Buddhadeb Bhattacharya: డీవైఎఫ్‌ఐ కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగిన బుద్ధదేవ్‌ కన్నుమూత

సీపీఎం సీనియర్‌ నేత, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య కన్నుమూశారు.

శ్వాసకోస వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్న బుద్ధదేవ్(80) ఆగ‌స్టు 8వ తేదీ కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్‌ ఉన్నారు.    

కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా.. 
సీపీఎం అత్యున్నత నిర్ణాయక విభాగమైన పొలిట్‌ బ్యూరో మాజీ సభ్యుడు అయిన భట్టాచార్య 1944 మార్చి 1న కోల్‌కతాలో జన్మించారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాల నుంచి బెంగాలీలో బీఏ ఆనర్స్‌ చేశారు. 1966లో పార్టీలో చేరారు. సీపీఎం యువజన విభాగమైన డీవైఎఫ్‌ఐలో చేరారు. రాజకీయాల్లోకి రాకముందు పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 

ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించిన ఆయన 2000లో జ్యోతిబసు సీఎం పదవి నుంచి వైదొలగక ముందు ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి పొందారు. జ్యోతిబసు తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2000 నుంచి 2011 వరకు  ముఖ్యమంత్రిగా పనిచేశారు. జ్యోతిబసు పాలనతో పోలిస్తే భట్టాచార్య హయాంలో లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల పట్ల సానుకూలంగా వ్యవహరించింది. విచిత్రమేమిటంటే పారిశ్రామికీకరణకు సంబంధించిన సీపీఎం విధానాలే 2011 ఎన్నికల్లో వామపక్షాల పరాజయానికి బాటలు వేశాయి.  

➤ బుద్ధదేవ్‌కు కేంద్రం 2021లో ‘పద్మభూషణ్‌’ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డును ఆయన తిరస్కరించారు.

Anshuman Gaekwad: మాజీ క్రికెటర్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ కన్నుమూత

#Tags