Supreme Court: సుప్రీంకోర్టులో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు వీరే..
జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జూలై 16వ తేదీ వెల్లడించారు.
కాగా ఈ ఇద్దరు న్యాయమూర్తుల పదోన్నతిపై సుప్రీంకోర్టు కోలిజియం గతంలో సిఫార్సు చేసింది. ఈ మేరకు వీరి నియామకంపై రాష్ట్రపతి తాజాగా ఆమోద ముద్ర వేశారు. కాగా కోటీశ్వర్ సింగ్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా.. ఆర్ మహదేవన్ మద్రాస్ హైకోర్టు చీఫ్ జడ్జీగా ఉన్నారు. ఇక కొత్తగా ఇద్దరు జడ్జీల చేరికతో సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐతో కలిసి న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.
New Indian Criminal Laws: అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు ఇవే..
మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకు..
జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ఇటీవల హింసాత్మకంగా మారిన ఈ ఈశాన్య రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు ఎన్నికైన తొలి జడ్జిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కడారు. ఈయన మణిపూర్ తొలి అడ్వకేట్ జనరల్ ఎన్ ఇబోటోంబి సింగ్ కుమారుడు. ఆయన ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజ్ అండ క్యాంపస్ లా సెంటర్‌లో పూర్వ న్యాయ విద్యను పూర్తి చేశారు. అనంతరం 1986లో న్యాయవాదిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆయన జడ్జి కాకముందు మణిపూర్ అడ్వకేట్ జనరల్‌గా కూడా పనిచేశారు. గతంలో అస్సాంలోని గువాహటి హైకోర్టు, మణిపూర్ హైకోర్టులోనూ విధులు నిర్వర్తించారు.
చెన్నైలో జన్మించిన మహదేవన్..
ఇక చెన్నైలో జన్మించిన జస్టిస్ మహదేవన్ ప్రస్తుతం మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. మహదేవన్ మద్రాసు న్యాయ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. న్యాయవాదిగా ఆయన 9,000 కేసులను వాదించారు. తమిళనాడు ప్రభుత్వానికి అదనపు గవర్నమెంట్ ప్లీడర్‌గా(పన్నులు), అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ న్యాయవాది, మద్రాసు హైకోర్టులో భారత ప్రభుత్వానికి సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.