Noel Tata: టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌గా నియ‌మితులైన నోయెల్‌ టాటా

టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌గా రతన్‌ టాటా సోదరుడు నోయెల్‌ టాటా ఏకగ్రీవంగా నియమితులయ్యారు.

టాటా సామ్రాజ్యానికి కీలకమైన దాతృత్వ సంస్థలను నిర్వహిస్తున్న టాటా ట్రస్టుకు అధిపతిని నియమించేందుకు అక్టోబ‌ర్ 11వ తేదీ సభ్యులు సమావేశమయ్యారు. అందులో రతన్‌ టాటా సోదరుడు నోయెల్‌ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.

నావల్ టాటా, సిమోన్ టాటా దంపతులకు 1957లో నోయెల్‌ టాటా జన్మించారు. అతను ససెక్స్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఫ్రాన్స్‌లోని ఇన్‌సీడ్‌ బిజినెస్ స్కూల్‌లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యారు. నోయెల్ టాటా గ్రూప్‌లో వివిధ నాయకత్వ హోదాల్లో విధులు నిర్వహించారు.

ట్రెంట్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్ వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 2010-2021 మధ్య అతని నాయకత్వంలో ఉన్న టాటా ఇంటర్నేషనల్ ఆదాయాన్ని 500 మిలియన్‌ డాలర్లు(రూ.4200 కోట్లు) నుంచి మూడు బిలియన్‌ డాలర్లు(రూ.25 వేలకోట్లు)కు చేర్చారు. 1998లో ట్రెంట్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఒకే రిటైల్ స్టోర్ ఉండేది. దాన్ని దేశంవ్యాప్తంగా వ్యాపింపజేసి 700 స్టోర్లకు పెంచారు.

Ratan Tata: దిగ్గజ పారిశ్రామికవేత్త 'రతన్‌ టాటా' కన్నుమూత

#Tags