Kandada Hindu: నీట్‌లో మెరిసింది.. ఫ్రీ సీటు సాధించింది

చేవెళ్ల: ఇటీవల విడుదలైన నీట్‌ పరీక్షల ఫలితాల్లో చేవెళ్లకు చెందిన పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు కందాడ సాయన్న కూతురు హిందు ఉత్తీర్ణత సాధించి కాలోజీ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ ఫ్రీ సీటు సాధించింది.

ఈ విషయం తెలియడంతో అక్టోబర్ 4న‌ ఆమెను, పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ తన కూతురును ఉన్నత చదువులు చదివించిన సాయన్నను గ్రామ నాయకులు అభినందించారు. విషయం తెలిసిన బీజేపీ యువ నాయకుడు డాక్టర్‌ వైభవ్‌రెడ్డి తన వంతుగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తానని ప్రకటించారు.

పేద కుటుంబానికి చెందిన హిందు ఉన్నత చదువుకు ఎంపిక కావటం సంతోషకరమన్నారు. కందాడ సాయన్న సుజాత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు వివాహం కాగా చిన్న కూతురు హిందూను గురుకుల పాఠశాలలో చేర్పించాడు.

చదవండి: Teacher Suresh: విద్యార్థి ప్రాణం కాపాడి.. తాను అస్వస్థతకు గురైన‌ ఉపాధ్యాయుడు.. కార‌ణం ఇదే..

కుమారుడు ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. సుజాత ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. నిరుపేద కుటుంబం అయినప్పటికీ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. హిందు పదో తరగతి వరకు వికారాబాద్‌ ఎస్సీ గురుకుల పాఠశాలలో, ఇంటర్‌ నల్లకంచ గురుకుల కళాశాలలో చదివింది.

కళాశాల నుంచి నీట్‌ పరీక్ష రాసిన ఆమె 466 మార్కులు సాధించింది. అర్హతను బట్టి ఎస్సీ కోటాలో వరంగల్‌లోని కాళోజీ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ ఫ్రీ సీటు సాధించింది. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ పిల్లలు బాగా చదువుకోవాలనే ఆలోచనతో ఉన్నత చదువులు చదించిన సాయన్నను పలువురు అభినందించారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హిందు నిరూపించిందని కొనియాడారు.
 

#Tags