Times Most Influential People: టైమ్స్‌ జాబితాలో 'సత్య నాదెళ్ల'కు చోటు.. పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్‌ వాటాదార్ల సంపద ఎంతో తెలుసా?

ప్రపంచంలోనే 100 మంది ప్రభావశీలుర జాబితా-2024లో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు చోటు సంపాదించారు. వీరిలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌, రెజ్లర్‌ సాక్షి మాలిక్‌, నటుడు దేవ్‌ పటేల్‌ తదితరులు ఉన్నారు. టైమ్‌ మ్యాగజైన్‌ బుధవారం ఈ జాబితాను విడుదల చేసింది. 

గూగుల్‌, అమెజాన్‌పై పైచేయి..

ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్‌ వినియోగదారులకు మెరుగైన సేవలిందించేందుకు కృషిచేస్తోంది. సత్య సీఈవోగా బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది ఫిబ్రవరితో పదేళ్లు ముగిసింది. ఈ కాలంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు.

దీంతో మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ విలువ పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్‌ వాటాదార్ల సంపద దాదాపు 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు పెట్టి మైక్రోసాఫ్ట్‌ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు అయ్యేది.

ఈ సమయంలో ‘అజూర్‌’ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్‌తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్‌ ఏఐ ద్వారా అజూర్‌ ప్లాట్‌ఫామ్‌ మీదకు తీసుకురాగలిగారు. దీంతో గూగుల్‌, అమెజాన్‌లతో పోల్చితే మైక్రోసాఫ్ట్‌ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ మీద లభించే రాయల్టీపై ఆధారపడటాన్ని తగ్గించారు. 

పేరు: సత్య నారాయణ నాదెళ్ల
తండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్
తల్లి: ప్రభావతి
భార్య: అనుపమ నాదెళ్ల
పిల్లలు: ముగ్గురు
కుమారుడు: జైన్ నాదెళ్ల
కుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్ల
జన్మస్థలం: హైదరాబాద్
వయసు: 56 (2024)
జాతీయత: భారతీయుడు
పౌరసత్వం: యూఎస్‌ఏ
చదువు: మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీ
వృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్
డెజిగ్నేషన్‌: మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్, సీఈవో

#Tags