Malaysian Man: రికార్డ్‌.. 70 ఏళ్ల వయసులో మెడికల్‌ గ్రాడ్యుయేట్ చేసిన మలేసియా వ్యక్తి

వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే.

అనుకున్న లక్ష్యం సాధించేందుకు వయసు ఏమాత్రం అడ్డురాదని మలేసియాకు చెందిన 70 ఏళ్ల తోహ్‌ హాంగ్‌కెంగ్‌ నిరూపించారు. ఇప్పటికే రిటైర్డ్‌ అయిన తోహ్‌ ఇటీవల మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఔరా అనిపించారు. 70 ఏళ్ల వయసులో మెడిసిన్‌ చేసి ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయసులో మెడిసిన్‌ చేసిన వారిలో ఒకరిగా తోహ్‌ రికార్డ్‌ సృష్టించారు. 
 
తోహ్‌ హాంగ్‌కెంగ్‌ చిన్నతనం నుంచే డాక్టర్‌ కావాలనేమీ కలలు కనలేదు. అప్పటికే ఆర్థికశాస్త్రం, రసాయన శాస్త్రం, ఎల్రక్టానిక్‌ ఇంజనీరింగ్‌ చదివేశారు. తర్వాత ఆయన మనసు మెడిసిన్‌ వైపు మళ్లింది. 2018లో కిర్గిజిస్తాన్‌ విహారయాత్రలో ఉండగా ఇద్దరు యువ భారతీయ వైద్య విద్యార్థులను కలిశారు. ఆ పరిచయం ఆయనను వైద్య విద్య పట్ల అమితాసక్తిని పెంచిందని తోహ్‌ చెప్పారు. 2019లో కార్పొరేట్‌ ప్రపంచం నుంచి పదవీ విరమణ పొందాక మెడిసిన్‌ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యారు. కానీ అన్నిచోట్లా వైద్యవిద్య చదవడానికి వయోపరిమితి అడ్డుగా ఉందని తర్వాత అర్థమైంది. 

ఈ వయసులోనూ తనను మెడిసిన్‌ చదివేందుకు అనుమతించే కాలేజీ కోసం తెగ తిరిగారు. అయితే తమ పని మనిషి కూతురు చదివిన ఫిలిప్పీన్స్‌లోని వైద్య పాఠశాలలో వయోపరిమితి లేదని తెలుసుకుని ఎగిరి గంతేశారు. వెంటనే దరఖాస్తు చేసుకోవడం, ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, తర్వాత సెలక్షన చకచకా జరిగిపోయాయి. పెట్టే బేడా సర్దుకుని అక్కడికి వెళ్లిపోయి స్కూల్లో చేరారు.

2020లో కరోనా విజృంభించడంతో హాంకాంగ్‌కు మకాం మార్చేసి తన క్లాసులన్నీ ఆన్‌లైన్‌లో విన్నారు. కుటుంబం, సహాధ్యాయిల సహకారంతో గత జూలైలో మెడిసిన్‌ పట్టా అందుకున్నారు. రెసిడెన్సీ అనుభవంతో పూర్తిస్థాయి లైసెన్స్‌డ్‌ డాక్టర్‌గా మారడానికి ఆయనకు మరో పదేళ్లు పట్టొచ్చు.  

Mount Kilimanjaro: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఐదేళ్ల బాలుడు

విదేశీ విద్యార్థుల ట్యూషన్‌ ఫీజుల కోసం..  
మెడికల్‌ బోర్డు పరీక్ష కోసం ఏడాది పాటు ఇంటర్న్‌షిప్, మరింత అధ్యయనం అవసరం. దానికి బదులుగా అతను హాంకాంగ్‌లో స్నేహితుడి సంస్థ అలెర్జీ అండ్‌ ఇమ్యునాలజీ డయాగ్నస్టిక్స్‌లో కన్సల్టెంట్‌గా పని చేయాలని యోచిస్తున్నారు. తనలాగా మెడిసిన్‌ చేస్తున్న పేద పిల్లలకు సాయం చేద్దామని భావించారు. ట్యూషన్‌ ఫీ చెల్లించడానికి కష్టపడే విదేశీ వైద్య విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌ ఫండ్‌ను ఏర్పాటుచేశారు. 

వైద్య పాఠశాలల ఫీజు సుమారు.. 
అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ కాలేజెస్‌ ప్రకారం అమెరికాలో ప్రభుత్వ వైద్య పాఠశాలలలో స్థానిక విద్యార్థులకు సంవత్సరానికి సగటు ట్యూషన్‌ ఫీజు సుమారు 60,000 డాలర్లు. విదేశీ విద్యార్థులకు 95,000 డాలర్లు ఖర్చు అవుతుంది. ప్రైవేటు వైద్య పాఠశాలల్లో విదేశీయులకు ట్యూషన్, ఫీజులు 70 వేల డాలర్ల వరకు ఖర్చవుతోంది.

అంతర్జాతీయ విద్యార్థుల విషయానికొస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. ఫిలిప్పీన్స్‌లో ట్యూషన్‌ ఫీజులు అంత ఎక్కువగా లేవు. తోహ్‌ సౌత్‌ వెస్ట్రన్‌ వర్సిటీ ఏడాదికి దాదాపు 5,000 డాలర్లు ఖర్చు చేశారు. ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకు ఇది పెద్దమొత్తమే. ఇలాంటివారికి ఆ నిధిని ఖర్చు చేయనున్నారు. 

World's Oldest Person: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఈమెనే.. ఏ దేశానికి చెందిన మహిళంటే!

#Tags