ఫిబ్రవరి 2019 అవార్డ్స్

ఏపీ, తెలంగాణలకు డిజిటల్ ఇండియా అవార్డులు
వివిధ విభాగాల్లో మెరుగైన సాంకేతిక సేవలకుగాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు డిజిటల్ ఇండియా అవార్డులు దక్కాయి. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 22న ఢిల్లీలో జరిగింది. భూ రికార్డుల్లో పారదర్శకత పాటించినందుకు ఏపీకి దక్కిన గోల్డ్ అవార్డును కేంద్ర మంత్రి రవి శంకర్‌ప్రసాద్ చేతుల మీదుగా సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ చెరుకూరి అందుకున్నారు. బెస్ట్ మొబైల్ యాప్ విభాగంలో (మీ సేవ) ఏపీకి దక్కిన సిల్వర్ అవార్డును మీ సేవ డిప్యూటీ డెరైక్టర్ ముత్తు రామస్వామి అందుకున్నారు. స్పెషల్ మెన్షన్ అవార్డు విభాగంలో ఏపీ రెరాకు దక్కిన అవార్డును ఆ శాఖ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీధర్ పోపురి అందుకున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి.. మహబూబ్‌నగర్ జిల్లా వెబ్‌సైట్‌కు వెబ్త్న్ర అవార్డు, ఔట్ స్టాండింగ్ డిజిటల్ ఇనిషియేటివ్ బై లోకల్ బాడీ కింద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్లాటినం అవార్డు, బెస్ట్ మొబైల్ యాప్ విభాగంలో టీ యాప్ ఫోలియోకి సిల్వర్ అవార్డులు దక్కాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏపీ, తెలంగాణలకు డిజిటల్ ఇండియా అవార్డులు
ఎప్పుడు : ఫిబ్రవరి 22న
ఎందుకు : మెరుగైన సాంకేతిక సేవలకుగాను
ఎక్కడ : న్యూఢిల్లీ

మన్మోహన్‌కు పీవీ’ అవార్డ్
2018 సంవత్సరానికి గానూ పీవీ నరసింహరావు జీవన సాఫల్య పురస్కారాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫిబ్రవరి 27న ప్రదానం చేయనున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదానం జరుగనుందని ఇండియా నెక్ట్స్ సంస్థ కన్వీనర్ సూర్యప్రకాశ్ ఫిబ్రవరి 22న తెలిపారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య అధ్యక్షతన లోక్‌సభ సెక్రటేరియట్ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, ఐపీఎస్ అధికారి కార్తికేయన్, లోక్‌సత్తా కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ్, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్ర మూర్తి, పీఐబీ మాజీ చీఫ్ నరేంద్ర సభ్యులుగా ఉన్న జ్యూరీ మన్మోహన్ సింగ్‌ను ఈ అవార్డ్‌కు ఎంపిక చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మన్మోహన్‌కు పీవీ నరసింహరావు జీవన సాఫల్య పురస్కారం
ఎవరు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎక్కడ : న్యూఢిల్లీ

మోదీకి సియోల్ శాంతి బహుమతి ప్రదానం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక సియోల్ శాంతి పురస్కారం అందుకున్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆయన ఫిబ్రవరి 22న జరిగిన ఓ కార్యక్రమంలో సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్.. మోదీకి పురస్కారాన్ని అందజేసింది. అవార్డు కింద జ్ఞాపికతోపాటు రెండు లక్షల అమెరికన్ డాలర్లను అందజేశారు. రెండేళ్లకోసారి అందజేసే ఈ పురస్కారాన్ని 2018 సంవత్సరానికిగాను మోదీకి అందజేశారు. మోదీపై చిత్రీకరించిన ప్రత్యేక షార్ట్‌ఫిల్మ్‌ను కూడా ప్రదర్శించారు. ఈ అవార్డు ప్రారంభమయ్యాక.. దీనిని అందుకున్న 14వ వ్యక్తి మోదీ. గతంలో సియోల్ శాంతి పురస్కారాన్ని ఐక్యరాజసమితి ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన కోఫీ అన్నన్, బాన్ కీ మూన్‌లకు దక్కింది. మరికొందరు ప్రముఖులను కూడా ఈ పురస్కారం వరించింది. అవార్డును అందుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఈ అవార్డు వ్యక్తిగతంగా తన ఒక్కడికి మాత్రమే కాదని.. యావత్ భారత ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత్ ప్రధాని నరేంద్రమోదీకి సియోల్ శాంతి బహుమతి
ఎవరు: నరేంద్రమోదీ
ఎప్పుడు: ఫిబ్రవరి 22
ఎక్కడ : దక్షిణ కొరియా (సియోల్)

