Medical Seats: డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లపై సర్కారు పట్టు.. లేకుంటే చర్యలు తీసుకోవాలని నిర్ణయం
ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీల మాదిరిగానే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనల ప్రకారం డీమ్డ్ మెడికల్ కాలేజీలు కూడా సగం సీట్లను కన్వీనర్ కోటా కిందే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఆయా కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇతర వర్గాలకు కూడా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందని అంటున్నాయి. డీమ్డ్ వర్సిటీలైనా, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైనా సగం సీట్లను కనీ్వనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది.
ఒకవేళ ఈ నిబంధనలను అమలు చేసేందుకు డీమ్డ్ మెడికల్ కాలేజీలు సహా ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలు ఒప్పుకోకపోతే, మరో రూపంలో ఆయా కాలేజీలను కట్టడి చేయాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇటీవల డీమ్డ్ హోదా పొందిన రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లపై ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనిపై సెప్టెంబర్ 17న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించనున్నారు.
డీమ్డ్ హోదా పొందిన కాలేజీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సదుపాయాలు పొందుతున్నాయని, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల పేరిట ప్రభుత్వ బిల్లులు పొందుతున్నాయని అంటున్నారు.
అవసరమైతే కోర్టుకు వెలైనా దీనిపై తేల్చుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు నీట్ ఫలితాలు వెలువడి కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత, డీమ్డ్ హోదా పొందటం న్యాయపరంగా ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
చదవండి: YS Jagan Mohan Reddy: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి.. ఈ లేఖను వెనక్కు తీసుకోండి
డీమ్డ్‌లో సొంత నిబంధనలపై గరంగరం..
రాష్ట్రంలో రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా దక్కించుకున్నాయి. మరో నాలుగు మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేసుకున్నాయి. కనీ్వనర్ కోటా సీట్లను మేనేజ్‌మెంట్ సీట్లుగా మార్చుకోవడం, ఫీజులు తమకు అవసరమైన రీతిలో వసూలు చేసుకోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం, సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం.. వంటివి ఉంటాయని ఆయా కాలేజీలు చెబుతున్నాయి.
నీట్‌లో ర్యాంకు సాధించిన ప్రతిభ గల, పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న ఆశను దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. డీమ్డ్ వర్సిటీలుగా మారా లంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్న వాదననను ప్రైవేట్ యాజమాన్యాలు తెరపైకి తెస్తున్నాయి.
ఇదే జరిగితే మున్ముందు మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా సాధించుకునే అవకాశం ఉంది. అలాగైతే రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లు మొత్తం మేనేజ్‌మెంట్ సీట్లుగా మారిపోతాయని అంటున్నారు.
దీనివల్ల కన్వీనర్ కోటా ఫీజు ఎత్తేసి మేనేజ్‌మెంట్ ఫీజులు అమలవుతాయి. డీమ్డ్ హోదా కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాల్సిందేనని అంటున్నారు.
ఎన్‌ఎంసీ నుంచి ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి పొందుతున్నందున ప్రభుత్వ అజమాయిషీ లేకుండా ఎలా ఉంటుందంటున్నారు.
ఫీజును కూడా ఆయా కాలేజీలు సొంతంగా నిర్ణయించుకునే అధికారం లేదని అంటున్నారు. దీనిపై సీరియస్‌గా ఉన్న మంత్రి రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు అని... దానిని డీమ్డ్ పేరుతో ఎలా కాలరాస్తారని ప్రశ్నిస్తున్నారు.