్రధానంగా పట్నా, హజారీబాగ్‌ ప్రాంతాలకే పరిమితమైనట్టు తేలింది. తద్వారా లబ్ధి పొందిన విద్యార్థులను గుర్తించడం కష్టమేమీ కాదు.

వారెంత మందో సీబీఐ దర్యాప్తు ఇప్పటికే తేల్చింది. కనుక మళ్లీ పరీక్ష నిర్వహించడం అనవసరం. పైగా దానివల్ల ఈ దశలో విద్యా సంవత్సరం దెబ్బ తింటుంది’’ అని పేర్కొన్నారు. 

చదవండి: UGC NET Exam Dates 2024 : యూజీసీ నెట్‌-2024 ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

ఎన్‌టీఏకి తలంటిన సీజేఐ

నీట్‌–యూజీ వంటి కీలక పరీక్ష నిర్వహణలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వ్యవహరించిన తీరు దారుణమని సీజేఐ దుయ్యబట్టారు. ముందు తప్పుడు నిర్ణయాలు తీసుకుని తర్వాత దిద్దుబాటుకు దిగడం దారుణమన్నారు. ‘‘లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణ బృహత్తర కార్యక్రమమే.
అందుకు భారీ వనరులు, సమన్వయం, ప్రణాళిక అవసరం. మేమేమీ కాదనడం లేదు. కానీ ఎన్‌టీఏ వంటి సంస్థలను ఏర్పాటు చేసింది అందుకే కదా! ఈసారి జరిగిన తప్పిదాలను నివారించేందుకు కావాల్సినన్ని నిధులు, సమయం ఎన్‌టీఏకు అందుబాటులో ఉన్నాయి. కనుక ఒకే కేంద్రంలో భారీ సంఖ్యలో అభ్యర్థులను అనుమతించడం వంటివి లీకేజీకి కారణాలని చెప్పడం కుదరదు. పైగా హజారీబాగ్‌ పరీక్ష కేంద్రంలో భద్రతా వైఫల్యమూ చోటుచేసుకుంది.
స్ట్రాంగ్‌ రూం వెనక తలుపు తెరిచి అనధికార వ్యక్తులు ప్రశ్నపత్రాలను చేజిక్కించుకున్నారు. వాటిని ఇ–రిక్షాల్లో తరలించుకుపోయి అభ్యర్థల చేతిలో పెట్టారు. ఫలితంగానే 67 మందికి నూరు వాతం మార్కులొచ్చాయి. అనుమానితులైన 1,563 మందికి తిరిగి పరీక్ష పెడితే ఆ సంఖ్య అంతిమంగా 17కు తగ్గింది. అది కూడా అభ్యర్థుల ఆక్రందనలు, మీడియా రిపోర్టులు, కోర్టు జోక్యం అనంతరం! ఇలాంటి వాటితో నిమిత్తం లేకుండానే ప్రజలు విశ్వసించేలా పనితీరు ఉండాలి. ఇకనైనా మరింత జాగ్రత్తగా ఉండండి’’ అంటూ ఎన్‌టీఏను మందలించారు.
తీర్పులో పేర్కొన్న అన్ని అంశాలపైనా దృష్టి పెట్టి ఇకపై పరీక్షల నిర్వహణ పూర్తిగా దోషరహితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు సిఫార్సు చేసే విషయంలో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలని రాధాకృష్ణన్‌ ప్యానెల్‌ను సీజేఐ నిర్దేశించారు. అభ్యర్థుల గుర్తింపు నిర్ధారణ పద్ధతిని లోపరహితం చేయడం, పరీక్షల నిర్వహణ, ప్రక్రియ తాలూకు భద్రత, డేటా సెక్యూరిటీ తదితరాలపైనా సిఫార్సులు చేయాలని నిర్దేశించారు. 

#Tags