ఆస్కార్ అవార్డులు-2019
2018 సంవత్సరానికిగాను ఆస్కార్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్‌‌ట్స అండ్ సెన్సైస్ (Academy of Motion Picture Arts and Sciences-AMPAS) ఫిబ్రవరి 25న ప్రకటించింది. అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని డాల్బి థియేటర్‌లో 91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలు బహుమతులు అందుకున్నారు. వ్యాఖ్యాత లేకపోయినా మాయ రుడాల్ఫ్, టినా ఫే, అమీ పోయిల్హర్ అవార్డ్ షోను విజయవంతంగా ప్రారంభించారు. 1989 తర్వాత వ్యాఖ్యాత లేకుండా ఆస్కార్ అవార్డుల ఉత్సవం జరగడం ఇది రెండో సారి.
ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ‘గ్రీన్‌బుక్’కు అవార్డు లభించింది. ‘బొహెమియన్ రాప్సోడి’ చిత్రానికి నాలుగు,‘ రోమా’,‘ బ్లాక్ పాంథర్’ సినిమాలకు చెరి మూడు ఆస్కార్‌లు దక్కాయి. ఈ పురస్కారాల్లో భారతీయ డాక్యుమెంటరీ ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’కి అవార్డు దక్కింది.
భారతీయ ఫ్రెడ్డీ
భారతీయ మూలాలున్న వ్యక్తికి సంబంధించిన పాత్ర పోషించిన నటుడికి కూడా 91వ ఆస్కార్ అవార్డుల్లో ఓ పురస్కారం దక్కింది. బొహెమియన్ రాప్సోడీ చిత్రంలో ఫ్రెడ్డీ మెర్కూరీ పాత్రలో నటించినందుకు ఉత్తమ నటుడి అవార్డుకు రామి మలేక్ ఎంపికయ్యారు. ఆ చిత్రం ఫ్రెడ్డీ మెర్యూరీ జీవితం ఆధారంగా తెరకెక్కిందే.
అవార్డు విజేతల జాబితా
ఉత్తమ చిత్రం: గ్రీన్‌బుక్
ఉత్తమ డెరైక్టర్: అల్ఫాన్సో క్వేరాన్ (రోమా)
ఉత్తమ నటుడు : రమీ మాలిక్ (బొహెమియన్ రాప్సోడి)
ఉత్తమ నటి: ఒలివియా కోల్మన్ (ద ఫెవరెట్)
ఉత్తమ సహాయ నటుడు: మహర్షెల్లా అలీ (గ్రీన్‌బుక్)
ఉత్తమ సహాయ నటి : రెజీనా కింగ్ (ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)
ఒరిజినల్ స్క్రీన్ ప్లే : గ్రీన్‌బుక్
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : బ్లాక్లాంన్స్‌మాన్ (స్పైక్ లీ)
ఉత్తమ విదేశీ చిత్రం : రోమా
యానీమేటెడ్ ఫీచర్ : స్పైడర్‌మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వర్స్
సౌండ్ ఎడిటింగ్ : బొహెమియన్ రాప్సోడి
విజువల్ ఎఫెక్ట్స్ : ఫస్ట్‌మ్యాన్
ఫిల్మ్ ఎడిటింగ్ : బొహెమియన్ రాప్సోడి
యానీమేటెడ్ షార్ట్: బావ్
లైవ్ యాక్షన్ షార్ట్: స్కిన్
డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్: పీరియడ్: ది ఎండ్ ఆఫ్ సెంటెన్స్
ఒరిజినల్ స్కోర్ : బ్లాక్ పాంథర్
ఒరిజినల్ సాంగ్ : షాలో (ఏ స్టార్ ఈజ్ బార్న్)
ప్రొడక్షన్ డిజైన్: బ్లాక్ పాంథర్ (రూత్ కార్టర్)
సినిమాటోగ్రఫీ : రోమా (అల్ఫాన్సో క్వేరాన్)
క్యాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్ (హన్నా బీచ్లర్ )
మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: వైస్ ( గ్రెగ్ కన్నమ్, కేట్ బిస్కోయి, పాట్రికా డిహానీ లీ)
డాక్యుమెంటరీ ఫీచర్: ఫ్రీ సోలో
సౌండ్ మిక్సింగ్ : బొహెమియన్ రాప్సోడి
డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్
భారత దేశంలో బహిష్టు సమయంలో స్త్రీలు ప్యాడ్స్ వాడే స్థితికి ఇంకా రాకపోవడం గురించి, నెలసరిపై సాంఘిక ప్రతిబంధకాలు ఉండటం గురించి తీసిన డాక్యుమెంటరీ ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెన్‌టెన్స్’ ఆస్కార్ బరిలో అవార్డు గెలుచుకుని వార్తలకెక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని కతిఖేరా గ్రామం(ఢిల్లీ సమీపం)లో కొంతమంది స్త్రీలు తయారు చేస్తున్న శానిటరీ ప్యాడ్స్ గురించి ఈ డాక్యుమెంటరీ తీశారు.

