Josaa Counselling Important Dates 2024 : జోసా కౌన్సెలింగ్ తేదీలు ఇవే.. భారీగా పెరిగిన సీట్లు.. కానీ..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : జూన్ 9వ తేదీన‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను విడుద‌ల చేయ‌నున్నారు. జూన్ 10వ త‌దీ నుంచి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించనుంది.

ఈ నేప‌థ్యంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర జాతీయస్థాయి విద్యాసంస్థ (జీఎఫ్‌టీఐ)లలో కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధమవుతోంది.

మొత్తం 57,152 వరకు సీట్లు.. కానీ..
జూన్ 17 వరకు మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. ఆ తర్వాత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. మొత్తం ఐదు రౌండల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. జూలై 23 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. 2024–25 విద్యాసంవత్సరానికి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో మొత్తం 57,152 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు జోసా సీట్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక కసరత్తును చేపట్టింది. 

భారీగా పెరిగిన సీట్లు.. 
గత ఐదేళ్లలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో గణనీయంగా సీట్ల సంఖ్య పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతుండడం, ఉపాధి అవకాశాలతో ఇంజనీరింగ్‌కు డిమాండ్‌ ఏర్పడింది. అయితే 2019 ముందు వరకు అత్యున్నత ప్రమాణాలతో నడిచే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో విద్యార్థుల డిమాండ్‌కు తగ్గట్టు సీట్ల సంఖ్య ఉండేది కాదు. దీంతో ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్య కోసం భారతీయ విద్యార్థులు ఏటా విదేశాలకు వెళ్లిపోయేవారు. దీన్ని నివారించడానికి 2024 నాటికి ఐఐటీలు, తదితర జాతీయ విద్యాసంస్థల సంఖ్యను పెంచడంతో పాటు వాటిలో సీట్ల సంఖ్యను 50 శాతం మేర పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

అలాగే అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడం ద్వారా విదేశీమారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల సంఖ్యను పెంచింది. అనేక రాష్ట్రాల్లో కొత్తగా ఈ సంస్థలను అందుబాటులోకి తెచ్చింది. 

మహిళలకు 20 శాతం..

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్ల సంఖ్యను 2020లో ఒక్కసారిగా కేంద్రం పెంచింది. 2019లో దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్‌టీఐలలో 38,704 సీట్లు ఉండగా దాన్ని 2020లో ఒకేసారి 50,822కు పెంచింది. 2021లో 52,453 సీట్లు, 2022లో 54,477, 2023లో 57,152 సీట్లు అందుబాటులోకి వచ్చా­యి. వీటితోపాటు ఆయా విద్యా సంస్థల్లో మహిళలకు 20 శాతం సూపర్‌ న్యూమరరీ కోటాతో సీట్లు కేటాయించుకునే వీలును కేంద్రం కల్పించింది.

కౌన్సెలింగ్‌లో ఉన్న‌ విద్యా సంస్థలు ఇవే.. 
నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జనవరి, ఏప్రిల్‌ సెషన్లలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించింది. అందులో టాపర్లుగా నిలిచిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. జూన్ 9వ తేదీన‌ అడ్వాన్స్‌డ్‌ తుది ఫలితాలను విడుదల చేయనుంది. అనంతరం 10 నుంచి నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభించనుంది. మొత్తం 121 విద్యా సంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల్లో మెరిట్‌ ర్యాంకులు సాధించిన వారికి ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్‌టీఐల్లో జోసా ప్రవేశాలు కల్పిస్తుంది. ఆయా విద్యా సంస్థల్లో సీట్లు మిగిలిపోతే జూలై 17 నుంచి వాటికి ప్రత్యేక కౌన్సెలింగ్‌ చేపట్టనుంది.

జోసా కౌన్సెలింగ్‌ 2024 తేదీలు తేదీలు ఇవే.. 
➤ జూన్‌ 18న అభ్యర్థుల రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక
➤ జూన్‌ 20న మొదటి విడత సీట్ల కేటాయింపు
➤ జూన్‌ 27న రెండో విడత సీట్ల కేటాయింపు
➤ జూలై 4న మూడో విడత సీట్ల కేటాయింపు
➤  జూలై 10న నాలుగో విడత సీట్ల కేటాయింపు
➤ జూలై 17న ఐదో విడత సీట్ల కేటాయింపు 

#Tags