174 కాలేజీల్లో అడ్మిషన్లకు నేడు నోటిఫికేషన్! పాత విధానంలోనే కౌన్సెలింగ్

హైదరాబాద్: 174 కాలేజీలకు సుప్రీంకోర్టు అనుమతి మేరకు ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ కోసం శనివారం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే షెడ్యూల్‌పై ప్రభుత్వంతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
  • సర్కారుతో చర్చించి నిర్ణయిస్తామన్న టీ-విద్యా మండలి
  • కౌన్సెలింగ్ నిర్వహణ మాదేనన్న ఏపీ మండలి
  • పాత విధానంలోనే కౌన్సెలింగ్
కాగా, సంబంధిత అథారిటీనే కౌన్సెలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు తాజాగా సవరణ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను గతంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాతినిధ్యంతో నియమించిన ప్రవేశాల కమిటీ నేతృత్వంలోనే చేపట్టే అవకాశముంది. అదే కమిటీకి ప్రవేశాలను చే పట్టే బాధ్యతను అప్పగించామని ఏపీ ఉన్నత విద్యా మండలి పేర్కొంటుండగా, సుప్రీం ఆదేశాల ప్రకారం ‘సంబంధిత అథారిటీ’ అన్నందున తామే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి పేర్కొంటోంది. శనివారం ప్రభుత్వంతో చర్చించి ప్రవేశాల షెడ్యూలును జారీ చేస్తామని టీ-విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. 14వ తేదీ నాటికి ప్రవేశాలు చేపట్టి, 15 నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపడతామన్నారు. మరోవైపు సుప్రీం తాజా సవరణ ఉత్తర్వుల్లో సంబంధిత అథారిటీ అని పేర్కొనడమేకాకుండా గతంలో ప్రవేశపరీక్ష నిర్వహించిన స్టేట్ అని కూడా పేర్కొందని, విభజన చట్టంలోనూ ప్రవేశాల నిర్వహణ బాధ్యత తమకే అప్పగించినట్లు ఉందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. అయితే గతంలో మాదిరిగానే ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్, కోకన్వీనర్లకే బాధ్యత అప్పగించామని చెప్పారు.

పాత విధానంలోనే కౌన్సెలింగ్
సాక్షి, న్యూఢిల్లీ:
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతించిన సుప్రీంకోర్టు... బుధవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేసింది. ఎంసెట్ కౌన్సెలింగ్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కానీ బుధవారం కోర్టు ఉత్తర్వుల కాపీలో కౌన్సెలింగ్‌కు కళాశాలలే దరఖాస్తులను ఆహ్వానించాలని ప్రచురితమైంది. దీనిని సవరిస్తూ సంబంధిత ఆధీకృత సంస్థ (ఉన్నత విద్యా మండలి) కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని పేర్కొంది.

#Tags