ఏపీకి ఏడు జాతీయ జల పురస్కారాలు
ఆంధ్రప్రదేశ్‌కు ఏడు జాతీయ జల పురస్కారాలు లభించాయి. ఢిల్లీలో ఫిబ్రవరి 25న నిర్వహించిన జాతీయ జల పురస్కారాలు-2018 ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ చేతుల మీదుగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు.
విభాగాల వారీగా అవార్డులు...
ఉత్తమ రాష్ట్రాల విభాగం- ఏపీకి తృతీయ పురస్కారం
నదుల పునరుజ్జీవన విభాగం
  1. కర్నూలు జిల్లా (కుందూ నది)కు మొదటి పురస్కారం
  2. కడప జిల్లా (పాపాఘ్ని నది)కు ప్రోత్సాహక బహుమతి
భూగర్భ జలం పెంపు విభాగం
  1. అనంతపురం జిల్లాకు ప్రథమ పురస్కారం
  2. విశాఖపట్నం జిల్లాకు ప్రోత్సాహక అవార్డు
నీటి నిర్వహణ విభాగం
  1. విశాఖపట్నంలోని జె.ఆర్.నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ఉత్తమ గృహ సముదాయ అవార్డు
  2. సింహాచలం శ్రీవరాహ లక్ష్మినరసింహస్వామి దేవస్థానంకు ఉత్తమ ఆధ్యాత్మిక సంస్థ అవార్డు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీకి ఏడు జాతీయ జల పురస్కారాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఎక్కడ : ఢిల్లీ

గాంధీ శాంతి పురస్కారాల ప్రదానం
2015, 2016, 2017, 2018 సంవత్సరాలకుగాను ప్రకటించిన గాంధీ శాంతి పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రధానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో ఫిబ్రవరి 26న నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. కన్యాకుమారిలోని ‘వివేకానంద కేంద్ర’కు 2015 ఏడాదికిగాను అవార్డు లభించింది. అక్షయపాత్ర ఫౌండేషన్, సులభ్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా 2016 ఏడాదికిగాను అవార్డును అందుకున్నాయి. అలాగే ఏకల్ అభియాన్ ట్రస్టుకు 2017 ఏడాదికిగాను, బహూకరించారు. కుష్టు వ్యాధి నిర్మూలన కోసం కృషిచేస్తున్న నిప్పన్ ఫౌండేషన్ చైర్మన్, జపాక్‌కు చెందిన యోహియే ససాకవాకు 2018కి బహుమతిని అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2015, 2016, 2017, 2018 గాంధీ శాంతి పురస్కారాల ప్రదానం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతిభవన్, ఢిల్లీ

