Starliner: సునీత విలియమ్స్ లేకుండానే ఐఎస్‌ఎస్‌ నుంచి భూమికి తిరిగొచ్చిన స్టార్‌లైనర్!!

వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్‌) వెళ్లిన స్టార్‌ లైనన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ ఒంటరిగానే తిరిగొచ్చింది.

ఆరు గంటల ప్రయాణం తర్వాత స్థానిక కాలమానం ప్రకారం సెప్టెంబ‌ర్ 7వ తేదీ ఉదయం 9.31 గంటలకు అమెరికాలో న్యూమెక్సికో ఎడారిలోని వైట్‌ శాండ్‌ స్పేస్‌ హార్బర్‌ సమీపంలో క్షేమంగా దిగింది. 

ఐఎస్‌ఎస్‌ నుంచి కేవలం 10 రోజుల్లో తిరిగి రావాల్సిన స్టార్‌ లైనర్‌ సాంకేతిక లోపాల వల్ల మూడు నెలలకు పైగా ఆలస్యంగా భూమిపై అడుగుపెట్టింది. స్టార్‌ లైనర్‌లో వెనక్కి రావాల్సిన సునీత, విల్మోర్‌ ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారు భూమిపైకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా ఐఎస్‌ఎస్‌లోనే ఉండి, అంతరిక్ష పరిశోధనల్లో పాలుపంచుకోనున్నారు. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్లి, ఒంటరిగా తిరిగివచ్చిన మొట్టమొదటి స్పేస్‌క్రాఫ్ట్‌గా స్టార్‌ లైనర్‌ రికార్డుకెక్కింది. 

Sunita Williams: స్పేస్‌లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్‌.. ఆమెకు రానున్న‌ అనారోగ్య సమస్యలు ఏవో తెలుసా?

ఏమిటీ స్టార్‌ లైనర్‌?  
ప్రఖ్యాత బోయింగ్‌ సంస్థ అభివృద్ధి చేసిన తొలి అంతరిక్ష వాహక నౌక స్టార్‌ లైనర్‌. ఈ ఏడాది జూన్‌ 5వ తేదీన ప్రయోగాత్మకంగా ఇద్దరు వ్యోమగాములతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించారు. సునీతా విలియమ్స్, విల్‌మోర్‌ స్టార్‌ లైనర్‌లో ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ప్రయాణం మధ్యలో ఉండగానే సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఇంజన్‌లోని కొన్ని థ్రస్టర్లు విఫలమయ్యాయి. 

హీలియం గ్యాస్‌ లీకైనట్లు గుర్తించారు. తాత్కాలిక మరమ్మత్తులతో స్టార్‌ లైనర్‌ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమైంది. వాస్తవానికి సునీతా విలియమ్స్, విల్‌మోర్‌ 8 రోజులపాటు అక్కడే ఉండి, ఇదే స్టార్‌లైనర్‌లో వెనక్కి తిరిగిరావాలి. మరమ్మత్తులు చేయడం సాధ్యం కాకపోవడంతో వారిని వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేకుండాపోయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ‘డ్రాగన్‌’ స్పేస్‌క్రాఫ్ట్‌లో వారిద్దరూ భూమిపైకి తిరిగి రానున్నారు. ‘డ్రాగన్‌’లో నలుగురు వ్యోమగాములు ప్రయాణించడానికి వీలుంది. కానీ, ఇద్దరే ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్నారు. వచ్చేటప్పుడు సునీతా విలియమ్స్, విల్‌మోర్‌ను కూడా తీసుకురానున్నారు.

Gaganyaan: అంతరిక్ష కేంద్రం మీదుగా గగన్‌యాన్‌.. అంతరిక్షంలోకి చేరిన తొలి భారతీయడు ఈయ‌నే..

#Tags