పర్యావరణ పరిరక్షణ చట్టాలు- ఉద్యమాలు- సదస్సులు

వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972): ఈ చట్టం ప్రకారం ఏ రాష్ర్టమైనా వన్యప్రాణి సంస్థ అనుమతి లేకుండా పార్కులు, వన్యప్రాణి కేంద్రాలకు సంబంధించి హద్దులను మార్చకూడదు. దీనికి 2002లో సవరణలు చేశారు.
భూమి, సహజ వనరుల హక్కు సంరక్షణ చట్టం (1972): స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో పర్యావరణంపై జరిగిన యూఎన్‌ఓ సదస్సులో భూమి, సహజ వనరులను రక్షించేందుకు ప్రతి దేశం చర్యలు తీసుకోవాలనినిర్ణయించారు.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (1974): నీటి కాలుష్య నివారణ చట్టం ప్రకారం 1974 లో కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటు చేశారు. 1981లో చేసిన వాయు కాలుష్య నివారణ చట్టంలోని అధికారాలను కూడా ఈ సంస్థకే అప్పగించారు.

అడవుల సంరక్షణ చట్టం (1980): ఈ చట్టం ప్రకారం ఏ రాష్ర్టమైనా కేంద్రం అనుమతి లేకుండా అటవీ భూములను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించరాదు. అటవీ భూముల్లో ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపడితే ముందుగా సంబంధిత శాఖల నుంచి అనుమతి పొందాలి.

అటవీ, పర్యావరణ శాఖ (1985): కేంద్ర ప్రభుత్వం 1985లో పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. పర్యావరణం, అడవులకు సంబంధించి కార్యక్రమాల అమలుకు అటవీ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.

ఎకోమార్క్‌ (1991): దీన్ని భారత ప్రమాణాల సంస్థ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్‌్స) జారీ చేస్తుంది. 1991లో దీన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులకు ఎకోమార్క్‌ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. పర్యావరణంపై ప్రభావం చూపే ఉత్పత్తులను అంగీకరించదు.

పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం (1995): పర్యావరణానికి నష్టం కలిగించే అంశాలపై, ప్రమాదకర పదార్థాల తయారీపై, వ్యక్తులు, ఆస్తులకు సంబంధించి సమస్యల పరిష్కారానికి ఈ చట్టం చేశారు.

జీవ వైవిధ్య చట్టం (2002): 1992 జూన్ 5న యూఎన్‌ఓ ఆధ్వర్యంలో బ్రెజిల్‌లోని రియోడిజెనీరోలో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో 172 సభ్య దేశాలు పాల్గొన్నాయి. జీవ వైవిధ్య సంరక్షణకు అంతర్జాతీయ స్థాయిలో సంతకాలు జరిగాయి. ఇక్కడ జరిగిన ఒప్పందం ప్రకారం 2002లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఈ చట్టాన్ని తెచ్చింది.

పర్యావరణ ఉద్యమాలు
బిష్ణోయి ఉద్యమం
: ఇది దేశంలో తొలి పర్యావరణ ఉద్యమంగా పేరుగాంచింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా ఖేజర్లీ గ్రామానికి చెందిన అమృతాదేవి నాయకత్వంలో ఈ ఉద్యమం జరిగింది. 1730లో ఖేజ్రి వృక్షాలను రక్షించేందుకు 363 మంది ఉద్యమం చేసి ప్రాణాలు కోల్పోయారు.

సెలైంట్ వ్యాలీ ఉద్యమం: కేరళలోని పాలక్కడ్ జిల్లాలోని ఉష్ణమండల అటవీ ప్రాంతాన్ని సెలైంట్ వ్యాలీ అంటారు. పెరియార్ నదికి ఉప నది అయిన కుధిపుజ నదిపై జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల అడవులు, జంతువులు, జీవరాసులు అంతరించిపోతున్నాయని ఆందోళన చేస్తూ 1973లో ఉద్యమం ప్రారంభమైంది. తర్వాత 1985లో ఈ ప్రాంతాన్ని సెలైంట్ వ్యాలీ నేషనల్ పార్క్‌గా మార్చారు.

