భారతదేశం - పవన విద్యుత్

సి.హరికృష్ణ, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్.
2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్.. పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని రికార్డు స్థాయిలో పెంచుకుంది. 2016-17లో 4,000 మెగావాట్ల సామర్థ్యం పెంపును లక్ష్యంగా పెట్టుకోగా 5,400 మెగావాట్లను సాధించింది. 2015-16లో 3,423 మెగావాట్ల సామర్థ్యం పెంపు నమోదైంది. 2016-17లో పవనశక్తి సామర్థ్యం పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ 2190 మెగావాట్లతో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో గుజరాత్ (1275 మెగావాట్లు), కర్ణాటక (822 మెగావాట్లు) ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా 23 మెగావాట్ల పవనశక్తి పెంపు మాత్రమే నమోదైంది.

భారత్ భవిష్యత్‌లో పవనశక్తి ఉత్పాదన స్థాపిత సామర్థ్యాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది. దేశంలో పునరుత్పాదక శక్తి వనరుల అభివృద్ధిలో భాగంగా నవీన, పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ పవనశక్తి ఉత్పాదన, అభివృద్ధికి కృషి చేస్తోంది.

పవన శక్తి, ఆవశ్యకత
కదులుతోన్న గాలి నుంచి ఉత్పత్తి చేసే శక్తినే పవన శక్తి అంటారు. భారత్‌లో గ్రిడ్ ఆధారిత స్థూల పవన శక్తి సామర్థ్యం 1,02,788 మెగావాట్లుగా అంచనా. ముఖ్యంగా చదరపు మీటర్‌కు 200 వాట్ల కంటే అధిక పవనశక్తి సాంద్రత కలిగిన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని దేశ స్థూల పవన శక్తి సామర్థ్యాన్ని అంచనా వేశారు.

ప్రస్తుతం భారత్‌కు పవన శక్తి ఉత్పాదన ఎంతైనా అవసరం. బొగ్గుపై ఆధారపడే కొద్దీ గ్రీన్‌హౌస్ ఉద్గారాల విడుదల పెరుగుతూనే ఉంటుంది. దీంతోపాటు పారిస్ ఒప్పందంలో భాగంగా భారత్ ఏర్పరచుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు నవీన-పునరుత్పాదక శక్తి వనరులపై ఆధారపడటం ఎంతైనాఅవసరం.

త్వరితగతిన లక్ష మెగావాట్లకు మించి స్థూల పవనశక్తి సామర్థ్యాన్ని చేరుకోవడం మన దేశానికి ఎంతైనా అవసరం. 2030 నాటికి దేశ స్థాపిత శక్తి సామర్థ్యంలో 40 శాతం మేరకు పునరుత్పాదక శక్తిని సాధించాలని పారిస్ ఒప్పందంలో భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందుకే భారత ప్రభుత్వం సౌర శక్తి, పవన శక్తి, చిన్న తరహా జల విద్యుత్, జీవ శక్తి, వ్యర్థాల నుంచి శక్తి వంటి పునరుత్పాదక శక్తి వనరుల విస్తరణ, ఉత్పాదనలపై ప్రత్యేక దృష్టిసారించింది.

గ్రిడ్ ఆధారిత పవన శక్తి ఉత్పాదనా లక్ష్యంతో భారత్ రెండు రకాల విండ్ టర్బైన్ల ఏర్పాటుపై దృష్టిసారించింది. ఇందులో మొదటి రకం స్టాల్ రెగ్యులేటెడ్ విండ్ టర్బైన్లు. వీటిలో స్థిర రోటార్ బ్లేడ్లు ఉంటాయి. రెండో రకం పిచ్ రెగ్యులేటెడ్ విండ్ టర్బైన్లు. వీటిలో అడ్జస్టబుల్ రోటార్ బ్లేడ్లు ఉంటాయి. గాలి వేగం, దిశను బట్టి రోటార్ బ్లేడ్లు తమ దిశను మార్చుకుంటాయి.

