G7 Summit 2024: ఈ దేశం అండతోనే.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం!!

2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది.

ఉక్రెయిన్‌పై రెండేళ్లకుపైగా దాడులు కొనసాగించే శక్తి రష్యాకు ఎలా వచ్చింది? అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు డ్రాగన్‌ దేశం చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. చైనా అండదండలతోనే ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోందని, సాధారణ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని జీ7 దేశాలు ఆరోపించాయి. 

ఇటలీలో సమావేశమైన జీ7 దేశాల అధినేతలు తాజాగా ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అండ చూసుకొని రష్యా రెచ్చిపోతోందని ఆరోపించారు. రష్యా యుద్ధ యంత్రానికి చైనానే ఇంధనంగా మారిందని జీ7 దేశాలు మండిపడ్డారు. రష్యాకు మిస్సైళ్లు డ్రోన్లు చైనా నుంచే వస్తున్నాయని ఆక్షేపించారు. 

జీ7 దేశాలు సాధారణంగా రష్యాను తమ శత్రుదేశంగా పరిగణిస్తుంటాయి. ఈ జాబితాలో ఇప్పుడు చైనా కూడా చేరినట్లు కనిపిస్తోంది. మారణాయుధాలు తయారు చేసుకొనే పరిజ్ఞానాన్ని రష్యాకు డ్రాగన్‌ అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విమర్శించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు చైనా నేరుగా ఆయుధాలు ఇవ్వకపోయినా ఆయుధాల తయారీకి అవసరమైన విడిభాగాలు, ముడి సరుకులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తోందని ఆక్షేపించారు.  

G7 Summit: ఈ దేశానికి రుణ ప్యాకేజీని ప్రకటించిన జీ7 దేశాల కూటమి!

చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన  
ఉక్రెయిన్‌లో మారణహోమం సృష్టించేలా రష్యాకు సహకరిస్తున్న దేశాలపై, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకతప్పదని జీ7 దేశాల అధినేతలు తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధమైన యుద్ధానికి మద్దతివ్వడం మానుకోవాలని హితవు పలికాయి. ఉక్రెయిన్‌పై దాడుల తర్వాత రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో తమకు అవసరమైన సరుకులను చైనా నుంచి రష్యా దిగుమతి చేసుకుంటోంది. అలాగే రష్యా నుంచి చైనా చౌకగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇరుదేశాలు పరస్పరం సహరించుకుంటున్నాయి. 

టిబెట్, షిన్‌జియాంగ్‌తోపాటు హాంకాంగ్‌లో చైనా దూకుడు చర్యలను జీ7 సభ్యదేశాలు తప్పుపట్టాయి. చైనా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఆరోపించాయి. మరోవైపు డ్రాగన్‌ దేశం అనుసరిస్తున్న వ్యాపార విధానాలను అమెరికాతోపాటు యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) దేశాలు తప్పుపడుతున్నాయి. 

వీటి తయారీకి చైనా ప్రభుత్వం రాయితీ!
ఎలక్ట్రికల్‌ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులు, సోలార్‌ ప్యానెళ్ల తయారీకి చైనా ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోంది. దీంతో ఇవి చౌక ధరలకే అందుబాటులో ఉంటూ విదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా ఆయా దేశాల్లో వీటిని తయారు చేసే కంపెనీలు గిరాకీ లేక మూతపడుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల్లో కోతపడుతోంది. చైనా దిగుమతులతో పశ్చిమ దేశాలు పోటీపడలేకపోతున్నాయి. చైనా ఎత్తుగడలను తిప్పికొట్టడానికి చైనా ఉత్పత్తులపై అమెరికాతోపాటు ఈయూ దేశాలు భారీగా పన్నులు విధిస్తున్నాయి.   

G7 Summit 2024: జీ-7 దేశాల సమ్మిట్.. జ‌రిగింది ఎక్క‌డంటే..

#Tags