మాజీ ప్రధాని మన్మోహన్‌కు పీవీ పురస్కారం
ఇండియా నెక్ట్స్ సంస్థ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట అందించే జీవన సాఫల్య పురస్కారాన్ని 2018 ఏడాదికిగానూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రదానం చేశారు. ఢిల్లీలో ఫిబ్రవరి 27న జరిగిన ఈ కార్యక్రమంలో మన్మోహన్‌కు అవార్డును మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ... భారతావనిలో ఆర్థిక సంస్కరణల విషయంలో పీవీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీవీ నర్సింహారావు జీవన సాఫల్య పుర స్కారం 2018
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
ఎక్కడ : ఢిల్లీ

ఆదిత్యపురికి టాటా లీడర్‌షిప్ అవార్డు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్యపురికి 2018 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఏఐఎంఏ-జేఆర్‌డీ టాటా కార్పొరేట్ లీడర్‌షిప్ అవార్డు లభించింది. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఫిబ్రవరి 27న జరిగిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి ఈ అవార్డును ప్రదానం చేశారు. దేశంలో ఒకానొక ఉత్తమ బ్యాంకర్, ఇనిస్టిట్యూషన్ నిర్మాణదారునిగా, వినూత్నమైన సంప్రదాయ, ఆధునిక బ్యాంకు రూపశిల్పిగా ఆదిత్యపురిని ఏఐఎంఏ ప్రశంసించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏఐఎంఏ-జేఆర్‌డీ టాటా కార్పొరేట్ లీడర్‌షిప్ అవార్డు 2018
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్యపురి
ఎక్కడ : న్యూఢిల్లీ

జీహెచ్‌ఎంసీకి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)కి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 15న జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా చేతుల మీదుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఈ అవార్డును అందుకున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నందుకు, పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైన కృషి చేస్తూ స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టినందుకు జీహెచ్‌ఎంసీకి ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైన కృషి చేస్తున్నందుకు

సింగరేణికి ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు
అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయిన బెర్క్‌ఫైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చే ఇండియాస్ బెస్ట్ కంపెనీ-2018 అవార్డుకు సింగరేణి కాలరీస్ కంపెనీ ఎంపికైంది. 2019, మార్చి 8న ముంబైలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఏటా దేశంలోని కంపెనీల పనితీరును, వృద్ధిని స్వచ్ఛందంగా అధ్యయనం చేసి అత్యుత్తమ కంపెనీని ఇండియాస్ బెస్ట్ కంపెనీగా బెర్క్‌ఫైర్ సంస్థ ఎంపిక చేస్తోంది.
సింగరేణి సంస్థకు 2018లో ఆసియా పసిఫిక్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్, అవుట్ స్టాండింగ్ గ్లోబల్ లీడర్‌షిప్, ఎక్స్‌లెన్స్ ఇన్‌కాస్ట్ మేనేజ్‌మెంట్, బెస్ట్ మేనేజ్‌మెంట్, ఆసియాస్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ, ఎక్స్‌లెన్స్ ఇన్‌పర్ఫార్మెన్స్, బెస్ట్ సేవా వంటి అవార్డులు లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెర్క్‌ఫైర్ ఇండియాస్ బెస్ట్ కంపెనీ-2018 అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : సింగరేణి కాలరీస్ కంపెనీ

రాజమోహన్‌కు చందూర్ జగతి పురస్కారం
ప్రముఖ పాత్రికేయుడు, ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్- సింగపూర్ డెరైక్టర్ చిలంకూరి రాజమోహన్‌కు ఎన్‌ఆర్ చందూర్ జగతి పురస్కారం-2019 లభించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఫిబ్రవరి 16న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, ఎన్‌ఆర్ చందూర్ కుటుంబసభ్యులు, స్నేహితులు సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జర్నలిజంలో విశిష్ట సేవలందించిన, అందిస్తున్న వారికి ఈ పురస్కారాన్ని అందజే స్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఆర్ చందూర్ జగతి పురస్కారం-2019
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : చిలంకూరి రాజమోహన్

