8 మంది నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ప్రమాణం చేయించిన శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు
andhrapradeshnewmlcs

సాక్షి, అమరావతి: శాసన మండలికి స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన 8 మంది కొత్త సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (వైఎస్సార్‌ జిల్లా), మేరిగ మురళీధర్‌ (నెల్లూరు జిల్లా), కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్‌ (పశ్చిమ గోదావరి జిల్లా), కుడిపూడి సూర్యనారాయణరావు (తూర్పు గోదావరి జిల్లా), నర్తు రామారావు (శ్రీకాకుళం జిల్లా), సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు జిల్లా), డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ (కర్నూలు జిల్లా) ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు, శాసనమండలి చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్‌ జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్సీలు, శాసనసభ సెక్రటరీ జనరల్‌  రామాచార్యులు, శాసనమండలి ఓఎస్డీ సత్యనారాయణరావు, ఉప కార్యదర్శి విజయరాజు  పాల్గొన్నారు. 

తోడేళ్ల మందలా దాడి
సీఎం జగన్‌ రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజ­కీయంగా ఉరితాడు లాంటివని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందుకే తోడేళ్ల మందలా ఏకమై కుట్రపూరితంగా ప్రజా ప్రభుత్వంపై దాడి మొదలుపెట్టా­రని మండిపడ్డారు. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లా­డారు. సీఎం జగన్‌ మేనిఫెస్టోలో 98 శాతానికిపైగా హామీలు అమలు చేసి చూపించార­న్నారు.

నిజాయతీ, విశ్వసనీయతకు నిదర్శనమైన సీఎం జగన్‌కు, అబద్ధానికి, మోసానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబుకు, తోడేళ్ల మందకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. చంద్రబాబు ఏజెంట్‌లా పవన్‌ కల్యాణ్‌ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పెత్తందార్ల పక్షాన నిలిచిన చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియాతో ప్రజల పక్షాన నిలిచిన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. టీడీపీ హయాంలో అమరావతి భూముల్లో కుంభకోణం జరి­­గిందన్నారు.

చంద్రబాబు బరితెగింపు, అక్రమా­లకు ఆయన కరకట్ట నివాసం నిదర్శనమని దుయ్య­బట్టారు. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్ల ద్వారా చంద్రబాబు గొడవ చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌ల కుట్ర రాజకీయాలను సీఎం జగన్‌ సమాధి చేస్తున్నారు కాబట్టే ఈ కుట్రదారులు వైఎ­స్సార్‌సీపీ విముక్త రాష్ట్రం అని మాట్లాడుతున్నారని చెప్పారు. 

#Tags