Gross State Domestic Product: ఏపీలో.. అదనంగా పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి.. ఆర్‌బీఐ నివేదికలో వెల్లడి

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సంక్షోభం రెండేళ్ల పాటు వెంటాడి­నప్పటికీ గత ఐదేళ్లూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం వృద్ధిలో ముందుకే మినహా ఎక్కడా వెనకడుగు వేయలేదు. వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు తలసరి ఆదాయం భారీగా పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లపై కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భారీగా వెచ్చించింది. గతంలో చంద్రబాబు పాలనతో పోలిస్తే..  విద్య, వైద్యం, తాగునీరు, సంక్షేమం, పారిశుద్ధ్యం, గ్రామీణ, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ సామాజిక రంగంపై వైఎస్‌ జగన్‌ ఏకంగా రూ.1.98 లక్షల కోట్లు అధికంగా వెచ్చించ్చింది. 

ఇక వైఎస్‌ జగన్‌ పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.1.94 లక్షల కోట్లు పెరిగింది. వ్యవసాయ, తయారీ, పారిశ్రామిక, సేవలు, నిర్మాణ రంగాలన్నింటిలోనూ వృద్ధి కొనసాగింది. స్థిర ధరల ఆధారంగా వృద్ధి గణన మాత్రమే నిజమైన అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటారు. ఈమేరకు 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ రంగాల వృద్ధి గణాంకాలను ఆర్‌బీఐ విడుదల చేసింది.

➤ ఐదేళ్ల వైఎస్‌ జగన్‌ పాలనలో స్థిర ధరల ఆధారంగా జీఎస్‌డీపీలో 31.04 శాతం వృద్ధి నమోదైనట్లు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. సగటు వార్షిక వృద్ధి 6.20 శాతం నమోదైంది. వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి 16.46 శాతం నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 3.29 శాతం నమోదైంది. కోవిడ్‌ సంక్షోభం రెండేళ్లు వెంటాడినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకుండా కొనసాగిస్తూ నగదు బదిలీ పథకాలతో ప్రజలను ఆదుకోవడం వల్లే ఈ వృద్ధి నమోదైందని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

➤ ఇక గత ఐదేళ్లలో తయారీ రంగంలో 58.39 శాతం వృద్ధి నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 11.67 శాతం నమోదైంది. గత ఐదేళ్లలో పారిశ్రామిక రంగంలో 46.62 శాతం వృద్ధి నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 9.32 శాతం నమోదైంది.

GST Collections: ఏపీలో క్షీణించిన జీఎస్టీ వసూళ్లు! దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో..

➤ నిర్మాణ రంగంలో గత ఐదేళ్లలో 41.50 శాతం వృద్ధి నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 8.3 శాతంగా ఉంది. గత ఐదేళ్లలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ రంగంలో 42.04 శాతం వృద్ధి నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 8.40 శాతంగా ఉంది. 
➤ గత ఐదేళ్లలో సేవల రంగంలో 22.90 శాతం వృద్ధి నమోదు కాగా సగటు వార్షిక వృద్ధి 4.5 శాతంగా ఉంది.

సామాజిక రంగానికి జగన్‌ పెద్దపీట
గత ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో సామాజిక రంగంపై వెచ్చించిన వ్యయం భారీగా పెరిగినట్లు ఆర్‌బీఐ గణాంకాలు స్పష్టం చేశాయి. చంద్రబాబు గత పాలనతో పోల్చితే వైఎస్‌ జగన్‌ ఐదేళ్లలో సామాజిక రంగంపై వ్యయం రూ.1.98 లక్షల కోట్లు అదనంగా వెచ్చించారు. విద్య, వైద్యం, తాగునీరు, సంక్షేమం, పారిశుద్ధ్యం, గ్రామీణ, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం లాంటి వాటిపై వెచ్చించే ఖర్చులు సామాజిక రంగం వ్యయం కిందకు వస్తాయి. చంద్రబాబు గత పాలనలో సామాజిక రంగంపై వ్యయం రూ.3.24 లక్షల కోట్లుగా ఉంటే వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో సామాజిక రంగంపై వెచ్చించిన వ్యయం రూ.5.22 లక్షల కోట్లుగా ఉంది.

గణనీయంగా పెరిగిన సొంత పన్ను ఆదాయం
వైఎస్‌ జగన్‌ పాలనలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం భారీగా పెరిగింది. రెండేళ్లు కోవిడ్‌ సంక్షోభం వెంటాడినప్పటికీ గతంలో చంద్రబాబు పాలనతో పోల్చితే ఐదేళ్లలో జగన్‌ హయాంలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.1.35 లక్షల కోట్లు ఎక్కువగా పెరిగింది. చంద్రబాబు గత పాలనలో రాష్ట్ర సొంత ఆదాయం రూ.2.37 లక్షల కోట్లు కాగా వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉండగా ఐదేళ్లలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.3.72 లక్షల కోట్లు వచ్చింది.

తలసరి ఆదాయం పెరుగుదల
రాష్ట్ర తలసరి ఆదాయం వైఎస్సార్‌ సీపీ హయాంలో భారీగా పెరిగింది. చంద్రబాబు పాలనలో 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 కాగా వైఎస్‌.జగన్‌ హయాంలో 2023–24లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,42,479కి పెరిగింది.

Andhra Pradesh: గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నంబర్‌వన్.. అలాగే వీటి ఉత్పత్తిలోనూ..

ఉద్యోగుల పెన్షన్ల వ్యయం పెరుగుదల
వైఎస్‌ జగన్‌ ఉద్యోగుల పెన్షన్ల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. గతంలో చంద్రబాబు పాలనలో పోల్చితే వైఎస్‌ జగన్‌ ఐదేళ్లలో ఉద్యోగుల పెన్షన్ల కోసం రూ.31,425 కోట్లు అదనంగా ఇచ్చారు. గతంలో చంద్రబాబు ఐదేళ్లలో పెన్షన్ల కోసం రూ.65,620 కోట్లు వెచ్చించగా వైఎస్‌ జగన్‌ ఐదేళ్లలో పెన్షన్ల కోసం రూ.97,045 కోట్లు వ్యయం చేశారు.

తలసరి విద్యుత్‌ లభ్యత పెరుగుదల
అభివృద్ధికి తలసరి విద్యుత్‌ లభ్యత కూడా కొలమానంగా ఉంటుంది. చంద్రబాబు హయాంతో పోలిస్తే తలసరి విద్యుత్‌ లభ్యత వైఎస్‌ జగన్‌ పాలనలో గణనీయంగా పెరిగింది. 2018–19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా తలసరి విద్యుత్‌ లభ్యత గంటకు 1,289.4 కిలోవాట్‌ ఉండగా వైఎస్‌ జగన్‌ పాలనలో 2023–24లో తలసరి విద్యుత్‌ లభ్యత గంటకు 1,623.0 కిలోవాట్‌కు పెరిగింది.

Panchayati Raj Institution: పంచాయతీరాజ్‌ సంస్థల రాబడుల్లో ఏపీ భారీ వృద్ధి.. గత ఐదేళ్లలో..

#Tags