సౌదీ యువరాజుకు పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘నిషాన్-ఇ-పాకిస్తాన్’ లభించింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఫిబ్రవరి 18న జరిగిన కార్యక్రమంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఈ అవార్డును సల్మాన్‌కు అందజేశాడు. పాకిస్తాన్, సౌదీ అరేబియాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకుగాను సల్మాన్‌కు ఈ పురస్కారం దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్
ఎక్కడ : ఇస్లామాబాద్, పాకిస్తాన్ త
ఎందుకు : పాకిస్తాన్, సౌదీ అరేబియాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు

ఠాగూర్ అవార్డుల ప్రదానోత్సవం
‘ఠాగూర్ అవార్డ్ ఫర్ కల్చరల్ హార్మొనీ’ పేరిట ఇచ్చే అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో ఫిబ్రవరి 18న జరిగింది. ఠాగూర్ అవార్డులకు ఎంపికైన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. 2014, 2015, 2016 సంవత్సరాలకుగానూ ఠాగూర్ అవార్డులకు వరుసగా ప్రముఖ మణిపురీ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ రాజ్‌కుమార్ సింఘజిత్ సింగ్, బంగ్లాదేశ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఛాయనౌత్, ప్రముఖ శిల్పి రామ్ వాన్జీ సుతార్‌లు ఎంపికయ్యారు. ఠాగూర్ అవార్డులకు అర్హులైన వారిని ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద కోటి రూపాయల నగదును బహుమతిగా అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఠాగూర్ అవార్డుల ప్రదానోత్సవం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ

ఎన్టీపీసీకి అపెక్స్’ అవార్డులు
ఎన్టీపీసీ రామగుండం థర్మల్ కేంద్రంతోపాటు నిర్మాణంతో ఉన్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు రెండు అపెక్స్-2018 అవార్డులు లభించాయి. థర్మల్ పవర్‌స్టేషన్ విభాగం టాప్ ప్లాటినం కేటగిరీలో ఎన్టీపీసీ రామగుండం అపెక్స్ ఇండియా ఎఫీషియెన్సీ అవార్డు-2018, తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఆక్సుపేషన్‌లో హెల్త్ అండ్ సేఫ్టీ విభాగంలో టాస్ ప్లాటినం అవార్డు సాధించింది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 18న జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు మనోజ్‌తివారీ చేతుల మీదుగా ఎన్టీపీసీ ప్రాజెక్టు ఏజీఎం రాధామోహన్, మనోజ్‌కుమార్, కొండయ్య అందుకున్నారు. ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ సంస్థ భద్రత, పర్యావరణ పరిరక్షణ, ఆపరేషన్, జన రేషన్లో అగ్రభాగాన నిలవడంతోనే అవార్డులు సాధించాయి. తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణం కూడా ప్రమాదరహితంగా నిర్మాణం చేపట్టడంతో అపెక్స్ అవార్డు సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్టీపీసీకి అపెక్స్ అవార్డులకు ఎంపిక
ఏప్పుడు : ఫిబ్రవరి 18
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : థర్మల్ పవర్‌స్టేషన్ విభాగం టాప్ ప్లాటినం కేటగిరీలో..

 

కాళేశ్వరం, భగీరథకు ప్రతిష్టాత్మక అవార్డు
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. సాగునీటి కల్పన లో జరుగుతున్న కృషి, పట్టణ తాగునీటి సరఫరాలో తీసుకుంటున్న చొరవకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ భగీరథ పథకాలకు స్మార్ట్ వాటర్ అండ్ వేస్ట్ వరల్డ్ మ్యాగజైన్ (ఎస్‌డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ) ఈ అవార్డులు ప్రకటించింది. పత్రిక సంపాదక వర్గం దేశవ్యాప్తంగా సాగునీరు, వ్యర్థ జలాల శుద్ధి, పట్టణ తాగునీటి సరఫరా సంబంధిత రంగాల్లో ప్రభుత్వ రంగంలోని మొత్తం 30 ప్రాజెక్టులను పరిశీలించింది. అనంతరం ఆయా రంగాల్లో అత్యుత్తమైనవిగా పరిగణించి 11 ప్రాజెక్టులను ఈ అవార్డుకు ఎంపిక చేయగా.. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ఉన్నాయి. ఫిబ్రవరి 19 రాత్రి చెన్నైలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవంలో కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నల్లా వెంకటేశ్వర్లు అవార్డును స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళేశ్వరం, భగీరథకు ఎస్‌డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అవార్డులు
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎక్కడ : చెన్నై
ఎవరు : నల్లా వెంకటేశ్వర్లు


