Subhadra Yojana: మహిళలకు 'సుభద్ర పథకం'.. వారి అకౌంట్‌లో రూ.50 వేలు.. అర్హులు వీరే!
2024–2025 ఆర్థిక సంవత్సరం నుంచి 2028–29 వరకు ఈ పథకం లబ్దిదారులకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆగస్టు 22వ తేదీ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం కోసం రూ.55,825 కోట్లు వెచ్చించనున్నట్లు ఒడిశా సీఎం తెలిపారు.
కోటి మంది జీవితాల్లో వెలుగులు..
సుభద్ర పథకంతో రాష్ట్రంలోని కోటి మందికి పైగా మహిళల జీవితాల్లో వెలుగులు రానున్నాయి. 21 ఏళ్లు నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల మహిళలందరికీ ఇది వర్తిస్తుంది. రాఖీ పూర్ణిమ రోజు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) నాడు రూ.5,000 చొప్పున రెండు విడతలుగా సంవత్సరానికి రూ.10,000 చెల్లిస్తారు. ఈ విధంగా అర్హత కలిగిన మహిళా లబ్ధిదారులు 5 ఏళ్లలో మొత్తం రూ.50,000 పొందుతారు. సుభద్ర సాయం అందించడంలో పారదర్శకతను నిర్ధారించడానికి, ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ (ఏపీబీఎస్) ద్వారా లబ్ధిదారు యొక్క ఆధార్‌తో అనుసంధానపరిచిన సింగిల్ హోల్డర్ బ్యాంక్ ఖాతాకు నేరుగా చెల్లింపు (డీబీటీ) చేయబడుతుంది. లబ్ధిదారులకు సుభద్ర డెబిట్ కార్డు కూడా జారీ చేయబడుతుంది.
వీరు అనర్హులు..
ఆర్థికంగా బలమైన కుటుంబాల్లోని మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకం కింద అర్హులు కాదు. అంతేకాకుండా, ఏదైనా ఇతర ప్రభుత్వ పథకం కింద నెలకు రూ.1,500 లేదా అంతకంటే ఎక్కువ లేదా సంవత్సరానికి రూ.18,000 లేదా అంతకంటే ఎక్కువ సహాయం పొందుతున్న మహిళలు కూడా సుభద్ర కింద చేర్చడానికి అనర్హులు.
నమోదు చేసుకోండిలా..
ఈ పథకం కింద ప్రయోజనాలు పొందేందుకు మహిళలు అంగన్‌వాడీ కేంద్రాలు, మండల కార్యాలయం, మీ సేవా కేంద్రాలు, జన్ సేవా కేంద్రాలు మొదలైన వాటిలో ఉచితంగా లభించే ఫారమ్‌లను నింపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సుభద్ర పథకం లబ్ధి కోసం కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమం అమలు, పర్యవేక్షణ కోసం మహిళా శిశు అభివృద్ధి శాఖ సుభద్ర సొసైటీని ఏర్పాటు చేస్తుందన్నారు.