Paris Olympics: ఒలింపిక్స్‌లో పడి లేచిన తరంగం.. ‘మను’సంతా పతకమే!

జూలై 25, 2021, టోక్యో.. ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించకుండా తీవ్ర నిరాశ.. పని చేయని తుపాకీతో వేదనగా నిష్క్రమించిన రోజు..

జూలై 28, 2024, పారిస్‌.. ఫైనల్స్‌లో సత్తా చాటి ఒలింపిక్‌ కాంస్యం గెలుచుకున్న క్షణం.. గర్జించిన తుపాకీని గొప్పగా ప్రదర్శించిన రోజు..  
అవే ఒలింపిక్స్‌ క్రీడలు.. అదే 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌.. అదే ప్లేయర్‌.. కానీ తుది ఫలితం మాత్రం భిన్నం.. 

విజయాలు కొత్త కాదు.. 
మూడేళ్ల క్రితం మనూ భాకర్‌ టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది. 19 ఏళ్ల ఒక అమ్మాయి మెగా ఈవెంట్‌లో మొదటిసారి.. అదీ మూడు ఈవెంట్లలో పోటీ పడటం చిన్న విషయం కాదు. కానీ అసాధారణ ప్రతిభతో దూసుకొచ్చిన ఈ షూటర్‌ అలాంటి అవకాశం సృష్టించుకుంది. నిజానికి అప్పటి వరకు ఆమె సాధించిన ఘనతలే భాకర్‌పై అంచనాలు భారీగా పెంచేశాయి. చివరకు అదే ఒత్తిడి ఆమెను చిత్తు చేసింది. 

టోక్యో ఒలింపిక్స్‌కు ముందు వరకు పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకుంది. జూనియర్‌ వరల్డ్‌ కప్‌లో రెండు స్వర్ణాలు, యూత్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం, ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, వరల్డ్‌ కప్‌లలో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు.. ఇలా ఈ జాబితా చాలా పెద్దది. దాంతో ఇదే జోరులో ఒలింపిక్‌ పతకం కూడా దక్కుతుందని అంతా ఆశించారు. కానీ అది సాధ్యం కాలేదు. 

ఇదేదో ఆటలో ఓటమిలా కాదు! క్వాలిఫయింగ్‌ పోటీల్లో కీలక సమయంలో భాకర్‌ పిస్టల్‌ సాంకేతిక సమస్యల కారణంగా పని చేయలేదు. దానిని సరిచేసుకొని వచ్చేసరికి ఆరు నిమిషాల కీలక సమయం వృథా అయింది. అయినా సరే 60 షాట్‌ల ద్వారా 575 పాయింట్లు సాధించడం విశేషం. చివరకు కేవలం రెండు పాయింట్ల తేడాతో ఫైనల్‌ అవకాశం కోల్పోయిన మను కన్నీళ్లపర్యంతమైంది. ఈ ప్రభావం మరో రెండు ఈవెంట్లపై పడి ఆమె కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది.  

Manu Bhaker: రికార్డు.. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన‌ తొలి భారతీయ మహిళా షూటర్ ఈమెనే..

మళ్లీ మొదలు..  
ఒలింపిక్‌ పతకం ప్రతిభ ఉంటేనే కాదు.. ధైర్యవంతులకే దక్కుతుంది! శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు ఓటమి భారంతో కుంగిపోయిన దశ నుంచి మళ్లీ పైకి లేవడం ఎంతో ధైర్యం ఉంటే తప్ప సాధ్యం కాదు. గొప్ప గొప్ప ఆటగాళ్లు కూడా ఇలాంటి పరాజయం తర్వాత కుప్పకూలిపోతారు. టోక్యో ఒలింపిక్స్‌ వైఫల్యం తర్వాత ఇతర షూటర్లు అపూర్వీ చండీలా, అభిషేక్‌ వర్మ, మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో ఆమె సహచరుడు సౌరభ్‌ చౌదరీ మళ్లీ కెరీర్‌లో ముందుకు వెళ్లలేక దాదాపుగా షూటింగ్‌కు దూరమయ్యారు. ఒకదశలో మనూ కూడా అలాగే ఆలోచించింది. 