పవన శక్తి వనరుల అంచనా
  • చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ, రాష్ట్ర నోడల్ ఏజెన్సీల సహకారంతో నవీన, పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో పవనశక్తి వనరులను అంచనా వేసే లక్ష్యంతో నేషనల్ విండ్ రిసోర్స్ అసెస్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
  • ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 70 మీటర్ల నుంచి 120 మీటర్ల ఎత్తులో 794 విండ్ మానిటరింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో పవన సామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో అంచనా కార్యక్రమాన్ని అమలు చేయగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నారు.
  • వీటికి అదనంగా దేశ వ్యాప్తంగా ప్రైవేటు విండ్ మానిటరింగ్ స్టేషన్లు కూడా పనిచేస్తున్నాయి. ఇలా ఏర్పాటు చేసిన విండ్ మానిటరింగ్ స్టేషన్ల సహకారంతో నవీన, పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ చ.మీ.కు 200 వాట్ల పవన శక్తి సామర్థ్యంతో 237 కేంద్రాలను గుర్తించింది.
  • నవీన, పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ దేశంలో పవనశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వీటితోపాటు 9 రాష్ట్రాల్లోని 33 ప్రాంతాల్లో 71 మెగావాట్ల పవనశక్తి సామర్థ్యానికి ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు డిమానిస్ట్రేషన్ కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో అమలవుతోంది.
  • దేశంలో పవన విద్యుత్ జనరేటర్ల ఉత్పాదనకు సుమారు 12 ప్రధాన కంపెనీలు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తిగా సొంత టెక్నాలజీతో పనిచేస్తున్నాయి. ఇందులో భారత్ కంపెనీలు కూడా ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు విదేశీ కంపెనీలకు అనుబంధంగా పనిచేస్తుండగా, కొన్ని జాయింట్ వెంచర్లతో ముందుకెళ్తున్నాయి. ప్రస్తుతం దేశ వార్షిక దేశీయ విండ్ టర్బైన్ల ఉత్పాదన సామర్థ్యం 9500 మెగావాట్లుగా ఉంది.
  • నవీన, పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ దేశంలో పవనశక్తి అభివృద్ధికి ఉద్దేశించిన మార్గదర్శకాలను 1995 జూలై నుంచి విడుదల చేస్తోంది.
  • దేశంలో పవనశక్తి వనరుల అంచనా కోసం, అదేవిధంగా టెస్టింగ్, సర్టిఫికేషన్ కోసం చెన్నైలో (1998లో) స్వయంప్రతిపత్తి కలిగిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీని ఏర్పాటు చేశారు. ప్రారంభంలో దీన్ని సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ టెక్నాలజీగా వ్యవహరించేవారు.
  • చిన్నతరహా విండ్ టర్బైన్లు, విండ్ సోలార్ హైబ్రిడ్ వ్యవస్థల వ్యాప్తిని ప్రోత్సహించే లక్ష్యంతో నవీన, పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ స్మాల్ విండ్ ఎనర్జీ అండ్ హైబ్రిడ్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీంతోపాటు ఆఫ్ గ్రిడ్ ఆధారిత విండ్ - సోలార్ హైబ్రిడ్ వ్యవస్థల స్థాపనకు ఆర్థిక సాయం అందిస్తోంది. విండ్ మిల్లులు, ఏరోజనరేటర్లు, విండ్ సోలార్ హైబ్రిడ్ వ్యవస్థల ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించడం, క్షేత్ర పరీక్షలను నిర్వహించడం, సామర్థ్య అంచనా నిర్వహణ, అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహిచడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం.
  • నవీన, పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ.. ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిం, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో 25 ఎస్‌డబ్ల్యూఈఎస్ ప్రాజెక్ట్‌లను నిర్వహించాలని నిర్ణయించింది. దీంతోపాటు ఎస్‌డబ్ల్యూఈఎస్‌లో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తోంది. విండ్ సోలార్ హైబ్రిడ్ సిస్టంలోని ఎలక్ట్రానిక్స్ వ్యవస్థల్లో సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ప్రతికూల పరిస్థితుల్లో సైతం పనిచేసే విధంగా రీసెర్‌‌చ అండ్ డెవలప్‌మెంట్‌నుప్రోత్సహిస్తుంది. ఈ రంగంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ర్టం ఎస్‌డబ్ల్యూఈఎస్‌లో దాదాపు 1468.6 కిలోవాట్ల స్థాపిత శక్తి ఉత్పత్తిని సాధించింది. తర్వాత స్థానంలో గోవా (193.8 కిలోవాట్లు), మేఘాలయ (191.5 కిలోవాట్లు), మణిపూర్ (140 కిలోవాట్లు) ఉన్నాయి.
  • పవనశక్తి రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో 2016-17లో నవీన, పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ అనేక విధానపరమైన మార్పులను తీసుకొచ్చింది. పవనశక్తి రంగంలో విండ్ పవర్ ప్రాజెక్ట్‌ల అభివృద్ధికి సరికొత్త మార్గదర్శకాలు, విండ్-సోలర్ హైబ్రిడ్ విధానానికి సంబంధించిన ముసాయిదా వంటివి వీటిలో ముఖ్యమైనవి.
  • సుదూర, ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో పవనశక్తి సామర్థ్య పెంపు, విస్తరణలకు కృిషి చేయడం ద్వారా మాత్రమే ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూకశ్మీర్‌లో తలసరి శక్తి లభ్యతను పెంచేందుకు వీలవుతుంది.

ఎంతో అవసరం
  • వ్యవసాయం, ఆరోగ్యం, జీవవైవిధ్యం, సహజ ఆవాసాలపై తీవ్ర ప్రభావనికి కారణమవుతున్న గ్రీస్‌హౌస్ ఉద్గారాల ఆధారిత శీతోష్ణస్థితి మార్పును నివారించేందుకు, పారిస్ ఒప్పంద లక్ష్యాల సాధనకు, బొగ్గు వినియోగ తగ్గింపునకు, సుదూర ప్రాంతాలకు శక్తి భద్రత కల్పించేందుకు భారత్‌కు పవనశక్తి ఉత్పాదన, విస్తరణ ఎంతైనా అవసరం.






#Tags