మిస్ ఇండియా అమెరికా’ కిరీటాన్ని దక్కించుకున్న కిమ్ కుమారి
న్యూజెర్సీలోని ఫోర్డ్స్ సిటీలో జరిగిన తుదిపోరులో ‘మిస్ ఇండియా అమెరికా-2019’ కిరీటాన్ని దక్కించుకున్న అందాల భామ కిమ్ కుమారి. మిస్‌న్యూజెర్సీ అయిన కుమారి అమెరికాలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన 75 మందితో పోటీపడి విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్ ఇండియా అమెరికా-2019
ఎక్కడ : న్యూజెర్సీ
ఎవరు : కిమ్ కుమారి

కళ్యాణరామన్‌కు ప్రతిష్టాత్మక ఐఏఏ అవార్డు

కళ్యాణ్ జ్యుయలర్స్ వ్యవస్థాపక సీఎండీ టి.ఎస్.కళ్యాణరామన్‌కు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అడ్వర్‌టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) వరల్డ్ కాంగ్రెస్ ప్రత్యేక అవార్డు లభించింది. ఇక్కడ జరుగుతున్న 44వ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్‌లో.. సంస్థకు జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా ఈ అవార్డును అందజేసింది. కళ్యాణ్ జ్యుయలర్స్‌ను ఆకర్షణీయ బ్రాండ్‌గా రూపుదిద్దినందుకు ఈ అవార్డును అందజేసినట్లు తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కళ్యాణ్ జ్యుయలర్స్ వ్యవస్థాపక సీఎండీ టి.ఎస్.కళ్యాణరామన్‌కు ఐఏఏ అవార్డు
ఎక్కడ : కొచ్చి
ఎవరు : టి.ఎస్.కళ్యాణరామన్

ఎర్రవల్లి గ్రామానికి జాతీయ స్వచ్ఛత శక్తి అవార్డు
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి గ్రామానికి ‘జాతీయ స్వచ్ఛత శక్తి’ అవార్డు లభించింది. ఫిబ్రవరి 12న జరగనున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి ఈ అవార్డును అందుకోనున్నారు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ ఎర్రవల్లి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పరిశుభ్రత పనులతో ఈ గ్రామం జాతీయ స్వచ్ఛత శక్తి అవార్డుకు ఎంపికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దత్తత తీసుకున్న ఎర్రవల్లి గ్రామం ఇప్పటికే రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా నిలిచిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ స్వచ్ఛత శక్తి అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ఎర్రవల్లి గ్రామం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ

తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు
దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్‌లో తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు లభించింది. ఢిల్లీలో ఫిబ్రవరి 8న జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని చౌబే, సురేశ్‌ప్రభుల చేతుల మీదుగా తెలంగాణ డైయిరీ డెవలప్‌మెంట్ సహకార సంస్థ (విజయ డెయిరీ) ఎండీ శ్రీనివాస్‌రావు ఈ అవార్డును అందుకున్నారు. ‘ఆహార భద్రత-ఆహార నాణ్యత’విభాగంలో విజయ డైరీకి ఈ అవార్డు దక్కింది. సాంఘిక, సంక్షేమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు విజయ డెయిరీ స్వచ్ఛమైన పాలను అందిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్‌లో జాతీయ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : తెలంగాణ విజయ డెయిరీ
ఎక్కడ : న్యూఢిల్లీ