షూటింగ్‌ తనలో ఆసక్తి రేపడం లేదని, ఇక ఆటకు గుడ్‌బై చెప్పి సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకుంది. కానీ సన్నిహితుల కారణంగా ‘చివరిసారిగా మళ్లీ ప్రయత్నిద్దాం’ అనే ఆలోచన మళ్లీ షూటింగ్‌లో కొనసాగేలా చేసింది. ఈసారి కూడా అంతే స్థాయిలో కఠోర సాధన చేసింది. ఏకాగ్రత చెదరకుండా ఒకే లక్ష్యానికి గురి పెట్టింది. దాంతో మళ్ళీ ఫలితాలు వచ్చాయి.  జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో స్వర్ణం, వరల్డ్‌ కప్‌లలో రెండు కాంస్యాలు, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, కాంస్యాలు దక్కాయి. 

అయితే పారిస్‌ క్రీడలకు ముందు గత రికార్డులను ఆమె పట్టించుకోలేదు. తనపై అంచనాలు లేకపోవడమే మంచిదని భావించి ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మెగా ఈవెంట్‌లోకి అడుగు పెట్టి పతకంతో తన విలువను ప్రదర్శించింది. కానీ ఈ మూడు సంవత్సరాల మూడు రోజుల వ్యవధి ఒక చాంపియన్‌ ప్లేయర్‌ కెరీర్‌లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది.. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని గెలుపు వైపు ఎలా సాగాలో చూపించింది. 22 ఏళ్ల వయసులో మనూ భాకర్‌ ఇప్పుడు ఒలింపిక్‌ పతక విజేతగా తానేంటో నిరూపించుకుంది. గత ఒలింపిక్స్‌ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ సగర్వంగా నిలిచింది. 

Paris Olympics: ఒలింపిక్స్‌లో పాల్గొనే హైదరాబాద్‌ అమ్మాయిలు వీరే..

నాన్న అండతో..  
హరియాణాలోని ఝఝర్‌ జిల్లా గోరియా మనూ భాకర్‌ స్వస్థలం. తండ్రి రామ్‌కిషన్‌ భాకర్‌ మర్చంట్‌ నేవీలో చీఫ్‌ ఇంజినీర్‌. చిన్నప్పటి నుంచి ఆయన తన కూతురు ఆసక్తి కనబర్చిన ప్రతీ చోటా ప్రోత్సహించాడు. టెన్నిస్, స్కేటింగ్, మార్షల్‌ ఆర్ట్స్‌.. ఇలా అన్నీ ఆడించాడు. ఒకదశలో బాక్సింగ్‌పై బాగా ఆసక్తి కనబర్చి ఎక్కువ సమయం ఈ గేమ్‌పై దృష్టి పెట్టింది. కానీ 14 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇదీ నచ్చలేదు. చివరకు తండ్రికి చెప్పి షూటింగ్‌ వైపు మరలగా.. ఆయన ఇక్కడా వద్దనలేదు. 

కేవలం రెండేళ్ల శిక్షణ, సాధనతో షూటింగ్‌లో మనూ దూసుకుపోవడం విశేషం. 15 ఏళ్ల వయసులో జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో అగ్రశ్రేణి షూటర్‌ హీనా సిద్ధూను ఓడించి సంచలనం సృష్టించడంతో పాటు ఈ టోరీ్నలో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు సాధించడంతో అందరి దృష్టి భాకర్‌పై పడింది. ఆ తర్వాత 16 ఏళ్ల వయసులో మెక్సికోలో జరిగిన వరల్డ్‌ కప్‌లో స్వర్ణం గెలుచుకొని పిన్న వయసులో ఈ ఘనత సాధించిన షూటర్‌గా నిలిచిన తర్వాత మనూ కెరీర్‌ బుల్లెట్‌లా దూసుకుపోయింది.

Paris Olympics: ఒలింపిక్స్‌కు భారత్‌ బలగం రెడీ.. 16 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు పోటీ

#Tags