జంగిల్ బచావో ఆందోళన్: బిహార్ ప్రభుత్వం అటవీ ప్రాంతంలో ఉన్న సాల్ చెట్లను నరికి, వాటి స్థానంలో టేకు వృక్షాలు పెంచాలని ప్రయత్నించడంతో 1980 లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. సింగ్‌భం జిల్లా గిరిజన వాసులు సాల్ వృక్షాలను హత్తుకొని నిరసన వ్యక్తం చేశారు.

చిప్కో ఉద్యమం: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా 1973లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. చిప్కో అంటే ‘హత్తుకొను’ అని అర్థం. చిప్కో ఉద్యమకారులు చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ వాటిని హత్తుకొని ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. సుందర్‌లాల్ బహుగుణ, గౌరీ దేవి, చండీప్రసాద్ భట్ మొదలైనవారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు.

నవధాన్య ఉద్యమం: జీవ రాశులు అంతరిస్తున్నాయనే ఉద్దేశంతో జీవవైవిధ్య సంరక్షణకు, సేంద్రీయ వ్యవసాయానికి రక్షణ కల్పించేందుకు 1984లో వందనా శివ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం జరిగింది.

అప్పికో ఉద్యమం: చిప్కో ఉద్యమం తరహాలోనే అడవుల సంరక్షణ కోసం 1983 సెప్టెంబర్‌లో కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లాలోని సల్కాని ప్రాంతంలో ఉద్యమం ప్రారంభమైంది. పాండురంగ హెగ్డే నాయకత్వంలో ఉద్యమం జరిగింది. కన్నడంలో అప్పికో అంటే ‘కౌగిలించుకొను’ అని అర్థం.

నర్మదా బచావో ఆందోళన్: మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, గుజరాత్ రాష్ట్రాల్లో నర్మదా నది ప్రవహిస్తోంది. పర్యావరణానికి హాని కలిగిస్తూ ఈ నదిపై చేపట్టే ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ముఖ్యంగా గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ డ్యాంకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమాన్ని 1989లో మేధా పాట్కర్ ప్రారంభించారు. బాబా ఆమ్టే, అరుంధతి రాయ్‌లాంటి వారు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించారు.

గంగా పరిరక్షణ ఉద్యమం
గంగా నది దేశంలో అతిపెద్దది. స్వచ్ఛమైన గంగా నది కోసం, కాలుష్య నివారణ కోసం శ్రీమతి రమారౌట ఆధ్వర్యంలో 1988న కాన్పూర్‌లో ఒక సెమినార్ జరిగింది. అదే ఉద్యమంగా మొదలైంది. అనేక స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, వైజ్ఞానిక సంస్థలు ఈ ఉద్యమానికి ప్రోత్సాహాన్ని అందించాయి.

అంతర్జాతీయ సదస్సులు
క్యోటో ప్రోటోకాల్:
వివిధ కారణాల వల్ల భూగోళం వేడెక్కుతోంది. ముఖ్యంగా కార్బన్‌డైయాక్సైడ్ కారణంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరిగి భూగోళం వేడెక్కుతోందనే ఉద్దేశంతో 1997, డిసెంబర్ 11న జపాన్‌లోని క్యోటో నగరంలో ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం జరిగింది. ఇందుకు 192 దేశాలు అంగీకరించాయి. 2005, ఫిబ్రవరి 16 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం గ్రీన్‌హౌస్ వాయువుల ప్రభావాన్ని 5 శాతానికి తగ్గించాలి. 2012లో కెనడా ఈ ఒప్పందం నుంచి తప్పుకుంది.

కార్టెజినా ప్రోటోకాల్: జీవరాశుల భద్రత కోసం 1999లో కొలంబియాలోని కార్టెజినాలో కాన్ఫరెన్‌‌స ఆఫ్ పార్టీస్‌లో చర్చ జరిగింది. 2003 సెప్టెంబర్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2015 నాటికి 170 దేశాలు ఇందుకు అంగీకరించాయి. ఈ ఒప్పందాన్ని ‘బయోసేఫ్టీ ప్రోటోకాల్’ అంటారు.