పట్టు గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణకి జాతీయ అవార్డు
దేశంలో అత్యధికంగా బైవోల్టిన్ (అత్యంత నాణ్యమైన) పట్టు గుడ్లను ఉత్పత్తి చేసినందుకుగాను తెలంగాణకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 10న జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, స్మృతిఇరానీ చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, ఉద్యానశాఖ డెరైక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. 40 ఏళ్లలో సాధించలేని ప్రగతిని తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలో సాధించడం పట్ల పట్టుపరిశ్రమ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పట్టు గుడ్ల ఉత్పత్తిలో జాతీయ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : తెలంగాణ

సంజయ్ సుబ్రమణ్యంకు డాన్ డేవిడ్ అవార్డ్
ప్రముఖ చరిత్రకారుడు సంజయ్ సుబ్రమణ్యంకు డాన్ డేవిడ్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఫిబ్రవరి 11న ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. మాక్రో హిస్టరీ (పూర్వకాలంలో ప్రపంచంలోని వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లోని సంస్కృతుల మధ్య సారుప్యత, వైవిధ్యం, వారధిలపై అధ్యయనం చేయడం)లో చేసిన విశేష పరిశోధనకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. అవార్డు కింద రూ.3.56 కోట్ల నగదు బహుమతిగా అందనుంది.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అధ్యాపకుడైన సంజయ్ క్రీస్తుశకం 1400-1800 సంవత్సరాల కాలంలో ఆసియన్లు, యూరోపియన్లు, స్థానిక, ఆధునిక అమెరికన్ల మధ్య సాంస్కృతిక సంబంధాలపై అధ్యయనం చేశారు. 2019, మే నెలలో జరిగే అవార్డు ప్రదాన కార్యక్రమంలో షికాగో యూనివర్సిటీ చరిత్రకారుడు కెన్నెత్ పొమెరాంజ్‌తో కలసి సంయుక్తంగా సంజయ్ ఈ అవార్డును అందుకోనున్నారు. కెన్నెత్‌కు కూడా రూ.3.56కోట్ల నగదు బహుమతిని అందజేస్తారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలతోపాటు భూత, భవిష్యత్, వర్తమానాల్లో మానవ విజయాలపై అధ్యయనం చేసేవారికి ‘ద డాన్ డేవిడ్ ఫౌండేషన్’ తరఫున టెల్ అవీవ్ యూనివర్సిటీ ఏటా ఈ అవార్డు అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డాన్ డేవిడ్ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : సంజయ్ సుబ్రమణ్యం
ఎందుకు : మాక్రో హిస్టరీలో చేసిన విశేష పరిశోధనకుగాను

తెలంగాణకు స్వచ్ఛత శక్తి పురస్కారం
తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు స్వచ్ఛతా శక్తి పురస్కారాలు లభించాయి. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి ప్రథమ బహుమతిని పొందగా, తమిళనాడు రాష్ట్రం ద్వితీయ బహుమతిని దక్కించుకుంది. హరియాణాలోని కురుక్షేత్రం గ్రామంలో ఫిబ్రవరి 12న జరిగిన స్వచ్ఛ శక్తి పురస్కారం అందజేత కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ‘స్వచ్ఛ సుందర్ శౌచాలయ్’లో భాగంగా ఇటీవల కేంద్ర బృందం ఎర్రవల్లి గ్రామాన్ని సందర్శించి డాక్యుమెంటరీ తీసింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణకు స్వచ్ఛతా శక్తి పురస్కారం
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కురుక్షేత్రం, హరియాణ

రవాణామంత్రి నితిన్ గడ్కరీకి ఎన్‌సీఏపీ అవార్డు
కేంద్ర రవాణామంత్రి నితిన్ గడ్కరీకి గ్లోబల్ ఎన్‌సీఏపీ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 12న జరిగిన కార్యక్రమంలో ఎన్‌సీఏపీ సంస్థ చైర్మన్ మ్యాక్స్ మోస్లే ఈ అవార్డును ప్రదానం చేశారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించి, రోడ్డు భద్రత ప్రమాణాలు పెంచడంలో చేసిన కృషికి గానూ మంత్రికి ఈ అవార్డు దక్కింది. రోడ్డు భద్రతకు ఆటోమొబైల్ రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర రవాణా శాఖ ఈ సందర్భంగా తెలిపింది. అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ ఎన్‌సీఏపీ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : కేంద్ర రవాణామంత్రి నితిన్ గడ్కరీ

