Atul Kumar: ఆ విద్యార్థికి సీటివ్వండి.. ఐఐటీ ధన్‌బాద్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివినా సమయానికి ప్రవేశరుసుం కట్టలేక ప్రతిష్టాత్మక ఐఐటీ ధన్‌బాద్‌లో సీటు కోల్పోయిన దళిత విద్యార్థికి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది.

వెంటనే ఆ విద్యార్థి అతుల్‌ కుమార్‌కు సీటు ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్ధివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం సోమవారం ఆదేశించింది.
జూన్‌ 24వ తేదీ సాయంత్రం ఐదింటిలోపు అడ్మిషన్‌ ఫీజు రూ.17,500 కట్టలేకపోవడంతో బీటెక్‌ సీటు కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ‘‘ విద్యార్థి ఆరోజు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు కోసం మధ్యాహ్నం మూడు గంటలకే లాగిన్‌ అయ్యాడు.
తర్వాత పదేపదే ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌లో రిమైండ్లతో గడువును గుర్తుచేశాం’’ అని ఐఐటీ సీట్ల కేటాయింపు విభాగం వాదించింది. దీంతో సీజేఐ కలగజేసుకుని ‘‘మీరెందుకంతగా వ్యతిరేకిస్తున్నారు?. ఈ పిల్లాడికి ఏమైనా చేయగలవేమో చూడండి.

చదవండి: Supreme Court Help for Student: విద్యార్థికి సాయపడేందుకు ముందుకొచ్చిన సుప్రీంకోర్టు
ఆ డబ్బులే ఉంటే కట్టకుండా ఎందుకుంటాడు? అణగారిన వర్గాలకు చెందిన రోజువారీ కూలీ కుమారుడు. పైగా అతనిదిదారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబం. ఐఐటీలో సీటు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. ప్రతిభగల ఇలాంటి విద్యార్థిని మనం ఊరకనే వదిలేయలేం.
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించిన అసాధారణ అధికారంతో మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. ఇదే ఏడాది అదే బ్యాచ్‌ ఎలక్ట్రిక్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో విద్యార్థికి సీటివ్వండి. హాస్టల్‌ వసతి సహా అర్హతగల అన్ని ప్రయోజనాలు అతనికి అందేలా చూడండి’’ అని ఐఐటీ కాలేజీ విభాగాన్ని కోర్టు ఆదేశించింది.
కిక్కిరిసిన కోర్టు హాలులో అంతసేపూ చేతులు కట్టుకుని నిలబడిన విద్యార్థితో ‘‘ ఆల్‌ ది బెస్ట్‌. బాగా చదువుకో’’ అని సీజేఐ అన్నారు. బాగా చదువుతూ ఇంజనీరింగ్‌ చేస్తున్న అతని ఇద్దరు అన్నల బాగోగులు తదితరాల గురించి కూడా ఆయన ఆరాతీశారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్‌ ఐఐటీ ధన్‌బాద్‌లో సీటు వచ్చినా పేదరికం కారణంగా డబ్బులు కట్టలేక నిస్సహాయుడయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తలో చేయి వేసి నగదు సర్దినా చివరి నిమిషంలో ఆన్‌లైన్‌ చెల్లింపు విఫలమై ఫీజు కట్టలేకపోయాడు.

 

జార్ఖండ్‌ హైకోర్టు లీగ్‌ సర్వీసెస్‌ అథారిటీని ఆశ్రయించగా పరీక్షను ఐఐటీ మద్రాస్‌ నిర్వహించినందున మద్రాస్‌ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో మద్రాస్‌ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ నెమ్మదించడంతో ఈసారి నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

#Tags