మొక్కల సంరక్షణ సదస్సు: ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1999లో అమెరికాలో మిస్సోరిలోని సెయింట్ లూయీస్ నగరంలో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో అంతరించి పోతున్న మొక్కలను కాపాడాలని నిర్ణయించారు. 2020 నాటికి లక్ష్యాన్ని పూర్తిచేయాలని ప్రతినబూనారు.

రియోడిజెనీరో - ధరిత్రీ సదస్సు: 1992, జూన్ 5న బ్రెజిల్‌లోని రియోడిజెనీరోలో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో సంతకాలు జరిగాయి. 1993, డిసెంబర్ 29న అమల్లోకి వచ్చింది. ఈ సదస్సులో జీవ వైవిధ్య సంరక్షణను మానవజాతి సమస్యగా గుర్తించారు.

నగోయా ప్రోటోకాల్: జపాన్‌లోని నగోయాలో 2010 అక్టోబర్‌లో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. ఇది 1992లో రియోడిజెనీరోలో జరిగిన సదస్సుకు అనుబంధంగా జరిగిన రెండో ఒప్పందం. 2014, అక్టోబర్ 12 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.

మాంట్రియల్ ఒప్పందం: సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా రక్షించే ఓజోన్ పొరకు జరుగుతున్న హానిని అరికట్టేందుకు 1987, సెప్టెంబర్ 16న కెనడాలోని మాంట్రియల్‌లో ప్రపంచ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఓజోన్ పొరకు నష్టాన్ని కల్గించే పదార్థాల ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇది 1989 జనవరిలో అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం అమలు ద్వారా అంటార్కిటికా ఖండం వద్ద ఓజోన్ పొరకు కలిగిన విఘాతాన్ని తగ్గిస్తున్నారు. 2050 నాటికి ఓజోన్ పొర యథాస్థితికి వస్తుందని భావిస్తున్నారు.

హైదరాబాద్ జీవవైవిధ్య సదస్సు: ఐక్యరాజ్య సమితి జీవవైవిధ్య సదస్సు హైదరాబాద్‌లో 2012, అక్టోబర్ 1 నుంచి 9 వరకు జరిగింది. 194 సభ్యదేశాలకు చెందిన పర్యావరణ, అటవీశాఖ మంత్రులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థలు కూడా పాల్గొన్నాయి. ఈ సదస్సులో జీవవైవిధ్యం, జీవరాసుల సంరక్షణపై చర్చ జరిగింది.

పారిస్ ఒప్పందం: వాతావరణ మార్పులపై పారిస్‌లో 2015, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు పర్యావరణ సదస్సు జరిగింది. 196 సభ్యదేశాలు హాజరయ్యాయి. 2016, ఏప్రిల్ నాటికి 174 దేశాలు సంతకాలు చేశాయి. భూగోళం వేడెక్కడంలో 2° C ఉష్ణోగ్రతను తగ్గించాలని ఈ సదస్సులో నిర్ణయించారు.

ఎకో సిటీ/ జీరో కార్బన్ సిటీ: ఎకో సిటీ అనే భావనను 1975లో కాలిఫోర్నియాలో బెర్‌కలీ రిచర్డ్‌ ప్రతిపాదించారు. కాలుష్యం లేకుండా ఉండేందుకు ప్రతి నగరంలో వివిధ చర్యలు చేపట్టాలి. పునరుత్పాదక శక్తివనరుల వాడకం పెంచాలి. పేదరికం తగ్గి, ఆర్థిక వృద్ధి పెరిగితే కాలుష్య నివారణ జరుగుతుంది. భారతదేశంలో ఎకోసిటీ కాన్ఫరెన్‌‌స బెంగళూరులో జరిగింది. ప్రపంచంలో జీరో కార్బన్ పట్టణం - మస్డర్(అబుదాబి).


మాదిరి ప్రశ్నలు

1. 2012లో జీవవైవిధ్య సదస్సు ఏ నగరంలో జరిగింది?
 1) వాషింగ్టన్ 
 2) హైదరాబాద్
 3) పారిస్ 
 4) న్యూయార్క్‌













































#Tags