ఎంపీ కవితకు ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం
నిజామాబాద్ ఎంపీ కె.కవితకు ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఢిల్లీలో జనవరి 31న జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా కవితతో పాటు మరో 25 మంది ఎంపీలు అవార్డులు అందుకున్నారు. ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవా దృక్పథం, లోక్‌సభకు హాజరు, చర్చల్లో చురుగ్గా పాల్గొనడం, ప్రశ్నలడగడం, పార్లమెంటు నియమ నిబంధనలను పాటించడం లాంటి అంశాలను పరిగణనలోకి ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ కవితకు ఈ అవార్డును ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : నిజామాబాద్ ఎంపీ కె.కవిత

దేవాపూర్ మైన్స్ కు జాతీయస్థాయి పురస్కారాలు
తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న దేవాపూర్ లైమ్‌స్టోన్స్ మైన్స్ జాతీయ స్థాయిలో ఐదు బహుమతులు గెలుచుకుంది. మైన్స్ ఎన్విరాన్‌మెంట్ అండ్ మినరల్ కన్జర్వేషన్ వీక్ 2018-19 పేరుతో నిర్వహించిన పోటీలో దేవాపూర్ మైన్స్ ఈ బహుమతులు దక్కించుకుంది. మినరల్ కన్జర్వేషన్ విభాగంతో పాటు మరో రెండు విభాగాల్లో తొలి బహుమతి, వేస్ట్ డంప్ మేనేజ్‌మెంట్‌లో రెండో బహుమతి, మినరల్ బెనిఫిసియేషన్ విభాగంలో మూడో బహుమతి పొందింది.

క్రీడా శాస్త్రవేత్తల బృందానికి ఐఎస్‌ఏఈ పురస్కారం
కేంద్రీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (క్రీడా) శాస్త్రవేత్తల బృందానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీర్స్ (ఐఎస్‌ఏఈ) అత్యుత్తమ పురస్కారం-2018 లభించింది. వారణాసిలో జరిగిన ఐఏఎస్‌ఈ 53వ వార్షిక సదస్సుల్లో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర చేతుల మీదుగా క్రీడా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె.శ్రీనివాస్‌రెడ్డి బృందం ఈ అవార్డును అందుకుంది. సాగుకు యోగ్యం కాని భూముల్లో సరికొత్త వ్యవసాయ పద్ధతులను అనుసరించి పలు రకాల పంటలు పండించిన క్రీడాకు ఈ అవార్డు దక్కింది. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలంలోని చెంచు కాలనీల్లో సాగుకు యోగ్యం కాని భూములను అభివృద్ధి చేసి వివిధ రకాల పంటల సాగు కోసం శ్రీనివాస్‌రెడ్డి బృందం పలురకాల పరిశోధనలను చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎస్‌ఏఈ అత్యుత్తమ పురస్కారం-2018
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : కేంద్రీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (క్రీడా) శాస్త్రవేత్తల బృందం
ఎక్కడ : ఐఏఎస్‌ఈ 53వ వార్షిక సదస్సు, వారణాసి, ఉత్తరప్రదేశ్

దీపికారెడ్డికి సంగీత అకాడమీ అవార్డు
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డికి ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. రాష్ట్రపతి భవన్‌లో ఫిబ్రవరి 6న జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డును అందజేశారు. 2017 సంవత్సరానికిగానూ సంగీతం, నృత్యం, నాటకాలు, కళా రంగానికి అందించిన సేవలు, సంప్రదాయ గిరిజన నృత్యం-తోలు బొమ్మలాట విభాగాల్లో 42 మంది కళాకారులకు రాష్ట్రపతి కోవింద్ సంగీత నాటక అకాడమీ అవార్డులను అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన దీపికారెడ్డి గత 47 సంవత్సరాలుగా కూచిపూడి నాట్య రంగంలో తన సేవలను అందిస్తున్నారు. దీపాంజలి పేరుతో నృత్య పాఠశాలను కూడా ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంగీత నాటక అకాడమీ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ











































































































































































































#Tags