Telangana DSC 2024 Exams: నేటి నుంచి తెలంగాణ డీఎస్సీ పరీక్షలు..

స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పరీక్షకు 1.60 లక్షల మంది, సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ (ఎస్జీటీ) పోస్టుల కోసం 80 వేల మంది దరఖాస్తు చేశారు. మిగతా వారిలో భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులున్నారు. తొలిసారిగా కంప్యూటర్‌ బేస్డ్‌ (ఆన్‌లైన్‌)గా జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా..ఒక్క గ్రేటర్‌ హైదరాబా ద్‌ పరిధిలోనే 27 కేంద్రాలున్నాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 

బయో మెట్రిక్‌ హాజరు: అభ్యర్థులకు బయో మెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి రోజూ రెండు షిఫ్టులుగా పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ ఒక విడత, సాయంత్రం 2 నుంచి 4.30 గంటల వరకు మరో విడత ఉంటుంది. 

AP EAPCET Seat Allotment 2024 : బ్రేకింగ్ న్యూస్‌.. ఏపీ ఈఏపీసెట్‌-2024 తొలి రౌండ్‌ సీట్ల కేటాయింపు.. ఈ లింక్ క్లిక్ చేయండి.. మీ కాలేజీని చెక్ చేసుకోండిలా..

జూలై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో పరీక్ష ఉండదు. ఎస్‌ఏ పరీక్షను జూలై 18, 20, 22, 24, 25, 30, 31, ఆగస్టు 1, 2 తేదీల్లో చేపడతారు. పీఈటీ పరీక్షను జూలై 18, 26 తేదీల్లో నిర్వహిస్తున్నారు. భాషా పండితులకు జూలై 26, ఆగస్టు 2, 5 తేదీల్లో డీఎస్సీ ఉంటుంది. పీఈటీలకు ఆగస్టు 5న, ఎస్‌జీటీలకు జూలై 19, 22, 23, 26, ఆగస్టు 1వ తేదీన పరీక్ష ఉంటుంది. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు జూలై 20న నిర్వహిస్తారు.  

ఆరేళ్ల తర్వాత..: ఉమ్మడి రాష్ట్రంలో 2012 ఆగస్టు 27, 28, 29 తేదీల్లో డీఎస్సీ నిర్వహించారు. చివరిసారిగా 2018 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ (టీఆర్‌టీ) పేరుతో జరిగింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ డీఎస్సీ జరుగుతోంది. దీంతో నిరుద్యోగులు ఈ పోస్టులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి 2023లో 5 వేల పోస్టులకు డీఎస్సీ నిర్వహించాలనుకున్నా వివిధ కారణాల వల్ల ఆగిపోయింది.  

వివాదాల మధ్య..: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేస్తారని భావించినా కేవలం 11,062 పోస్టులకే డీఎస్సీ నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్‌ ఇచ్చిన దగ్గర్నుంచీ రకరకాల వివాదాలు చుట్టుముట్టాయి. ఖాళీలన్నీ డీఎస్సీలో చేర్చాలని నిరుద్యోగులు పట్టుబట్టారు. ఆ తర్వాత టెట్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో డీఎస్సీ నిర్వహణకు మరికొంత సమయం ఇవ్వాలన్న డిమాండ్‌ తెరమీదకొచ్చింది. 

Recruitment Drive: 600 ఉద్యోగాలకు 25వేల మంది పోటీ.. ఎయిర్‌పోర్ట్‌లో తొక్కిసలాట

టెట్, డీఎస్సీ సిలబస్‌ వేరని, ఇప్పటికిప్పుడు పరీక్ష చేపడితే సన్నద్ధత కష్టమని కొత్తగా టెట్‌ ఉత్తీర్ణులైనవారు ఆందోళనకు దిగారు. కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ సమయంలో కూడా డీఎస్సీ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

ఇప్పటికీ 20 శాతం మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోలేదు. వీరిలో కోర్టును ఆశ్రయించిన వాళ్ళు కూడా ఉన్నారు. న్యాయస్థానం చివరి నిమిషంలో తమకు అనుకూలంగా ఆదేశాలు ఇస్తుందనే ఆశతో వీరు ఉన్నారు. అయితే డీఎస్సీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం గురువారం నుంచి పరీక్ష నిర్వహణకు సిద్ధమైంది. 

#Tags