RBI: 'గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌'.. ఎకానమీ పటిష్టతే ఆర్‌బీఐ లక్ష్యం

భార‌త‌దేశ ఆర్థిక రంగాన్ని పటిష్టంగా, చురుగ్గా, కస్టమర్‌కు స్నేహ పూర్వకమైనదిగా మార్చడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నిరంతరం పనిచేస్తుందని గవర్నర్‌ శక్తికాంతదాస్ అన్నారు.

ఇందుకు తగిన విధాన పరమైన చర్యలను తీసుకుంటుందని ఉద్ఘాటించారు. ఆర్‌బీఐ @ 90 గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌లో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌పై గవర్నర్ ప్రసంగిస్తూ, యూనిఫైడ్‌ లెండింగ్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఎల్‌ఐ), సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి (సీబీడీసీ) సంబంధించి సెంట్రల్‌ బ్యాంక్‌ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తావించారు. విదేశాల నుంచి యూపీఐ ద్వారా నగదు బదిలీ సేవలను విస్తృతం చేయనున్నట్లు ఆయన తెలిపారు. 

➤ క్రాస్‌–బోర్డర్‌ రెమిటెన్స్‌లకు (విదేశాల నుంచి స్వదేశానికి డబ్బు పంపడానికి సంబంధించి) ప్రత్యామ్నాయంగా చౌకైన,  వేగవంతమైన ఇన్‌స్ట్రుమెంట్‌గా యూపీఐ వ్యవస్థ పురోగమించనుంది. ప్రత్యేకించి తక్కువ విలువ కలిగిన వ్యక్తిగత రెమిటెన్స్‌ల విషయంలో విప్లవాత్మకమైన మార్పులకు యూపీఐ వ్యవస్థ నాందీ పలకనుంది.
➤ జూలైలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ప్రకారం, సేవా ఎగుమతుల తర్వాత విదేశాల నుంచి వచ్చే నిధుల విషయంలో రెమిటెన్సులు రెండో స్థానాన్ని ఆక్రమించాయి. 2024 క్యాలెండర్‌ ఇయర్‌లో ఇవి 3.7 శాతం వృద్ధితో 124 బిలియన్‌ డాలర్లకు, 2025లో 4 శాతం వృద్ధితో 129 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉంది.  

Shaktikanta Das: ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకర్‌గా ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్‌

➤ రిజర్వ్‌ బ్యాంక్‌ గణనీయమైన ఆశావాదంతో ఆర్‌బీఐ @ 100 వైపు ప్రయాణం సాగిస్తోంది. 
➤ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల, డీపీఐ (డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) థీమ్‌ విషయానికి వస్తే, గత దశాబ్ద కాలంలో  సాంప్రదాయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో అపూర్వమైన సాంకేతిక పరివర్తన చోటుచేసుకుంది.  
➤ లావాదేవీల వ్యయాలను తగ్గించడం, ఆర్థిక సదుపాయాల అందుబాటు, ఇంటరాపరబిలిటీ  విషయంలో పోటీ, ప్రైవేట్‌ మూలధనాన్ని ఆకర్షించడం, అందరికీ ఆర్థిక సేవల వంటి కీలక చర్యలను డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రా ప్రోత్సహిస్తుంది.

#Tags