ఈ ఐటీ దిగ్గజ కంపెనీలోని ఉద్యోగులకు భారీ షాక్
బెంగుళూరు: కరోనా వైరస్ ఉదృతి నేపథ్యంలో దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ బాటలోనే ఐటీ దిగ్గజం డెల్ కంపెనీ సైతం పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 14న డెల్ సంస్థలో జరిగిన త్రైమాసిక సమావేశంలో సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. అయితే డెల్ ఉన్నతాధికారి జెఫ్ క్లార్క్ స్పందిస్తూ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకుంటే ఏ ఒక్క విభాగానికో పరిమితం కాదని తెలిపారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకునేందుకు అన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే సంస్థాగతంగా కంపెనీ కార్యకలాపాల విశ్లేషణ ఉంటుందని, కొంతమంది సిబ్బందికి ఉద్వాసన పలకొచ్చని తెలిపారు. అలాగే మరో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఇటీవలే భారత్‌లో వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డెల్ సంస్థలో లక్ష 65వేల మంది ఉద్యోగులు సేవలంధిస్తున్నారు. అయితే నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఢోకా ఉండదని, ఉద్యోగులకు నైపుణ్యమున్న విభాగాలను కేటాయిస్తామని భారత్‌కు చెందిన డెల్ అధికారి తెలిపారు. కాగా డెల్ సంస్థకు బెంగుళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, పూణే, చెన్నై, కోల్‌కతా తదితర మహానగరాలలో కార్యాలయాలు ఉన్నాయి. ఇటీవల డెల్ ఇండియా ఎండీ అలోక్ ఓరీ స్పందిస్తూ డిజిటల్ నైపుణ్యాలకు, ఆరోగ్య రంగం, విద్య, టెలికం రంగంలో అత్యాధునిక సాంకితకతను ఉపయోగిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే.