Inspiring Success Story : నేటి యువ‌త‌కు ఇన్స్పిరేషన్.. ఈ గ్రూప్‌-1 ఆఫీస‌ర్ స‌క్సెస్ జ‌ర్నీ..

ల‌క్ష్యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌, క‌సి ఉంటే చాలు.. అది ఏ రంగంలోనైన విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించారు ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 టాప‌ర్‌.. ప్ర‌స్తుత బ‌ద్వేల్ ఆర్డీవో ఆకుల వెంకట రమణ. ఈయ‌న ప‌ట్టువ‌ద‌ల‌ని విక్రమార్కుడులా గ్రూప్‌-1 ప్రిప‌రేష‌న్‌లో ఏ సందర్భంలోనూ విసుగు, నిరాశ చెందకుండా.. స‌హ‌నంతో అనుకున్న ల‌క్ష్యం సాధించారు.

ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-1& 2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ది. క‌నుక ప్ర‌స్తుతం గ్రూప్‌-1& 2 ఉద్యోగాల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు ఆకుల వెంకట రమణ(ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 టాప‌ర్‌) సక్సెస్ జ‌ర్నీ మీకు మంచి ఇన్స్పిరేషన్ అవుతుంద‌నే ఉద్దేశ్యంతో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ అందిస్తున్న ప్ర‌త్యేక‌ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం : 
మా స్వస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురం. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న శ్రీరాములు, అమ్మ లక్ష్మీ నరసమ్మ. ఉన్న కొద్దిపాటి పొలం సాగు చేస్తూ .. వచ్చే ఆదాయంతోనే నన్ను, ఇద్దరు అన్నయ్యలను, తమ్ముడిని చదివించారు మా నాన్న‌. 

ఎడ్యుకేష‌న్ :

నా విద్యాభ్యాస మంతా మా స్వస్థలం మార్కాపురంలో ప్రభుత్వ పాఠశాలలోనే పూర్తయింది. 2000లో ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక.. బీటెక్ చదవాలనే కోరికతో ఒక సంవత్సరం పాటు సొంతంగానే ఎంసెట్‌కు ప్రిపేరై 2001లో వేయి ర్యాంకు సాధించా. బీటెక్ ఈసీఈ పూర్తవగానే క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థలో 2005లో సర్క్యూట్ డిజైన్ ఇంజనీర్‌గా ఉద్యోగం లభించింది.

నా జీవితంలో మలుపుతిప్పిన ఉద్యోగం ఇదే.. కానీ..

ప్రభుత్వ సర్వీసులవైపు దృష్టి పెట్టడానికి నా ఉద్యోగ జీవితమే కారణమని చెప్పొచ్చు. నేను జాబ్ చేసేటప్పుడు ఖాళీ సమయాల్లో సహచర ఉద్యోగులతో కలసి సమీప ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లి, అక్కడి విద్యార్థులకు క్లాసులు చెప్పేవాళ్లం. ఆ సందర్భంగా సమాజానికి ఎంతో అవసరమైన ప్రాథమిక విద్యలో లోటుపాట్లు ప్రత్యక్షంగా చూశాను. దీంతో ప్రభుత్వ సర్వీసుల ద్వారా మరింత సేవ చేయొచ్చనే భావనతో గమ్యాన్ని మార్చుకున్నాను. 2009లో ఉద్యోగానికి రాజీనామా చేసి.. సివిల్స్, గ్రూప్స్ ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను. 

వ్యక్తిగత ఖర్చుల కోసం కుటుంబంపై ఆధారపడటం ఇష్టం లేక..

సివిల్స్ లక్ష్యంగా 2011లో తొలి అటెంప్ట్ ఇచ్చాను. అందుకోసం శిక్షణ కూడా తీసుకున్నాను. అప్పుడు ప్రిలిమ్స్‌లో నెగ్గి మెయిన్స్ రాసినా.. ఫలితం రాలేదు. ఆ తర్వాత సంవత్సరం నుంచే సివిల్స్ పరీక్ష విధానంలో మార్పు వచ్చింది. దాంతో అప్పుడే వెలువడిన 2011 గ్రూప్-1పై దృష్టిపెట్టా.. ఒకవైపు ఉద్యోగానికి రాజీనామా.. మరోవైపు సొంత ప్రిపరేషన్ మొదలుపెట్టా. వ్యక్తిగత ఖర్చుల కోసం కుటుంబంపై ఆధారపడటం ఇష్టం లేక.. గ్రూప్-2, బ్యాంక్ పీఓ వంటి పరీక్షలకు జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్‌కు ఫ్యాకల్టీగా పనిచేశాను.

దురదృష్టవశాత్తు..

ఏపీపీఎస్సీ గ్రూప్-1కు తొలిసారిగా 2011లో హాజరయ్యాను. అప్పుడే ఇంటర్వ్యూ దశకు చేరుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు అది రద్ద అయింది. మళ్లీ 2012లో రీ-ఎగ్జామినేషన్ నిర్వహించి..  ఫలితాలు విడుదల చేయడం.. అందులో మార్కుల పరంగా గ్రూప్‌-1 టాపర్‌గా నిలిచాను. దాదాపు అయిదేళ్లపాటు సాగిన ఈ సుదీర్ఘ ప్రిపరేషన్‌లో ఏ సందర్భంలోనూ నేను విసుగు చెందలేదు. నిరాశకు గురవలేదు. ఆ సమయంలో మ‌రింత‌ పట్టుదలతో నా నైపుణ్యాలను మరింత పెంచుకునేందుకు కృషి చేశాను.

నా ఇంటర్వ్యూ..
నా గ్రూప్‌-1 ఇంటర్వ్యూ దాదాపు అరగంట సేపు జరిగింది. ఏపీపీఎస్‌సీ చైర్మన్ సహా నలుగురు సభ్యుల బోర్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో నా వ్యక్తిగత నేపథ్యం, బీటెక్ చదివి ప్రభుత్వ సర్వీసువైపు రావడానికి కారణం, ప్రభుత్వ శాఖల్లో అవినీతి, మావోయిస్ట్ సమస్య, తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలు, సామాజిక మార్పు అంటే ఏంటి? మా ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తవకపోవడానికి కారణం? ఇలా దాదాపు అన్ని అంశాలపై ప్రశ్నలు సంధించారు. అన్నిటికీ సంతృప్తికరంగా సమాధానాలిచ్చాను. 

ఇంటర్వ్యూ పూర్తయ్యాక విజేతల జాబితాలో నిలుస్తాననే నమ్మకం కలిగింది. గ్రూప్-1 జాబితాలో వచ్చిన మార్కుల ప్రకారం.. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చే అవ‌కాశ‌ముంద‌ని అనుకున్నా.. అలాగే.. వ‌చ్చింది.

ఇలా ప్రిప‌రేష‌న్ సాగిస్తే.. విజ‌యం మీదే..

గ్రూప్-1, సివిల్స్ వంటి పోటీ పరీక్షల అభ్యర్థులు ముందుగా వ్యక్తిగతంగా సహనం అలవర్చుకోవాలి. ఇది సుదీర్ఘంగా సాగే ఎంపిక ప్రక్రియ. ఏ సమయంలోనూ విసుగు చెందకుండా మానసికంగా స్థిరంగా ఉండాలి. ప్రిపరేషన్ పరంగా శిక్షణ తీసుకోవడం అనేది ఆయా అభ్యర్థుల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. బేసిక్స్‌పై పట్టు సాధించి విశ్లేషణాత్మక దృక్పథంతో చదివాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఫలితం గురించి ఆలోచించకుండా.. స్వయంకృషిని నమ్ముకొని ముందుకుసాగితే కొంత ఆలస్యమైనా విజయం వరిస్తుంది.

ప్ర‌స్తుతం ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 & 2 ఉద్యోగాల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులకు ఆకుల వెంకట రమణ గారు అందించిన సూచ‌న‌లు-స‌ల‌హాలు మీకు ఎంతో ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశం ఉంది. ఆకుల వెంకట రమణ గారు ప్ర‌స్తుతం బ‌ద్వేల్ ఆర్డీవోగా ప‌నిచేస్తున్నారు. అలాగే ఈయ‌న విధినిర్వ‌హ‌ణ‌లో కూడా నిజాయితీగానే ముందుకు సాగుతూ.. నేటి యువ‌త‌కు ఆద‌ర్శంగా ఉంటున్నారు.

#Tags